గురువారం, ఏప్రిల్ 14, 2011

లౌక్యం

లౌక్యము అంటే ఏమిటి? మోసానికీ, లౌక్యానికీ భేదాలేమిటి? ..అదేమిటో కానీ ఈ ప్రశ్నలకి ఎప్పుడూ సంతృప్తికరమైన సమాధానం దొరకదు. అవతలి వాళ్ళని నొప్పించకుండా, మనకి కావాల్సిన విధంగా వాళ్ళని ఒప్పించడం లౌక్యం అనిపించుకుంటుందా? లౌక్యంలో యెంతో కొంత మోసం ఇమిడి ఉందా? అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే ఏదన్నా మోసానికీ, లౌక్యానికీ మధ్యన ఉందా? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలు.

"ఫలానా ఆయన చాలా లౌక్యుడు" అని ఎవరన్నా చెప్పినప్పుడు, సదరు వ్యక్తితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు యెంతో కొంత జాగ్రత్త పడిపోతాం కదా.. అయినప్పటికీ ఆయన మనకి తెలియకుండానే మనల్ని తన బుట్టలో వేసేసుకున్నప్పుడు, ఆ విషయం తర్వాతెప్పుడో మనకి తెలిసినప్పుడు ఆయన లౌక్యం ముందు మన జాగ్రత్త ఎందుకూ పనికి రాలేదు కదా అనిపించక మానదు. అలాంటప్పుడు సదరు లౌక్యాన్ని తెలియకుండానే అభినందించేస్తాం.

పైకి కనిపించకుండా లౌక్యం ప్రదర్శించడం అన్నది అందరికీ చేతనయ్యే విద్య కాదు. కొంతమంది ప్రదర్శించే లౌక్యం సులభంగా బయట పడిపోతూ ఉంటుంది. సాధారణంగా కార్యస్థలాలు ఇందుకు వేదికలు అవుతూ ఉంటాయి. బాసులే సదరు లౌక్యులు అవుతూ ఉంటారు. తను లౌక్యంగా ప్రవర్తించానని బాసుడు అనుకునేలా చేయడం ద్వారా ఉద్యోగులు కనిపించని లౌక్యాన్ని ప్రదర్శించేసి మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడానికి ఉద్యోగుల్లో ఐక్యత అవసరం.. ఈ ప్రమాదం రాకుండా ఉండడం కోసమే చాలా మంది బాసులు విభజించి పాలిస్తూ ఉంటారేమో..

నలుగురు మనుషులు కలిసిన ప్రతి చోటా రాజకీయం పుడుతుందని కదా నానుడి.. నిజానికి రాజకీయం కన్నా ముందు లౌక్యం పుడుతుంది. అసలు లౌక్యం ముదిరితే రాజకీయం అవుతుంది అనడానికి కూడా అవకాశం ఉందేమో.. కొంచం పరిశోధనలు జరగాలిక్కడ. సుపరిపాలనకి లౌక్యం ముఖ్యావసరం. 'అర్ధశాస్త్రము' రాసిన కౌటిల్యుడు ఏమన్నాడు? "తుమ్మెద పుష్పాల నుంచి తేనెని గ్రహించినట్టుగా పాలకుడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి" అని కదా.. దీనర్ధం పన్నులు విధించడంలోనూ, వసూలు చేయడంలోనూ లౌక్యం చూపమనే కదా..

"అది మోసం కాదు, నా లౌక్య ప్రజ్ఞే" అంటాడు రామప్పంతులు, మాయగుంటకి జాతకం బనాయించి ముసలి లుబ్దావదాన్లతో పెళ్లి సంబంధం కుదిర్చిన వైనాన్ని మధురవాణికి వర్ణించి వర్ణించి చెబుతూ.. "ఔరా! తాము చేస్తే లౌక్యమూ, మరొకరు చేస్తే మోసమూనా?" అని ఆశ్చర్య పోతుంది మధురవాణి. అయితే, ఇక్కడ మధురం చూపిన లౌక్యమూ తక్కువదేమీ కాదు. పెళ్ళికి లౌక్యులని పిలుచుకు రావడం కోసం పంతుల్ని పెద్దిపాలెం పంపేసి, అతగాడు తిరిగి వచ్చేలోగానే మాయగుంట తో అవధాన్లు పెళ్లి జరిపించేసి ఆపై తన కంటె కోసం పంతులుతో పెట్టుకున్న జట్టీని గురజాడ వారి 'కన్యాశుల్కం' చదివిన వాళ్ళని మర్చిపొమ్మన్నా మర్చిపోగలరా?

లౌక్యంగా బతికితే సౌఖ్యాలు పొందవచ్చా? వచ్చుననే అంటాడు దివాకరం. అదేనండీ, వంశీ 'ఏప్రిల్ 1 విడుదల' లో కథానాయకుడు. చుక్కలు తెమ్మన్నా కోసుకు తెచ్చేస్తానని భువనేశ్వరికి మాటిచ్చేశాడా? ఆవిడేమో చుక్కలొద్దు, నువ్వు నెల్లాళ్ళ పాటు కేవలం నిజాలు మాత్రమే మాట్లాడు చాలు అనేసరికి ఎక్కిళ్ళు మొదలవుతాయి మనవాడికి. అప్పటివరకూ చూపించిన లౌక్యాలన్నీ వరుసగా ఎదురు దెబ్బ కొట్టడం మొదలైపోతుంది. సౌఖ్యాలన్నీ అట్టే పోయి కష్టాలు మొదలైపోతాయి.

రామప్పంతుల్నీ, దివాకరాన్నీ చూడగానే ఒకటే సామెత గుర్తొస్తుంది. 'తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు మరొకడు ఉంటాడు' అని. కానైతే ఆ వెంటే మరో ప్రశ్నా సర్రున దూసుకుని వచ్చేస్తుంది. అస్సలు లౌక్యం అనేదే చూపించకుండా బతకడం సాధ్యమా? అని. నిస్సందేహంగా దీనికి జవాబు 'కాదు' అనే చెప్పాలి. కానైతే దేనికన్నా ఓ పరిమితి అన్నది ఉంటుందని గుర్తుపెట్టుకోవడం కూడా అవసరమే మరి. ఇంతకీ లౌక్యము అంటే ఎదుటి వాళ్ళని మరీ ఎక్కువ మోసం చేయకుండా మనక్కావాల్సింది సాధించుకోడమేనా???

14 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

లౌక్యము 101 క్లాసు నడిపించేశారుగా? :)
ఎక్కడో చదివిన ముక్క - నమ్మిన చోట చేస్తే మోసమూ, నమ్మని చోట చేస్తే లౌక్యమూ. నా వుద్దేశంలో - లౌక్యంలో కొంతలో కొంత win-win approach ఉంటుంది - as opposed to pure selfishness in మోసం

Sravya Vattikuti చెప్పారు...

మధురవాణి (మన బ్లాగరు మధురవాణి గారు కాదు ) చెప్పినట్లు సింపుల్ మనం లేదా మనవాళ్ళు చేస్తే లౌక్యం , ఎదుటి వాళ్ళు చేస్తే మోసం :)

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

నిజం చెప్పాలంటే మురళి గారు,టపా కాస్త కంటే ఎక్కువగానే కన్ ఫ్యూజన్ కలిగించింది.

జయ చెప్పారు...

ఏమిటో, లోక జ్ఞానం లేని దాన్ని...లౌక్యమేమిటొ, మోసమేమిటొ నాకేం తెలుసు!!!(అన్నమయ్య తల్లి డైలాగ్ అన్నమాట:)

ప్రవీణ చెప్పారు...

బాగుందండి. learn లౌక్యం to live అంటారు, కానీ మనసే ఒప్పుకోదు..మనసు ఒప్పించాకపోతే బతకలేవు. నాకు చాల సార్లు ఈ సలహా చెప్పారు నా సన్నిహితులు.

మురళి చెప్పారు...

@కొత్తపాళీ: విన్-విన్ అప్రోచ్.. ఆలోచించాల్సిన పాయింటేనండీ.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: కానయితే రామప్పంతులు ఒప్పుకోలేదు కదండీ? :)) ..ధన్యవాదాలు.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి; అంతేనంటారా?? ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@జయ: బాగుందండీ బాగుంది :)) ..ధన్యవాదాలు.
@ప్రవీణ; నేర్చుకుంటే వచ్చేది కాదేమోనని నాక్కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండీ.. ధన్యవాదాలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి చెప్పారు...

విషయమేంటంటే ఆ కన్ ఫ్యూజన్ ఎందుకొచ్చిందో రాద్దామని మొదలేస్తే అదొక ఠప్.. ఆ.. అయ్యే ప్రమాదం ఎదురయ్యింది.తీరిక చూసుకుని దాన్ని కుదించి కామెంటు లాగానే ప్రచురించేందుకు ప్రయత్నిస్తా(ఎందుకంటే ఈ మధ్య ఠపాలు యేమీ రాయట్లేదండి,వేయటమే)

Mauli చెప్పారు...

http://teepi-guruthulu.blogspot.com/2011/04/blog-post_19.html

Mauli చెప్పారు...

మురళి గారు,

రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి రె౦డవ వ్యాఖ్య చూడనేలేదు. అయితే నేను టపా వ్రాయడ౦ అతిశయోక్తి కాదన్న మాట. టపాలొ మీ అభిప్రాయ౦ చెప్పగలరు. :)

@రాజేంద్ర కుమార్ గారు

మీరు కూడా.

అజ్ఞాత చెప్పారు...

మురళీ గారూ,
బాగుందండీ.మా ఫ్రెండొకడు అప్పులూ మోసాలూ చేయడం హాబీలా ప్రాక్టీస్ చేస్తుంటాడు.ఈ మధ్య నన్ను కూడా జేబులో వేసుకుందామనుకున్నాడు, స్కీం వేసి వాడికే ;ఎద్ద దెబ్బకొట్టాను.
అంతే ఆ దెబ్బతో నన్ను ఎక్కడెక్కడినించో వాడి బాధితులు ఫోన్ చేసి నాకు లౌక్య చక్రవర్తి అని బిరుదిచ్చినంత పని చేశారు.అదండీ మోసం చేయబోయిన వాణ్ణి మోసం చేయడం లౌక్యం అని నా అనుభవం
-సంతోష్ సూరంపూడి

మురళి చెప్పారు...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: తప్పకుండానండీ.. ఎదురు చూస్తూ ఉంటాను..
@Mauli: చదివానండీ బాగా రాశారు.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: ఎత్తుకి పైఎత్తు అన్నమాట.. బాగుందండీ.. ధన్యవాదాలు.

Sandeep చెప్పారు...

లౌక్యం ఒక పద్ధతి. దాన్ని సద్వినియోగం చేయవచ్చును, దుర్వినియోగం చేయవచ్చును. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. -- అని నా అభిప్రాయం.

మురళి చెప్పారు...

@సందీప్: ఒప్పుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి