శుక్రవారం, ఫిబ్రవరి 27, 2009

అలా జరిగింది..

సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిందీ సంఘటన. ఇప్పుడు బ్లాగు లోకంలో కాపీ కవితల గురించి జరుగుతున్న చర్చ చదువుతుంటే గుర్తొచ్చింది. అవి 'నువ్వేకావాలి' సినిమా విడుదలైన కొత్త రోజులు. సొంత సినిమా కావడంతో ఈటీవీ లో ప్రతి అరగంటకీ ఆ సినిమా ప్రకటన వచ్చేది. ప్రకటనలు చూసీ, చూసీ పాటల పల్లవులన్నీ నోటికి వచ్చేశాయి. అదే సమయంలో ఒకతనితో పరిచయం అయ్యింది. ఉద్యోగం కోసం వచ్చి, ఓ మిత్రుడి సూచన మేరకు నా సలహా కోసం వచ్చాడతను. అతనికి సాహిత్యం మీద కొంచం ఆసక్తి ఉండటంతో తొందరలోనే ఇద్దరి మధ్య బాగా మాట్లాడుకునే చనువు ఏర్పడింది. అతను ఉద్యోగంలో చేరాక కూడా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవాళ్ళం. ఒక రోజు అలా కలిసినప్పుడు సంభాషణ సాహిత్యం వైపు వెళ్ళింది. "చాలా పుస్తకాలు చదువుతారు కదా..మీరు కవిత్వం ఎందుకు రాయకూడదు?" అని అడగాడతను. నాకెందుకో తనతో జోక్ చేయాలనిపించింది. "రాస్తూనే ఉంటా.. పత్రికల్లో వస్తూ ఉంటాయి కూడా.." అన్నాను నమ్మకంగా.

అతను కొంచం ఎక్సైట్ అయినట్టు కనిపించాడు. "అవునా..నేనెప్పుడూ చదవలేదు.. ఏ పేరుతో రాస్తారు? నా కోసం ఒకటి రాసివ్వరూ ప్లీజ్" అని అడిగాడు. అంతేనా.. కాగితం, కలం ఇచ్చాడు. నాకు అప్పుడే 'నువ్వేకావాలి' ప్రకటన గుర్తొచ్చింది. కొంచం ఆలోచించినట్టు నటించి సీరియస్ గా కాగితం మీద రాసేశా.. 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.. రాగం నింగిని కరిగించింది.. కరిగే నింగి చినుకయ్యింది.. చినుకే చిటపట పాటయ్యింది.. చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది.. రాచిలుక నువ్వేకావాలి.. ఆ రాచిలుక నువ్వేకావాలి..' రాయడం పూర్తి చేసి అతని చేతికిచ్చా.. అతను అదంతా చదివి మళ్ళీ ఎక్సైట్ అయ్యి, "ఎంత బాగుందో.. మీరు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు?" అని అడిగాడు. "నన్ను మించి నటించేస్తున్నాడు" అని మనసులో అనుకుని, "అక్కడ చాలా మంది ఉన్నారు.. నాకంత ఆసక్తి లేదు" అన్నాను, ముఖం చాలా మామూలుగా పెట్టి. కాస్సేపు మాట్లాడి, అతనా కాగితం పట్టుకుని వెళ్ళిపోయాడు. నేనా విషయమే మర్చిపోయాను.

ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడతను. "మిమ్మల్ని ఇంకెప్పుడూ నమ్మను" అన్నాడు సీరియస్ గా. ఏమైందో నాకు అర్ధం కాలేదు. "మీ కవిత మా బాస్ కి చూపించాను" ..ఉహు.. అప్పటికీ నాకు వెలగలేదు. "మా ఫ్రెండ్ రాశాడండి..సినిమాల్లో ట్రై చేస్తే మంచి పాటల రచయిత అవుతాడు..కానీ అతనికి ఇంటరెస్ట్ లేదట..అని చెప్పాను.. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు.." అప్పుడు నాకు విషయం కొంచం అర్ధమైంది.. మళ్ళీ అతనే చెప్పడం కొనసాగించాడు. "ఏం బాబూ.. నువ్వు టీవీ కానీ, సినిమాలు కానీ చూడవా? అని అడిగాడాయన. నా ముఖం చూసి, నిజంగానే నాకు విషయం తెలియదని అర్ధం చేసుకుని, అది సినిమా పాటని చెప్పాడు." ఇతనికి తెలిసీ నన్ను ఆట పట్టించడానికి సినిమాల్లో ప్రయత్నించమన్నాడని అనుకున్నాను నేను. అతను కాగితం భద్రంగా తీసుకెళ్ళినప్పుడు కూడా సందేహించలేదు. "ఉద్యోగం వేటలో సినిమాలు చూడడం కుదరలేదు. రూమ్ లో టీవీ కూడా లేదు.. కొత్త ఆఫీస్ లో నా పరువుపోయింది.. మీరు జోక్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు.. పెద్ద ఫూల్ అయ్యాను.." అతను చెబుతూనే ఉన్నాడు. చాల కష్టపడి అతన్ని కూల్ చేశా. ఆ పాట ఎప్పుడు విన్నా అతని ముఖమే గుర్తుకు వస్తుంది.

9 కామెంట్‌లు:

  1. హాయ్ ,,పడిపడి నవ్వే ప్రాక్టికల్ జోక్ ఇది మాత్రం ,రెండు రోజుల క్రితం మన బ్లాగ్లోకం లో ఓ మిత్రుడి బ్లాగ్ లో రెహ్మాన్ పాటలు పెట్టి ,తనే రాసినట్లు ,వాటికి కామెంట్స్ తనే ,నైస్ అని రాయడం,ఇంకో బ్లాగర్ పాయింట్ చేయడం ,బోల్తాపడ్డ ప్రాక్టికల్ జోక్ అని వివరణ ,,అది మరిచే లోపు మీది ,,బాగు బాగు..

    రిప్లయితొలగించండి
  2. బావుంది.

    మీరిచ్చిన కాగితాన్ని తను తన బాస్ కి చూపించే సీను ఊహించుకుంటే నవ్వొస్తోంది. మీరు మీ కవిత చదివాక ఆయన మిమ్మల్ని ఫూల్ చేస్తున్నాడేమో అనుకున్నారు, తనేమో మిమ్మల్ని అమాయకంగా నమ్మేసారు.. ఇది మనసులో పెట్టుకోకుండా తను మీతో ఎప్పటిలానే ఉన్నాడని ఆశిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  3. చిన్ని గారు చెప్పినట్లు ఇందాక ఒక బ్లాగరు మీలా చేసే ఇరుకున పడ్డారు :)

    రిప్లయితొలగించండి
  4. హన్నా.. మురళి గారూ..
    అల్లరిలో సార్థక నామధేయులనిపించుకుంటున్నారు సుమా..!
    పాపం.. ఎంత పని చేశారండీ..!
    నిన్నేమో.. హీరోయిన్ల ముచ్చట్లు.. ఇప్పుడేమో ఇదా.. ;)
    మొత్తానికే భలేవారండీ మీరు.. పాపం మీ ఫ్రెండ్ పరిస్థితి తలచుకుంటే.. భలే నవ్వొస్తుంది.
    మొత్తానికి ఆ తరవాత బ్రతిమాలలేక మీ పని అయిపోయి ఉంటుంది ;)

    రిప్లయితొలగించండి
  5. నేనూ బోల్తా పడ్డాను సినిమాలు ఎక్కువ చూడకపోవటం వల్ల .చూసినా ఎక్కువ పాతవి చూస్తాను .

    రిప్లయితొలగించండి
  6. @చిన్ని: ధన్యవాదాలు
    @ఉమాశంకర్: చాలా రోజులయిందండి అతన్ని కలిసి.. ధన్యవాదాలు.
    @నేస్తం: ధన్యవాదాలు
    @మధురవాణి: దీనిని అల్లరి అంటారా? ధన్యవాదాలు.
    @పరిమళం: కావాలని చేసింది కాదండి.. ఏదో అనుకుని మొదలుపెడితే మరేదో అయ్యింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నేనూ మీరు చెప్పిన "అతను" పడ్డట్లే పడ్డానొకసారి కాపైకవితలబుట్టలో. క్రొత్తగా యూనివర్సిటీలో చేరిన రోజులు, పైగా "వయసులో వున్న గాడిద పిల్ల" అన్నట్లు కాస్త కంటికి నదరుగా ఆనే అందం :)

    నాన్నగారి స్నేహితుని అన్న కొడుకునంటూ ఒకతను పరిచయం చేసుకుని ముందో నెల ఆ సాయం ఈ సాయం చేసాడు. చనువు పెరిగాక ఇది చదవండి అంటూ ఒక english poem ఇచ్చాడు. నిజంగా బాగుంది, నేనే వ్రాసానన్నాడు, నన్ను దృష్టిలో పెట్టుకునే అని కూడా విశేషనం కలిపాడు. కాస్త పొంగాను. మరికొన్ని రోజులకి ఓ లేఖ/కవిత - ఈసారి హిందీలో. మరీ మురిసిపోయాను. తర్వాత తెలుగులో - ఇక ఉప్పొంగిపోయిన నేను నా స్నేహితురాలు కళాకి చూపించా. అలా అలా అది పరిశోధనలోకి దిగి ఏతా వాతా తేలిందేమిటంటే అన్నీ కాపీలే. అతని వాదన - "ఏం ఒక ఇద్దరు ఒకేలా ఆలోచించరా? నా భావాలు అలా మాటల్లో దొరికాయి అని వాటిని నా కవితలోకి తీసుకున్నాను, అయినా ఒకటి రెండూ పదాలో, పంక్తులో మార్చి వ్రాసాగా?" అని. ప్చ్ - అన్ని అడ్డగోలు తెలివితేటలున్న వాడితో ఇక నేనేం వాదించగలను. ఇది చాలా కాలం నాటి మాట లేండి. సో ఇది జరగటానికి చాలా ఆస్కారమున్న రోజులవి. కనుక కట్టుకథ కాదు స్వయానా నా జీవితానిభవమిది.

    రిప్లయితొలగించండి
  8. @ఉష: చదువు ఐపోయాక అతను ఏం చేస్తున్నాడో వాకబు చేసి ఉండాల్సిందండి. బహుశా ఏ తెలుగు సినిమా రచయితగానో, దర్శకుడిగానో కనిపించి ఉండేవాడు. మీకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. నిండు గోదారిలా ఎప్పుడూ నిదానంగా, గంభీరంగా, హుందాగా కనిపించే మీరు ఇలా అల్లరి కూడా చేస్తారా? ఆశ్చర్యంగా వుంది.

    రిప్లయితొలగించండి