ఆదివారం, మార్చి 20, 2011

ఆనందభైరవి

సంప్రదాయాన్ని బతికించుకోడానికి ఓ తండ్రి పడే ఆరాటం, ఆధునికతని అందిపుచ్చుకోవాలన్న తనయుడి తపన, వీళ్ళిద్దరికీ మధ్యన నలిగిపోయే తల్లి, ప్రియురాలు. ఓ చిన్న కుటుంబంలో జరిగిన ఈ సంఘర్షణలో సంప్రదాయం గెలిచిందా? లేక ఆధునికత ముందు దాసోహమందా?? ...ఈ స్టోరీలైన్ తో, శాస్త్రీయ నృత్యం నేపధ్యంలో ఓ తెలుగు సినిమా అనగానే, 'కథ-చిత్రానువాదం-దర్శకత్వం కాశీనాధుని విశ్వనాధ్' అనే టైటిల్ ని ఊహించేసుకుంటారు మెజారిటీ ప్రేక్షకులు. కానీ, ఈ కథని తెరకెక్కించింది విశ్వనాధ్ కాదు, ఆయన ఆస్థాన రచయిత జంధ్యాల.

మూడు దశాబ్దాలకి పూర్వం 'ఆనందభైరవి' పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై విజయం సాధించిన ఈ జంధ్యాల సినిమాకి, తెలుగులో వచ్చిన కళాత్మక సినిమాల జాబితాలో స్థిరమైన స్థానం ఉంది. బలమైన కథ, అక్కడక్కడా బలహీనంగా అనిపించే స్క్రీన్ ప్లే, వీనులవిందైన సంగీతం, సాహిత్యం, కంటికింపైన నృత్యం, వీటన్నింటికీ మించి పాత్రోచితంగా ఉన్న నటీనటుల నటన, దర్శకత్వ ప్రతిభ.. ఇవన్నీ కలిసి 'ఆనందభైరవి' ని కేవలం అవార్డు సినిమాగా మాత్రమే కాక, జనం మెచ్చిన సినిమాగా నిలబెట్టాయి.

కథాస్థలం దేశం గర్వించదగ్గ సంప్రదాయ నృత్యరీతి పురుడు పోసుకున్న కూచిపూడి అగ్రహారం. ఆ ఊళ్ళోని నాట్య గురువులలో నారాయణ శర్మగారికి (గిరీష్ కర్నాడ్) పెద్ద పేరు. నాట్యకళ వారికి వంశ పారంపర్యంగా అబ్బింది. తాతలనాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కేవలం మగ పిల్లలకి మాత్రమే నృత్యం నేర్పుతున్నారు శర్మగారు. ఆయన కొడుకు ఆనంద శర్మకీ నృత్యం నేర్పించి, తను భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన సంప్రదాయాన్ని తర్వాతి తరానికి అందించాలన్నది శర్మగారి అత్యంత సహజమైన కోరిక.


అయితే, బళ్ళో చదువుతో పాటు అన్నింటిలోనూ ఫస్టున నిలబడుతున్న ఆనంద్ (రాజేష్) కోరిక వేరు. అతనికి నృత్యం అంటే ఆసక్తి ఏమాత్రమూ లేదు. నేర్చుకోవాలన్న కోరిక అసలే లేదు. బాగా చదువుకోవలన్నది అతని కల అయితే, కొడుకుని పెద్ద ఉద్యోగస్తుడిగా చూసుకోవాలన్నది తల్లి లక్ష్మి (కాంచన) కోరిక. గజ్జెపూజ కి ఆనంద్ నిరాకరించడంతో మొదలైన స్పర్ధ, అతడు ఇల్లు వదిలి పారిపోయి మేనమామ ఇంట తలదాచుకోవడంతో పెద్దదై, తన విద్యని నేర్పించడం కోసం బంగారి అనే దొమ్మరి పిల్లని శర్మగారు ఇంటికి తీసుకు రావడంతో ఓ కొలిక్కి వస్తుంది.

బంగారిని భైరవిగా (మాళవిక) మలచి, ఆమెనో గొప్ప నాట్యగత్తెగా తీర్చిదిద్దుతానని అగ్రహారీకులకి సవాల్ విసిరి, ఆమెతో కలిసి ఇల్లు విడిచిపెడతాడు నారాయణ శర్మ. కొడుకు, భర్త ఇల్లు విడిచిపెట్టడంతో ఒంటరిగా మిగిలిన లక్ష్మికి మామగారే ఆసరా. కొడుకూ, కోడలి ఇళ్ళ మధ్యన తిరుగుతూ ఉంటాడాయన. ఆనంద్, భైరవిల మధ్య చిన్ననాడే మొగ్గ తొడిగిన స్నేహం, వయసుతో పాటు పెరిగి పెద్దదై ప్రేమగా మారడం, ఆనంద్ ని వివాహం చేసుకుంటే భైరవి నాట్యానికి శాస్వితంగా దూరమవుతుందన్న భయంతో వారి ప్రేమని శర్మ గారు అంగీకరించక పోవడం వంటి మలుపులతో చకచకా సాగిపోతుంది కథ.

అగ్రహారీకులకి విసిరిన సవాల్ శర్మ గారు గెలిచారా? ఆనంద్-భైరవిల ప్రేమ గెలిచిందా? శర్మగారి సంప్రదాయం కొనసాగిందా? తదితర ప్రశ్నలకి సమాధానం చెబుతూ ముగుస్తుందీ సినిమా. కొండముది శ్రీరామచంద్రమూర్తి నవల 'చిరుమువ్వల మరుసవ్వడి' ఆధారంగా జంధ్యాల తయారు చేసుకున్న స్క్రిప్ట్ లో విశ్వనాధ్ మార్క్ సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటికే 'సిరిసిరిమువ్వ' 'శంకరాభరణం' వంటి కళాత్మక సినిమాలకి పనిచేసిన అనుభవం జంధ్యాలకి ఈ సినిమా చేయడంలో బాగా ఉపయోగపడింది. ద్వితీయార్ధంలో సాగతీతని, ముగింపుకి ముందు వచ్చే (ప్రి-క్లైమాక్స్) సన్నివేశంలో నాటకీయతనీ తగ్గించి ఉండాల్సింది అనిపించక మానదు.

రమేశ్ నాయుడు సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు ఆణిముత్యాలు. ఎక్కువమందికి మొదట గుర్తొచ్చే పాట 'పిలిచిన మురళికి వలచిన మువ్వకి..' అయినప్పటికీ, నాకుమాత్రం 'కొలువైతివా రంగశాయీ..' పాటే చెవుల్లో మోగుతుంది. శర్మగారు సవాల్ గెలవాల్సిన సందర్భం అనే కీలక సన్నివేశంలో వచ్చే పాట కావడం ఇందుకు కారణం కావొచ్చు. పోటీ జరుగుతుండగానే, శర్మగారి తండ్రి మరణించారనే వార్త తెలియడం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని శర్మగారూ, భైరవీ గుర్తు చేసుకుంటూనే పోటీలో కొనసాగడం... పాటకు తగ్గ చిత్రీకరణ.

'గురుబ్రహ్మా..' అంటూ భైరవికి నృత్య పాఠం మొదలు పెట్టిన నారాయణ శర్మ, అక్కడే ఉన్న తన తండ్రి పాదాలకి నమస్కరించడం, శర్మ గారి పాదాలకి భైరవి నమస్కరించడం చూసినప్పుడల్లా 'ఇక్కడ భైరవి స్థానంలో ఆనంద్ ఉండాలి కదూ' అనిపించక మానదు. 'చైత్రము కుసుమాంజలీ..' మరో మంచి పాట. ప్రారంభంలో వచ్చే 'సుడిగాలిలోన దీపం' జానపద బాణీ కాగా, చివర్లో వచ్చే 'రా..రా...రా...రాగమై' పాట చిత్రీకరణలో శృతి మించిన నాటకీయత కనిపిస్తుంది.

నటీనటుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది గిరీష్ కర్నాడ్ ని గురించే. నారాయణశర్మ పాత్ర కోసమే పుట్టినట్టుగా అనిపిస్తాడు నాకైతే. బాలూ డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఆవెంటనే చెప్పుకోవాల్సింది మాత్రం లక్ష్మి గా చేసిన కాంచనను గురించే. లక్ష్మి పాత్రలో సంఘర్షణని, అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది కాంచన. కొన్ని సన్నివేశాల్లో గిరీష్ కర్నాడ్ తో పోటీపడి నటించింది. మాళవిక నటనకి వంక పెట్టలేము కానీ, ఒక్కరవ్వ వొళ్ళు చేస్తే ఇంకా బాగుండును కదా అనిపిస్తుంది.

కథ ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడుస్తుంది. అగ్రహారీకుల చాందసాన్ని కొంచం ఎక్కువ చేసి చూపించరేమో అనిపించక మానదు. సందర్భానుసారంగా 'సత్యభామ జడ' వంటి కూచిపూడి సంప్రదాయాలని పరిచయం చేసిన తీరు మెచ్చదగింది. నాట్య సంప్రదాయాన్ని గురించి గిరీష్ కర్నాడ్ చేత ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇప్పించారు జంధ్యాల. ఈతరహా ఉపన్యాసాలు అప్పట్లో వచ్చిన చాలా సినిమాలకి ఆయన రాసి ఉన్నారు. జంధ్యాల మార్కు హాస్యాన్ని పంచడానికి సుత్తి ద్వయం మరియు శ్రీలక్ష్మి ఉండనే ఉన్నారు. శ్రీలక్ష్మి 'ఈల' కామెడీ గురించి కొత్తగా చెప్పడానికేముంది?

పాత్రలని పరిచయం చేసి కథలో ముళ్ళని చకచకా వేసిన దర్శకుడు, వాటిని విప్పే క్రమంలో కొంచం తడబడినట్టుగా కనబడుతుంది. 'మూవీ టైం' వీడియో వారు విడుదల చేసిన వీడియో డిస్కు క్వాలిటీ ఏమంత బాగాలేదు. 'ఉన్నంతలో బాగా చేయడానికి ప్రయత్నించాం' అని వారు ఓ నోట్ పెట్టి ఊరుకున్నారు. ఈ సినిమా ప్రింట్ లలో బాగున్న దానిని ఎంపిక చేసి డిస్కుగా రూపాంతరం చెందించడం అత్యవసరం. ఎందుకంటే కళాత్మక సినిమాలని ఇష్టపడే అందరిదగ్గరా ఉండాల్సిన సినిమా ఈ 'ఆనందభైరవి.'

7 కామెంట్‌లు:

  1. ఈ సినిమాకి (ఇంచు మించు జంధ్యాల అన్ని సినిమాలకి ) ప్రొడక్షన్ వాల్యూస్ చాల చెత్తగా ఉంటాయి.
    బహుశా బడ్జెట్ వల్ల నాణ్యత మీద శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది. అప్పటి సినీ ప్రేక్షకుల అభిరుచి మీద కూడా అనుమానం కలుగుతుంది. ఇంకా బాగా ప్రోత్సహించి ఉంటే, కొంత ఎక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసేవరేమో జంధ్యాల అనిపిస్తుంది.
    నెలకు రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చూడగలిగిన జంధ్యాల సినిమాలు ఇలా ఉండడం శోచనీయం.

    ఆనంద భైరవి లో పాటలు, కామెడి మాత్రం భలే ఇష్టం నాకు.

    ఈ సినిమా లో అవసరం లేకపోయినా ఫ్లాష్ బ్యాక్ తో మొదలెట్టడం అప్పటి ఒక ట్రెండ్ ని నిదర్శనం.

    రిప్లయితొలగించండి
  2. రివ్యూ బాగుంది.. చాలా చాలా కాలం క్రితం, దూర దర్శన్ లో చూడటమే.. డి వి డి తప్పకుండా కొనుక్కుంటాను..

    రిప్లయితొలగించండి
  3. ఇది నాకు చాలా ఇష్టమైన సినెమా..డి వి డి క్వాలిటీ నిజంగా చాలా చెత్తగా ఉంది..రాజెష్ నటన గురించి కూడా కాస్త రాసుంటే బాగుండేది...ఎక్కువుగా విలన్ రోల్స్ చేసిన రాజేష్ కి జంధ్యాల గారు ఒక విలక్షణ మైన పాత్ర ఇచ్చారనే చెప్పుకొవచ్చు..

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి సినిమా. ఆంధ్రప్రభ లో అనుకుంటా ఈ నవల వచ్చింది. అప్పుడే చదివాను.
    ఈ సినిమా పేరు వినగానే నాకు మొదట గుర్తొచ్చేది తాత పాత్రలో నటించిన పుచ్చా పూర్ణానందం గారి కంఠస్వరమే. మీరు ఆయన పేరుని మరిచిపోయారు.
    రమేష్ నాయుడు గారి సంగీతం చాలా బాగుంటుంది. విశ్వనాథ్ గారు మామతో చేసినా,ఎందుకో జంధ్యాల గారు ఎప్పుడూ నాయుడు గారితోనే చేస్తారు.
    అన్నట్టు చిత్రము కాదు చైత్రము కుసుమాంజలి అనుకుంటానండి.

    రిప్లయితొలగించండి
  5. మీరు ఎప్పటిలానే చాలా బాగా రాసారండి.

    82 లో ఆంధ్రప్రభ లో వచ్చిన ఈ సిరియల్ "చిరుమువ్వల మరుసవ్వడి" అండి.మదు కాదండి .
    మా అమ్మ ,మా అత్తయ సీరియల్స్ బైండింగ్ చేయించేవారు.ఆ బైండింగ్ల లో ఇది ఒకటి.చాలా సార్లు చదివేను.సినిమా కూడా బాగా ఇష్టం..

    రిప్లయితొలగించండి
  6. @వాసు: నిజమేనండీ.. ముఖ్యంగా జంధ్యాల చివరి రోజుల్లో తీసిన సినిమాలు మరీ దారుణం. నాయికలైతే మరీ నాసిరకం.. అలా ఎలా ఎంపిక చేశారో.. ఫ్లాష్ బ్యాక్ అంటారా.. అంటా విశ్వనాధ్ మహత్యం అనే అనుకోవాలండీ.. ధన్యవాదాలు.

    @కృష్ణప్రియ: చూడదగ్గ సినిమా అండీ.. ధన్యవాదాలు.

    @నైమిష్: నిజానికి రాజేష్ పాత్ర పరిధి చాలా తక్కువేనండీ.. పైగా గిరీష్ కర్నాడ్, కాంచన లాంటి సీనియర్లు పక్కన ఉండడం వల్ల ఇతను చేసింది అంతగా కనిపించలేదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @బోనగిరి: ముందుగా అచ్చుతప్పుని సరిచేసినందుకు ధన్యవాదాలండీ.. సరిచేయడం కోసం రాస్తే కూడా చిత్రము అనే వచ్చింది చిత్రం!! నిజమే పూర్ణానందం గారి గురించి ప్రస్తావించి ఉండాల్సింది నేను.. కుటుంబ సభ్యులందరి మధ్యా వారధిగా ఉండే పాత్ర.. చాలా బాగా చేశారు కూడా.. అలాగే సుత్తి వీరభద్ర రావు ప్రాసలు :-) :-) ..ధన్యవాదాలు.

    @రాధిక (నాని); సరి చేశానండీ, కృతజ్ఞతలు మీకు. సినిమా టైటిల్స్ అలుక్కుపోయినట్టు ఉండడం వల్ల 'మధు సవ్వడి' అనేసుకున్నాను నేను.. అయితే నవల చదివారన్న మాట.. నవల-సినిమా రెంటి గురించీ ఓ టపా రాయండి, వీలు చూసుకుని.. ఎందుకటే నవల ఇప్పుడు దొరికే అవకాశాలు కనిపించడం లేదు మరి :(

    రిప్లయితొలగించండి