పుష్కర కాలం క్రితం ఓ పెళ్ళికి వెళ్లాను. ఉన్నట్టుండి కళ్యాణ మండపంలో చిన్నపాటి కలకలం. అతిధులంతా పెళ్లి చూడ్డానికి బదులుగా, వెనక్కి తిరిగి గుమ్మంవైపు తిరిగి చూస్తున్నారు. "హ్యాట్సాఫ్ అంకుల్.." "హ్యాట్సాఫ్ అంకుల్.." అంటున్నారు పిల్లలంతా. ఎవరా అని కుతూహలంగా చూస్తే, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్. వాళ్ళబ్బాయి, మరో సహాయకుడు చక్రాల కుర్చీ తోస్తుండగా, వేదికకి దగ్గరగా వచ్చి, నూతన దంపతులని ఆశీర్వదించి, అటుపై భోజనానికి కదిలారు.
అదిగో, సరిగ్గా అప్పుడే నూతన్ ప్రసాద్ తో మాట్లాడే అవకాశం దొరికింది నాకు. నేను వెళ్ళింది పెళ్ళికూతురి తరపున. ఆయన వచ్చింది పెళ్ళికొడుకు తరపున కావడంతో, దగ్గరుండి ఆయన భోజనం సంగతి కనుక్కునే బాధ్యత నాకప్పగించారు పెళ్ళికూతురి తరపు వారు. నిజం చెప్పొద్దూ.. "ఇప్పుడీయన సినిమా గొప్పలన్నీ నేను భరించాలన్నమాట" అనుకున్నాను మనసులో. నా అంచనాకి భిన్నంగా నూతన్ ప్రసాదే మొదట మాటకలిపారు.
"మీరు పెద్ద సినిమా యాక్టర్ కదా.. ఇప్పుడు పిల్లలంతా మిమ్మల్ని కేవలం మీరు చేస్తున్న టీవీ ప్రోగ్రాం ('హ్యాట్సాఫ్' అని అప్పట్లో ఈటీవీలో వచ్చేది) తో మిమ్మల్ని గుర్తు పడుతుంటే ఎలా అనిపిస్తోంది?" అని అడిగాను నేను. "నేను పుడుతూనే సినిమా నటుణ్ణి కాదండీ. మొదట రంగస్థలం, తర్వాత సినిమా, ఇదిగో ఇప్పుడు టీవీ. నన్ను నటుడిగా గుర్తు పట్టారు కదా చాలు నాకు," అన్నది తన సమాధానం. "అంటే, సినిమా వాళ్ళు టీవీకి రావడాన్ని ఒక మెట్టు దిగడంగా అనుకుంటారు కదండీ?" అన్నాను.
"ఏ నటుడుకైనా మీడియం ఏమిటన్నది ఎప్పుడూ సమస్య కాదు. తన టాలెంట్ చూపించే అవకాశం ఎంత ఉంది? జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అన్నది మాత్రమే చూస్తాడు. చూస్తూ ఉండండి, టీవీలో నటించడానికి అందరూ పోటీ పడే రోజు వస్తుంది," అన్నారు తను. వాళ్ళబ్బాయిని (పేరు పవన్ అని జ్ఞాపకం) పరిచయం చేశారు. "నాతోనే ఉంటున్నాడు" అంటూ. "సినిమాల్లోకి తీసుకొస్తారా?" తడుముకోకుండా అడిగేశాను నేను. "వాడిష్టం. వస్తానంటే వద్దనను.. ఇక్కడి కష్ట నష్టాలన్నీ భరించగలగాలి, వాడికంటూ వాడు పేరు తెచ్చుకోవాలి. ఇప్పటివరకైతే చేస్తానని అనలేదు" అన్నారాయన. వాళ్లబ్బాయిది చిరునవ్వే సమాధానం.
సాధ్యమైనంత వరకూ మరొకరి మీద ఆధారపడకుండా తన పనులు చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ఆయన్ని యాక్సిడెంట్ గురించి గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. అందుకే "సినిమాలేవైనా చేస్తున్నారా?" అని అడిగాను. "నాకోసం వేషం తయారు చేసి పిలుస్తుంటే వెళ్లి చేసి వస్తున్నా. వేషం ఇమ్మని ఎవరినీ అడగడం లేదు. టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలు" అని జవాబొచ్చింది. ఆయన సినిమాలు కొన్నింటినీ "పిశ్చాత్తాపం" "క్లిష్ట పరిస్థితి" లాంటి ఉచ్చారణలనీ గుర్తు చేశాను. సంతోషించారు చాలా.
"నా ఒక్కడి గొప్పతనమూ కాదండీ.. రచయితలు రాసినవి, దర్శకుడు చెప్పినట్టుగా నేను చేశానంతే. జనానికి నచ్చింది, అదృష్టం.." అన్నారు. "ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం నా గొంతే. అది జనానికి నచ్చడమే..." అంటూ భోజనం ముగించారు. "చాలా సంతోషం అండీ. భోజనం బాగుంది," అని నూతన్ ప్రసాద్ అన్నప్పుడు, "ఈయన నిజంగా సినిమా మనిషేనా?" అని సందేహం కలిగింది నాకు. ఆయన మరణ వార్త విన్నప్పటి నుంచీ ఆనాటి సంభాషణ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.