ఆదివారం, నవంబర్ 28, 2010

ఉపోషం

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా.. అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా.. జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.." ఇలా పరిపరివిధాలుగా చెప్పి కార్తీక సోమవారం నాడు నేను ఉపవాసం ఉండడానికి అమ్మని ఒప్పించేశాను నేను. అప్పుడు నేను మూడో తరగతి. పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ, కార్తీక మాసం వచ్చిందంటే సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

ఆదివారం రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు. "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే చెర్లో కార్తీక స్నానం చేసొచ్చేశామా. ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది. ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు. "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా బాబూ. నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ, తను మాత్రం పాలు కూడా తాగలేదు. నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తాడు.." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను. కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది.."ప్రసాదం వద్దనకూడదమ్మా, తినాలి" అని కూడా చెప్పింది. నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా, "ఇవాళ మావాడు కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి పుత్రోత్సాహంతో చెప్పింది అమ్మ. వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. "అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది "అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా. "పిల్లాడు ఉపోషం ఉన్నాడు, ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ. "ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది. నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, "అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో, హడావిడి పడుతూ పొయ్యి వెలిగించేసింది వంటకి, "అసలే పిల్లాడు కూడా ఉపోషం" అంటూ. నేనేమో వీధిలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ వంట అవ్వడం, నక్షత్రం రావడం జరిగిపోయింది. ఇంకేముంది, పప్పు, కూర, పులుసు, పెరుగు వేసుకుని బోయినం చేసేశా. "ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది. తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. "కార్తీక సోమవారం కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.

27 కామెంట్‌లు:

  1. అబ్బ మరల బుల్లి మురళి మళ్ళీ వచ్చేసాడా..ఉపోషాలు వుంటున్నడా?పై పెచ్చు బామ్మ ని వదలకపోవడం.పోలిస్వర్గం దీపాలు మొన్న మొన్నే చదివినట్లు.చాల చాల బాగున్నాయి మీ జ్ఞాపకాలు .

    రిప్లయితొలగించండి
  2. నేనెప్పుడూ ఉపోషం ఉండలేదండి.కానీ, మా అమ్మ వారానికి 8 రోజులు ఏదో ఒక దేవుడి పేరు మీద ఉపోశం ఉంటుంది. ఆరోగ్యం పాడవుతుందే అంటే వినదు.టపా నా చిన్ననాటి రోజులని గుర్తుకు తెచ్చిందండి.

    రిప్లయితొలగించండి
  3. hahaha! ilaa aitae enni soemavaaraalainaa upoesham unDocchu;)
    baagundanDee. intakee baammagaarekkaDiki velhlhaaru mee upoesham taimuloe?

    రిప్లయితొలగించండి
  4. చాన్నాళ్ళవుతుంది మీ చిన్ననాటి ఙ్ఞాపకాలు చదివి. ఎప్పటిలానే అందంగా అపురూపంగా ఉన్నాయ్ మూడేళ్ల మురళి ఉపోషం క(ఇ)ష్టాలు :)

    రిప్లయితొలగించండి
  5. ఎప్పటిలాగే మళ్ళీ బాల్యంలోకి తీసుకెళ్ళిపోయారు. అధ్భుతంగా రాస్తారండి మీరు. చాలా మామూలు అనుకునే జ్ఞాపకాలే అపురూపమైనవి అయిపోతాయి మీ టపా చదవగానే. ఇంత అందమైన జ్ఞాపకాన్ని అంత తేలికగా ఎందుకు తీసుకున్నానా అని నామీద నాకే కోపమొచ్చేస్తుంది. :)

    రిప్లయితొలగించండి
  6. Mee uposhalu naa balyam gurtuku techai. naku annam tinatamante appatlo tagani badhakam. roju kalipi peditene tinedanni. so inchakka bhojana karyakramam inka kanchalu, manchineellu pettadam lanti panlu avoid cheyataniki ee upavasalu ammani batimali maree chesedanni.
    entaina upavasanantaram evening tine bhojanam chala ruchi kadandi.

    Sree Raaga

    రిప్లయితొలగించండి
  7. ఉపోషం :)
    ఐతే మిమ్మల్ని తెలంగాణావాదులు, సమైక్యాంధ్రవాదులు కాంటాక్ట్ అవ్వమని చెప్పాలి. వాళ్ళ నిరాహారదీక్షలకి మీలాంటి సుశిక్షితుడైన సైనికుడి అవసరం చాలా ఉంది. నాకు ఉపవాసాలకి భూమికి హేలీ తోకకి ఉన్నంతదూరం

    రిప్లయితొలగించండి
  8. శిశిర గారు! మీ కామెంట్ చదివాక పోస్ట్ చదివాను. బాగా చెప్పారు.
    మురళి గారు! హహహహ....
    నేను కూడా మీలాగే ఉపవాసాలు చేస్తుంటాను.:)

    రిప్లయితొలగించండి
  9. బావుంది మీ ఉపోషం. అన్నీ చక్కా తినేసి ఉపోషమా....హహహ.

    ఇంట్లో మా నలుగురం ఉపోషం ఉండేవాళ్ళం. వీలైతే అన్ని సోమవారాలూ లేదా వీలైనన్ని సోమవారాలూ చేసేవాళ్ళం. ఉదయం నుండి పాలు మాత్రమే తాగుతూ, సాయంత్రం వేళకి చుక్కలు ఎప్పుడు కనిపిస్తాయా అని మా చెల్లి, నేను పెరట్లోనే కాపుకాసేవాళ్ళం. సాయత్రం అయ్యాక స్నానాలు అవీ చేసి మా నాన్నగారు ఆయనకీ, మాకూ కూడా విభూది పట్టీలు వేస్తూ ఉంటే తెగ సరదాపడేవాళం. అదేమి మహిమోగానీ రోజూకన్నా కార్తీక సోమవారం నాడు మాత్రం భోజనం అమోఘంగా, అద్వితీయంగా ఉంటుంది.

    ఆ ఇంకోటి...ఆరోజుకి మడిబట్టలు ఆరేసుకుని, పూజ వేళకి కట్టుకోవడం ఇంకో ప్రహసనం. నేనూ, మా చెల్లి మా మడి బట్టలకి ఏమైనా తగిలేస్తాయేమో అని అవి ఆరేవరకు వాటి పక్కనే కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం.

    మీ పోస్ట్ నా మధుర జ్ఞాపకాలన్నిటినీ గుర్తుకుతెచ్చింది. Thank u so much!

    రిప్లయితొలగించండి
  10. మురళి గారూ.. హహ్హహ్హా.. భలే ఉన్నాయి మీ ఉపోషం కబుర్లు. ఎంత బాగా ఉన్నారో ఉపోషం. పోస్ట్ చాలా చాలా బాగుంది..:)

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు, మల్లి ఇంకొ మదురానుభూతిని గుర్తు చెసారా.చాల చాల థాంక్స్ అండి.మీ కార్తిక సొమవారాల లాగా మేము శ్రావణ శనివారాలు ఉండెవాల్లం.(నేను మా చెల్లి). అన్నం మాత్రం తినకుడదట కాన్ని అప్పాలు, వొడియలు, టిఫిన్లు తినొచ్చట అని ఒకరికొకరం చెప్పుకొని మా అమ్మమ్మకు చెప్పి మరి తినెవాల్లం. ప్రసాదాలు కుర్చోని తింటె తప్పు కాని,పిల్లలు నిలబడి తింటె తప్పేమి లేదని మా అమ్మమ్మ మాకు చాల చాల రాయితీలు కూడ ఇస్తుండేది. మా చెల్లెలు ఇప్పటికి అవి పాటిస్తునే ఉపవాసాలు చెస్తుంటుంది అప్పుడప్పుడు.

    రిప్లయితొలగించండి
  12. అబ్బే, ఏనాడూ ఉపోషం మొహం ఎరుగను నేను. ఈ పద్ధతేదో బాగుందని ఇప్పుడిప్పుడే అయిడియా వస్తోందండి. ఇంక మిమ్మల్ని ఫాలో అయిపోతా. ఈ మిగిలిన జీవితంలో కొంచమైనా పుణ్యం దక్కించుకుంటా.

    రిప్లయితొలగించండి
  13. :))) చాలా బావున్నాయి మీ ఉపోషం కబుర్లు.. లాంగ్ వీకెండ్ స్పెషల్స్ అన్నీ బాగా లాగించేసి ఇవాళ ఉపవాసానికి ఎంతో కష్టపడి మనఃశ్శరీరాలని సిద్ధం చేసుకుంటూ మీ టపా చూశాను.. ఏమైనా ట్రిక్స్ చెప్తారని ఆత్రంగా చదివితే యధావిధిగా బుల్లి మురళి ఆద్యంతం నవ్వించాడు :-)

    ఇంతకీ చిన్నారి పొన్నారి మురళి కబుర్ల పుస్తకం త్వరలో ఆశించవచ్చంటారా? అప్పుడే ముప్పై ఐదు కధలైపోయాయి మరి! :-)

    రిప్లయితొలగించండి
  14. మొరళి గారు,

    బాగున్నాయండీ మీ ఉపోషం కబుర్లు, మీరు ఏది చెప్పీనా చాలా బాగా చెపుతారు. ఆహ్లాదం గా, ఆనందంగా వుంటాయి చదువుకోవటానికి.

    రఘురామ్

    రిప్లయితొలగించండి
  15. నేను కార్తిక పౌర్ణమికి "ఉపోషం" ఉంటాను,కాని కటిక ఉపోశం కాదండోయ్ ...కాఫీ మాత్రం తగేస్తాను.

    మురళి గారు ,మీ జ్ఞాపకాలు చదువుతుంటే ,నేను నా ఫ్లాష్ బాక్ కీ వెళ్లిపోయా కాసేపు..చాలా బాగుందండి మీ ఉపోశం .ఇప్పుడూ ఇలాగే చేస్తున్నారా???:)

    రిప్లయితొలగించండి
  16. నాకు ఈ మధ్య కాలం లో బాగా నచ్చిన పోస్ట్ అండి.. తెల్లవారు జామున చలికి వణుకుతూ సముద్రం లో కార్తీక దీపాలను వదిలిన రోజులు గుర్తు వచ్చాయి..చిన్నపుడు నేనూ ఉపవాసం చేసేదాన్ని.. మా అమ్మా మీ అమ్మగారిలానే వీధి వీధి చెప్పేసేది మా అమ్మాయి ఉపవాసం ఈ రోజు అని :)

    రిప్లయితొలగించండి
  17. @చిన్ని: వచ్చేశాడండీ :-) :-) ..ధన్యవాదాలు.
    @విశ్వనాధ్: ఆవిడ భక్తి మీకోసమేనేమోనండీ.. ధన్యవాదాలు.
    @సునీత: ఆవిడ హైదరాబాద్ వెళ్ళిందండీ అప్పుడు. రాగానే చెప్పేశాను కదా.. :-) :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @వేణూ శ్రీకాంత్: మూడేళ్ళు కాదండీ, ఎనిమిది.. మూడో తరగతి.. ధన్యవాదాలు.
    @శిశిర: నాదేమీ లేదండీ.. బాల్యమే అద్భుతంగా ఉంటుంది.. మీరే పట్టించుకోడం లేదనిపిస్తోంది.. ధన్యవాదాలు.
    @సిరి: మీ బద్ధకం తినడానికి కాదేమోనండీ, కంచాలు పెట్టడానికేమో :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @వేణూ శ్రీకాంత్: మూడేళ్ళు కాదండీ, ఎనిమిది.. మూడో తరగతి.. ధన్యవాదాలు.
    @శిశిర: నాదేమీ లేదండీ.. బాల్యమే అద్భుతంగా ఉంటుంది.. మీరే పట్టించుకోడం లేదనిపిస్తోంది.. ధన్యవాదాలు.
    @సిరి: మీ బద్ధకం తినడానికి కాదేమోనండీ, కంచాలు పెట్టడానికేమో :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @సుబ్రహ్మణ్య చైతన్య: నేనేం తిన్నా అమ్మ పెడితేనే తిన్నానండీ.. వాళ్ళకా సౌకర్యం ఉండదు పాపం :-) ..ధన్యవాదాలు.
    @సవ్వడి: ధన్యవాదాలండీ.
    @ఆ.సౌమ్య: నిజమేనండీ.. రోజంతా ఏమీ తినం కదా.. అందుకే భలే రుచిగా ఉంటుంది రాత్రి భోజనం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @మనసు పలికే: నా భక్తి అలాంటిదండీ మరి :-) ..ధన్యవాదాలు.
    @స్ఫూర్తి: అయ్యో.. ఈ నిలబడి తినడం గురించి నాకు తెలీదండీ.. బామ్మ కూడా చెప్పలేదు.. :-) :-) ..ధన్యవాదాలు.
    @జయ: కానివ్వండి మరి.. ఎందుకాలస్యం? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @మనసు పలికే: నా భక్తి అలాంటిదండీ మరి :-) ..ధన్యవాదాలు.
    @స్ఫూర్తి: అయ్యో.. ఈ నిలబడి తినడం గురించి నాకు తెలీదండీ.. బామ్మ కూడా చెప్పలేదు.. :-) :-) ..ధన్యవాదాలు.
    @జయ: కానివ్వండి మరి.. ఎందుకాలస్యం? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @నిషిగంధ: ఇంతకీ ఉపోషం ఎలా ఉన్నారో చెప్పలేదు!! పుస్తకమా?!! మీరు మరీనండీ.. ధన్యవాదాలు.
    @రఘురాం: ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): లేదండీ, ఇప్పుడు కటిక ఉపవాసం.. కేవలం కాఫీ మాత్రమే, అది కూడా రెండేసార్లు తాగి... ధన్యవాదాలు.
    @నేస్తం: అబ్బో.. మీరూ ఉండేవాళ్ళా ఉపోషాలు?? ఆ పుణ్యం అంటా ఊరికే పోయిందా చెప్పండి, సింగపూర్ తీసుకెళ్లలేదూ మిమ్మల్ని?? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @నిషిగంధ: ఇంతకీ ఉపోషం ఎలా ఉన్నారో చెప్పలేదు!! పుస్తకమా?!! మీరు మరీనండీ.. ధన్యవాదాలు.
    @రఘురాం: ధన్యవాదాలండీ..
    @రాధిక (నాని): లేదండీ, ఇప్పుడు కటిక ఉపవాసం.. కేవలం కాఫీ మాత్రమే, అది కూడా రెండేసార్లు తాగి... ధన్యవాదాలు.
    @నేస్తం: అబ్బో.. మీరూ ఉండేవాళ్ళా ఉపోషాలు?? ఆ పుణ్యం అంటా ఊరికే పోయిందా చెప్పండి, సింగపూర్ తీసుకెళ్లలేదూ మిమ్మల్ని?? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. "అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు. "
    అయ్యయ్యో, నేను మాత్రం ఈ టపా ఇన్నాళ్ళు మిస్సయ్యాను!! ప్చ్ ప్చ్

    శివప్రీత్యర్ధం కావాలంటే పదకొండు సార్లు గొంతుచించుకుని నమకం చదువుతానుగానీ ఉపవాసం మాత్రం నావల్ల కాదు!!

    రిప్లయితొలగించండి
  26. మీ ఉపోషం గొప్ప రుచిగా ఉన్నది. మా ఆవిడ రొజూ తన patients కు పురుళ్ళు పోసి పోసి విసేగేసి, నా పెరిగి పోతున్న
    ఉదరం చూచి మండి పడి " మీరు ఉపోషాలు ఉండాలని" రూలు పెట్టింది.

    సాగించుకుంటే ఉపోషం ని మించిన విందు భోజనం మరొకటి లేనట్లుగా ఉన్నది. ఉపోషానికి, నేను సిద్ధం అని చెప్పేస్తాను. మా ఆవిడ మీ బ్లాగ్ చూడకుండా ఉంటె బాగుండని కోరుకుంటున్నా

    రిప్లయితొలగించండి
  27. @కొత్తపాళీ: ఇంత టపా చదివాక కూడా, ఉపవాసం కష్టం అంటే ఎలా అండీ? :-) ..ధన్యవాదాలు.
    @మధురలాలస: ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి