మంగళవారం, ఫిబ్రవరి 17, 2009

ప్రేమవైద్యులు

'ప్రేమంటే..?' చాలా మంది చాలా సమాధానాలు చెబుతారు. ఓ మధుర భావన, అవతలి వ్యక్తే సర్వస్వం అనిపించడం, అతను/ఆమె లేకపొతే జీవితం వృధా అనిపించడం, అవతలి వ్యక్తి సమక్షంలో చాలా సంతోషంగా ఉండడం..ఇలా రకరకాల సమాధానాలు వస్తాయి. కొందరు 'ఇదో రకం జబ్బు' అనికూడా అంటారు. అందుకేనేమో ఒక్కొక్కరుగా ప్రేమ వైద్యులు పుట్టుకొచ్చేస్తున్నారు. మీరెక్కడా చూడలేదా? ఏదైనా దినపత్రిక తాలూకు సప్లిమెంట్ తిరగేయండి..లేదా ఏదైనా ఎఫ్.ఎం. రేడియో ట్యూన్ చేయండి. మీకు ప్రేమ వైద్యులు కనిపిస్తారు, వినిపిస్తారు. ఎలా ప్రేమించాలో, ప్రేమను ఎలా వ్యక్త పరచాలో, ఎలా ఒప్పించాలో..అవసరమైతే ఒకరిని మర్చిపోయి మరొకరిని మళ్ళీ మొదటినుంచీ ఎలా ప్రేమించాలో వివరంగా నేర్పిస్తారు వీళ్ళు. 'పోరికి సైట్ కొట్టి పటాయించు' అని రేడియో జాకీ కొంచం నాటుగా చెబితే, 'ఆ అమ్మాయి మనసెరిగి ప్రవర్తించాలి.. ఆమె మనసును గెలుచుకోవాలి' అని ప్రేమ వైద్యులు పత్రికా ముఖంగా సెలవిస్తూ ఉంటారు.

ఈ ప్రేమ వైద్యుల తీరు విచిత్రంగా ఉంటుంది..ఒక్కో సమస్య పట్లా వీరి స్పందన ఎలా ఉంటుందన్నది కనీసం ఊహించలేము. ఒక్కోసారి 'నీదసలు సమస్యే కాదు' అన్నవాళ్లు, అలాంటి సమస్యనే మరొకరినుంచి విని 'నా గుండె చెదిరిపోయింది..కష్టాలు మనుషులకి మాత్రమే వస్తాయి' అని చెబుతూ ఉంటారు. ఈ వైద్యుల దృష్టిలో ప్రేమించడం మంచినీళ్ళు తాగినంత సులభమైన వ్యవహారం. జనం ప్రేమిస్తూ ఉండాలి, మర్చిపోతూ ఉండాలి..మళ్ళీ ప్రేమలో పడుతూ ఉండాలి అన్నట్టుగా ఉంటాయి వీరి సలహాలు. పత్రికలకి ఉత్తరాలు రాసే ప్రేమ బాధితుల గురించి పెద్దగా తెలుసుకోలేము కానీ, రేడియోకి ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకునే ప్రేమికులు మాత్రం 'ప్రేమంటే ఇంతేనా' అనిపిస్తారు. యాంకరమ్మాయి 'గిఫ్టులు కొనిచ్చి అమ్మాయికి ప్రపోస్ చేసేయ్' అని సలహా ఇస్తే 'ఏం కావాలో చెప్పు..నీకే ఇచ్చేస్తా' అని అడుగుతాడో ప్రేమికుడు.

మామూలు జబ్బులకి వైద్యం చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. పైగా ఒక్కో రకం జబ్బుకీ ఒక్కో స్పెషలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే వైద్యులకి చికిత్స చేసే అర్హత వస్తుంది. కానీ ఈ ప్రేమ వైద్యానికి ఆ బాదరబందీ ఏదీ ఉండదు. నాకు తెలిసి ప్రేమ వైద్యానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీసాలైనా పూర్తిగా మొలవని రేడియో జాకీ కూడా ప్రేమికులకి చికిత్సలు చేసేస్తున్నప్పుడు ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏం ఆలోచించగలం. వీళ్ళకున్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సమస్య పూర్తిగా చెప్పే పని ఉండదు.. కొంచం చెప్పగానే మిగిలింది వాళ్ళే ఊహించేసి ఏం చేయాలో చెప్పేస్తూ ఉంటారు. పత్రికల్లోనూ అంతే.. శారీరక, మానసిక సమస్యలకి సలహాలు ఇచ్చే వైద్యుల క్వాలిఫికేషన్లు వాళ్ల ఫోటోల కింద ఇస్తూ ఉంటారు. ఐతే ఈ ప్రేమ వైద్యుల ఫోటోల కింద ఎలాంటి క్వాలిఫికేషన్లు ఉండవు.

మామూలు వైద్యులకీ, ప్రేమ వైద్యులకీ నేను గమనించిన మరో తేడా ఏమిటంటే, మామూలు వైద్యులు సమస్యని గురించి మాత్రమే మాట్లాడతారు. ఈ ప్రేమ వైద్యులు మాత్రం బాధితుల వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ల తల్లిదండ్రుల పెంపకాన్ని విమర్శించేస్తూ ఉంటారు. బహుశా ప్రేమ అనేది వ్యక్తిగతమైన విషయం అవ్వడం వల్ల వీళ్ళు ఆమాత్రం చొరవ తీసుకోక తప్పదేమో. మామూలు వైద్యులకి సందేహాలు ఎక్కువ, చికిత్స సూచిస్తూనే 'దగ్గరలో ఉన్న డాక్టరుని కలిసి వారి సలహాపై మందులు వాడండి' అని చెబుతూ ఉంటారు. ప్రేమ వైద్యులకి అలాంటి శషభిషలేమీ ఉండవు. వీళ్ళు చెప్పిందే చికిత్స. అయినా మామూలు వైద్యులంటే ప్రతి వీధి చివరా ఒక్కరో ఇద్దరో ఉంటారు కానీ, ఈ ప్రేమ వైద్యులు చాలా తక్కువ కదా. మొత్తం మీద నేను తెలుసుకున్నది ఏమిటంటే వైద్యులందు ప్రేమ వైద్యులు వేరయా.. అని.

7 కామెంట్‌లు:

  1. 'ప్రేమ"అంటే గుర్తోచిందండి ,యండమూరి రాసిన "ప్రేమ'నోవెల్ చదివితే ఏ లవ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదండి.నిజానికి ప్రేమ లో ఉన్నవారు అవతలి వారికే తెలియలనుకుంటారు కాని పబ్లిక్లో దిసేక్షన్ పెట్టరు.

    రిప్లయితొలగించండి
  2. మురళీ గారు చెప్పింది అక్షరాల నిజం...
    ప్రేమరోగులారా!!!సొంత వైద్యం కొంతచేసుకుని
    ప్రేమవైద్యులకి దూరంగా ఉండండి...

    రిప్లయితొలగించండి
  3. మీసాలైనా పూర్తిగా మొలవని రేడియో జాకీ కూడా ప్రేమికులకి చికిత్సలు చేసేస్తున్నప్పుడు ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏం ఆలోచించగలం..
    baagaa cheppaaru

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ ! ప్రేమ వైద్యులు ......హ ..హ్హ .....
    ముఖ్యంగా ఈ రేడియో జాకీ ల భాష వింటుంటే అసలు ప్రేమేవిటి , జీవితం మీదే విరక్తి పుడుతోంది .అమ్మాయిల్లో కూడా సున్నితత్వం ఏకోశానా కనపడ్డం లేదు .ఇంకా మేల్ జాకీ లే బెట్టరనిపిస్తుంది .కుటుంబ సమేతంగా సినిమాలు చూడలేకపోతున్నాం .ఇప్పుడు టి .వి .కూడా .....ఇకముందు రేడియో కూడా వినలేని రోజులొస్తాయేమో.మంచి టపా .అభినందనలు .

    రిప్లయితొలగించండి
  5. Excellent Post... nuvvu cheppina daniki nenu angikaristanu. Rainbow 101.9 FM lo Every Saturday 6-8PM telecast avutundi. Nenu ee show dadaapu 1 1/2 year nunchi vintunna naaku aitey eppudu aa RJ nuvvu paina cheppina vidamga reply ivvaledu. Just for a look ee week vinu.

    Thanks & Regards,
    Ur's - DeepU.

    రిప్లయితొలగించండి
  6. @చిన్ని, పద్మార్పిత, నేస్తం, పరిమళం, దీపు: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. muraligaru ,meeru cheppindi nijamga nijam.evari anubhavalu,badhalu vaarive.Artham chesukune manasunte manchide ,kani nee samasya asalu samasye kadante ...em cheppali? Ayina ilanti vishayallo salahalu ,soochanalu iche varu manaku aatmiyulaithe ne mana manasu telusukuni salahalu ivvagalugutaru.

    రిప్లయితొలగించండి