మంగళవారం, మే 03, 2011

ఆరోగ్యశ్రీ

నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా మొదలై, దాదాపు ఏడాది క్రితం వరకూ ఓ వెలుగు వెలిగి ప్రస్తుతంలో మిణుకు మిణుకుమంటున్న ఆరోగ్య బీమా పధకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. 'మహానేత' కలల ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ భారీ పధకం వల్ల సామాన్య ప్రజలకన్నా, కార్పొరేట్ ఆసుపత్రులు, బీమా సంస్థలే ఎక్కువగా లాభ పడుతున్నాయని కిట్టని వాళ్ళతో పాటు 'ఆరెండు' పత్రికలు అనేకసార్లు కోడై కూశాయి. ఇప్పుడూ అడపాదడపా కూస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే ప్రత్యేకమైన ఈ పథకం కింద, తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నవారందిరికీ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయబడ్డాయి. ఆరోగ్యశ్రీ కార్డు అందని పక్షంలో, తెల్ల రేషన్ కార్డునే ఆరోగ్యశ్రీ కార్డుగా పరిగణించాల్సిందిగా సంబంధిత ఆస్పత్రులకి ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులలో, ఎంపిక చేసిన అనారోగ్యాలకిగాను, కార్డుదారులకి వారి కుటుంబ సభ్యులకి కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం లభిస్తుంది.

గడిచిన నాలుగేళ్ళలోనూ కార్పొరేట్ ఆస్పత్రి రిసెప్షన్లో డాక్టర్ నుంచి పిలుపుకోసం ఎదురు చూస్తున్నప్పుడు అనేకమార్లు ఎదురుపడ్డ దృశ్యం ఒకటే. ఆరోగ్యశ్రీ కార్డుతో వచ్చిన రోగులు, బంధువులు, ప్రత్యేక కౌంటర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నర్సు వారి రిపోర్టులు పరిశీలించి, వారి అనారోగ్యం ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని చెప్పడం. కనీసం పది సార్లకి తక్కువకాకుండా నాకెదురైన అనుభవం ఇది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స చేయడం ఎందుకు సాధ్యపడదో రోగులకి వివరించడానికి ఆస్పత్రి సిబ్బంది బాగానే కష్టపడేవాళ్ళు.

ఇప్పుడు స్వానుభవం. తెలిసిన వారొకరు ఆరోగ్యశ్రీ లబ్దిదారులు. వాళ్ళింట్లో పెద్దావిడకి అనారోగ్యం. రెండురకాల శస్త్ర చికిత్సలు అవసరం అని తేలింది. అదృష్టవశాత్తూ రెండు శస్త్ర చికిత్సలూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. కానీ, ఏ ఆస్పత్రిలోనూ ఈ రెండు శస్త్ర చికిత్సల కాంబినేషన్ అందుబాటులో లేదు. కాంబినేషన్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సౌకర్యం లేదు. రెండుసార్లు ఆపరేషన్ టేబిల్ మీద ఆ పెద్దావిడని పడుకోబెట్టడం, ఆవిడ ఆరోగ్యరీత్యా మంచిది కాదని డాక్టర్ల సూచన. ఇప్పుడు వాళ్ళేం చేయాలి?

పేదలకి కార్పొరేట్ వైద్యం అందడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ఎందుకంటే విద్య, ఆరోగ్యం ఈ రెండూ అందరికీ అందుబాటులో ఉండి తీరాలి. కానైతే, ఈ అందించే క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం విపరీతంగా పెరిగిపోవడం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? మనకి ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. కానీ, ఏ ఒక్క దాంట్లోనూ పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నిపుణులైన వైద్యులని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చేమో బహుశా. నిజానికి ఈ కారణాల వల్లే ఆరోగ్యశ్రీ లో ప్రభుత్వ భాగస్వామ్యం అన్న వాదన వినిపించింది అప్పట్లో.

ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించిన మొత్తాన్ని, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచడానికి ఉపయోగించి ఉంటే, కనీసం కొన్ని ధర్మాసుపత్రులైనా సర్వ సౌకర్యాలూ ఉన్న వైద్యశాలలుగా మారి ఉండేవి కదా? వెచ్చించిన సొమ్ముకు గాను, ప్రభుత్వానికి వైద్యపరికరాల రూపంలో స్థిరమైన ఆస్తులు మిగిలి ఉండేవి కూడా. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలాగూ వైద్యం ఉచితమే కాబట్టి, లేనిదల్లా సౌకర్యాలే కాబట్టి, ప్రజలకి అన్ని అనారోగ్యాలకీ చికిత్స చేయించుకునే వీలుండేది. అప్పుడు 'ఆరోగ్యశ్రీ క్లైముల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు' లాంటి విమర్శలకి అవకాశం ఉండేది కాదు.

విద్య, వైద్యాలని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలన్నది ప్రపంచబ్యాంకు నిబంధనల్లో ఒకటి అని వామపక్షీయులు చాలారోజులుగా చెబుతున్నారు. ఉన్నత విద్య దాదాపుగా ప్రైవేటు యాజమాన్యాల అధీనంలోకి వెళ్ళిపోయిన ప్రస్తుత తరుణంలో, ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు, వాటి అమలు తీరు గమనిస్తున్నప్పుడు నిజంగానే ప్రపంచబ్యాంకు అటువంటి షరతు ఏదన్నా పెట్టిందేమో అన్న సందేహం కలుగక మానదు. ఎటూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాల 'సమీక్ష' ఒకటి జరగబోతోంది కాబట్టి, ఈ ఆరోగ్యశ్రీ ఏ రూపు దాలుస్తుందన్నది వేచి చూడాలి.

3 కామెంట్‌లు:

  1. idi nijamenandi. kaani yenta mandi governament doctors sincere gaa vuntunnaru cheppandi. meeru yenta govt. hospitals lo facilities creat cheyyalani chusinaa doctors sincerity lekapote adi oka jeevita kalam time teesukuntundi. arogya sri carporate valla jebulu nimpinaa kontalo konta imapct chupinchindi.

    i think what the governament should do is to try to improve the facilities and responcibilities in government hospitals and gradually discourage arogya sri instead of withdrawing all of a sudden.

    an idal alternative would be to bring social insurance. everybody will be treated equally and poor will pay less premium and rich will pay more premium. idi amalu jaragaalante mana vaalla mind set ni complete gaa reprogram cheyyalsi vuntundi.

    anyway you provided nice analysis

    రిప్లయితొలగించండి
  2. మొన్నీ మధ్య ఒక నిరుపేదకి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చి చాలా ఆసుపత్రులకి తిరిగి చివరికి ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రికొకదానికి వెళ్తే, ఏమీలేదు, మామూలు నొప్పే అని వాళ్ళొక సూదిమందు వేసి పంపేసారట. ఆ నొప్పి ఏ మాత్రమూ తగ్గక అలాగే బాధపడుతున్న అతనికి ఒక నెలకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంది ఒక లేఖ వచ్చిందట. దాని సారాంశం "మీరు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులైనందుకు చాలా సంతోషం. మీ వైద్యానికైన ఖర్చు రెండు లక్షలు ఆ ఆసుపత్రికి చెల్లించాం" అని. మీడియా వాళ్ళు ఆసుపత్రి వారిని సంప్రదిస్తే ఆ రెండు లక్షలు స్కానింగ్‌లకి అయిన ఖర్చు అని లెక్కలు చూపించేసారు.

    రిప్లయితొలగించండి
  3. @mmd: నేను 'ఆరోగ్యశ్రీ' ఒక్కసారిగా ఆపేయాలని అనడంలేదండీ.. కానీ ప్రభుత్వ ఆస్పత్రులని కూడా అభివృద్ధి చేయాలని అంటున్నాను.. జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు సరిగా పని చేయడం లేదంటే, లోపం ఎవరిది? జీతాలు ఇస్తున్న వాళ్ళదే కదండీ?!! ..ధన్యవాదాలు.
    @శిశిర: ఆశ్చర్యం ఏమీ లేదండీ.. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. అలా జరిగిపోతోంది, అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి