గురువారం, జనవరి 29, 2009

అమ్మ పుట్టిన ఊరు..

మాది ఓ పల్లెటూరు..ఐతే అమ్మమ్మ వాళ్ల ఊరు మా ఊరికన్నా పల్లెటూరు. అక్కడివాళ్లు మమ్మల్ని ఓ మహా నగరం నుంచి వచ్చిన వాళ్ళలా ట్రీట్ చేసే వాళ్లు. అమ్మమ్మ వాళ్ల ఊరికి మా ఊరినుంచి నేరుగా ఐతే గంట ప్రయాణం. ఐతే కొంత దూరం నడక, కొంత దూరం బస్, మళ్ళీ కొంత దూరం నడక.. ఇలా సాగే ప్రయాణం ఓ రెండు మూడు గంటలు పట్టేది. అప్పట్లో బస్ లు కూడా సరిగా ఉండేవి కాదు. దానికి తోడు అమ్మకి బస్ ప్రయాణం పడదు. ఇక మా తిప్పలు ఉండేవీ...

బాగా చిన్నప్పుడు బస్ గోదారి బ్రిడ్జి దాటుతున్నపుడు భయంగా అనిపించేది. 'బ్రిడ్జి కూలి బస్ గోదారిలో పడిపోతే..' అని సందేహం. 'చెడు కోరుకోకూడదు.. భయమేస్తే కళ్లు మూసుకుని ఆంజనేయ స్వామి కి దండం పెట్టుకో' అని చెప్పేది అమ్మ. కొంతమంది బస్ డ్రైవర్లు బస్ ని బ్రిడ్జి దగ్గర ఆపి, స్వామి కి దండం పెట్టుకుని మళ్లీ బస్ ఎక్కేవాళ్ళు. పెద్దవాళ్ళు బస్ కిటికీ లోంచి గోదారిలోకి చిల్లర పైసలు విసిరే వాళ్లు. అలా వృధా చేసే బదులు అడుక్కునే వాళ్లకు ఇవ్వొచ్చు కదా అనిపించేది. అదే మాట అమ్మతో అంటే 'ఇవి కూడా వాళ్ళకే వెళతాయిలే' అనేది.

అక్కడ బస్ దిగినప్పటినుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళే వరకు దారి పొడుగునా చాలా మంది అమ్మని పలకరించే వాళ్లు. వాళ్ళంతా అమ్మ ఫ్రెండ్స్. అలా మాటల్లోనే ఇల్లు వచ్చేసేది. ఇక మేం వెళ్ళామంటే అమ్మమ్మ, తాతయ్య, పిన్నిలు, చిన్న మామయ్య చేసే హడావిడి చూడాలంటే. 'పాపం పిల్లలు అంత దూరం నుంచి వచ్చారు.. ఏమన్నా తిన్నారో లేదో' అంటూ అమ్మమ్మ పొయ్యి వెలిగించేది. మేము దారిలో అమ్మని పీడించి రకరకాల చిరుతిళ్ళు కొనిపించుకున్నామని ఆవిడకి తెలీదు కదా.

అక్కడికి చేరగానే అమ్మ మమ్మల్ని దాదాపు మర్చిపోయేది. తన చెల్లెళ్ళతో, తమ్ముడితో ఒకటే కబుర్లు. 'నువ్వు కూర్చో అమ్మా..నేను చెల్లెళ్ళు కలిసి పనంతా చేసేస్తాం' అనేది అమ్మ. అమ్మమ్మ వింటే కదా. అమ్మమ్మ పెట్టింది తిన్నాక మేము ఊరిమీద పడేవాళ్ళం. ఎక్కువ దూరం వెళ్తే తాతగారు ఏమంటారో అని భయం. అందుకని పక్క ఇళ్ళకి మాత్రమె వెళ్ళేవాళ్ళం.

మేము స్కూల్లో నేర్చుకున్న పద్యాలు, పాటలు పాడేవాళ్ళం. పాఠాల్లో మాకు నచ్చినవి కూడా చెప్పేవాళ్ళం. అందరూ చాల ఆసక్తిగా వినేవాళ్ళు 'ఎంత బాగా చెబుతున్నారో..' అంటూ. కొందరైతే వాళ్ల పిల్లల్ని కోప్పడే వాళ్లు..మమ్మల్ని చూసి నేర్చుకోమని. అలా వి ఐ పి ట్రీట్మెంట్ పొంది ఇల్లు చేరేవాళ్ళం. అప్పటికి మామయ్య తేగలు లాంటి చిరుతిళ్ళు సిద్ధం చేసేవాడు. మేము వచ్చినప్పుడే ఎవరైనా పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు వస్తే ఇక పండగే.. అందరం కలిసి విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. అమ్మమ్మ తాతగారికి ముందే చేప్పేసేది 'పిల్లల్ని ఏమి అనకండి..రాక రాక వచ్చారు..' అని. అమ్మా వాళ్లు కూడా మమ్మల్ని వదిలేసే వాళ్లు, వాళ్ల కబుర్లకి మేము అడ్డు రాకుండా ఉంటే అంతే చాలని.

సాయంత్రాలు అమ్మ వాళ్ల ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. వాళ్ల ముందు మా విద్యా ప్రదర్శన. ఒకరు ఓ పాట పాడితే ఆ చివరి అక్షరం తో మొదలయ్యే పాట మరొకరు పాడడం (దానిని 'అంత్యాక్షరి' అంటారని అప్పట్లో మాకు తెలీదు). తాతగారు పద్యాలు రాగయుక్తంగా చదివేవాళ్ళు. అమ్మమ్మ మాచేత కబుర్లు చెప్పించుకుని వినేది. ఆవిడ చిన్న పిల్లల్ని కూడా 'నువ్వు' అనేది కాదు. మా కబుర్లలో మా ఇష్టాలేమితో తెలుసుకుని మర్నాడు అవి వండి పెట్టేది. ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. మాకేవరికైనా జ్వరం వస్తే తప్ప.

ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య లేరు. మామయ్య వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఖాళీ గా ఉంది. ఎప్పుడు మా ఊరు వెళ్ళినా అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్ళాలని బలంగా అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. అన్నీ కలిసొచ్చినా ఆ క్షణంలో 'వెళ్లి అక్కడ ఏం చూడాలి?' అనిపిస్తుంది. అప్పుడప్పుడూ అమ్మమ్మ వాళ్ల ఊరు, ఇల్లు, ఆ జ్ఞాపకాలూ బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్లి చూసి రావాలి...

7 వ్యాఖ్యలు:

మధుర వాణి చెప్పారు...

బావున్నాయండీ మీ కబుర్లు :)

మధుర వాణి చెప్పారు...

please remove word verification option for commenting. it makes us easy to comment in your blog.

మురళి చెప్పారు...

@మధురవాణి: ధన్యవాదాలు. మీ సూచన పాటించాను. ఇంకేమైనా సూచనలు ఉంటే ఇవ్వగలరు. అన్నట్టు మీ పేరు నాకిష్టమైన ఓ పాత్ర పేరు.

మధుర వాణి చెప్పారు...

మురళి గారూ..
ఇక మీకేమీ సూచనలు అక్కర్లేదండీ.. బ్రహ్మాండంగా రాస్తున్నారు బ్లాగుని.. ఇలా కానిచ్చేయ్యండీ :)

నా పేరున్న మీకిష్టమైన పాత్ర.. 'కన్యాశుల్కం' లోని మధురవాణి ఏనా?
కరెక్ట్ గా చెప్పానా :)
మధురవాణి అంటే నాకైతే సావిత్రే గుర్తొస్తుంది.

మురళి చెప్పారు...

@మధురవాణి: నాకు తెలిసి సాహితీ లోకంలో మరో మధురవాణి ఇంకా పుట్టలేదండి. గురజాడ వారి
మధురవాణే.. రాయడంలో నేను మొదటి మెట్టు మీదే ఉన్నానని మీ అందరి బ్లాగులు చూశాక అర్ధమైంది..

praneeta చెప్పారు...

cities lo putti perigina naalanti vallaki ilanti anubhootulanni yendamavule..mee chinnappati kaburlu bavunnayandi!

మురళి చెప్పారు...

@ప్రణీత: ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి