ఆదివారం, ఫిబ్రవరి 22, 2009

మొదటిపరీక్ష

పరీక్ష అంటే ఏమిటో తెలియకుండానే ఒకటో తరగతి పూర్తైపోయింది. రెండో తరగతిలో కూడా పరీక్షలు ఉంటాయని అనుకోలేదు. ఎందుకంటే మా స్కూల్లో మూడో తరగతి నుంచి పరీక్షలు మొదలు అయ్యేవి. ఐతే అనుకోనిది జరగడమే కదా జీవితం..అందుకే రెండో తరగతిలో పరీక్ష రాయాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందంటే, మేము రెండో తరగతి మధ్య లో ఉండగా ఇద్దరు మాస్టార్లు మా స్కూలికి కొత్తగా వచ్చారు. సత్యనారాయణ గారి గురించి 'తొలిబెత్తందెబ్బ' లో చెప్పాను కదా.. ఆయన తో పాటు వచ్చిన మరో మాస్టారు సుబ్బరమణ్యం గారు. అసలు పేరు సుబ్రహ్మణ్యం, కానీ మా నోళ్ళలో పడి అలా ఐపోయింది. సుబ్బరమణ్యం గారు ఒకటి, రెండు తరగతులకి, మూడు నాలుగు తరగతులకి సత్యనారాయణ గారు పాఠాలు చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ మధ్యలో 'వచ్చే వారం మీకు పరీక్ష పెడతాను' అని ప్రకటించారు. ముందూ వెనుకా ఆలోచించాలని తెలియని వయసు కావడం వల్ల ఇంటికి వెళ్తూనే ఆ విషయం అమ్మకి చెప్పేశా.

ఇక అప్పుడు మొదలయాయి నా కష్టాలు. 'నీకసలే బళ్ళో పరీక్ష' అనే మాట అమ్మ నోటి చివర నానింది. ఆటలు అటుంచి, ఇంట్లో చిన్న పని కూడా చెయ్యనివ్వకుండా 'చదువుకో' 'చదువుకో' అంటూనే ఉండేది. తెల్లవారు జామున నిద్ర లేపి పాఠాలు చదివించేది. అసలు ఉన్నవే మూడు పాఠాలు - వినాయకచవితి, కొబ్బరిచెట్టు, అమరావతి. ఇప్పటికీ ఆ పాఠాలు మర్చిపోలేదంటే అమ్మ శిక్షణ ఎలా ఉండేదో ఊహించ వచ్చు. 'నాకన్నీ వచ్చేశాయి' అనడం ఆలస్యం..ఓ సుదీర్ఘమైన క్లాసు. 'ఇప్పుడు అలాగే అనిపిస్తాయి..తీరా పరీక్షలో గుర్తు రాకపోతే ఎలా? అందుకే వచ్చినా మళ్ళీ మళ్ళీ చదవాలి' ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే మాట. పోనీ అనుకుందుకు అదేమీ పేపర్ మీద రాసే పరీక్ష కాదు. మాస్టారు నోటితో అడిగే ప్రశ్నలకు పలక మీద జవాబులు రాసి చూపించాలి.

ఇక మర్నాడు పరీక్ష అనగా అమ్మ నాకు పరీక్ష పెట్టింది. అంటే ప్రీ-ఫైనల్ అన్నమాట. ఆ పరీక్ష ఇంచుమించు పదోతరగతి స్థాయి లో ఉంది. 'అమరావతి గూర్చి వ్రాయుము?' అని అడిగారనుకో, ఏం రాస్తావు? అని అడిగింది అమ్మ. 'గూర్చి' అంటే ఏమిటమ్మా? అని అడిగాను. నిజంగానే నాకు అప్పుడు ఆ పదానికి అర్ధం తెలియదు. 'ఏమి రాకుండానే అన్నీ వచ్చునంటావు. ఇప్పుడు చూడు, ప్రశ్న అడిగితే గూర్చి అంటే ఏమిటి అంటున్నావు' అని నా పుస్తకం తెమ్మని ప్రైవేటు చెప్పేసింది. చక్కగా నాన్న బయటికి వెళ్ళారు. ఫ్రెండ్స్ అంతా బయట ఆడుకుంటున్నారు. నేను మాత్రం వినాయకచవితి, కొబ్బరిచెట్టు, అమరావతి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా. 'కాసేపు ఆడుకుని వస్తానమ్మా' అని కాకా పట్టినా లాభం లేకపోయింది. 'ఏ దేబ్బో తగిలించుకుని వస్తే రేపు పరీక్ష ఎలా రాస్తావు?' అంది.

ఇలా కఠోర శిక్షణ సాగుతుండగా పరీక్ష రోజు రానే వచ్చింది. రోజూ కన్నా ముందే నిద్రలేచి పాఠాలన్నీమళ్ళీ చదివి బడికి రెడీ అయ్యా. 'కంగారు పడకు, ఆలోచించి జవాబులు రాయి, దేవుడికి దండం పెట్టుకో' లాంటి ఓ వంద జాగ్రత్తలు చెప్పి అమ్మ నన్ను పరీక్షకు సాగనంపింది. శకునం మంచిది రాదేమో అని తనే ఎదురు వచ్చింది. మిగిలిన పిల్లలెవరూ పరీక్ష గురించి అంతగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. మేము బడికెళ్ళిపోయి మాస్టారు కోసం ఎదురు చూస్తున్నాం. బెల్లు కొడతారు, అవ్వగానే ప్రార్ధన.. ప్రార్ధన అవ్వగానే పరీక్ష ఉంటుంది అని ఆలోచిస్తున్నా.

బెల్లు లేదు, ప్రార్ధన లేదు. మాస్టార్లు ముగ్గురూ ఏదో మాట్లాడుకున్నారు. మమ్మల్నందర్నీ గొడవ చేయొద్దని చెప్పి హెడ్ మాస్టర్ ముసలయ్య గారు మొదలు పెట్టారు. 'మన పక్క ఊరి స్కూల్లో మాస్టారుగారు చనిపోయారు. అందుకని ఇవాళ బడికి సెలవు. మీరెవరూ గొడవ చేయకూడదు. చప్పుడు చేయకుండా ఇళ్ళకు వెళ్ళిపొండి. మళ్ళీ రేపు ఉదయం రండి' అని చెప్పారు. కొంచం దూరం బుద్ధిమంతుడిలా నడిచి ఆ తర్వాత ఎగురుకుంటూ ఇల్లు చేరుకున్నా. గుమ్మంలోనే ఎదురై అమ్మ అడిగింది 'అప్పుడే పరీక్ష అయిపోయిందా?' అమ్మని ఇంకేమీ అడగనివ్వకుండా బడి సెలవు విషయం చెప్పేశా. తర్వాత రోజు మాష్టారు పరీక్ష పెట్టడం, నాకు క్లాస్ ఫస్ట్ రావడం జరిగింది. ఐతే అది మొదలు ఇంకెప్పుడూ అమ్మ ఆ స్థాయిలో పరీక్షలకు హడావిడి చేయలేదు. అంతేనా.. ఎప్పుడూ శకునం కూడా రాలేదు. తర్వాత ఎప్పుడైనా నాన్న 'ఇవాళ వాడికి పరీక్ష..ఎదురు వెళ్ళు' అన్నా, అమ్మ 'నేను ఎదురు వెడితే వాడి పరీక్షే జరగదు' అంటూ నవ్వేసేది.

6 కామెంట్‌లు:

  1. బాగుందండి మీ పరీక్ష కథ ,సో మీ మదర్ చాల కేర్ తీసుకున్నారు.అందుకనే కాబోలు ప్రతీది పూసగుచినట్లు చెప్పగలరు,స్ట్రాంగ్ ఫౌండేషన్ .

    రిప్లయితొలగించండి
  2. వేరీ వేరీ గుడ్ బాయ్ అన్నమాట మీరు.....

    రిప్లయితొలగించండి
  3. అయ్య బాబోయ్..... పెద్ద పెద్ద పరీక్షలకే అనుకొన్నా, రెండో తరగతి పరీక్షలకు కూడా ఇలా సిద్ధం చెసేస్తారన్న మాట!!! :-)

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ..
    బహు చక్కని పోస్టు.. నాకెంతగానో నచ్చింది..!
    అప్పటి పాఠాలు కూడా ఇప్పటికీ భలే గుర్తున్నాయండీ మీకు.. :)
    మీరు కబుర్లు చెప్పే పద్దతి మాత్రం.. మరీ మరీ వినాలనిపించేలా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా చెప్తుంటారా ఎప్పుడూ.. :)
    మీరేమో చకా చకా బోలెడన్ని టపాలు రాసేస్తున్నారు.. సమయం కుదరకపోవడం వల్ల.. నేను మీరు రాసినంత వేగంగా నేను అన్నీటినీ చదవలేకపోతున్నాను.
    కానీ.. ఆలస్యమైనా..అసలు చదవకుండా మాత్రం వదలను లెండి :)

    రిప్లయితొలగించండి
  5. బావుంది మీ మొదటి పరీక్ష.. నాకు పరీక్షలంటే చచ్చేంత భయం..

    మీ పరీక్ష సంగతి చదువుతుంటే నాకు నా స్నేహితుని అక్క కూతురు గుర్తుకు వచ్చింది. తను చదివేది ఒకటో తరగతో లేక రెండో తరగతో.. దానికి పరీక్ష అన్న మాటకి అర్ధమే తెలీదు.. అయితే అది పాపం ఏదో పరీక్ష లో తప్పింది .

    సరే, దాన్ని పిలిచి సరదాగా పరీక్ష ఎందుకు తప్పావే అని అడిగితే, తప్పడం అనేదానికి కూడా అర్ధం తెలియని ఆ బుడత.. "ఏమో నాకేం తెలుసు, అలా పరీక్ష రాస్తూ ఉన్నానా, అలా అలా రాస్తూనే తప్పిపోయాను" అంది.. బహుశా తప్పడం అంటే బజార్లో తప్పిపోవడం అనుకుందో ఏమో..

    రిప్లయితొలగించండి
  6. @చిన్ని: ఇప్పుడు తల్చుకోడానికి బాగుందండి..కాని అప్పట్లో చాలా విసుగ్గా ఉండేది..ఏమిటిది కనీసం ఆటలకు కూడా వెళ్ళనివ్వకుండా అని. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: అస్సలు కాదండి..రాబోయే పోస్టులు చదివితే మీకే అర్ధమవుతుంది :) ధన్యవాదాలు.
    @పిచ్చోడు: అప్పట్లో మిగిలిన పేరెంట్స్ అంతగా పట్టించుకునే వారు కాదు కానీ మా వాళ్లు మరీ స్ట్రిక్టు. మీకు ధన్యవాదాలు.
    @మధురవాణి: చిన్నప్పుడు వాగుడుకాయ్, వసపిట్ట అని ముద్దు పేర్లు నాకు. వయసు పెరిగే కొద్దీ అలవాట్లు మారుతుంటాయి కదండీ.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: బాగుందండి పరీక్ష తప్పిన బుడుత కథ. చిన్నప్పుడు నాకూ చాలా భయంగా ఉండేది, మార్కులు తగ్గితే ఏం జరుగుతుందో అని... మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి