శుక్రవారం, జనవరి 30, 2009

ఎడారి కోయిల

'కథే తానై, తానే కథై తెలుగు కథకు కొత్త వెలుగునిచ్చిన మధురాంతకం రాజారాం గారి దివ్య స్మృతికి మా ఈ ప్రదర్శన అంకితం చేస్తున్నాం..గంగోత్రి..పెదకాకాని వారు సమర్పించు ఎడారి కోయిల నాటిక. రచన వల్లూరు శివ ప్రసాద్..దర్శకత్వం నాయుడు గోపి..ఎడారి కోయిల మరికొద్ది క్షణాల్లో ..' ఈ ప్రకటనతో మొదలయ్యే 'ఎడారి కోయిల' నాటికను నాలుగుసార్లు చూసే అవకాశం దొరికింది నాకు. నచ్చిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, సినిమా నచ్చితే రెండు మూడు సార్లు చూడడం నాకు అలవాటు. నాటకం/నాటిక విషయంలో మాత్రం ఈ అవకాశం అరుదుగా దొరుకుతుంది.

ఇది ఏడెనిమిదేళ్ళ క్రితం సంగతి. అప్పటికే దామల్ చెరువు అయ్యోరి (మధురాంతకం రాజారాం) కథలు కొన్ని..'ఎడారి కోయిల' తో సహా.. చదివి ఉన్నాను. ఓ కథనో, నవలనో సినిమాగానో, నాటకంగానో మలచడంలో ఉండే కష్ట నష్టాలపై కొంత అవగాహన ఉంది. మొదటిసారి ఈ నాటికను చూస్తున్నపుడు కథను పూర్తిగా మార్చేస్తున్నారా? అని సందేహం కలిగింది. ఐతే నాటిక పూర్తయ్యేసరికి నాకు కలిగిన అనుభూతి, కథను చదివినప్పటి అనుభూతితో సమంగా ఉండేసరికి మళ్ళీ ఈ నాటిక చూసే అవకాశం ఎప్పటికి వస్తుందా అని ఎదురు చూశా.

మధురాంతకం రాసిన 'ఎడారి కోయిల' కథ తన తాతయ్య, నాయనమ్మలను వెతుక్కుంటూ అమెరికా నుంచి రాయలసీమ లోని ఓ కుగ్రామానికి వచ్చే ఓ టీనేజ్ కుర్రాడి కథ. తన తండ్రికి పాఠాలు చెప్పిన మాష్టారి ద్వారా ఊరి పరిస్థితులు, ఇంటి పరిస్థితులు తెలుసుకోడం తో పాటు, తనమీద కోపంగా ఉన్న తాతయ్య మనసు ఎలా గెలుచుకున్నాడనేది కథాంశం. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా కథ కి కొంచం దగ్గరగా ఉంటుంది. బహుశా ఆ కథ రాసిన 'మానస' దామల్ చెరువు అయ్యోరి కథ నుంచి స్ఫూర్తి పొంది ఉండొచ్చు.

కథని నాటికగా మార్చడంలో కొన్ని మార్పులు చేశారు. కథలో లేని ఫాక్షనిజం అంశాన్ని నాటికలో చేర్చారు. కథలో ఉండే మేనత్త పాత్రకు బదులుగా బాబాయ్ పాత్రను సృష్టించారు. రాయలసీమ నేటివిటీ కోసం నాటికను ఓ చెక్క భజనతో ప్రారంభించారు. స్టేజి మీద సెట్టింగ్ సింపుల్ గా ఉన్నా, 'సీమ' గ్రామాన్ని ని ప్రతిబింబించింది. తాతయ్య పాత్రని నాయుడు గోపి, నాయనమ్మగా సీనియర్ రంగస్థల నటి రత్న కుమారి (ఈవిడకి నట రత్న కుమారి అని పేరు) మనవడిగా కిరణ్ అనే అబ్బాయి నటించారు.

కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నాయనమ్మకి మనవడంటే ఇష్టం, తాతయ్య కి కోపం. పెద్దాయన తన పెద్ద కొడుకుని కష్టపడి మెడిసిన్ చదివిస్తాడు. అతను ఓ కోస్తా జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లితండ్రులని, సీమని వదిలి అమెరికా లో సెటిల్ అవుతాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పెద్దాయన 'ఎందుకొచ్చావని' మనవడి మీద కోప్పడతాడు.. కుర్రాడికి విందు భోజనం పెట్టలేని తమ స్థితి పట్ల వృద్ధ దంపతులు బాధ పడతారు. బాబాయ్ ఫాక్షనిస్టు గా ఎందుకు మారవలసి వచ్చిందో, ఫలితంగా కుటుంబంలో పెరిగిన అశాంతి ఆ అబ్బాయి కళ్ళారా చూస్తాడు.

తమ కొడుకు కోడలు విజయవాడ వచ్చారని, మనవడు తిరుపతి వెళ్తానని వాళ్ళకి చెప్పి తమను చూడడానికి వచాడని తెలుసుకుని ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషిస్తారు. 'ఈ ఊరే తిరుపతి, మీరిద్దరే నా దేవుళ్ళు అనుకుని వచ్చాను తాతయ్యా..' అని అబ్బాయి చెప్పే డైలాగ్, బ్యాక్ గ్రౌండ్ లో 'గోవింద గోవింద' అనే మ్యూజిక్ ప్రేక్షకుల చేత అప్రయత్నంగానే చప్పట్లు కొట్టిస్తాయి. మెడిసిన్ చదువు పూర్తి చేసి అదే ఊళ్ళో హాస్పిటల్ పెడతానని తాతయ్యకి, నాయనమ్మకి హామీ ఇచ్చి మనవడు ప్రయాణం అవ్వడం, చెక్క భజన బృందం దగ్గర భజన నేర్చుకుని బస్ ఎక్కడం నాటిక ముగింపు.

ఓ సినిమా చూసాక అది మనకి నచ్చితే ఆ నటీనటుల్ని వ్యక్తిగతంగా కలిసి అభినందించడం మనకి వీలు కాదు. అదే నాటకం లో ఆ సౌలభ్యం ఉంది. రచన క్రెడిట్ పూర్తిగా మధురాంతకం వారికి ఎందుకు ఇవ్వలేదని నాయుడు గోపి ని అడిగాను. మూల కథని నాటకీకరించడంలో చాల మార్పులు చేశామని చెప్పారు. ప్రదర్శన పూర్తైన ప్రతిసారి కిరణ్ చాలా ఎమోషనల్ అయిపోయేవాడు. పాత్ర నుంచి బయటకి రావడానికి కొంచం టైం పట్టేది. హైస్కూల్ తో చదువు ఆపేసిన ఆ అబ్బాయి స్టేజి మీద అమెరికన్ యక్సేంట్ లో డైలాగులు చెపుతుంటే అబ్బురంగా అనిపించేది. డిగ్రీ అయినా చదవమని సలహా ఇచ్చా.. విన్నాడో లేదో తెలీదు.

చాలా రోజుల తర్వాత ఈ నాటికని ఓ టీవీ చానల్ వాళ్లు స్టూడియో లో షూట్ చేసి ప్రసారం చేశారు. క్వాలిటీ చాల నాసి రకంగా ఉంది..సగం చూసి ఇక చూడలేక చానల్ మార్చేశా..

7 కామెంట్‌లు:

  1. నేనెప్పుడూ నాటకాలు చూళ్ళేదు. కానీ.. మీ వ్యాఖ్యానం చదివి.. నిజంగా నాటకాన్ని స్వయముగా చూసిన ఫీల్ వచ్చింది :) బాగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  2. @మధురవాణి: నాటకం చూసే అవకాశం ఎప్పుడు వచ్చినా మిస్ కాకండి.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. ఈ నాటికను దూరదర్శన్లో 3 సార్లు చూశాను. చాలా బాగా ఉంటుంది. అదే గాక కొన్ని రాళ్ళపల్లి, రమణమూర్తి , సుత్తివేలు వాళ్ళ లఘునాటికలు ఇలాగే మానవ సంబంధాల మీద, నైతిక విలువల పైన వచ్చాయి. వీటిలో నాకు నచ్చేది నేటివిటీ. చాలా సింపుల్ సెట్టింగ్స్, చిన్న చిన్న డైలాగ్స్, పెద్దగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. నాకు చాలా ఇష్టం దూరదర్శన్ అంటే.

    రిప్లయితొలగించండి
  4. @Subrahmanya Chaithanya Mamidipudi: మంచి నాటిక అండి.. క్రెడిట్ చాలా వరకు మధురాంతకం వారికే చెందుతుంది.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. మధురాంతకం గారి ఒక quote నాకు చాలా ఇష్టం.

    "పొద్దు చాలకపోవడం జీవ లక్షణం
    పొద్దు గడవకపోవడం మృత్యు లక్షణం"

    రిప్లయితొలగించండి