మంగళవారం, అక్టోబర్ 27, 2009

కష్టం

"ప్రపంచం లో ఎవరూ భరించలేనిది ఒకటి ఉంది.. అది కష్టం.." వెంకటేష్ 'సుందరకాండ' సినిమాలో అపర్ణ చెప్పిన డైలాగ్ ఇది. నిజమే.. కష్టాన్ని భరించడం ఎంత కష్టమో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే అర్ధమవుతుంది. వచ్చిన ప్రతిసారీ "ఇంతటి కష్టం ఎప్పుడూ రాలేదు" అని మన చేత అనిపించడం కష్టం ప్రత్యేకత. ఎప్పుడైనా ఏ పనీ లేనప్పుడు ఒక్కసారి అలా వెనక్కి వెళ్లి మనం దాటి వచ్చిన కష్టాలన్నింటినీ తల్చుకుంటే ఎంత హాయిగా ఉంటుందో..

కష్టం రాగానే దానిని ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది.. కుటుంబ సభ్యులతో పంచుకోలేని పక్షంలో మనకి వెంటనే గుర్తొచ్చేది మిత్రులే. కాబట్టి వెంటనే వాళ్ళతో మన కష్టాన్ని చెప్పుకుని కొంచం తేలిక పడతాం.. ఇక్కడో చిక్కుంది. ప్రతి ఒక్కరూ తమకి వచ్చింది మాత్రమే కష్టం అనుకుంటారు. మరోలా చెప్పాలంటే.. చాలా ఏళ్ళ క్రితం 'స్వాతి' మాస పత్రిక పాఠకులకి 'కష్టాలు లేనిది ఎవరికి?' అని ప్రశ్న ఇచ్చి, ఉత్తమ సమాధానానికి బహుమతి ప్రకటించింది.. బహుమతి గెలుచుకున్న సమాధానం 'ఎదుటి వాళ్లకి.'

ఈ కారణంగా మనం అత్యంత భయంకరమైనది అనుకున్న కష్టం మన మిత్రులని కదిలించ లేకపోవచ్చు. అసలు, వాళ్ళ దృష్టిలో అది కష్టమే కాకపోవచ్చు. అదే మాటని వాళ్ళు పైకి అన్నారనుకోండి, నిస్సందేహంగా మన మనోభావాలు దెబ్బ తింటాయి. వాళ్ళు చెప్పిన కష్టానికి మనం అదే రీతిగా స్పందించినప్పుడు వాళ్ళ మనో భావాలు కూడా సేమ్ టు సేమ్. అందువల్ల చేత ఎవరైనా వాళ్ళ కష్టాన్ని గురించి చెబుతున్నప్పుడు 'ఓస్.. ఇంతేనా.. ఈ మాత్రానికేనా..' అనకుండా ఉండడం ఉత్తమం అనిపిస్తుంది.

చాలా సందర్భాలలో మనం కష్టాన్ని మరొకరితో పంచుకుని సాంత్వన పొందాలి చూస్తామే తప్ప, వాళ్ళ నుంచి పరిష్కారాన్ని ఆశించం. ముఖ్యంగా అది పరిష్కారం లేని సమస్య అని బలంగా నమ్మినప్పుడు, అవతలి వారు ఇచ్చే సలహాలు, సూచనలు మనకి నచ్చే అవకాశం తక్కువ. ఒక్కోసారి పరిష్కారం మన దగ్గరే ఉన్నా, సమయానికి ఆలోచన రాక బాధ పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మాత్రం ఎదుటివారు ఆ పరిష్కారాన్ని గుర్తు చేస్తే గొప్ప సంతోషం కలుగుతుంది.

ప్రతి మనిషిలోనూ ఇగో ఉంటుంది.. అది మానవసహజం. "నేను కాబట్టి ఇన్ని కష్టాలు భరించాను.. అదే మరోకరైతేనా.." అనుకోవడం ద్వారా ఆ ఇగోని సంతృప్తి పరుచుకుంటూ ఉంటాం.. ఇందులో ఎలాంటి తప్పూ లేదు.. ఎవరికీ ఇబ్బందీ లేదు. సమస్య ఎప్పుడు వస్తుందీ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన గురించి అలా అనుకోవాలని ఆశించినప్పుడు. మన కష్టం వాళ్ళ దృష్టిలో కష్టమే కానప్పుడు, మన గొప్పదనాన్ని వాళ్ళు ఎలా అంగీకరించగలరు? అన్న ఆలోచన రాదు మనకి.

అసలు కష్టమన్నదే లేకపొతే జీవితం ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది..నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే కష్టం మనల్ని ఆలోచింప జేస్తుంది, జడులం కాకుండా కదలిక తెస్తుంది. రకరకాల పరిష్కారాలని వెతికేలా చేస్తుంది.. కష్టం తీరాక మనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా చేస్తుంది. అదే ఏ కష్టమూ లేకపొతే, ఎలాంటి చాలెంజీ లేకపొతే.. 'మడిసికీ గొడ్డుకీ..' అన్న 'ముత్యాల ముగ్గు' డైలాగు గుర్తు చేసుకోవాలేమో.. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే మనిషి అంతగా రాటు దేలతాడు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు మరి.

19 కామెంట్‌లు:

  1. "ఈదేసిన గోదారి - దాటేసిన కష్టాలు" తీయగా ఉంటాయి :)
    Copyright - ముళ్ళపూడి గారు

    రిప్లయితొలగించండి
  2. మీరు పత్రికల్లో అప్పుడప్పుడూ రాస్తూంటారా?? ఒకవేళ రాయకపోతే ఒక మంచి రచయితను పాఠకులందరూ మిస్సవుతున్నారు...మీ రచనలు బ్లాగులకే పరిమితం అయితే వాటికి మీరు తీరని ద్రోహం చేసేవారవుతారేమో ఆలోచించండి. మీకు చెప్పేటంత వయసు,అనుభవం నాకు లేవుగానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను.
    టపా చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  3. కష్టాల్లో పెద్దవీ చిన్నావీ అన్నది మనం వాటికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఉంటుందండి. మనకి పెద్దది అనిపించిన సమస్య ఎదుటివారికి అసలు సమస్య లానే కనిపించకపోవచ్చు.కానీ చిన్నదయినా ఒక "కష్టం" తెచ్చిన "వేదన" అనుభవించే మనసుకే తెలుస్తుంది.

    ప్రతి మనిషి తనకి వచ్చిన కష్టాన్ని తన పరిధి లోంచే ఆలోచిస్తాడు. అది సహజం. ఆ కష్టం దాటిపోయాకా పాత కష్టాలతో పోల్చుకుని, లేక తనకు తెలిసిన మిగతావారి కష్టాలతో పోల్చుకుని-- అబ్బా, నాదెంత చిన్న కష్టమో అని తేలికపడతాడు.

    వచ్చినది పెద్ద కష్టం కాకపోయినా "అబ్బ నీకెంత కష్టం వచ్చింది" అని ఎవరన్నా పరమార్శిస్తే బాధలో ఉన్న వ్యక్తి "అహం" తృప్తి పడుతుంది. అది అబధ్ధమని తెలిసినా సరే..!!

    ఈ వ్యాఖ్య రాస్తున్నది తృష్ణ..సైకాలజిస్ట్ కాదండోయ్..

    సమస్యలోంచి బయటికి వచ్చి దానిని ఎదుటివారి దృష్టి లోంచి చూస్తే ఇలాటి ఆలోచనలు వస్తాయి నాకు.
    (నాకు ట్యూషన్ అవసరం లేదేమో..:) )

    రిప్లయితొలగించండి
  4. నాకు మాత్రం మీ ప్రతీ పోస్ట్ భలే ఇష్టం!
    వాటికి వ్యాఖ్యలు పెట్టడం మాత్రం కష్టం!:)
    (ఎందుకంటే కామెంట్ పెట్టడానికి పదాలు దొరకవు అందుకని)

    రిప్లయితొలగించండి
  5. నిజమేనండి ,అదేమిటో ప్రపంచములో వున్న కష్టాలన్నీ నాకే పెట్ట్టాడా ,ఎదుటివాడికి కష్టాలు పెట్టటము మరచిపోయాడా ఆ దేవుడు అనిపిస్తుందండి !
    బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  6. పీత కష్టాలు పీతవి. కష్టం లేనివాడు ఎవరండీ! ఏదో కథలో చెప్పినట్లు చావన్నది ఎరుగని ఇంటినుంచి మాత్రమే ఆహారం తెచ్హి ఇమ్మన్నాడట. ఈ కష్టం కూడా అలాంటిదే. మీ కష్టం నా కష్టం కంటే పెద్దది అంటే మాత్రం నేనొప్పుకోనండి. కష్టాలలో పోటీ పెడితే మాత్రం అందరూ ఫస్టే ఒస్తారనుకుంటా. అదిమాత్రం నిజమే కదండి మురళి గారు.
    (తృష్ణ గారు నాకు మాత్రం ట్యూషన్ అవసరం ఉంది)

    రిప్లయితొలగించండి
  7. కష్టమేనండి కామెంట్ రాయడం
    సింప్లీ సూపర్బ్

    రిప్లయితొలగించండి
  8. మీ కష్టం ఏమో కాని నాకొచ్చే కష్టాలు నరమానవుడికి కూడా రావు బాబు ..ప్చ్..

    రిప్లయితొలగించండి
  9. మురళీ గారూ మీ కష్టాలేవో ఈ బ్లాగులోకంలో పంచుకోండి. కావలసినంత స్వాంతన. మీకున్నాయని కాదుకానీ టపా కష్టం మీదకదా అందుకని:).
    నిజమేనండీ, కష్టల్లో వున్నప్పుడు ఒంటరితనం ఎంతలా కోరుకుంటామో , అలాగే ఒక్కోసారి పది మంది పలకరింపులు కోరుకుంటాము. ఉచిత సలహాలకు చిర్రెత్తినా ఎత్తవచ్చు :)

    రిప్లయితొలగించండి
  10. మురళి నిజమే కదా.. కష్టానికి ఇంత అంత అని కొలమానాలేమున్నాయి అందుకే గా సామెత వుంది "సీత కష్టాలు సీతకైతే పీత కష్టాలు పీత వి" అని.

    రిప్లయితొలగించండి
  11. @మేధ: అరె.. నేనింకా మీ కొటేషన్ అనుకున్నానండీ :-) :-) .. ముళ్ళపూడి వారి కొటేషన్ ని 'కోతి కొమ్మచ్చి' టపాలో రాశానని ఇక్కడ ప్రస్తావించలేదండి. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నేను రాసుకునే ఏకైక వేదిక నా బ్లాగేనండీ.. అప్పుడప్పుడు 'నవతరంగం' 'పుస్తకం.' మీ అభిమానం నన్ను కదిలించింది.. ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీరే ప్రైవేటు చెప్పేశారు కదండీ.. వేరే ట్యూషన్ ఎందుకు? :) :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @పద్మార్పిత: మీదైనా శైలిలో వ్యాఖ్యానించారు.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: అలా అనిపించడం సహజం కదండీ.. ధన్యవాదాలు.
    @జయ: నిజమేనండీ.. అందరూ ఫస్టు రావాల్సిందే ఎవరికీ వాళ్ళు జడ్జీలు అయినప్పుడు.. ఎదుటివాళ్ళు జడ్జీలైతే మాత్రం ఒక్కరికి కూడా ప్రైజు రాదు :) ..ఇంతకీ తృష్ణ గారి దగ్గర ట్యూషన్లో చేరుతున్నారా? :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @మాఊరు: అలా వచ్చారా? :) ..ధన్యవాదాలు.
    @చిన్ని: నాక్కూడా అంతేనండి.. పశు పక్ష్యాదులకి కూడా రావు :) ..ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: పంచుకుంటూనే ఉన్నాను కదండీ :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @భావన: అవునండీ.. 'సీత-పీత' నేను కూడా చాలాసార్లు విన్నానీ మాట.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: మాటిచ్చి మర్చిపోవడం గురించి ఒక టపా రాస్తే ఎలా ఉంటుందంటారు? :):) ధన్యవాదాలు.
    @నెల బాలుడు: :):) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. కష్టాన్ని అంత కష్టంగా కాకుండా ...ముందు దాటిన కష్టం తో పోల్చి చూసుకొని కొంత కష్టమైనా సరే వచ్చిన కష్టం నుండి కాస్త ఇష్టంగా గట్టెక్కే మార్గాలు కష్టమనుకోకుండా వెతుక్కోవాలంటారు ! అంతేనాండీ :)
    కష్టపడి మీ 'కష్టాన్ని' ఇష్టపడి వ్యాఖ్య రాశాను సుమండీ ....

    రిప్లయితొలగించండి
  16. @పరిమళం: "చచ్చిన చావు చావకుండా చచ్చినన్ని సార్లు చచ్చాను.. ఇంకీ చావు నేను చావలేనయ్యా.." అన్నారటండీ గుమ్మడి చమత్కారంగా, ఆమధ్య ఎవరో నిర్మాత తనకో 'గుండె పోటు తండ్రి' పాత్ర ఆఫర్ చేస్తే.. ఆ డైలాగు గుర్తొచ్చింది, మీ వ్యాఖ్య చదవగానే.. ఇష్టంగా చదువుతున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి