భారీ నీటిపారుదల ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనలు జరుపుతున్న నేపధ్యంలో, మన రాష్ట్రంలో దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న పోలవరం భారీ నీటిపారుదల ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికార పార్టీలో ఒక వర్గం నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులూ ఉన్నారు కానీ, ఆ వ్యతిరేకత కేవలం రాజకీయ కారణాల వల్ల.
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. స్వాతంత్రానికి పూర్వం నుంచీ ప్రయత్నాలు మొదలైనా అనేకానేక కారణాల వల్ల ఎప్పటికప్పుడు నిర్మాణం వాయిదా పడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అట్టహాసంగా మొదలు పెట్టిన 'జలయజ్ఞం' లో పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ పెండింగు ప్రాజెక్టుని ప్రధానంగా చేర్చారు.
అంతేకాదు, పోలవరం ద్వారా గోదావరి డెల్టాకి నీరందుతుందన్ననమ్మకంతో, ఎగువన గోదావరి నదిపై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, తెలంగాణా ప్రాంతంలో బీడు భూములకి నీరంది అవి వ్యవసాయ యోగ్యం అవుతాయి. అయితే, గోదారి దిగువ ప్రాంతానికి ప్రవహించే నీటిని ఎగువ భాగంలోనే లిఫ్ట్ ద్వారా తోడేయడం వల్ల దిగువ ప్రాంతంలో నీటి కటకట ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ కారణం చేత పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుని సమర్ధిస్తున్న నాయకులు అంటున్నారు.
ప్రాజెక్టు పూర్తయితే పెరగబోయే సాగు భూమి విస్తీర్ణం, విద్యుత్ ఉత్పత్తి, ఆంధ్ర తో పాటు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకీ నీరందించే వీలుండడం వల్ల రానున్న కాలంలో మారబోయే రాష్ట్ర ఆర్ధిక ముఖచిత్రం లాంటి అంశాలని ఆకర్షణీయంగా చెబుతున్న ఈ నాయకులు, పర్యావరణ అంశాలని తేలిగ్గా తీసుకుంటున్నారు. "ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలి" అన్న ధోరణి వీరి వ్యాఖ్యల్లో వినిపిస్తోంది.
ప్రాజెక్టు నిర్మించాక ఏదైనా జల విపత్తు జరిగితే కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రధాన నగరాలు ఆనవాలు లేకుండా పోయే ప్రమాదం ఉందనే కారణంతో కొందరూ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే వారి హక్కులని కాపాడడం కోసం మరికొందరూ ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. వీరి వ్యతిరేకతలో ప్రధానంగా రాజకీయ కారణాలే వినిపిస్తున్నాయి తప్ప, పర్యావరణాన్ని గురించి మచ్చుకైనా వీరూ మాట్లాడడం లేదు.
రాజశేఖరరెడ్డి మరణం తర్వాత దాదాపుగా ఆగిపోయిన అనేక ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి. ఇన్నాళ్ళూ మౌనం వహించిన నేతలందరూ ఉన్నట్టుండి ఇప్పుడీ ప్రాజెక్టుని గురించి మాట్లాడడం రాష్ట్ర రాజకీయాలని పరిశీలిస్తున్న వారికి బొత్తిగా అంతుపట్టని విషయమేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొచ్చి, తద్వారా కేంద్ర నిధులతో పనులు పూర్తి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు తవ్విన కాలువలు పూడిపోక ముందే ప్రాజెక్టు పనులు మొదలవుతాయా? అన్నది అంతు చిక్కని ప్రశ్నలాగే ఉంది.
రాజకీయాలని పక్కన పెడితే, పర్యావరణవేత్తలెవరూ భారీ ప్రాజెక్టులని సమర్ధించడం లేదు. జీవ వైవిధ్యం దెబ్బ తినడం, సమతుల్యత లోపించడం లాంటి అనేక కారణాలు ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల కారణంగా కొన్ని అడవులు, జీవజాతులు అంతరించిపోయే ప్రమాదమూ ఉందంటున్నారు వాళ్ళు. ( పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంతరించిపోయే మొదటి జీవి ఆంధ్రులకి అత్యంత ప్రియమైన పులసచేప). ప్రాజెక్టులు-పర్యావరణానికి సంబంధించిన అనేక కీలక అంశాలు సామాన్యులకి అర్ధమయ్యే భాషలో వివరంగా రాశారు రచయిత్రి చంద్రలత తన నవల 'దృశ్యాదృశ్యం' లో.
పర్యావరణాన్నిసైతం పక్కన పెట్టి ప్రాజెక్టుని స్వాగతిద్దామంటే వెంటాడుతున్న మరో భయం పనుల నాణ్యత. గడిచిన కొన్నేళ్లుగా ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క నుంచి అప్పటివరకూ జరిపిన నిర్మాణాలు వరదల్లో కొట్టుకోపోడాన్నిటీవీల్లో చూశాక, ఈ ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకూ పాటించగలరు? అన్నసందేహం కలగక మానదు. గడిచిన ఆరున్నర దశాబ్దాలలో ఎన్నోమార్లు వాయిదా పడ్డ పోలవరం నిర్మాణం ఈసారి ఏమవుతుందో వేచి చూడాలి.
అంత పెద్ద ప్రాజెక్టు ఎత్తిపోతలమీద నడపడం ప్రపంచంలో వేరెక్కడా జరగదేమోనండి, అమలుచేయడం అంటే చాలా ఖర్చు అవసరం, ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చు ప్రాజెక్ట్‌లు గట్రా ఉన్నా, ప్రజలు సహకరించరు, నాయకులకీ మేత అవసరం ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తిగా కట్టడానికే యాభైవేల కోట్లు అవుతుందేమో, అప్పటికీ పనికొస్తుందా అంటే అనుమానమే,
రిప్లయితొలగించండియధా ప్రజాః తధా రాజాః
బాగా రాశారు. చంద్రలతగారి నవలని స్మరించడం కూడా సందర్భోచితం. ఇంకో కోణం కూడ ఉంది. ఆంధ్రప్రదేశ్‌కి
రిప్లయితొలగించండితలమానికాలని చెప్పుకునే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వలన మొదట చెప్పినంత ప్రయోజనం (సాగునీటికీ, విద్యుత్ తయారీకీ) సమకూడలేదని ఎక్కడో చదివాను.
పోలవరం గురించి నా చిన్నప్పటి నుండీ వింటున్నానండీ, ఎప్పటికైనా ఓ కొలిక్కి వస్తుందా అని ఎదురుచూస్తున్నా.
రిప్లయితొలగించండిప్రజలకి లాభమో నష్టమో తరువాత, అసలు ఈ నిర్మాణం జరుగుతుందనే అనుకుంటున్నారా మురళి గారు:)
రిప్లయితొలగించండివరమో, శాపమో కాలమే చెప్పాలి.
రిప్లయితొలగించండిఆనాడు "కాటను" కట్టిన ప్రాజెక్టులవలన ఎవరి కొంపలూ మునగలేదు.
ఈనాడు మనవాళ్ళు కట్టే ప్రాజెక్టుల నాణ్యత చూస్తుంటే ఎంతమంచి ప్రాజెక్టయినా కొంపలు మునగడం ఖాయం.
ఇదిలా ఉంచితే "దృశ్యాదృశ్యం" అని నాకు(ఒక సివిల్ ఇంజనీరుగా) ఆసక్తికరమైన నవలని పరిచయం చేసారు.
మళ్ళీ ఈ రోజు బుక్ ఫెయిర్ కి వెళ్ళి ఈ నవల దొరుకుతుందేమో చూడాలి.
@తార: పోలవరం ఎత్తిపోతల పథకం కాదండీ.. తెలంగాణా లో కడుతున్నవి ఎత్తిపోతల పధకాలు.. ప్రస్తుత అంచనా పదహారువేల కోట్లు.. చూడాలండీ ఎంతవుతుందో.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: ఆ వాదన కూడా ఉందండీ.. ఏమవుతుందో చూడాలి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ప్రతిసారీ చివరివరకూ వచ్చి ఆగిపోతోందండీ.. మరి ఈసారి ఏమవుతుందో.. ధన్యవాదాలు.
@జయ: అధికారిక లెక్కల ప్రకారం ముప్ఫై రెండు శాతం పనులు పూర్తయ్యాయండీ.. (కాలువలు తవ్వడం లాంటివి) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: మీరు తప్పక చదవాల్సిన నవల 'దృశ్యాదృశ్యం' అండీ.. చాలా ఆసక్తికరంగా సాగే కథనం ఆ నవల ప్రత్యేకత.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
ప్రాజెక్ట్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ అందరూ అంగీకరిస్తున్నది అధిక ఖర్చు, పదివేల కోట్లతో పూర్తి చేయొచ్చు కానీ డిజన్ మార్చి ఇరవై వేల కోట్లు చేశారు అని మాత్రం తెలిసింది, నా మొదటి వ్యాఖ్య పోలవరం ఎత్తిపోతలనుకోని పెట్టినది క్షమించగలరు.
రిప్లయితొలగించండి@తార: అయ్యో.. క్షమాపణ ఎందుకండీ.. సరిచేయాలనే ఆ వివరం రాశాను.. ఇక అంచనాలు అంటారా? అవి ఎలా పెరిగిపోతాయో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా..
రిప్లయితొలగించండిలేదు లేదు, నా క్షమాపణలు నేను తెలుసుకోకుండా కామెంటు పెట్టినందుకు అంతే, ఇక మిగతావి అన్నీ కాస్త విషయసేకరణ చేస్తున్నాను, వచ్చాక వివరంగా పెడతాను.
రిప్లయితొలగించండికాకపొతే గిరిజనులు అనే సరికి కొద్దిగా ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది.
ఇంక డాక్యుమెంట్లు అవీ ప్రభుత్వం ఎమ్మటే ఇవ్వదు నెలల తరబడి తిరగాలి, అసలు ఈ ప్రజెక్టులకి సంభందించిన అన్ని వివరాలు, ప్రభుత్వం దగ్గిర ఉన్న సర్వం నెట్లో పెడితే తప్ప నిజానిజాలు బయటకిరావు.
@తార: ఆర్ టీ ఐ పుణ్యమా అని ఇప్పుడు కనీసం అడిగి తెలుసుకునే అవకాశం అయినా ఉందండీ.. నెట్ లో లేటెస్ట్ అప్డేట్స్ లేవు.. నాయకులవి పొంతన లేని ప్రకటనలు.. అధికారులు నోరు విప్పి చెప్పారు.. అదండీ పరిస్థితి. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో నిర్వాసితులు గిరిజనులే అవుతారు సహజంగా, అటవీ ప్రాంతాలే ఎక్కువగా మార్క్ అయ్యేలా జాగ్రత్త పడతారు కదా.. ఎనీ హౌ.. మీ కృషి కొనసాగించండి..
రిప్లయితొలగించండి>>ఆర్ టీ ఐ పుణ్యమా అని ఇప్పుడు కనీసం అడిగి తెలుసుకునే అవకాశం అయినా ఉందండీ..
రిప్లయితొలగించండిదాన్ని కావల్సిన విధంగా బ్రష్టు పట్టిస్తున్నారట, ప్రత్యేకించి మన రాష్ట్రంలో, సమాధానం ఇవ్వరు, అడిగితే అదే పని చేస్తున్నాం అంటారు, అప్పీల్ చేస్తే మందలించి త్వరగా ఇవ్వమని కేస్ కొట్టేస్తున్నారు, దీనికి కనీసం రెండేళ్ళు, తిరిగి మళ్ళీ అప్లికేషన్, తిరగడం, అప్పీలు, ఈ సారి ఒక వార్నింగు, ఐదు వేల ఫైను, మళ్ళీ మొదటికి, ఇలా సాగుతున్నది ప్రస్తుతం ప్రాజెక్టులపై ఆర్. టి. ఐ.,
>>ఎనీ హౌ.. మీ కృషి కొనసాగించండి..
నా స్నేహితులు కొందరు తిరుగుతున్నారు, కానీ వారి ఉద్యోగం వారికున్నది, ఇది పార్ట్ టైం, అడిగిన వెంటనే సమాధానం ఇవ్వరు, పైన చూశారుగా, అదే జరిగింది, ఇస్తే పైనుంచి గొడవ, దానికన్నా ఆ ఐదో, పాతికవేలో కట్టేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారంట..
@తార: ఆర్.టి.ఐ. అమలు మరీ ఇంట దారుణంగా ఉందా!! కొత్త విషయం అండీ.. కొంచం దృష్టి సారించాలి అయితే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి