బుధవారం, జనవరి 28, 2009

ఉత్తమ ఉపాధ్యాయుడు

అది ఒక స్టార్ హోటల్ లో విశాలమైన కాన్ఫరెన్స్ హాల్. సుమారు వంద మందితో ఓ వర్క్ షాపు జరుగుతోంది. అక్కడ ఉన్నవారంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. పేరుపొందిన స్కూళ్ళలో ప్రతిరోజూ వందలాది విద్యార్ధులను పరిశీలిస్తూ, వారికి విద్యను బోధిస్తూ వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వారందరికీ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నది కూడా ఓ ఉపాధ్యాయుడే. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన ఆయనకు విద్యార్ధుల మనస్తత్వమే కాదు, అధ్యాపకుల ఆలోచనా సరళిపైనా అవగాహన ఉంది. ఆ కార్యక్రమం ఉద్దేశ్యం ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారుచేయడం.

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధ్యాపకుడు పాల్గొన్న వారందరినీ కార్యక్రమం లో భాగస్వాములని చేశాడు. వాళ్ళచేత ఆడించాడు, పాడించాడు. వాళ్లకు పరిక్షలు పెట్టాడు..గెలిచిన వాళ్ళకి చాక్లెట్లను బహుమతిగా పంచాడు. ఈ క్రమంలోనే 'మంచి అధ్యాపకుడు ఎలా ఉండాలి?' అన్నది వివరిస్తూ ఆయన ఓ కథ చెప్పాడు. ఆ కథ ఆయన మాటల్లోనే..

ఓ స్కూల్లో లెక్కలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన పరమ కోపిష్టి. విద్యార్ధుల నుంచి ప్రశ్నలు రావడం ఆయనకీ ఇష్టం ఉండదు. తన క్లాస్ లో విద్యార్ధులంతా క్రమశిక్షణతో ఉండాలి..ఆయన చెప్పేది శ్రద్ధగా వినాలి. విద్యార్దులనుంచి ఎలాంటి సందేహాలూ రాకూడదు. నిజానికి ఆయన సంగతి తెలిసిన విద్యార్ధులు క్లాస్ లో ఎలాంటి ప్రశ్నలూ వేయడానికి ఇష్టపడరు. ఆయన బోర్డ్ మీద రాసే లెక్కల్ని తమ పుస్తకాల్లో వేగంగా రాసుకోడానికే వారికి సమయం చాలదు. బోర్డ్ మీద లెక్కలో మూడో లైన్ రాయగానే మొదటి లైన్ చెరిపేయడం ఆయన అలవాటు. ఇప్పుడు ప్రశ్న'ఈయన మంచి అధ్యాపకుడేనా?' అని.. 'అవును' అని ఎవరూ చెప్పలేదు.

ఒకరోజు మొదటి పిరియడ్ లెక్కల క్లాస్ జరుగుతుండగా వెనుక బెంచ్ లో కూర్చున్న ఓ విద్యార్ధి టిఫిన్ బాక్స్ కింద పడింది. ఆ శబ్దానికి శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్న విద్యార్ధులంతా ఒక్కసారిగా వెనక్కి చూసారు. ఆ విద్యార్ధి సిగ్గు పడ్డాడు. మాష్టారు అతనికేసి సీరియస్ గా చూసి 'లంచ్ టైంలో నన్ను కలు' అని చెప్పి పాఠంలోకి వెళ్లిపోయారు. ఆ విద్యార్ధి ముఖంలో భయం, మిగిలిన విద్యార్ధుల్లో ఉత్కంత..ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుందో అని. ఆ తరువాత జరిగిన క్లాసులు ఎవరూ శ్రద్ధగా వినలేదు. ఇదే టాపిక్ మీద క్లాసంతా గుసగుసలు.

లంచ్ టైం రానే వచ్చింది. విద్యార్ధి భయం భయంగా మాష్టారిని కలిసాడు. 'నేను కావాలని పడేయలేదు సార్..పొరపాటున జరిగింది..ఇంకెప్పుడూ ఇలా చెయ్యను సార్..' అతను భయంతో వణికిపోతూ చెబుతున్నాడు. ఐతే మాష్టారు అతన్ని మాట్లాడనివ్వలేదు. 'కాంటీన్లో నీకు నెల రోజుల భోజనం కోసం డబ్బు కట్టాను.. రోజు వెళ్లి భోజనం చెయ్. నెల అవ్వగానే మళ్ళీ కడతాను' అన్నారు సీరియస్ గానే.

'ఇప్పుడు చెప్పండి..అధ్యాపకుడు అలా ఎందుకు చేసాడు? అతను మంచి అధ్యాపకుడేనా? ' సమాధానం చెప్పడానికి ఓ ఉపాధ్యాయిని ముందుకొచ్చింది. 'టిఫిన్ బాక్స్ కింద పడ్డ శబ్దం వల్ల అది ఖాళిదని మాష్టారికి తెలిసింది. మొదటి పిరియడ్ లో ఖాళీ టిఫిన్ బాక్స్ అంటే..ఆ విద్యార్ధి భోజనం తెచ్చుకోలేదని ఆయనకి అర్ధమైంది. ఓ మంచి అధ్యాపకుడు తన విద్యార్ధి సమస్యలను తెలుసుకోవాలి. తనకు తోచిన సహాయం చేయాలి. ఆయన విద్యార్ధి సమస్యని అర్ధం చేసుకున్నాడు. సాయం చేసాడు. పైకి చాలా కటువుగా కనిపించినా ఆయన చాల మృదు స్వభావి, మంచి అధ్యాపకుడు.' వర్క్ షాప్ నిర్వాహకుడు ఆమెకు ఓ చాక్లెట్ బహూకరించాడు.

8 కామెంట్‌లు:

  1. పిల్లలను తీర్చిదిద్దే అధ్యాపకులు రాను రాను అంతరించిపోతున్నారు.
    అలాంటి అధ్యాపకులు ఇంకా ఉన్నారంటారా

    రిప్లయితొలగించండి
  2. @బాటసారి: ముందుగా ధన్యవాదాలు. అలాంటి వారి సంఖ్య తగ్గుతున్న మాట వాస్తవం. ఐతే అస్సలు లేకుండా పోలేదు. ఈ మార్పు అన్ని రంగాలలోనూ జరుగుతోందని అనుకుంటున్నా..

    రిప్లయితొలగించండి
  3. మంచి పోస్టు అందించారు. మీరన్నది నిజం. పల్లెల్లో ఇప్పటికీ కొందరు టీచర్లు విద్యార్థులకు సొంత డబ్బుతో భోజనం, బట్టలు కల్పిస్తున్నారు. ఒకప్పుడు అలాంటివారు చాలా మంది ఉండే వారు, ఇపుడు తగ్గుతున్నారు.

    రిప్లయితొలగించండి
  4. బావుందండీ మీరు చెప్పిన కథ. మీరన్నట్లుగా ఇలాంటి వారు కొందరైనా ఉన్నారని నేనూ నమ్ముతున్నాను.

    రిప్లయితొలగించండి
  5. @మధురవాణి: నాకు తెలిసిన వాళ్లు ఉన్నారండి. మరో టపాలో రాస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి