గురువారం, ఆగస్టు 11, 2011

చదువు కష్టం

నాకు తెలిసిన వాళ్లకి ఒక సమస్య వచ్చింది. అది కూడా వాళ్ళబ్బాయి వల్ల. కుర్రాడు బుద్ధిమంతుడు, తెలివైన వాడూ అయినప్పటికీ సమస్య రాడానికి కారణం 'కాలం కలిసి రాకపోవడం' అని తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకం. సరే, నమ్మకాలనీ, విశ్వాసాలనీ మార్చడానికి మనమెవరం? సమస్య ఆ కుర్రాడి చదువు. ఎటూ కాకుండా అయిపోయింది కదా అని బాధనిపించింది జరిగింది విన్నప్పుడు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టినా ఉపయోగం లేదు కూడా.

ఆ కుర్రాడు మూడేళ్ళ క్రితం ఇంటర్ పాసై, ఎంసెట్ రాశాడు. మంచి ర్యాంకు రాలేదు. ఎంసెట్ మళ్ళీ రాయాలా? డిగ్రీలో చేరాలా? ఇంకేదన్నా ప్రత్యామ్నాయం ఆలోచించాలా? అన్న ఆలోచనలో అతను, అతని కుటుంబం ఉన్నప్పుడు, 'ఎంసెట్ లో ర్యాంకు రాలేదా? బాధ పడకండి. మీ పిల్లల్ని సీఏలుగా తీర్చి దిద్దే బాధ్యత మాది' అంటూ ఓ ప్రముఖ విద్యా సంస్థ మొదలు పెట్టిన ప్రచారం వీళ్ళ దృష్టికి వచ్చింది. ఆ సంస్థ ఆఫీసుకి కుర్రాడిని తీసుకుని వెళ్ళారు అతని తల్లిదండ్రులు.

చార్టర్డ్ అకౌంటన్సీ ఎంత గొప్ప కోర్సో, ఇంజనీరింగ్, మెడిసిన్లతో ఏవిధంగా సమానమో - కొండొకచో అంతకన్నా ఎక్కువో - ఆ కోర్సు పూర్తి చేస్తే కుర్రాడి జాతకం ఏవిధంగా మారిపోతోందో గ్రాఫిక్స్ లో చూపించేయడంతో పాటుగా, కుర్రాడిని తమకి అప్పగిస్తే తగు మాత్రం ఫీజు తీసుకుని సీఏగా తిరిగి అప్పగిస్తామని హామీలిచ్చేసి, అప్పటికప్పుడే అడ్మిషన్ తీసుకోడానికి ఒప్పించేశారు ఆ సంస్థ వాళ్ళు. మార్కెటింగా మజాకానా మరి? శుభమో, ఆశుభమో తెలియని ఒకానొక ముహూర్తంలో కోచింగులో చేరిపోయాడు.

వాళ్ళబ్బాయిని సీఏని చేయబోతున్నందుకు తల్లితండ్రులు చాలా గర్వపడ్డారు అప్పట్లో. ఇంజినీరింగుకి తొందర్లోనే డిమాండ్ పడిపోతుందనీ, సీఏనే బెస్టనీ చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పారు కూడా. గడిచిన మూడేళ్ళలోనూ దాదాపుగా ఇంజనీరింగ్ చదువుకి పెట్టినంత ఖర్చూ సీఏ చదువుమీద పెట్టారు. సమస్య ఇప్పుడు వచ్చింది. ఆ కుర్రాడికి క్లాసులో ఉన్నంతసేపూ బాగానే ఉంటోంది కానీ, చదవడానికి వచ్చేసరికి అంతా బ్లాంక్ గా ఉంటోంది. ఇక పరిక్షలైతే చెప్పక్కర్లేదు. సీఏ నేను చదవను అంటాడు. సదరు సంస్థ వాళ్ళు విజయవంతంగా చదువుకుంటున్న స్టూడెంట్స్ ని చూపిస్తూ లోపం కుర్రాడిలో ఉంది తప్ప కోచింగులో లేదనేస్తున్నారు.

కుర్రాడి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడ్డట్టయ్యింది. అటు చూస్తే తన తోటివాళ్ళందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసేయ బోతున్నారు. చదువు పూర్తి చేసి ముందుకి వెళ్ళలేడు. అలాగని వెనక్కీ వెళ్ళలేడు. తల్లితండ్రులు సీనియర్ చార్టర్డ్ అకౌంటంట్లని కలవడం మొదలు పెట్టారు. "కోచింగ్ లో చేరిస్తేనే సీఏ అయిపోరు. చదివే వాళ్లకి ఆసక్తి ఉండాలి. బాగా కష్టపడి చదవడం, చదివింది అర్ధం చేసుకుని సొంతంగా రాయడం అవసరం. మీరు కోర్సులో చేర్చేముందే కుర్రాడిని మా దగ్గరకి తీసుకురావాల్సింది" అన్నది అటునుంచి వచ్చిన సమాధానం. సీఏలో పాస్ పర్సంటేజ్ పదిహేను నుంచి ముప్ఫై శాతం లోపేనని చల్లగా చెప్పారు వాళ్ళు.

"సీఏ అంటే మాటలేంటీ.. ఎవడు పడితే వాడు సీఏ అయిపోడమే" అంటూ దొరికిందే చాన్సని కొందరు బంధువులు మొటికలు విరుస్తున్నారు . కుర్రాడికి ఏడుపొక్కటే తక్కువ. తల్లిదండ్రుల పరిస్థితీ ఇంచుమించి అదే. సీఏ మధ్యలో వదిలేసిన వాళ్లకి ఒక సర్టిఫికేట్ ఇస్తారనీ, దానితో సీఏగా పనిచేసే వాళ్ళదగ్గర అసిస్టంట్ ఉద్యోగం దొరుకుతుందనీ తెలిశాక, ఆ ఉద్యోగంలో చేరిపోతానని కుర్రాడి పట్టు. ఇప్పటికీ సమయమూ, డబ్బూ చాలా ఖర్చయ్యింది కాబట్టి ఇకపై ఆ రెంటినీ వేస్ట్ చేయనంటాడు. ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. నన్ను సలహా అడిగినప్పుడు "కేవలం మూడేళ్ళ కోసం నలభయ్యేళ్ళ కెరీర్ ని పణంగా పెట్టొద్దు. ఇంటర్ క్వాలిఫికేషన్ తో చేయదగ్గ కోర్సుల్లో నీకు నచ్చిన దానిలో చేరు.. జరిగినదాన్నే తల్చుకుని బాధ పడొద్దు" అని చెప్పాను.. చూడాలి, ఏం చేస్తారో..

14 కామెంట్‌లు:

  1. This is how India is destroying the young talent. Both parents *and* the kids are rank idiots. When I joined Engineering one guy joined as a junior after 4 years, discontinued it in 2 years went back to my hometown and started doing civil contracts. Now he owns at least 4 streets (on both sides of the streets, he owns them all) full of apartments and houses. His classmates are just engineers now. Tell this to the kid and let him learn. Even pan shop will make money if one knows how to run business. Mainly these parents are horrible. Always put stress on kids. Kid has no choice at all. Either you are a doctor or an engineer. CA is not tough at all. If he put sometime into it, by now he would have passed the first part. His brains are on another career.

    రిప్లయితొలగించండి
  2. ఈ సమస్య చదువుతున్నప్పుడే నేను అనుకున్న సమాధానం మీరు చెప్పారు . అతను సి ఏ దగ్గర అసిస్టెంట్ ఉద్యోగమునకు సిద్దపడ్డడంటే, ప్రస్తుతానికి ఈ కోర్సును వదిలించు కోవాలనుకుంటున్నాడు.

    రిప్లయితొలగించండి
  3. చదువుకి సంబంధించిన ఇంకో సమస్యని కిందటివారమే చూసాను.

    టెంత్ చక్కటి మార్కులు తెచ్చుకున్న మా మేనల్లుడిని విజయవాడలో ఓ కొత్త రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించారు. రెండు వారాంతాల్లో జరిగిన ఐ.ఐ. టీ నమూనా పరీక్షల్లో (వీళ్ళ ఆశ పాడుగానూ, అన్నప్రాసన నాడే ఆవకాయా!) ఈ పిల్లాడికి ఐదో రేంకు వచ్చిందిట. ఇంక ఏముంది. రోజుకి 20 గంటలు రుద్దుడే రుద్దుడు. ఆ రేంకు దిగి కిందకి రాకుడదని వీడికి క్షణక్షణం కౌన్సిలింగులు ట. మూడో వారం తిరిగే సరికి హడిలిపోయి ఇంటికి పరిగెత్తుకొచ్చేసాడు. నేను షెఫ్ నవ్వాలనుకుంటున్నాను. నాకు ఇంటర్ మంచిమార్కులు వస్తే చాలు. ఇంత ఒత్తిడి నాకు అవసరం లేదు. అని తెగేసి చెప్పేసాడు. లబోదిబోమని ఇంట్లో వాళ్ళు ఓ క్షణం మొత్తుకున్నా, పేపర్లలో రోజూ చదువుతున్న సున్నిత మనస్కుల అఘాయిత్యాలు గుర్తొచ్చి ఊళ్ళోనే ఓ మంచి కాలేజీలో చేర్చారు. అదీ విషయం.

    రిప్లయితొలగించండి
  4. అయ్యోపాపం! నిజమే. ఇలాంటి మోసాలు చాలా ఉంటాయి. కానీ సరైన అవగాహనలేను చోటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. జాయిన్ అయ్యేముందు కొంచెం ఎంక్వెయిరి చెయాల్సింది.....ఎందుకంటే ఇది ఇంజినీరింగ్....మెడిసిన్లాగా కాదు కదా! ఏమీ తెలీనప్పుడు అంత సాహసం చేయడం...ఏమోలే అయిందేదో అయిపోయిందిగా! కానీ మీరు చెప్పిన చివరి మాట బాగుంది. 'మూడేళ్ళకోసం నలభయ్యేళ్ళు ' :))

    రిప్లయితొలగించండి
  5. మురళిగారు, 'మనీ హై తో హాని హై' సినిమా చూసారా? అందులో మనోజ్ బాజపేయి కోటి రూపాయలు వ్యాపారంలో పెట్టి తొంభై లక్షలు నష్టపోతాడు. ఎవరో జాలి చూపిస్తే, నాకు కోటి రూపాయలతో వ్యాపారం చేసే అనుభవం వచ్చింది, నష్ట పోయింది తొంభై లక్షలు. మిగిలి ఉన్న పదిలక్షలు, కోటి రూపాయల వ్యాపార అనుభవంతో మళ్ళి వ్యాపారం చేస్తా పది కోట్లు సంపాదిస్తా అంటాడు. ఎందుకో నాకు సినిమా కన్నా ఈ ఒక్క డైలాగు నచ్చింది. పడ్డవాళ్లేపుడు చెడ్డ వాళ్ళు కాదు అని నానుడి, చూడండి అతని అదృష్టం ఎలా ఉందో. మీ లాంటివాళ్ళు అతనికి కొంత మానసిక ధైర్యాన్ని ఇస్తే కొంత సమస్య నుండి బయటపడతాడేమో!!

    రిప్లయితొలగించండి
  6. This is the issue with many parents. Many would have seen such instances in their circles.

    As such parenting (parenting in the current times) is not easy, mainly due to the many choices and distractions to children. I heard somewhere that there are 2 choices in leading life, simply put chana and honey and one has to have both. If one enjoys honey first, he may have to enjoy spiceless hard chana at a later date, when he may not have his teeth in tact.

    One more issue is parents not letting children live their life(remember Bommarillu movie?). It is true that the parent had worked hard and reached a place where one is reasonably comfortable. However the problem comes when the parent tries to impress(enforce is right word) it on the kid, when his/her interest is else where.

    The reason why i termed parenting not easy is that a parent will not know whether the path followed by him(with respect to his child or himself) is correct or not until he reaches the very end. . This mostly leaves the child and parent with few choices at that point.

    One main cause for this state of affairs with bringing up children is that we as parents are pushing children into rat race and not giving him/her the lessons needed for life. For example, finance. I recall one of my colleague berating his son that he doesnot know banking(deposit/withdrawal etc) even after the end of his engineering. The point he missed was that he(parent) himself is responsible for that. Similarly going out into the world. How many parents let their children go to any camp and live on their own(at least for a few days). Hardly few.

    If this issue is taken care, what one studies hardly matters. Many of top level officials of good organisations in India are simple graduates. Also in the world, persons who are/were billionires are mostly school dropouts.(Ambani, Gates etc)

    In summary, as parent, one can inculcate the independence in the child by teaching them life skills on a continuous basis. It is not easy as one needs lot of patience to work with children, specially who are currently teens. And one needs double this patience for course correction of a child who uselessly spent most of his fruitful learning life as the child in the case.

    రిప్లయితొలగించండి
  7. IT కంపెనీల కోసం పిల్లలని కనే తల్లిదండ్రులదే ఈ తప్పంతా.
    ఏమి చదవాలనుకొంటున్నారని పిల్లలని ఎవరూ అడగరు.
    వాళ్ళు ఏమి కోరుకొంటున్నారో చెపుతారు అంతే.

    రిప్లయితొలగించండి
  8. హ్మ్ కానీ ఆ పిల్లాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది అనుకోవడానికేమీ లేదు. better late than never. ఇప్పుడు తనకి ఏమి కావాలో అది ఇష్టపడి చదువుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. డబ్బు, సమయం వృధా అయినమాట నిజమే కానీ వీటన్నిటికంటే గొప్పవైన మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే ఆ కుర్రాడు జీవితంలో పైకొస్తాడు. మీరు మంచి సలహాయే చెప్పారు.

    ఇంజనీరింగ్, మెడిసిన్, సి.యే లేదా ఎం.బి.ఎ తప్ప మిగతా చదువులు చదువులే కావు అనుకున్నంతవరకు యువత ఇలాంటి సమస్యను ఎదుర్కోక తప్పదేమో!

    రిప్లయితొలగించండి
  9. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల POలకి నెలకి ఇరవై వేలు జీతం వస్తుంది. ప్రొబేషన్ పూర్తైన తరువాత జీతం ముప్పై వేలకి లేదా నలభై వేలకి పెరుగుతుంది. మా అమ్మగారి జీతం నెలకి నలభై వేలు. ఈ విషయం తెలిస్తే బ్యాంక్ ఉద్యోగాలకి కూడా పోటీ పెరుగుతుంది. ఇప్పటికే పోటీ మొదలయ్యింది కూడా. మొన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ముగ్గురు అమ్మాయిలు కూర్చుని అప్లికేషన్ ఫార్మ్‌లు నింపుతోంటే అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్లు అనుకున్నాను. అవి PO పోస్ట్‌లకి అప్లికేషన్లని తరువాత తెలిసింది. PO పరీక్షలకి కోచింగ్ సెంటర్లు కూడా మా పట్టణంలో కొత్తగా వెలిశాయి.

    రిప్లయితొలగించండి
  10. హలో మురళి గారు, ఇలాంటి సమస్య మా స్నేహితుడు ఒక అబ్బాయి కి కూడా వచ్చింది. మా తో పాటు ఆడుతూ పాడుతూ చాల చక్క గ చదివే అతను CA లో జాయిన్ అయ్యాక ఎందుకో కాన్ఫిడెన్సు తగ్గింది. CA లో ఒక సబ్జెక్టు పోయినా మళ్ళి మొదటి నుండి చదవాలి అని చెప్పారు. ఇలా ఇంకా చదవాలి అంటే ఇంట్రెస్ట్ పోతుంది, మా అందరితో కలవడానికి కూడా ఇష్టపడే వాడు కాదు. చాల బాధ గ అనిపిస్తుంది అతన్ని తలచుకుంటే. మీకు తెలిసిన అబ్బాయి కి నిజం గ ఎందుకు భయపడుతున్నాడో కనుక్కొని అతనికి మిగత రంగాలలో ఎమన్నా ఇష్టం వుంటే ఆ దిశగా ప్రోత్సహించడం నయం.

    రిప్లయితొలగించండి
  11. DG: నిజం.. మీరన్నట్టుగా చదువుకీ, సంపాదనకీ సంబంధం ఉండకపోవచ్చు.. కానీ చదువుకీ, చదివే వాళ్ళ ఆసక్తికీ సంబంధం ఉండడం అవసరం.. ఇతని సీఏ విషయంలో ఆ ఆసక్తే కనిపించలేదు నాకు.. ధన్యవాదాలు.
    @రాజశేఖర్ దాసరి: అవునండీ.. పైగా చదవడమే ఇష్టం లేనివాడు, అదే ఉద్యోగంలో ఎలా కొనసాగగలడు? అని నా డౌట్ ...ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: పోన్లెండి.. అది తన కప్ ఆఫ్ టీ కాదని త్వరలోనే తెలుసుకున్నాడు.. మరీ ఏడాదో, రెండేళ్ళో టైం వేస్ట్ కాకుండా.. ఇక్కడ డబ్బు కన్నా కూడా టైం విలువైనది కదా.. తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు వాళ్ళని కూడా అభినందించాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @ఇందు: అవునండీ.. ఈ టైం లో ఆలోచించాల్సింది అదే కదా.. పైగా, చదువే ఇష్టం లేని వాడు ఆ ఇష్టంలేని ఉద్యోగం ఎలా చేస్తాడు? ఎంతకాలం చేస్తాడు? ..ధన్యవాదాలు..
    @శ్రీ: చూడలేదండీ. ఇప్పుడు మీ వ్యాఖ్య చూశాక, చూడాల్సిన జాబితాలో వేసుకున్నాను.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్; నిజమండీ.. స్పూన్ ఫీడింగ్ ఇవ్వడంలో చూపిస్తున్న శ్రద్ధ, బతకడం ఎలాగో నేర్పించడంలో ఉండడం లేదు.. కనీసం బజారుకెళ్ళి కూరలు తేలేని వాళ్ళు, ఇంటి బడ్జెట్ లాంటివి ప్లాన్ చేయగలిగే వాళ్ళు ఎక్కడో తప్ప కనిపించడం లేదు.. అలా అనడం కన్నా, వాళ్ళకా అవకాశం ఇవ్వకుండా, అదేదో గొప్పగా పెంచడం అనుకుంటున్నారు పేరెంట్స్.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. @బోనగిరి: కొంచం నిష్టూరంగా వినిపిస్తున్నా నిజం చెప్పారు! కానైతే ఇదంతా ఒక శాఖా చంక్రమణం అనిపిస్తుంది నాకు.. చక్రం అలా తిరుగుతూ ఉంటుందేమో.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: ఇప్పటికైనా తనకి ఆసక్తి ఉన్న దాంట్లో చేరమని అతనికీ, చేర్పించమని పేరెంట్స్ కీ చెప్పానండీ.. నిర్ణయం వాళ్ళది కదా.. చూడాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @ప్రవీణ్ శర్మ: బ్యాంక్ పీవో కి కనీస అర్హత డిగ్రీ అని ఇచ్చారండీ.. ఇప్పుడు ఇతని క్వాలిఫికేషన్ ఇంటర్ మాత్రమే.. పైగా తల్లిదండ్రులు చదివించ గలరు.. ధన్యవాదాలు.
    @వినీల: అవునండీ.. ఇతనికీ అలాంటి భయాలేవో ఉన్నాయి.. "బేసిగ్గా నాకు ఇష్టం లేదు, పేరెంట్స్ కోసం చేరాను" అంటున్నాడు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి