గత కొన్ని వారాలుగా వార్తల్లో బాగా వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రాంతాలు కడప, పుట్టపర్తి. తండ్రికి రాజకీయ జీవితం ఇచ్చి, ముఖ్యమంత్రిగా ఎదగనిచ్చిన పార్టీ మీదా, పార్టీ అధినేత్రి మీదా అలిగిన వారసుడు ఆ పార్టీని విడిచిపెట్టి, వేరు కుంపటి పెట్టుకున్న ఫలితంగా కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానాలకి జరగబోయే ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకీ ఓ సవాలుగా మారడంతో పాటు, వార్తలకోసం ఆవురావురుమంటున్న ప్రసార సాధనాలకి కావలసినంత ముడిసరుకు అందిస్తోంది.
వారసుడికి సొంతంగా మీడియా హౌసు ఉండడం వల్లనూ, 'ఆ రెండు' మీడియా హౌసులూ అతని వ్యతిరేకులకి అనుకూలంగా (ప్రజలకి కాదు) పనిచేస్తున్నందువల్లనూ నాలాంటి వాళ్ళు నాణేనికి ఉన్న బొమ్మా బొరుసూ తెలుసుకోగలుగుతున్నారు. సందట్లో సడేమియాగా గొప్పవారి గోత్రాలు ఎవరూ అడగకుండానే బయట పడుతున్నాయి. ఇరువర్గాలూ కూడా మరణించిన 'మహానేత' నిజమైన వారసులం మేమంటే, మేమేనంటూ వాద ప్రతివాదాల్లో తేలుతూ టీవీ చానళ్ళ ద్వారా జనానికి వినోదాన్ని అందిస్తున్నాయి.
అచ్చంగా వారసత్వ పోరే, మరోరూపంలో జరుగుతోంది అదే రాయలసీమలోని పుట్టపర్తిలో. నూట ముప్ఫైకి పైగా దేశాల్లో భక్తుల చేత నడిచే దైవంగా కొనియాడబడ్డ పుట్టపర్తి దేవుడు సత్యసాయి బాబా అనారోగ్యం పాలైనట్టుగా మొదటి వార్త వచ్చిందే తడవుగా చర్చలు మొదలయ్యాయి, ప్రభుత్వానికి సమాంతరంగా సాయిబాబా నిర్మించిన అఖండ సామ్రాజ్యానికి వారసుడు ఎవరు? అనే అంశం మీద. వైద్యానికి స్వామి శరీరం సహకరించని కారణంగా ఆయన్ని బతికించలేక పోయామని వైద్యులు తేల్చేశారు. సమాధి నిర్మాణం కన్నా ముందే వారసత్వ చర్చ ఊపందుకుంది.
నలుగురైదుగురు భక్తులు కలిసి ఓ ఖాళీ స్థలంలో గుడి కట్టినా, ఆ ఆలయానికి కొంచం పేరూ, ఆదాయమూ వచ్చేసరికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా దానిని స్వాధీనం చేసేసుకోడానికి సర్వదా సిద్ధంగా ఉండే ప్రభుత్వం, లక్షన్నర కోట్ల రూపాయలకి పైగా విలువైన ఆస్తులు ఉన్నట్టుగా చెబుతున్న సత్యసాయి సంస్థల వ్యవహారంలో కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే ఎందుకు పోషిస్తోందన్నది లక్షన్నర కోట్ల రూపాయల ప్రశ్న. సత్యసాయి జీవించి ఉన్నంతకాలమూ పుట్టపర్తి అన్ని చట్టాలకీ అతీతమైన ప్రదేశంగానే వెలుగొందింది. ఆయన మరణం తర్వాత కూడా చట్టాలకి సంబంధించి 'యధాతధ స్థితి' కొనసాగనుందా?
మళ్ళీ కడపకి వద్దాం.. ఈ ఎన్నికలకోసం ప్రభుత్వం ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టడం అవసరమా? (అభ్యర్ధుల ఖర్చు కాదు, ప్రభుత్వ పరంగా ఎన్నికల ఏర్పాట్ల ఖర్చు). ఎన్నిక ఎందుకు జరపాల్సి వస్తోంది? ఎన్నికైన అభ్యర్ధి, తన పదవీ కాలం పూర్తి కాకముందే, తనని గెలిపించిన పార్టీ పట్ల విశ్వాసం కోల్పోవడం వల్ల. సరే, రాజీనామా ఆయా అభ్యర్ధుల వ్యక్తిగత విషయం. వారి రాజీనామా కారణంగా ఏర్పడ్డ ఖాళీ భర్తీ చేయడం కోసం జరుగుతున్న ఎన్నికలో మళ్ళీ వాళ్ళే మరో పార్టీ తరఫున పోటీ చేస్తుంటే, అందుకోసం జనం పన్నులరూపం లో కట్టిన డబ్బుని ప్రభుత్వం ఖర్చుపెట్టడం అసమంజసంగా అనిపించడం లేదూ?
ఒక అభ్యర్ధి రెండు స్థానాలలో పోటీ చేసి గెలిచి, ఒక సీటుకి రాజీనామా చేసినప్పుడూ, ఇలా పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చేలా చేసి తనే మళ్ళీ పోటీలో నిలబడ్డ సందర్భంలోనూ ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చుని సదరు అభ్యర్దే భరించే విధంగా చట్ట సవరణ జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇది కేవలం వారసుడి కారణంగా జరుగుతున్న ఎన్నికల గురించి మాత్రమే కాదు, ఎందుకంటే ఈ తరహా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి కాదు. పుట్టపర్తి విషయం మాత్రమే కాదు, ఈ విషయాన్నీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ఆలోచిస్తారనుకోను.
ఇలా పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చేలా చేసి తనే మళ్ళీ పోటీలో నిలబడ్డ సందర్భంలోనూ ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చుని సదరు అభ్యర్దే భరించే విధంగా చట్ట సవరణ జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది
రిప్లయితొలగించండి-----------------------
very true !
చట్టం చేయడం మాట అలా ఉంచి ఇలాంటి విషయాలు ఆలోచించే అవకాశం వచ్చినా వారెవరూ ఆలోచించరు. ఎందుకంటే పార్టీ మీదో, పార్టీలోని మరో మనిషి మీదో అలిగినప్పుడల్లా వారి వారి సామర్ధ్యాలు నిరూపించుకోవడానికి పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చేలా రాజీనామా చేయడం, ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మళ్ళీ వారే పోటీ చేయడం(అదే పార్టీ నుండయినా)వాళ్ళాడే రాజకీయ చదరంగంలో ఒక ఎత్తు అనుకుంటున్నారు కనుక. ఇదంతా వాళ్ళకొక ఆటలా ఉంది కనుకా. మధ్యలో గొర్రెలవుతున్నది తామేనని ప్రజలకీ తెలుసు, ఆ ఆడే వారికీ తెలుసు.
రిప్లయితొలగించండిమీరు మొదట చెప్పిన వారసుడుగారికి ఒక్క మీడియా హౌస్ కాదండి, మూడు ఉన్నాయి. సాక్షి పేపర్, టీవీలతోబాటు టీవీ5ను కూడా వారు కొనేశారు. ఇక ఎన్ టివి, ఐన్యూస్ ఛానళ్ళ మాతృసంస్థ రచన బ్రాడ్ క్యాస్టింగ్ తో వారసుడుగారికి వ్యాపార భాగస్వామ్యం ఉంది. అందుకే అవి వారసుడుగారి బాకా ఊదుతుంటాయి.
రిప్లయితొలగించండి"ఇలా పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు వచ్చేలా చేసి తనే మళ్ళీ పోటీలో నిలబడ్డ సందర్భంలోనూ ప్రభుత్వ పరంగా జరిగే ఖర్చుని సదరు అభ్యర్దే భరించే విధంగా చట్ట సవరణ జరపాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది"
రిప్లయితొలగించండినేను కామెంటు దామనుకున్న మాట మీరే రాసేశారు :)
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@శిశిర: నిజమేనండీ.. ఈ రాజీనామా అన్నది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు కదా.. అందుకే వాళ్ళెవరూ మాట్లాడారు. అదీకాక వాళ్ళ విషయాలు వచ్చేసరికి అందరూ ఒకటే (ఉదా: జీతభత్యాలు).. కాబట్టి అటు నుంచి ఆశించలేము.. ధన్యవాదాలు.
@తేజస్వి: అవునా!! కొత్త విషయమండీ నాకు.. ఇకపై మీరు చెప్పిన వారి కార్యక్రమాలు గమనించాలి అయితే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వాసు: అయితే ఏకీభవించేశారన్నమాట!! ...ధన్యవాదాలండీ..