గురువారం, అక్టోబర్ 29, 2009

నారాయణరావు

డెబ్బై ఐదేళ్ళ క్రితం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగు నవలల పోటీ నిర్వహించినప్పుడు రెండు నవలల్లో దేనికి మొదటి బహుమతి ఇవ్వాలో న్యాయ నిర్ణేతలు నిర్ణయించుకోలేక పోయారు. ఫలితంగా ప్రధమ బహుమతి ని ఆ రెండు నవలలకీ కలిపి ప్రకటించారు. వాటిలో ఒకటి విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' కాగా రెండో నవల అడివి బాపిరాజు రాసిన 'నారాయణరావు.' 1933-34 సంవత్సరాలలో ప్రచురితమైన ఈ నవల ఆ నాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని కళ్ళముందు ఉంచుతుంది.

'వేయి పడగలు' చదివిన నాటినుంచీ 'నారాయణరావు' చదవాలని ప్రయత్నం. ఎట్టకేలకి ఈమధ్యన పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు కొత్త ప్రింట్ కనిపించింది. వెంటనే తీసేసుకున్నాను. ఇది ఉన్నత తరగతి రైతు కుటుంబానికి చెందిన నారాయణరావు కథ. మద్రాసులో లా చదువుతున్న నారాయణరావు తన మిత్రులతో కలిసి సొంత ఊరైన కొత్తపేటకి వెళ్ళడం కోసం రైల్లో ప్రయాణిస్తుండడం తో కథ ప్రారంభమవుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో అతన్ని చూసిన విశ్వలాపురం జమీందారు లక్ష్మీ సుందర ప్రసాద రావు 'నీకు వివాహమైనదా?' అని ప్రశ్నిస్తాడు నారాయణరావును.

బాపిరాజు చిత్రకారుడు, కవీ కూడా కావడం వల్ల ఆ ఛాయలు నవలలో కనిపిస్తాయి. ప్రతి వ్యక్తినీ, స్థలానీ, సన్నివేశాన్నీ కళ్ళకి కట్టినట్టుగా వివరిస్తారు. నారాయణరావుని ఇలా వర్ణిస్తారు రచయిత: "నారాయణరా వాజానుబాహుడు, ఐదడుగుల పదనొకం డంగుళముల పొడవు వాడు. బలసంపదకు నెలవైన వాడు. ఉజ్జ్వల శ్యామలుడు. చిన్నవి, తీష్ణమైన లోచనములు తీరి, సమమై కొంచము పొడుగైన ముక్కు దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనస్సువలె తిరిగి పోయిన పై పెదవికి నాతిదూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీ జాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదై యున్నది"

'నారాయణరావు' మీద తనకున్న ప్రేమని ఎక్కడా దాచుకోలేదు రచయిత. తలిదండ్రులు, సోదరీ సోదరులు, బంధువులు, స్నేహితులు, ఇంట్లో పని వాళ్ళు, ఊరి జనం.. ఇలా ప్రతి ఒక్కరూ నారాయణరావు ని మెచ్చుకొనే వారే. జాతీయోద్యమం లో కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన నారాయణరావు మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ అహింసా సిద్ధాంతం మీద, సత్యాగ్రహం మీద విపరీతమైన నమ్మకం ఉన్నవాడు. జైలు జీవితం కారణం గా చదువుకి మధ్యలో ఆటంకం ఏర్పడడం వల్ల లా లో చేరతాడే తప్ప, న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి తో కాదు. ఐనప్పటికీ తరగతిలో అతడే ప్రధముడే.

జస్టిస్ పార్టీ శాసన సభ్యుడు కూడా అయిన విశ్వలాపురం జమీందారు తన పెద్ద కుమార్తెకి జమీందారీ సంబంధం చేసి తల బొప్పి కట్టి ఉండడం తో, రెండో కుమార్తె శారద కి మామూలు సంబంధం చేయాలని తలచి వరాన్వేషణలో ఉండగా అనుకోకుండా నారాయణరావుని చూడడం, అతన్ని అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించు కోవడం జరుగుతాయి. శారద కి ఇంట్లోనే చదువుతో పాటు సంగీతం చెప్పిస్తున్నారు. ఆమెకి సాహిత్యం అంటే ఆసక్తి మెండు.

జమీందారు గారి భార్య వరద కామేశ్వరీ దేవి గారికి నారాయణ రావు సంబంధం నచ్చదు. చిన్న కూతురికి కూడా జమీందారీ సంబంధం, అందునా తన మేనల్లుడు జగన్మోహన రావు సంబంధం చేయాలన్నది ఆమె కోరిక. తండ్రిగారి నిర్ణయానికి ఎదురు చెప్పదు శారద. నారాయణరావు తండ్రి సుబ్బారాయుడిని ఒప్పించి వియ్యమందుతారు జమీందారు గారు. తల్లికి నారాయణరావు పట్ల ఉన్న నిరసన భావం కారణంగా అతనికి దగ్గర కాలేక పోతుంది శారద. అయితే ఈ విషయాన్ని పొరపాటున కూడా బయట పెట్టడు ఉదాత్త చరితుడైన నారాయణరావు.

సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు మామా అల్లుళ్ళు. చదువు పూర్తి చేసి, మద్రాసులో న్యాయవాద వృత్తి ప్రారంభించి శారదతో వేరు కాపురం పెడతాడు నారాయణరావు. తన అక్క చెల్లెళ్ళు, స్నేహితుల సంసారాల్లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడతను. తన విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. భర్త పట్ల శారద తన వైఖరిని మార్చుకుందా లేదా? తన వృత్తికి సంబంధించి నారాయణ రావు ఏ నిర్ణయం తీసుకున్నాడు? అన్నది నవల ముగింపు.

ప్రధాన కథతో పాటు సాగే ఉప కథలు ఆనాటి పరిస్థితులని వివరిస్తాయి. ఆనాటి చదువుకున్న యువత మహాత్ముడిని ఎంతగా ఆరాధించిందో అర్ధమవుతుంది, ఈ నవల చదువుతుంటే. "ఆంధ్ర దేశానికి కోనసీమ నాయకమణి" లాంటి వర్ణనలకి కొదవ లేదు. ఆనాటి ఆంధ్ర దేశాన్నే కాదు, అమెరికానీ చూడొచ్చు ఈ నవలలో. 'నారాయణరావు' నవల చదువుతుంటే 'వేయిపడగలు' తో పాటు 'చదువు' (కొడవటిగంటి కుటుంబరావు) 'మాలపల్లి' (ఉన్నవ లక్ష్మీనారాయణ) తదితర నవలలు గుర్తుకు రాక మానవు. విడవకుండా చదివించే రచనాశైలి ఈ నవల ప్రత్యేకత.

కథానాయక పాత్రపై రచయితకి ఉన్న ప్రేమ ఆశ్చర్యం కలిగిస్తుంది, 'ధర్మారావు' పట్ల విశ్వనాథ వారికి ఉన్న ప్రేమను గుర్తుకు తెస్తుంది. నారాయణరావు మిత భాషి కావడం వల్ల, ధర్మారావు లాగా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడు. అయితే లలిత కళల గురించి, దేశ పరిస్థితుల గురించి మిత్రుల చర్చలు మాత్రం సుదీర్ఘంగానే సాగుతాయి. వివాహానికి వెలుపల ఉండే స్త్రీ పురుష సంబంధాలా తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాజేశ్వరుడు-పుష్పశీల పాత్రల ద్వారా చిత్రించారు బాపిరాజు. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 322, వెల రూ. 160, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు). అడివి బాపిరాజు సాహిత్యాన్నంతటినీ పునః ప్రచురించాలన్న విశాలాంధ్ర ప్రయత్నానికి అభినందనలు.

22 కామెంట్‌లు:

  1. మురళి గారు ఇది నిజంగా చాలా మంచి పుస్తకం. నేను చదివిన చాలా కొన్ని పుస్తకాలలో ఇది కూడా ఒకటి. మా చిన్నప్పుడు మా అమ్మ చాలా బుక్స్ తెప్పించేది. అందులోనుంచి చదివిందే ఇది కూడా. మీరు అందమైన జీవితం గురించి రాసినప్పుడు నేను తొందరపడి ముగింపు చెప్పేసాను. ఇప్పుడు చెప్పను లెండి. కొడవటిగంటి వారి చదువు కూడా ఇలా చదివిన పుస్తకమే. నేనెప్పుడో చదివిన బుక్స్ ఇప్పుడు మీరు గుర్తుకు తెస్తున్నారు. మళ్ళీ చదవాలి. థాంక్యూ వెరీ మచ్.

    రిప్లయితొలగించండి
  2. ఇటువంటి రచనలు చదువుతుంటే , మనం టై మెషిన్ ఎక్కి ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. అప్పటి సామాజిక పరిస్తితులు, ఉద్యమాలు, ఆచారాలు , కట్టుబొట్టూ కూడా మన కళ్ళముందు నిలుస్తాయి . కాబట్టి , కధ కోసం కాకపోయినా ఆ రోజుల్ని చూడటానికైనా ( చదువుతూ) ఇటువంటి పుస్తకాలు చదవటం బావుంటుంది. కాకపోతే రచన , గ్రాంధికంలో ఉంటే కొంచెం కష్టం .

    రిప్లయితొలగించండి
  3. నా కిష్టమైన రచయితల్లో "అడివి బాపిరాజు" గారు, నవలా నాయకుల్లో "నారాయణరావు" ఒకరండి. మా తాతగారు మద్రాసులో "లా" చదివే రోజుల్లో బాపిరాజు గారు తాతగారి రూమ్మేట్ ట. ఆ విధంగా మా కందరికీ ఆయన గురించి కొంత తెలుసు. ఆయన రచనలు చాలా మటుకు మా తాతగారి సంతానం అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. "గోన గన్నారెడ్డి" మా మావయ్య ఇంట్లో చిన్నప్పుడు చదివాను.. కధ గుర్తు లేదు. నాకు ముఖ్యంగా "నారాయణరావు", "తుపాను" ఇష్టం.

    nice review.. కానీ, కధను ఇంకొంచెం రాయవలసింది అనిపించిందండి. బహుశా టపా పెద్దదయిపోతుందని కుదించేసి ఉంటారు.

    రిప్లయితొలగించండి
  4. నాకైతే బాపిరాజుగారు కళ్ళలో కనబడతారు ,కోనంగిలోను ఇతని రూపమే . వేయిపడగలు ,మాలపల్లి ,చదువు సమకాలినుల రచనలు కదండీ అందుకే సారుప్యత .ఎంచుకున్న అంశం కూడా ఇంచుమించు ఒకటే వుంటుంది ,ముఖ్యంగా ఆనాటి రాజకీయ సాంఘిక వ్యవస్థకి అద్దంపట్టినట్లువుంటాయి రచనలన్నీ
    ఇకపోతే 'వెయ్యి పడగ 'లకి ఎందుకు బహుమానమో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు ,మీకు తెలిస్తే చెప్పారు ప్లీజ్ :) ధర్మారావు పని లేకుండాపెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకున్నందుక ?లేక తన తన కళ్ళ ముందే పుట్టిన స్నేహితుడి కూతుర్ని వలచి రెండో పెళ్లి చేసుకున్నందుకా..ఓహో సుధీర్గ ఉపన్యసలకా ...దీని మీద రివ్యు రాయండి ,మా వంటి అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించండీ .

    అడవి బాపిరాజుగారు నాకు రవ్వల ముక్కుపుడక పై మోజు పెంచారు తన కధానాయకి అనంతలక్ష్మీ (కోనంగి)రవ్వల బేసరి తళుక్కున మెరవడం వర్ణించిన తీరు .....పెద్దయ్యాక ఆ మోజు తీర్చుకున్న -:)
    మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు ...తరువాత తుఫానా ..లేక గోనగన్నరెడ్డ?

    రిప్లయితొలగించండి
  5. నిజం చెప్పాలంటే నాకు వేయిపడగల నవలే పూర్తిగా చదవడం కాలేదండి, ఇంక ఇదెప్పుడు చదువుతానో?

    రిప్లయితొలగించండి
  6. అడవి బాపిరాజు గారి హిమహబిందు చాలా ఏళ్ళ క్రితం చదివాను. మీరు వ్రాసింది చూస్తే ఇదీ చదవాలనివుంది. ఏమిటో ఎంత చదివినా ఇంకా మిగిలేవుంటూన్నాయి.

    ఇందులోని మూడు పాత్రలు అక్కడక్కడా చూసినట్లుగావుంది. ముఖ్యంగా నారాయణరవు, వరద కామేశ్వరీ దేవి, శారద.

    "కోనసీమ నాయకమణి" - మా మావయ్యకి ఈ మాట చెప్తే కాస్త కానుక ఏమైనా ఇస్తారేమో మళ్ళీ! ;)

    రిప్లయితొలగించండి
  7. నాకు ఛాలా ఇష్టమైన నవల. దీన్ని గురించి రాయాలని చాలా సార్లు ప్రయత్నించి మానేశాను. మనకి మరీ ప్రియమైన వాటిని గురించి రాయలేం. ఈ నవల నాకు చాలా ఇష్టం అని తెలిసినప్పుడు కొందరు సాహితీ మిత్రులు, ఛా, నిజమా, యేవుందా నవల్లో, అంతా పెటీ బూజువా .. డాడాడా అని ఏదో అన్నారు. ఆ తరవాత విశ్లేషించుకో చూశాను, కానీ ఎక్కడా స్పష్టంగా ఇదీ అని తెలీలేదు. ఈ నవల నాకిష్టం .. అంతే అనుకుని ఊరుకున్నా. కొన్ని కొన్ని అలా విశ్లేషించకుండా ఒప్పుకుని గమ్మునుండడమే మంచిది! :)

    రిప్లయితొలగించండి
  8. గౌతమీ నది, కుర్రకారు దాంట్లో స్నానం చేయటం, నారాయణరావు ఆలోచనా ధోరణి, బెజవాడ రైల్వేస్టేషను మద్రాసు, అక్కడి జీవితం, డబ్బున్న వాళ్ళ అలవాట్లు, నవల్లు చదవటం, సంగీతం...ఓరినాయనో చెప్పుకుంటుపోతే ఇంకో పుస్తకమే అవుతుంది.
    మంచి పరిచయం సోదరా.
    నావద్ద మొట్టమొదటిసారి అచ్చైన పుస్తకం ఉన్నట్టు గుర్తు.

    రిప్లయితొలగించండి
  9. చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు :-)

    "నారాయణరావు మీద తనకున్న ప్రేమని ఎక్కడా దాచుకోలేదు రచయిత."

    ఇది మాత్రం అక్షరాలా నిజం.. అసలు సిసలు కధానాయక లక్షణాలన్నీ నారాయణరావులో చూస్తాం.. ఈయన పరిచయం అయ్యాక అసలు యద్దనపూడి హీరోలు ఎందుకు పనికి వస్తారు అనిపిస్తుంది :-)

    నారాయణరావుకి మద్రాసులో ముగ్గురు అక్కచెల్లెళ్ళతో ఉన్న పరిచయం, అనుబంధం గురించి ప్రస్తావించాల్సి ఉండల్సింది.. కానీ తృష్ణ గారు చెప్పినట్లు టపా మరీ పెద్దదై పోయేదేమో!

    రిప్లయితొలగించండి
  10. @ చిన్ని: బాపిరాజు గారి రచన వల్ల కాదు కాని నేనూ బాగా పెద్దయ్యాకే "ఆ" సరదా తీర్చుకున్నా..!

    @ నిషిగంధ: ఏమండీ,నారాయణరావు గొప్పతనం నేను ఎప్పుడూ కాదనను. నాకు చాలా ఇష్టపడిన వ్యక్తిత్వం అది...కానీ ...యద్దనపూడి హీరోలని ఎమన్నా అంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను...నా టపాల్లో రాసి చూపిస్తానంతే..!!

    మురళిగారూ, మీరు రెండవ భాగం మొదలెట్టి కధ గురించీ,కొన్ని పాత్రల గురించీ,నారాయనరావు-శారదల అనుబంధం గురించీ రాయాల్సిందే..

    రిప్లయితొలగించండి
  11. :))) తృష్ణ గారు..
    రాయండి.. రాయండి.. అదే నా (మా) కోరిక..

    అదేమిటో, బాపిరాజు 'నారాయణరావు'నీ, చండీదాస్ 'గీతాదేవి'నీ చూశాక యద్దనపూడి హీరోలు, యండమూరి హీరోయిన్లూ అంత ఆకర్షించడం లేదండీ!

    రిప్లయితొలగించండి
  12. అడవి బాపిరాజు రచనలను ఆదుకోండి అంటూ అడవి బాపిరాజు గారి మేనల్లుడు చేసిన విజ్ఞప్తి ని ఇక్కడ చూడగలరు.
    http://vizagdaily.info/?p=1708
    నారాయణరావు నవల మీద కాస్త కంటే ఎక్కువగానే చర్చలో పాల్గొనాలని ఉంది కానీ సమయాభావం :(

    రిప్లయితొలగించండి
  13. బర బర.. (బుర్ర గోక్కుంటున్నా) అంతా గ్రీక్ మరియూ లాటిన్ లాగున వున్నది. పుస్తకం చదివితే కాని కూసంత బోధ పడదేమో.. అందాక నోరు తెరుచుకుని చెయ్యి మూసుకుని (అంటే రెచ్చి పోయి కామెంట్ లు చెయ్యకుండా దీని గురించి) గమ్మునుంటా.

    రిప్లయితొలగించండి
  14. ఇది మా అమ్మ కు ఇష్టమైన నవల. తను చెప్పిందనే కొని చదివాను.వెయ్యిపడగల గురించి మాట్లాడను. ఎందుకంటే ఆ పుస్తకం అభిమానులు నా అడ్రస్ కనుక్కుని మా ఇంటికి వచ్చిమరీ కొట్టి వెళతారు.:-)

    రిప్లయితొలగించండి
  15. @జయ: మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకాలండీ, నాకైతే. తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.
    @లలిత: నారాయణరావు ని రచయితా వర్ణించిన తీరు ని యధాతధంగా ఇచ్చాను చూడండి.. నవల్లో భాష మొత్తం అలాగే ఉంటుంది.. శుద్ధ గ్రాంధికమూ కాదు, ప్రస్తుతం నడుస్తున్న వ్యావహారికమూ కాదు.. చదవండి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మొన్న 'గమ్యం' మూర్తి గారు, ఇవాళ బాపిరాజు గారు.. మీ సర్కిల్ చాలా పెద్దదండీ... నారాయణ రావు గురించి మరో టపా రాయాలని నాకూ ఉందండి.. రాస్తాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @చిన్ని: కవర్ పేజి మీద ఉన్న బాపిరాజు గారి ఫోటో చూశాక నాకూ అలాగే అనిపించిందండీ.. కానీ ముందు మాటలో ఇది బాపిరాజు గారి స్నేహితుడు ముష్టి నారాయణరావు అనే ఆయన కథ అని రాశారు.. ఇక 'వేయి పడగలు' విషయం.. చదివినప్పుడు నేనూ ఇంచుమించు మీలాగే ఆలోచించాను.. కానీ బహుమతి ఇచ్చింది డెబ్బై ఐదేళ్ళ క్రితం కదండీ.. అప్పటి పరిస్థితులని కూడా దృష్టిలో పెట్టుకోవాలేమో.. జ్ఞానం విషయానికి వస్తే నన్నూ అజ్ఞానుల జాబితాలోనే వెయ్యాలండీ.. అన్నట్టు మీ ముక్కుపుడక కథ బాగుంది.. ఒక టపా రాయకూడదూ? ..ధన్యవాదాలు.
    @సృజన: ఇది కొంచం సులువుగానే ఉంటుందండి.. పైగా చిన్నది కూడా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @ఉష: నాకు 'చాలా ఆలస్యం చేశాను' అనిపించిందండీ.. మీ మామయ్యా గారి నుంచి కానుక అందుకోండి మరి :) ..ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: నాక్కూడా నచ్చిందండీ.. మళ్ళీ 'ఏం నచ్చింది?' అంటే జవాబు చెప్పలేను.. నిజమే.. గమ్మునుందాం :) ..ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు; కొంచం ఆ పుస్తకాన్ని ఫోటో తీసి మీ బ్లాగులో పెట్టే ఏర్పాటు చేయండి.. చూడాలని ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @నిషిగంధ: మరో టపా రాస్తానండి.. అందులో ప్రస్తావిస్తాను, ఇక్కడ వదిలేసిన సంగతులు.. 'యద్దనపూడి' విషయం మీరు తృష్ణ గారు చూసుకోండి :):) ..ధన్యవాదాలు.
    @రాజేంద్ర కుమార్ దేవరపల్లి: లంకె ఇచ్చినందుకు థాంక్స్ అండీ.. మీరు చర్చలో పాల్గొంటే బాగుండేది.. ధన్యవాదాలు.
    @భావన: పుస్తకం చదివి, కామెంట్ ఏమిటి ఏకంగా ఒక టపానే రాయండి.. ధన్యవాదాలు.
    @సునీత: నాకిప్పుడు 'వేయిపడగలు' గురించి రాయాలనిపిస్తోందండీ.. సమస్య ఏమిటంటే ఆ పుస్తకాన్ని మళ్ళీ చదవడం ఒక బృహత్కార్యం.. వీలు చూసుకుని మొదలు పెడతాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. ikkada antaa panditulu unnaru chaduvutu pote chalu anipistundi.

    రిప్లయితొలగించండి
  20. పుస్తక పరిచయానికి ధన్యవాదాలు. ఈ పుస్తకం ఎక్కడ కొన్నారో కూడా చెప్పండి.

    రిప్లయితొలగించండి
  21. పరిచయం బావుందండీ ...ముగింపు మీరు చెప్పరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతావారు చెప్పటం మానేస్తే ...ఈ పుస్తకాలన్నీ చదవటానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తోంది :) అయినా సరే ఈపుస్తకం ఎప్పటికైనా చదువుతాను మురళి గారూ చదువుతాను.

    రిప్లయితొలగించండి
  22. @rama108: నేను మాత్రం పండిత పుత్రుడినండీ :):) ..ధన్యవాదాలు.
    @విజయవర్ధన్: విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుందండి.. నేను విశాలాంధ్ర లో కొన్నాను.. ధన్యవాదాలు.
    @పరిమళం: చెప్పకపోతేనే బాగుంటుందేమో కదండీ.. తెలిసిపోతే మీకు చదవాలనే కుతూహలం తగ్గిపోదూ?? ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి