శనివారం, జనవరి 24, 2009

నేనూ ఓ బ్లాగు వాడిని అయ్యాను..

బ్లాగు లోకంతో నాది కొద్ది నెలల పరిచయం. అదికూడా చాలా యాదృచ్చికంగా జరిగింది. సినిమా అంటే ఉన్నఆసక్తితో సినిమా వెబ్సైట్లు వెతుకుతుంటే 'నవతరంగం' కనిపించింది. నాలాంటి వాళ్లు అక్కడ చాలామంది కనిపించేసరికి నాక్కూడా రాయాలని అనిపించింది. వెబ్ లో తెలుగు లో రాయడం నేర్చుకుని అప్పుడప్పుడు సినిమా సమీక్షలు పంపడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో బ్లాగుల గురించి తెలిసింది. కూడలి లోను జల్లెడ లోను బ్లాగులు చదవడం, అప్పుడప్పుడు కామెంట్స్ రాయడం జరిగింది. అత్యంత సహజంగానే 'వాట్ నెక్స్ట్' అనే ప్రశ్న, దానికి 'సొంతంగా ఓ బ్లాగు మొదలుపెట్టడం' అని సమాధానం.

మరి బ్లాగులో ఏం రాయాలి? మన అభిప్రాయలు లేదా మన జ్ఞాపకాలూ, అనుభవాలు. మిగిలిన అంశాలను గురించి రాసినా జ్ఞాపకాల గురించి ప్రస్తావన లేకుండా ఉన్న బ్లాగులు అరుదు అని నా చిన్న పరిశీలన. మరి బ్లాగుకి పేరేం పెట్టాలి? 'నామకరణం' సమస్యని అధిగమించడం కోసం ఓ సారి బాల్య స్మృతుల్లోకి వెళ్ళాను. చాలామంది పిల్లల్లాగే అప్పట్లో నాకూ 'నెమలి కన్ను' అంటే విపరీతమైన ఇష్టం. దానిని సంపాదించడం కోసం నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. శ్రీరమణ 'షోడా నాయుడు' కథ చదివినప్పుడల్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మిత్రులని బతిమాలి ఓ నెమలీక సంపాదించడం, దానిని 'తెలుగు వాచకం' లో భద్రంగా దాచి అది పిల్లల్ని పెడుతుందనే నమ్మకంతో కొబ్బరి చెట్టు తాలూకు పైబర్ ను 'మేత' గా వేయడం, ఎప్పటికి పిల్లల్ని పెట్టడంలేదని నిరాశ పడ్డం..ఇంట్లో నాన్న కంటా, బడిలో మేష్టారి కంటా పడకుండా ఆ నేమలీకను కాపాడుకోవడం..

నెమలి కళ్ళతో చేసే విసనకర్రలతో అందర్నీ ఆశీర్వదిస్తూ పొట్ట పోసుకునే సంచార జాతులవాళ్ళ వెంటపడి 'ఒక్క కన్ను..కనీసం ఒక్క ఈక అయినా..' అని బతిమాలడం.. (వాళ్లు డబ్బులిచ్చినా ఇవ్వరు..ఆ విసనికర్రె వాళ్ల జీవనాధారం..కానీ అప్పట్లో మనకి ఆసంగతి అర్ధం కాలేదు, పైగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ల వెనకాల తిరగడం లో ఎన్ని రిస్కులనీ..) కళ్ళముందు గుండ్రాలు గుండ్రాలుగా ఫ్లాష్ బ్యాక్ పూర్తి అవ్వడంతో 'నెమలికన్ను' అనే పేరు డిసైడ్ చేసేసా. గూగులమ్మ వరమివ్వడంతో పని సులువైంది. కాని, అసలుపని అంతా ముందుందని ఎకౌంటు ఓపెన్ చేస్తున్నపుడు అర్ధమైంది. ఎన్నెన్నో సందేహాలు. ముందుగా మొదలు పెట్టేద్దాం, నెమ్మదిగా మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకుని, 'సాహసం సేయరా డింభకా..' అన్న'పాతాళభైరవి' మాంత్రికుడి మాట గుర్తు చేసుకుని మొదలు పెట్టేసా. సాయం చేయడానికి మీరంతా ఉన్నారు కదా.

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అక్షింతలు తెమ్మనడం భావ్యం కాదు కాబట్టి అవి లేకుండానే ఆశీర్వదించేయండి..

13 కామెంట్‌లు:

  1. శేషశాయి ఒంగోలు
    --భాగ్యనగరం నుంచి
    ఆసక్తికరంగా ఉంది. కాలం ఈక లాగ ఎగిరిపొయింది. కన్ను నన్ను చూసి నవ్వింది. గతం నెమరు వేసుకునే అవకాశాన్ని మీరు కలిగించారు.
    కొనసాగించండి మీ కలం కలలన్నింటినీ తిరిగి ముందుంచగలదు.
    నే కూడా కొత్త బ్లాగరిని
    చదువుతున్నా ( ఇప్పటిదాక . రాయలేదు యేమీ )

    రిప్లయితొలగించండి
  2. మంచి బ్లాగు శీర్షిక. కానివ్వండి.

    రిప్లయితొలగించండి
  3. @శేషసాయి గారు, కత్తి మహేష్ కుమార్ గారు: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మేము తాటాకు ఈనెలకి వుండే గోధుమరంగు ధూళి/రజను వంటిది మేతగా వేసేవాళ్ళం మా ఈకలకి. దీనితో పాటు రేడియోలోకి బుల్లి బుల్లి మనుషులు చిన్న చిన్న నిచ్చెలనలు వేసుకు ఎక్కుతారని వంతులు వేసుకుని ఉదయం, రాత్రులు నిఘావేసేవాళ్ళం. ఈకలూ పెరగలేదు, ఆ మనుషులు కనపడలేదు ఎంచేతో? ;)

    రిప్లయితొలగించండి
  5. @ఉష: ఎందుకంటే ఈలోగా మనం పెరిగి పెద్దయిపోయామండీ.. ఇంకొన్నాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటే చూసేవాళ్ళమేమో... ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. మీ బ్లాగ్ "నెమలి కన్ను" చూడగానే -నెమలి కన్ను ని క్లాసు పుస్తకాలో భద్రం గా పెట్తోకొనే వాడ్ని చిన్నప్పుడు
    చాలా బావుండేది
    మీ బ్లాగు ఇప్పుడు ఈతరం లో కూడా ప్రచురించారు కదా..అభినందనలు

    రిప్లయితొలగించండి
  7. పాత టపాలకి ఇప్పుడు వ్యాఖ్యలేమిటి?అనుకుంటున్నారేమో..మరి నేనో కొత్త బ్లాగర్ని కదా.తీరిక దొరికినప్పుడు అందరి పాత టపాలూ చదువుతున్నాను.నెమలికన్ను గురించి పోస్టు చూడగానే నాకు చిన్నప్పుడు క్లాసుపుస్తకాల్లో నెమలీకల్ని దాచుకోవటం,అవి పిల్లల్ని పెడతాయని పెన్సిలు చెక్కుని దాంట్లో ఉంచటం...అన్నీ గుర్తుకు వచ్చాయి.నాకూ నెమలీకలంతే భలే ఇష్టం.గోడమీద క్రిష్ణుడి పొస్టర్ పక్కల్న,ఫ్లవర్ వాజ్లో అన్నింటిలొ నెమలీకలే.నాదగ్గర ఎప్పుడూ ఒక బంచ్ నెమలీకలు ఉంటూఉంటాయి.

    రిప్లయితొలగించండి
  8. @హరే కృష్ణ: ధన్యవాదాలు
    @తృష్ణ: వ్యాఖ్య అన్నది మన అభిప్రాయం చెప్పదానికండి.. కొత్త, పాత ఏమీ లేదు.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. అచ్చంగా స్నిగ్ధకౌముది కోసం నేను పడ్డ కష్టం లాగే వుందండీ..

    రిప్లయితొలగించండి
  10. మీ మొదటి టపాలో...మీకు నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు మురళిగారు..ఎందుకంటే మీ ఫోస్ట్ లు కూడా మీలాగే దినదినాబివృద్ధి చెందాలని నా కోరిక..

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. ఈ ప్రయాణం వెయ్యి పోస్టుల దాకా .. ముహూర్తం మంచిది మురళీ గారూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూ అనుకోలేదండీ.. ఇంకా రాయాలనే ఉంది.. చూద్దాం.. మీ తోడ్పాటుకి ధన్యవాదాలు.. 

      తొలగించండి