సోమవారం, జనవరి 26, 2009

శ్రీ గణనాథం..

..భజామ్యహం..అంటూ గణేశుడిని తలుచుకుని ఏ పని అయినా మొదలు పెట్టాలని చిన్నప్పడు ఇంట్లో తాతయ్య మొదలు బడిలో మేష్టారి వరకు అందరూ చెప్పేవారు. అందుకే ఈ బ్లాగులో గణేశుడిని తలుచుకుంటున్నా. కాకపోతే ఇతను నా బాల్య మిత్రుడు గణేష్. మేమిద్దరం రెండో తరగతి నుంచి స్నేహితులం. ఎనిమిదో తరగతి వరకు కలిసి చదివాం. ఎలిమెంటరీ స్కూల్ లో మా ఇద్దరికీ విపరీతమైన పోటీ.. ఒక పరీక్షలో ఒకరికి ఫస్ట్ వస్తే, తరువాతి దాంట్లో మరొకరికి ఫస్ట్ రావాల్సిందే..

అప్పట్లో మా ఊళ్ళో ఒకాయన ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటి నుంచి నాలుగు తరగతుల వరకు పాతిక రూపాయలు, ఐదో తరగతి వాళ్ళకి యాభై రూపాయలు ప్రోత్సాహక బహుమతి ఇచ్చేవాళ్ళు. దీనికోసం ప్రతి క్లాస్ లోనూ ఇద్దరం పోటి పడేవాళ్ళం. కాని ఇద్దరం స్నేహితులం.. ఎంత అంటే ఒకరు బడికి వెళ్ళ లేకపోతే రెండో వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లి ఆరోజు ఏం చెప్పారో చెప్పి అవసరమైతే హోం వర్క్ లో సాయం చేసే అంత. యూనిట్ పరీక్షలలోను, క్వార్టర్లీ, హాఫ్ యియర్లీ పరీక్షలలోను తనకి ఫస్ట్ వచ్చినప్పుడల్లా నేను ఇంటికొచ్చి ఏడిస్తే 'వాడు నీకన్న యేడాది పెద్దవాడు..' అని అమ్మ నన్ను ఊరుకోపెట్టేది.

సరే.. ఐదో తరగతిలోకి వచ్చేశాం..స్నేహం స్నేహమే.. చదువు చదువే.. యాభై రూపాయలు ఎవరివో అని మిగిలిన స్నేహితులంతా చర్చించుకునేవారు. ఆ సంవత్సరం ఐదో తరగతి బహుమతి ఇద్దరికి చెరో పాతిక రూపాయలు ప్రకటించారు. అంటే గణేష్ కి నాకు. ఏడో తరగతిలో ఉండగా మా ఇద్దరికి చ్చిన్న మాట పట్టింపు వచ్చింది.. దాదాపు యేడాది పాటు మాట్లాడుకోలేదు. ఇప్పుడు తల్చుకుంటే చాలా సిల్లీగా ఉంటుంది కాని, అప్పట్లో ఇద్దరం చాలా పట్టుదలకి పోయాం. గణేష్ వాళ్ల తాతగారు మా ఊళ్ళో కిరాణా కొట్టు నడిపేవారు. చాలా కష్ట జీవి. దివిసీమ ఉప్పెన టైములో ఆయన 'మనందరం ఎన్నాళ్ళు ఒంటి పూట భోజనం చేస్తే ఈ నష్టం పూడుతుంది?' అనడాన్ని ఇప్పటికి ఎప్పుడు గోదారొచ్చినా మా ఊరివాళ్ళు తలచుకుంటారు.

ఆయన మరణం తరువాత పిల్లలు వేరు పడ్డారు. గణేష్ వాళ్ల నాన్నగారు ఓ సినిమా హాల్లో పనిచేసే వారు. తను సినిమాలు ఎక్కువగా చూసే వాడు. అంతే కాదు, ఆ కథలు చాలా వివరంగా చెప్పేవాడు. కొత్త సినిమా విడులైతే మర్నాడు స్కూల్లో 'సినిమా సూపరిట్టు' అనో 'ప్లాపైపాయింది..' అనో చెప్పేవాడు. ఆ రెండింటికీ భేదం ఏమిటో అప్పట్లో నాకు తెలిసేది కాదు.

నాకు అప్పట్లో సినిమా పరిజ్ఞానం చాలా తక్కువ. హీరోలని కూడా సరిగా గుర్తుపట్టలేక పోయేవాడిని. సినిమాకి వెళ్ళడం మీద మా ఇంట్లో చాలా ఆంక్షలు ఉండేవి. ఓ రకంగా సినిమా మీద నాకు ఆసక్తి ని పెంచింది అతనే. అంతేకాదు, నాకు ఊహ తెలిశాక అమ్మతో కాకుండా చూసిన మొదటి సినిమా తనతోనే.. అది 'లవకుశ' సినిమా. వాళ్ల నాన్నగారు పనిచేసే హాల్ వాళ్లు మార్నింగ్ షోలకోసం తెచ్చారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పక్క ఊరికి తీసుకెళ్ళాడు.

ఎనిమిదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతుండగా ఓ రోజు మా ఇంగ్లిష్ మాష్టారు పిలిచి 'గణేష్ పరీక్షలకు రావడం లేదెందుకు?' అని అడిగారు. పరీక్ష అవ్వగానే గణేష్ వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ల నాన్నగారు ఉన్నారు. విషయం ఆయన్నే అడిగా. 'ఓ షాప్ లో పెట్టనమ్మా..అక్కడికి వెళ్తున్నాడు..' అన్నారు. ఏం చెప్పాలో కాసేపు అర్ధం కాలేదు. 'కనీసం పరీక్షలైనా రాయనీయండి. ఇన్నాళ్ళు చదివి పరిక్షలు రాయకపోవడం అంటే బాధ కదా. మాష్టారు అన్ని పరీక్షలూ రాయనిస్తానన్నారు' అన్నాను. ఆయన నా ముందే గణేష్ కి పర్మిషన్ ఇచ్చేశారు.

మర్నాడు ఇద్దరం కలిసి స్కూలుకి.. దారిలో చెప్పాడు తను చదువు మానేయల్సిందేనని. చాల బాధ అనిపించింది. మేమిద్దరం గొడవ తర్వాత కలిసిపోయమన్న ఆనందం ఏమి మిగలలేదు. చెప్పినట్టే తను చదువు మానేశాడు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం.. తను స్కూలు గురించి, మాష్టార్ల గురించి పేరు పేరునా అడిగేవాడు. తరువాత కొన్నాళ్ళకి నేను ఊరు వదిలేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఊరెళ్ళినపుడు తనని కలిసేవాడిని. ప్రైవేటు గా చదవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎప్పటికప్పుడు ఏవేవో ఇబ్బందులు. నెమ్మదిగా తనకి చదవగలనన్ననమ్మకం పోయింది.

కుటుంబ బాధ్యతలని తనపై వేసుకుని పూర్తిచేశాడు. తన పెళ్ళికి పిలిచాడు కాని వెళ్ళడం నాకు వీలు పడలేదు. పెళ్లి టైం కి ఫోన్ లో శుభాకాంక్షలు మాత్రం చెప్పగలిగా. పెళ్ళయిన కొన్నాళ్ళకి మా ఊళ్ళోనే ఓ కిరాణా షాపు మొదలెట్టాడు తను. తన షాప్ కి వెళ్లి 'రామోజీరావు కూడా పచ్చళ్ళు అమ్మడం తోనే కెరీర్ మొదలు పెట్టాడు' అన్నా, తనని ఉత్సాహపరచడం కోసం. 'అంతకు ముందు, తర్వాత కొన్ని వేల మంది పచ్చళ్ళు అమ్మారు.. వాళ్ళంతా రామోజీరావు లు కాలేదు కదా?' అన్నాడు. బాగా చల్లటి గాలి ముఖానికి కొట్టిన ఫీలింగ్..అది వేసవి కాలం మరి.

తానేమీ నిరాశావాది కాదు, బట్ ప్రాక్టికల్ థింకర్.. కొన్నాల్లకే షాప్ మూసేయాల్సి వచ్చింది.. ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందులు.తన సమస్యలన్నీ చెప్పేవాడు.. ఐతే తానేదో ఆ బరువు కి కుంగి పోతున్నానన్న భావనతో కాదు.. వాటిని తాను ఫేస్ చేయగలననే ధీమాతో.. భార్యా పిల్లలతో ఊరు విడిచిపెట్టాడు. చదువుకునే అవకాశం దొరికి ఉంటే తను చాలా మంచి స్థాయి కి వెళ్ళేవాడు అని నేను అనుకుంటూ ఉంటా. కాని తను అలా అనుకోడు. 'పర్వాలేదు..ఇప్పుడూ నేను బాగానే ఉన్నా..' అంటాడు నవ్వుతూ.

ఈమధ్య కలిసినప్పుడు చాలా సంతోషంగా చెప్పాడు.. పిల్లలు బాగా చదువుకుంటున్నారట.. 'మనం ఎలాగు చదవలేక పోయాం.. వాళ్ళని చదివించాలి..' అన్నాడు. చిన్నప్పుడు అమ్మ తరచూ చెప్పిన 'వాడు నీకన్నా యేడాది పెద్దాడు' అన్న మాట గుర్తొచ్చింది. 'యేడాది కాదు..చాలా పెద్దవాడు..' అనుకుంటున్నా.

8 వ్యాఖ్యలు:

durgeswara చెప్పారు...

very well

chinnanaati sneha bamdham to modalu pettaavu mamchi rachanaa saili vunnadi digvijayeebhava

ఉమాశంకర్ చెప్పారు...

మురళి గారూ,
మీర్రాసిన మొదటి టపా చాలా బాగుంది. నాచిన్నప్పుడు నాక్కూడా ఒక ఫ్రెండుండేవాడు , దాదాపు ఇదే అనుభవం నాక్కూడా.. వీలైతే నా బ్లాగు లో రాయాలి తన గురించి...

keep writing

మురళి చెప్పారు...

@దుర్గేశ్వర, ఉమాశంకర్: ధన్యవాదాలు.

మధుర వాణి చెప్పారు...

చిన్నప్పటి స్నేహంలో ఉన్న మాధుర్యం మళ్ళీ జీవితంలో వేరే ఏ స్నేహంలోనూ ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏది ఏమైనా.. ఇప్పటికీ మీ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నందుకు మీకు అభినందనలు. మీ వ్రాత శైలి బాగుంది :)

మురళి చెప్పారు...

@మధురవాణి: ధన్యవాదాలు.

భావన చెప్పారు...

ఎమిటో జీవితం... ఒక్కొక్క సారి అనిపిస్తుంది ఈ జీవితానికి మనం అర్హులమేనా? మనకంటే ఎంతో తెలివి గల వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూపు లోనే జీవితం గడిపేస్తారు కదా అని. (మన కంటే తెలివి తక్కువ వాళ్ళు మనకంటే బాగా జీవితం లో ముందు వుండే వాళ్ళు వుంటారు ఇంకో పక్క). మనలోని ఇంకో కోణం బాగా బయటకు తెచ్చేరు బాగుంది మురళి.

"శం కరోతి" - ఇతి శంకరః చెప్పారు...

స్నేహం గురించి ఎంత బాగ చెప్పరండి మురళి గారు. మీ స్నేహితుడి లాగానే నాకు నాగార్జున అని ఒక స్నేహితుడున్నాడు. ఇద్దరం తొమ్మిది పది తరగతులు కలిసి చదివాము. ఆ తర్వాత నేను వాడు ఇంటర్ ఒకే కాలేజీకి వెళ్ళాము. కాని ఇంటర్ మొదలైన మొదటి సంవత్సరమే నాన్న గారు మాకు వీసా అప్లయ్ చెయ్యాటమూ...అది రావటమూ ...చక చకా జరిగిపోయాయి. ఇంకేముంది..కాలేజీకి రెండు మూడు నెలలు వెళ్ళానో లేదో అమెరికా వచ్చి పడ్డాను. వచ్చి ఆరేళ్ళు గడిచినా మొన్న 2007 లో తప్ప మాతృదేశం వెళ్ళే అవకాశం మళ్ళీ దొరకలేదు. కాని వచ్చిన కొత్తల్లో నాగార్జున వాళ్ళింటికి ఫోన్ చేసేవాడిని. ఈంటర్ రెండొ సం. అనుకుంటా వాళ్ళింటికి ఫోన్ చేస్తే వాళ్ళ నన్న గారు చెప్పారు..." వాడు చదువు మానేసి నా లాగ లారీలు చూస్కుంటానంటున్నడు...కాస్త నువ్వైనా చెప్పు బాబు...వింటాడేమో " అని....చెప్పి చూశా...కాని వాడి కర్మకి నేను కర్తని కాలేనుగా. తర్వాత కొన్నాళ్ళకి నేను వాళ్ళింటికి ఫోన్ చేస్తే ఆ నంబరు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ నాగార్జున ఎవరు లేరు అని చెప్పారు. అయినా సరె...తప్పు నంబరుకి చెశాననుకుని మళ్ళీ మళ్ళీ చేసాను. ఈ సారి ఆ ఫోన్ ఎత్తిన ఆవిడకి కోపం వచ్చి..."ఎన్ని సార్లు చెప్పాలి...ఇది నాగార్జున నంబర్ కాదని? " అన్నారు. ఇంక మళ్ళీ అదే నంబర్కి ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టటం భావ్యం కాదని వదిలేశా. కాని వాడు ఎలా ఉన్నాడో ..ఎం చేస్తున్నాడో అని లొపల మధన పడుతూనే ఉన్నా. సంతోష పడాలో..బాధ పడాలో తెలియట్లేదు కానీ..ఈ మధ్య వేరే స్నేహితుల ద్వారా వాడి విషయాలు తెలిశాయి. వాడు చదువాపేసి వాళ్ళ నాన్న లాగా లారీ పనే చూస్కుంటున్నాడని తెలిసి బాధ పడ్డా. పోనిలే కనీసం అందులో అన్నా స్థిరపడ్డాడుకదా మెల్లిగా అందులో అయినా పైకొస్తాడులే అన్న ఆశతో ఉన్నా. ప్రస్తుతం వాడి మొబైల్ నంబరు కనుక్కొవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. తొందరలో వాడి నంబర్ దొరుకుతుందన్న ఆశతో ఉన్నాను.

మురళి చెప్పారు...

@"శం కరోతి" - ఇతి శంకరః : మనం గట్టిగా ప్రయత్నిస్తే కానిదేమీ ఉండదండీ.. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో మరికొంచెం సులువుగానే పని పూర్తి చేయొచ్చు.. త్వరలోనే మీ మిత్రుడిని కలుసుకోవాలనీ, ఆ శుభావార్తని మాతో పంచుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ...ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి