మంగళవారం, ఫిబ్రవరి 03, 2009

నాయికలు-మధురవాణి

గురజాడ అప్పారావు విరచిత 'కన్యాశుల్కం' నాటకాన్ని మొదటిసారి చదివినప్పుడు నన్ను అమితంగా ఆకట్టుకున్న పాత్ర మధురవాణి. అసలు మధురవాణి లేకపొతే కన్యాశుల్కం ఇంతగా రక్తి కట్టేదా? అని అనిపించింది..గత కొన్నేళ్లలో ఆ పుస్తకాన్ని చదివిన ప్రతిసారి ఇదే అభిప్రాయం కలుగుతోంది. అంతే కాదు మధురవాణి మీద అభిమానం పెరుగుతోంది. బాల వితంతువు బుచ్చమ్మ చెల్లెలు సుబ్బి. ఆమెకి ముసలి లుబ్దావధాన్లు తో పెళ్లి నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి అగ్నిహోత్రావధాన్లు. ఆమె తల్లి వెంకమ్మ కి, మేనమామ కరకటశాస్త్రికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. మధురవాణి అనే వేశ్య సహాయంతో శాస్త్రి ఈ పెళ్లి ఎలా చెడగొట్టగలిగాడన్నదే 'కన్యాశుల్కం' కథాంశం.

శూద్రక కవి (ఇది రచయిత పేరు) రాసిన 'మృచ్చకటికం' అనే సంస్కృత నాటకంలో (తెలుగు అర్ధం మట్టిబండి) 'వసంతసేన' అనే వేశ్య పాత్ర 'మధురవాణి' పాత్రను మలచడంలో గురజాడకి స్ఫూర్తినిచ్చిందని సాహితీ పరిశోధకులు అంటారు. నిజానికి వసంతసేన, మధురవాణి పాత్రల్లో సారూప్యతలకన్నా భేదాలే ఎక్కువ. మధురవాణి లో కొంటెతనం, జాణతనం హెచ్చు. నాటకం మొదటి సీన్లో రామప్పంతులుని మంచం కింద దాచి, తర్వాత గిరీశాన్ని అదే మంచం కింద దాచి, గిరీశాన్ని వెతుక్కుంటూ వచ్చిన పూటకూళ్ళమ్మకి కను సైగ తోనే గిరీశం మంచం కింద ఉన్నాడని చెప్పే సీన్లో మధురవాణి పాత్ర స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేశారు రచయిత. అలా కంటికొనతో చూపుతూనే 'మంచం కింద దాచడానికి నేనేమీ మగనాలినీ కాదు..వెధవముండనీ కాదు..' అంటుంది గడుసుగా.

'వృత్తి చేత వేశ్యని కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను' అని చెబుతూనే 'మీ తోబుట్టువుకి వచ్చిన కష్టం తీర్చడంలో సాయం చేయలేనా పంతులుగారూ?' అంటుంది కరకటశాస్త్రి తో. గిరీశం నుంచి వేరుపడి, రామప్పంతులు ఆశ్రయం లోకి వచ్చాక మధురవాణి-లుబ్దావధాన్లు-రామప్పంతులు మధ్య వచ్చే ఓ సన్నివేశం నాటకం మొత్తానికే హైలెట్. లుబ్ధావదాన్లుకి వరుసకి తమ్ముడైన గిరీశం, అగ్నిహోత్రావధాన్లు ఇంట చేరి అక్కడ జరిగే పెళ్లి పనులగురించి తన అన్నగారికి వ్యంగ్యంగా రాసే ఉత్తరాన్ని మధురవాణి చదివే సన్నివేశం. 'ఏనుగులు..లొట్టి పిట్టలు' అన్నప్పుడు ఆమె నవ్వులు..'పంతులు ఓ జాకాల్' అని చదివినప్పుడు 'నక్కను కూడా తెమ్మంతున్నరషండీ' అని అవధాన్లు అమాయకంగా అడగడం..

నాకైతే 'నువ్వు నాకు నచ్చావ్' లో ప్రకాష్ రాజ్ కి చంద్రమోహన్ రాసే ఉత్తరాన్ని ఆర్తి అగర్వాల్ చదివే సీన్ కి ఇదే ప్రేరణ అని సందేహం. లుబ్దావధాన్లు తలకి వాసన నూనె రాసి చిక్కు తీస్తూ 'సరైన సంరక్షణ లేక ఇలా అయిపోయారు కాని..మీరు వృద్ధులేమిటి బావా?' అని మధురం (రామప్పంతులు ఇలాగే పిలుచుకుంటాడు) అన్నప్పుడు పంతులు ఉడుక్కుంటూ 'నాకు మావ ఐతే నీకు బావ ఎలా అవుతారని?' లాజిక్ లాగితే 'మా కులానికి అందరూ బావలే' అని నోరు మూయిస్తుంది మధురవాణి.

ఆడ వేషం వేసిన కరకట శాస్త్రి శిష్యుడికి తన 'కంటె' (బంగారు నగ) ఎరువిచ్చి, అతని నుంచి దానిని తిరిగి తీసేసుకుని, కంటె తెస్తేకాని ఇంట్లోకి రానివ్వని రామప్పంతులుని వీధిలో నిలబెట్టడం మధురవాణికే చెల్లు. నాకు నచ్చే మరో సన్నివేశం క్లైమాక్స్ లో సౌజన్య రావు పంతులు-మధురవాణి ల మధ్య వచ్చేది. కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో సౌజన్య రావు పాత్రను గురజాడ తీర్చిదిద్దారంటారు. 'మంచివారిని చెరచ వద్దని మా అమ్మ చెప్పింది' అంటూనే సచ్చీలుడైన సౌజన్య రావుని ఓ ముద్దు కోరుతుంది మధురవాణి. గిరీశం ఓ ఆషాఢభూతి అని పంతులుకి చెప్పకనే చెప్పి బుచ్చమ్మని రక్షించడం ఆమెలో మరో కోణాన్ని చూపుతుంది.

నాటకాలు, సినిమా, సీరియళ్ళలో ఎంతో మంది 'మధురవాణి' పాత్ర పోషించినా 'కన్యాశుల్కం' సినిమాలో సావిత్రి పోషించిన పాత్రే ఊహల్లో మధురవాణికి దగ్గరగా ఉంటుంది. కంటికొసలతో ఆమె అభినయం..నడవడం, విరగబడి నవ్వడంలో ఆమె వయ్యారం మరెవరికీ రాలేదు. చివరిసారిగా మధురవాణి పాత్రను తెరపై చూసింది మా టీవీ లో వచ్చిన 'కన్యాశుల్కం' సీరియల్లో. గొల్లపూడి గిరీశం గా వేసిన ఈ సీరియల్ రెండేళ్ళ క్రితం ప్రసారమైంది. నటి జయలలిత (ఏప్రిల్ 1 విడుదల లో భాగ్యం) మధురవాణి పాత్ర పోషించారు. ఆమె నటనకు వంక పెట్టలేకపోయినప్పటికీ, అంత పెద్ద మధురవాణి ని చూడలేక పోయాను. అక్షరాలలో మధురవాణికి తెరపై ఎవరూ సాటిరారు.

11 కామెంట్‌లు:

  1. ఆధునిక తెలుగు సాహిత్యంలో మరువలేని పాత్రల్లో మధురవాణి ముందుంటుందంటే అతిశయోక్తి కాదు. మృఛ్ఛకటికం కర్తని శూద్రకవి అని రాశారు. దయచేసి శూద్రక కవి అని సవరించండి.

    రిప్లయితొలగించండి
  2. మృచ్ఛకటిక సంస్కృత నాటక రచయిత శూద్రకవి కాడు,శూద్రకుడు.
    కన్యాశుల్కం నాటకంతో పోల్చుకోవడంతో సినిమా కోసం చేసిన మార్పులు జనానికి నచ్చక ఆసినిమా అప్పట్లో హిట్ కాలేదేమో కాని, కన్యాశుల్కం చాలా చక్కటి చిత్రం.విజయనగరానికే వన్నెతెచ్చిన వేశ్యాశిఖామణి మధురవాణి పాత్రని ఎంతో మధురంగా రూపుకట్టింది సావిత్రి అభినయంతో.మీరు కూడా సినిమా మధురవాణినే దృష్టిలో పెట్టుకొని రాసినట్టున్నారు కదూ.

    రిప్లయితొలగించండి
  3. నాకు కూడా కన్యాశుల్కం లోని మధురవాణి అంటే చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  4. @కొత్తపాళీ: సరి చేశానండి. ధన్యవాదాలు.
    @సుధారాణి: శూద్రక కవి అనే నాకు తెలుసునండి. అచ్చుతప్పు చూసుకోక పోవడం వల్ల శూద్రకవి అని వచ్చింది. బోయవాడు వాల్మీకి అయినట్టుగా ఆయన వెనుక కూడా ఏదో కథ ఉండి ఉంటుంది బహుశా.. సంస్కృత పండితులను ఎవరినైనా అడగాలి. 'అక్షరాలలో మధురవాణికి తెరపై ఎవరూ సాటిరారు' ..ఇదే నా అభిప్రాయం.. 'సావిత్రి పోషించిన పాత్రే ఊహల్లో మధురవాణికి దగ్గరగా ఉంటుంది' అని కూడా రాశాను. చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.
    @శరత్'కాలం': ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. శూద్ర అనే కులం పేరుకీ శూద్రక కవి పేరుకీ ఏమీ సంబంధం లేదని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  6. నేను కన్యాశుల్కం రచన చదవలేదు.. అలాగే నాటకం కూడా చూళ్ళేదు.
    కానీ.. సినిమా చూసాను. మీరు వివరించిన సన్నివేశాలు గుర్తుకొచ్చాయి. సావిత్రి నటన మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది. ఆ సినిమా చూడటం వల్ల, అసలు మధురవాణి అంటే సావిత్రి కాక మరొకరు లేరేమోనని నాకనిపిస్తున్నది :)

    రిప్లయితొలగించండి
  7. @మధురవాణి: 'మధురవాణి' అన్న పేరు పెట్టుకున్నందుకైనా మీరు 'కన్యాశుల్కం' చదవాలండి. చిన్న సూచన మాత్రమె.. మీకు చదివే అలవాటు, ఆసక్తి ఉన్నాయి కాబట్టి. సావిత్రి బాగా చేశారు.. కాని పుస్తకం చదివాక మనం ఊహించుకునే మధురవాణి ఇంకా బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  8. మధురవాణి గురించి ఇంత తక్కువగానా చెప్పేది? ఒక నెల రోజులపాటు రోజూ ఒక టపా రాయాలి ఆమె గురించి. సావిత్రి తప్ప ఇంకెవరు మధురవాణి వేషం వేసినా ప్చ్...లాభం లేదు.ఆ లౌక్యం, తెలివి తేటలు, అందం, హృదయం, అన్నీ చూపించింది ఒక్క సావిత్రే! అలాగే గిరీశం కూడా ఒక్క ఎన్ టీఆరే! నటుడు రమణమూర్తి గారు ఆ వేషం రంగస్థలం మీద ఎన్నోసార్లు వేసిన అనుభవంతో ఆ దూరదర్శన్ సీరియల్లో కూడా వేశారేమో గానీ అప్పటికే ఆయన వృద్ధుడైపోవడం వల్ల, బుడ్డిమంతుడు కూడా కావడం వల్ల గిరీశం లోని చురుకుదనం లోపించింది. మధురవాణి మీద అభిమానంతో కన్యాశుల్కం పుస్తకాన్ని ఎంతోమందికి కానుకగా ఇచ్చాను. ఇంకా నా దగ్గర రెండు కాపీలు , మరియు ఒక డీవీడీ ఉన్నాయి.

    రేడియో నాటకంలో గిరీశంగా వేసింది కీర్తి శేషులు బందా కనకలింగేశ్వర రావు గారని గుర్తు! ఎప్పుడో చిన్నప్పుడు విన్న జ్ఞాపకం!

    రిప్లయితొలగించండి
  9. @సుజాత: నాకు దాదాపుగా నోటికి వచ్చేసిన పుస్తకాలలో 'కన్యాశుల్కం' ఒకటి. మీరు చేసిన పనే నేనూ చేశాను. ఒక్కసారే రాయాలని రూల్ ఏమి లేదు కాబట్టి, రాయాలనిపించినప్పుడల్లా రాస్తూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
  10. కన్యాశుల్కం సినిమా చూశాను కాని నాటకం చదవలేదండీ. ఇప్పుడు మీ టపా చదివాక నాటకం (పుస్తకం) కోసం ప్రయత్నించాలనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  11. @ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. ఎమెస్కో వాళ్ళు పాకెట్ బుక్ వేశారు. విశాలాంధ్ర వాళ్ళు కూడా ప్రచురించారు.. మళ్ళీ మళ్ళీ చదివించే లక్షణం ఉన్న పుస్తకం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి