శుక్రవారం, ఫిబ్రవరి 20, 2009

నాయికలు-రమ్య

'ఫోన్ లో మీ గొంతు విన్నప్పుడల్లా గుప్పెడు సన్నజాజులు గుండెల మీద జారుతున్న ధ్వని..' ...రమ్యని తలచుకోగానే నాకు మొదట గుర్తొచ్చే వాక్యం ఇది. 'ఆ అమ్మాయి చెప్పిన ఆ అనుభూతి ఎలా ఉంటుంది?' అని కొన్ని వందల సార్లు ఆలోచించి ఉంటాను. ఎందుకంటే తను మామూలు అమ్మాయి కాదు 'వెన్నెలమ్మాయి' రేవంత్ భాషలో.. యండమూరి వీరేంద్రనాథ్ భాషలో ఐతే 'వెన్నెల్లో ఆడపిల్ల'. సిన్సియర్ గా చెప్పాలంటే ఓ అంతర్జాతీయ స్థాయి చదరంగం ఆటగాడితో నెల రోజులపాటు ప్రేమ చదరంగం ఆడిన రమ్య, నేను ప్రేమలో పడ్డ తొలి నవలా నాయిక. మరో మాటలో చెప్పాలంటే రమ్యని ప్రేమించిన వేలాదిమంది తెలుగు పురుషుల్లో ఓ పుణ్య (?) పురుషుడిని నేను.

అందం, తెలివితేటలు, భావుకత్వం, సున్నితత్వం..వీటన్నింటినీ మించిన ఆత్మవిశ్వాసం, సెన్స్ అఫ్ హ్యుమర్ ఉన్న అమ్మాయి రమ్య. చదరంగంలో గెలిచిన రేవంత్ కి ఓ అభిమానిగా ఫోన్ చేసి, తన మీద ఆసక్తి ని రేకెత్తించి, తన పేరు, చిరునామా కనుక్కోమని సవాల్ విసిరినా..అతను కష్టం లో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి ఆటలో రేవంత్ కెరీర్ ని తన తెలివితేటలతో కాపాడినా అతనిమీద తనకున్న నిరుపమానమైన ప్రేమతోనే. 'గోదారి ఇసుకతిన్నెల మీద పడుకుని కృష్ణ శాస్త్రి కవిత్వం చదువుకోవాలనుకునే' భావుకత్వం తో పాటు 'చీకటి గదిలో ముద్దు' పజిల్ తో రేవంత్ ముఖం ఎర్రబరిచే కొంటెతనమూ ఆమె సొంతం.

'పేరెందుకూ' అంటుంది రమ్య, రేవంత్ మొదటిసారి ఫోనులో ఆమె పేరు అడిగినప్పుడు. అతని స్నేహితుడు జేమ్స్ తో తను 'టెన్త్ ఫెయిల్డ్ అనీ, స్టాంపు కలెక్షన్, సినిమాలు చూడడం' తన హాబీలనీ చెబుతుంది రెండోసారి ఫోన్ చేసినప్పుడు. మొదటిసారి ఈ నవల చదివినప్పుడు తొలిసారిగా ఈ అమ్మాయి నాకు నచ్చిన సందర్భం మాత్రం ఆమె జేమ్స్ మాటతీరుని బట్టి అతని మనస్తత్వాన్నీ, నేపధ్యాన్నీ, జీవన విధానాన్నీ వివరించడం. (రమ్య తర్వాత ఈ నవల్లో నాకు అంతగా నచ్చిన మరో పాత్ర జేమ్స్) రేవంత్ ని ఇష్టపడి, అతనిగురించి అన్ని వివరాలూ తెలుసుకుని, తనకి సరైన జోడీ అని నిర్ణయించుకుని అతనితో స్నేహం మొదలుపెట్టిన రమ్య చాలా కాలిక్యులేటెడ్ అనిపిస్తుంది. పైగా 'నేను మిమ్మల్ని నిరాశ పరచను రేవంత్ బాబూ..' అని ఊరిస్తూ ఉంటుంది, రేవంత్ నే కాదు, పాఠకులని కూడా.

రమ్య ఇచ్చే పజిల్స్ ని గెలవడంలో రేవంత్ ఫెయిలయిన ప్రతిసారీ ఆమె తెలివితేటల మీద అంచనాలు పెరిగిపోయేవి. రమ్య చేసిన పనుల్లో బాగా నచ్చినది ఆమె రేవంత్ కి రాసిన ఉత్తరాలు. ఓ ఉత్తరాన్ని గ్రాఫాలజిస్ట్ కి ఇచ్చి ఆమె మనస్తత్వం ఎలాంటిదో రేవంత్ కనుక్కుంటాడు. (ఈ సబ్జక్ట్ మీద సేకరించిన సమాచారంతో యండమూరి తర్వాత రాసిన పుస్తకం 'గ్రాఫాలజీ') ఆమె వ్యక్తిత్వం, ఫ్రాంక్ నెస్, దయాగుణం, ఈస్తటిక్ సెన్స్, సెన్స్ అఫ్ ఫ్రాగ్మాటిజం, జీవితం లో ఉన్న ప్రాక్టికాలిటీ...ఇవన్నీ... రేవంత్ ని ఉత్తరం రాయమని ప్రోత్సహించి, అతని ఆఫీస్కి వచ్చి, అతనికి తెలియకుండా చెత్త బుట్టలో పారేసిన ఉత్తరం చిత్తు ప్రతులన్నింటినీ జాగ్రత్తగా ఏరుకెళ్లి అతనికి జవాబు రాస్తుంది రమ్య.

ఈ నవల చదివిన వాళ్ళందరికీ బాగా గుర్తుండిపోయేది ముగింపు. అది ఎలా ఉంటుందంటే అప్పటివరకు చదివిన నవల మొత్తాన్ని మర్చిపోయి ముగింపుని మాత్రమే గుర్తు పెట్టుకునేలా. మొదటి సారి ఈ నవల చదివినప్పుడు వారం రోజులు పట్టింది, రమ్య ఇచ్చిన షాక్ నుంచి కోలుకోడానికి. చాలా రోజులపాటు ఆ పుస్తకం మళ్ళీ చదవాలని అనిపించలేదు. రెండో సారి చదివినప్పుడు నవలంతా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత చాలాసార్లు చదివాను. 'నేను చదివేశాను మొర్రో' అంటున్నా వినకుండా ఓ ఫ్రెండ్ చేత రెండు మూడేళ్ళ క్రితం ఈ నవల బలవంతంగా చదివించా.. 'నాకసలు జేమ్స్ పాత్రే గుర్తులేదు..నిజం చెప్పాలంటే రమ్య అల్లరి, ముగింపు తప్ప ఇంకేమీ గుర్తులేవు.. మొత్తం కొత్తగా చదివాను' ఇది అతని స్పందన. తనకి ఏ పుస్తకమూ రెండో సారి చదవడం ఇష్టం ఉండదు. అనవసరం అని అభిప్రాయం. నేనేమో అందుకు పూర్తిగా వ్యతిరేకం.

ఆ ఫ్రెండ్ తర్వాత ఆ పుస్తకాన్ని తన కొలీగ్ చేత చదివించాడు. ఆ కొలీగ్ కి పుస్తకాలు చదివే అలవాటు లేదు (ట). 'రమ్య హాంగోవర్ నుంచి తేరుకోడానికి నాలుగు రోజులు పట్టింది' ఇది అతని ఫీడ్ బ్యాక్. నిర్మాత కె.ఎస్. రామారావు(క్రియేటివ్ కమర్షియల్స్) కి ఈ పుస్తకం అంటే చాలా ఇష్టం అనుకుంటా. 'వెన్నెల్లో ఆడపిల్ల' పేరుతొ దూరదర్శన్ కి ఓ సీరియల్ తీశారాయన. తర్వాత ఇదే కథ తో శ్రీకాంత్ కథానాయకుడిగా 'హలో ఐ లవ్యు' అనే సినిమా తీశారు. అప్పటికే నవల వచ్చి చాలా రోజులు గడిచిపోవడం వల్ల అనుకుంటా ఆ సినిమా అంత బాగా ఆడలేదు. అందులో 'ఝుం తన నన నన' అనే పాట మాత్రం నా ఫేవరేట్. రమ్య తరహా పాత్రలు ఆ తర్వాత చాలా కథల్లోనూ, నవలల్లోనూ కనిపించాయి. కానీ రమ్య రమ్యే.. 'నవసాహితి' ప్రచురించిన 'వెన్నెల్లో ఆడపిల్ల' నవల వెల రూ. 50. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఎవరికయినా పుస్తకాలు చదివే అలవాటు చేయడానికి కానుకగా ఇవ్వదగ్గ పుస్తకం.

19 కామెంట్‌లు:

  1. hi..manchi novel gurtu chesaru ,jnapakaalu gubalistonai .ramya appatlo ammailni nidra poniledandi.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ ! నేను చదివిన వీరేంద్రనాద్ గారి మొదటి నవల వెన్నెల్లో ఆడపిల్ల .చదివిన వారు ఎప్పటికీ రమ్య ను మర్చిపోలేరు .ఇంత చక్కగా వివరించి నందుకు అభినందనలు .ఇక సినిమా ఫ్లాప్ అవడానికి కారణం నవల పాతబడిపోవటం కాదు .పాత్రలు తగిన న్యాయం చేయలేకపోవడం .ముఖ్యంగా రమ్య ......అసలు నవల్లో ఆమెను వర్ణిస్తూంటే కళ్ళముందు అలా కదలాడుతుంది .కాని సినిమాలో ..........ప్చ్ ....నాయికలు అని అన్నారు తర్వాత మందాకిని గురించి రాయబోతున్నారా ?

    రిప్లయితొలగించండి
  3. నేను మొదలెట్టి ఆపకుండా ఏకబిగిన చదివిన నవల ఇది. అలానే మళ్ళీ మళ్ళీ చదివిన నవల కూడా...

    రిప్లయితొలగించండి
  4. నేనూ వెన్నేల్లో ఆడపిల్ల నవల ఒక కన్నడ సినిమా లో చూసాను,మన తెలుగులోలా చెత్త చేయలేదు,ఎలా ఉందో అలా చివరివరకు అలాగే తీసాడు,అప్పుడునాకు యండమూరి అంటే ఎవరో తెలియదు ,ఆ సినిమా చూసి అది ఆయన నవల ఆధారం అని తెలిసాకా ఆయన అభిమానిని అయిపోయాను

    రిప్లయితొలగించండి
  5. నేను నవలలంటూ చదివితే అవి యండమూరివే(ఆ తర్వాత సూర్యదేవర వి).చాలా వరకూ అన్నీ చదివాను,ఈ మధ్యన(అంటే ఓ 5-6 ఏళ్ళ క్రితం వరకూ)వచ్చినవి తప్ప.చక్కటినవల.ఎప్పుడు తీరిక దొరికినా చదవచ్చు ఆ నవలలు,ఒక్కో పేజీ రెండు మూడు సార్లు చదవాలి అప్పుడే కొంచం మజా గా ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  6. @చిన్ని: ధన్యవాదాలు. నేనింకా అమ్మాయిలంతా రేవంత్ ఫాన్స్ అనుకుంటున్నా.. :)
    @పరిమళం: ధన్యవాదాలు. మధురవాణి తో మొదలుపెట్టి నాకు నచ్చిన నాయికలందరి గురించి రాస్తున్నానండి. ఇద్దరు మందాకినుల గురించీ రాసే ఆలోచన ఉంది.
    @ఉమాశంకర్: ధన్యవాదాలు. నేను ఎన్నిసార్లు చదివానో లెక్కపెట్టడం మానేసిన పుస్తకాలలో ఇదీ ఒకటి.
    @నేస్తం: ధన్యవాదాలు. వీలయితే ఆ కన్నడ సినిమా పేరు చెప్పండి..చూసేందుకు ప్రయత్నిస్తా.. మీరు చెప్పిన తీరు చూడాలన్న కుతూహలం పెంచింది.
    @శ్రీనివాస్ పప్పు: మొదటిసారి చదివేటప్పుడు కథ ఏమవుతుందో అనే కుతూహలంతో (కథనకుతూహలం:)) చదివేస్తాం కదండీ. మళ్ళీ మళ్ళీ చదవదగ్గ పుస్తకం. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మీరనట్టు వెన్నెల్లో ఆడపిల్ల ఆఖర్న ఇచ్చిన ఝలక్ మిగతా పాత్రల్ని మర్చి పోయేలా చేస్తుంది.నాకు బాగా నచ్చిన ది ఏంటంటే రేవంత్ కష్ట పడి లంబకోణం అన్న క్లూ తో ఢిల్లీ నుంచి ఆలోచిస్తూ అడ్రెస్స్ పట్టుకుని వచ్చే వేళకి ఆమె ఇంటిముందు శవం .గాలికి ఆమె ముఖం మీద కప్పిన గుడ్డ ఎగిరి ఆమె మొఖం చూసే అవకాశం వచ్చినా రేవంత్ టక్కున తల తిప్పేసుకుని నా వుహల్లో వుహించుకున్న వెన్నెల్లో ఆడపిల్లని అలాగే వుండి పోనీ అని చూడ కుండ వెళ్లి పోవడమే గుండెలు పిండే ఘటం. యండమూరి కి పాఠకుల pulse బాగా తెలుసు .కానీ కొంచెం చిలిపి టైటిల్స్ పెట్టడం లో దుప్పట్లో మిన్నాగు , నిశబ్దం నీకు నాకు మద్య ,మచ్చుక్కి ఉదాహరణలు .

    రిప్లయితొలగించండి
  8. నేస్తం గారు చూసిన కన్నడ సినిమా ’బెళదింగళ బాలె’ కన్నడలో అనంత నాగ్ నటించారు. సినిమా బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. అప్పట్లో ఆంధ్రభూమిలో సీరియల్ గా వచ్చింది. ఆఖరి భాగం చదివి ఇంట్లో ఎవరో ఆత్మీయులు మరణిస్తే ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో అలాంటి పరిస్థితి ,దుక్ఖం అన్భావించాము. ఒక లాంటి మాయలో ముంచేసిన పాత్ర.

    రిప్లయితొలగించండి
  10. ఈ నవల చదివిన వాళ్ళందరికీ బాగా గుర్తుందిపోయేది ముగింపు. అది ఎలా ఉంటుందంటే అప్పటివరకు చదివిన నవల మొత్తాన్ని మర్చిపోయి ముగింపుని మాత్రమే గుర్తు పెట్టుకునేలా.
    సరిగ్గా చెప్పారండీ. నాకు అలానే జరిగింది. మొత్తానికి వెన్నెల్లో ఆడపిల్ల ను మళ్ళీ గుర్తు చేశారు. ఏం చేద్దాం...... పుస్తకానికి మళ్ళీ దుమ్ము దులపాల్సిందే :-)

    రిప్లయితొలగించండి
  11. నిన్న ఇక్కడో వ్యాఖ్య పెట్టానే!

    అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాకు నచ్చిన నవల వెన్నెల్లో ఆడపిల్ల. అప్పట్లో రేవంత్‌తో పాటు తెలుగు పాఠకులతో కూడా ఓ ఆట ఆడుకుంది రమ్య.
    ఇలాంటి నవలల నవలగానే చదవాలి, సినిమాగా చూస్తే ఆ అనుభూతే పోతుంది. పిచ్చోడు గారనట్లు నవలంతా ఓ ఎత్తు అయితే ముగింపు మరో ఎత్తు.

    రిప్లయితొలగించండి
  12. @రవిగారు: ధన్యవాదాలు. మాథ్స్ లాంటి సబ్జక్ట్ ని కూడా నవలకి ఉపయోగించుకోవచ్చని యండమూరి నిరూపించారు.
    @Raj: ధన్యవాదాలు. సినిమా చూడడానికి ప్రయత్నిస్తాను.
    @నా బ్లాగు: ధన్యవాదాలు. నేను కూడా అలాగే బాధ పడ్డానండి.
    @పిచ్చోడు: ధన్యవాదాలు. మళ్ళీ చదువుతున్నారన్నమాట. ఎన్నిసార్లైనా చదవోచ్చండి.
    @సిరిసిరిమువ్వ: ధన్యవాదాలు. నిన్న మీ వ్యాఖ్య ఏమీ రాలేదండి.

    రిప్లయితొలగించండి
  13. హాయ్ మిస్టర్ , మురళి . మీ పేరు యెంత కృష్ణుడిని పోలిన , నెమలి ఈక ఫోటో పెడతారా?
    బై ది బై రమ్య తరువాత ఎవరిని ప్రేమించ లేదా ?

    రిప్లయితొలగించండి
  14. మురళీ గారు... మీరు నవలని గుర్తు చేసి చదివి కన్నీరు కార్చేలా చేసారు. ఆ నవలలో ముగింపు కన్నీటి బొట్టు రేవంత్ తో అన్నమాటలు చాలండి మనం కన్నీరు కార్చడానికి....నేను ఇప్పటికిఒక డజన్ "వెన్నెల్లో ఆడపిల్ల" నవలన్న బహుమతిగా ఇచ్చి వుంటాను ఇకముందు కూడా ఇస్తాను...... హట్స్ హాఫ్ టు యండమూరిగారు.

    రిప్లయితొలగించండి
  15. @monkeygaru: ధన్యవాదాలు. నా గత టపాలు, రాయబోయే టపాలు చదవండి. 'నాయికలు' శీర్షికతో నేను ప్రేమలో పడ్డ పాత్రల గురించి రాస్తున్నా.. బై ద బై, నల్లమల అడవులనుంచి బ్లాగారణ్యం లోకి ఎందుకు దూకారో..?
    @padma4245: ధన్యవాదాలు. వ్యాఖ్య చూసి 'పద్మార్పిత' గారు రాసినట్టు ఉందే అనుకున్నా.. చూస్తే అది మీ బ్లాగే.. పేరు మార్చుకున్నారా? నేను కూడా చాలా మంది చేత చదివించానండి..ఎవ్వరూ 'బాగోలేదు' అని చెప్పలేదు.

    రిప్లయితొలగించండి
  16. మీరందరి అభిప్రాయాలు చూసాకా.. నేను చెప్పే ఈ మాట విని అందరూ నన్ను తన్నడానికి వస్తారేమో అని భయంగా ఉంది :)
    ఏంటంటే.. నేనీ పుస్తకం ఇంకా చదవలేదు :(
    మూడేళ్ళ క్రితమే.. యండమూరి పుస్తకాలు చాలా చదివేసాను ఇంటర్నెట్ లో దొరకడం వల్ల.. అప్పుడు ఈ పుస్తకం దొరకలేదు :(
    త్వరలో తప్పకుండా చదవాలని అనుకుంటున్నాను. కానీ.. ఈ నవలలోని ముఖ్యమైన ట్విస్టులన్నీ చిన్నప్పటి నుంచీ వాళ్ళూ.. వీళ్ళు చెప్తుంటే వినేసాను.. ఇప్పుడు చదివితే ఎలా ఉంటుందో మరి.. చూడాలి..!

    రిప్లయితొలగించండి
  17. @మధురవాణి: మేమందరం మళ్ళీ మళ్ళీ చదువుతున్నాం. కథ తెలిసిపోయిందని చదవడం మానేయకండి. చదివిన వెంటనే ఓ టపా రాసేస్తారు మీరు. తప్పక చదవండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. మధురవాణి గారు, ఈ నవల వాళ్లూ వీళ్లూ చెప్పినదానికంటే మనం చదివితేనే ఎక్కువ అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కోసమయినా మీరీ నవల చదవాలి, చివరి పేజీ మరీనూ..

    రిప్లయితొలగించండి
  19. @సిరిసిరిమువ్వ: ఆవిడ చివరి పేజి ఒక్కటీ చదివి వదిలేస్తారేమో:)

    రిప్లయితొలగించండి