సోమవారం, మే 09, 2022

వేయిపడగలు నేడు చదివితే

'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ అశువుగా చెబుతుండగా సోదరుడు వెంకటేశ్వర్లు 28 రోజుల్లో 999  అరఠావుల మీద  రాయడం పూర్తి చేసిన నవల 'వేయిపడగలు'. అచ్చులో కూడా ఈ పుస్తకం బరువు సుమారు వెయ్యి పేజీలకి దగ్గరగా ఉంటుంది. అయితే గడిచిన ఎనభై ఏళ్లలో ఈ నవల మీద వచ్చిన విమర్శని లెక్కిస్తే వేయి పేజీలు ఎప్పుడో దాటేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఈ నవలని గురించి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూ ఉండడమే 'వేయిపడగలు' ప్రత్యేకత. ఈ నవలపై కల్లూరి భాస్కరం తాజాగా వెలువరించిన విమర్శ వ్యాసాలకి పుస్తక రూపం 'వేయిపడగలు నేడు చదివితే'. సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం 'వేయిపడగలు' మీద రాసిన విమర్శని విశ్లేషిస్తూ భాస్కరం రాసిన వ్యాసాలు, ఈ నవలని ప్రఖ్యాత ఆంగ్ల నవల 'గాన్ విత్ ది విండ్' తో పోలుస్తూ రాసిన వ్యాసాల పరంపరని కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు 'అస్త్ర బుక్స్' వారు. 

మొత్తం పదహారు వ్యాసాలున్న ఈ పుస్తకంలో తొలి ఏడు వ్యాసాలూ ఆర్.ఎస్. సుదర్శనం విమర్శని ఆధారంగా చేసుకుని రాసినవి. తొలి వ్యాసం 'బాహ్యమిత్రుని వెతుకులాట' లో సుదర్శనానికి విశ్వనాథ పట్ల ఉన్న కుతూహలాన్ని గురించి వివరిస్తూనే, ఆయన బ్రాహ్మణేతరుడైనందువల్ల విశ్వనాథని, వేయిపడగలునీ పైనుంచి మాత్రమే పరిశీలించారని, తాను (భాస్కరం) లోతుగా చూడగలిగాననీ ధ్వనించారు. వంటని రుచిచూసి చెప్పడానికి వంటవాడే అయి ఉండాలా? అనే ప్రశ్న ఇక్కడ సందర్భమూ, అసందర్భమూ కూడా. సుదర్శనం పరిశీలనల నుంచి భాస్కరం చేసిన గమనింపులూ, వాటికి చేసిన వ్యాఖ్యానాలూ మిగిలిన వ్యాసాల మీద ఆసక్తిని పెంచాయి. 'రవీంద్రుడు ఎన్నిమెట్లు ఎక్కారో విశ్వనాథ అన్నిమెట్లు దిగారు' అన్నది రెండో వ్యాసం శీర్షిక. ఇది సుదర్శనం చేసిన వ్యాఖ్యే. ఈ వ్యాఖ్యతో భాస్కరానికి పేచీ లేదు, ఆమోదమే. 'మాలపల్లి' తో సుదర్శనం తెచ్చిన పోలిక ఆసక్తిగా అనిపించింది. 

'వేయి ప్రశ్నల పడగలు' అనే మూడో వ్యాసంలో  'వేయిపడగలు' నవల కథానాయకుడు ధర్మారావు జీవిత చరిత్ర అని తేల్చారు, సుదర్శనం విమర్శ వ్యాసాల ఆధారంగానే. 'ధర్మారావు గెలిచాడు' అన్న నాలుగో వ్యాసాన్ని "ఇప్పుడు గనుక ధర్మారావు చరిత్రని తిరగరాస్తే అది ఒక విజేత చరిత్ర అవుతుంది" అన్న ఆశ్చర్యకరమైన ప్రతిపాదనతో ముగించారు. ఐదో వ్యాసం 'అతనిలో ఒక అపరిచితుడు' లో ధర్మారావు పాత్రని లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించారు. దీనికి కొనసాగింపుగా  'అతని ఊహా వైపరీత్యం', 'జ్ఞానానికి అడ్డుగోడ', 'భయపెట్టే నిర్లిప్తత' అనే మూడు వ్యాసాలు రాశారు. చివరి వ్యాసం 'విశ్వనాథ-గోపీచంద్' లో ధర్మారావుని, గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర' కథానాయకుడు సీతారామారావుతో పోల్చి గుణ(?)దోషాలు ఎంచారు. 

ఎవరైనా విమర్శకులు ఓ రెండు పుస్తకాల్ని పోలుస్తూ విమర్శకు పూనుకున్నప్పుడు, వారికి ఆ రెండు రచనలమీదా సమభావం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి 'వేయిపడగలు-గాన్ విత్ ద విండ్ పోలికలు-తేడాలు' అధ్యాయంలో రాసిన ఏడు వ్యాసాలూ. ప్రపంచ ప్రఖ్యాత నవలల్లో ఒకటైన 'గాన్ విత్ ద విండ్' భాస్కరానికి బాగా నచ్చడంతో ఆశ్చర్యం లేదు. అయితే, ఆ రచనని 'పెద్దగీత' గా చూపేందుకు 'వేయిపడగలు' ని ఎంచుకోవడమే ఆశ్చర్యం. 'వేయిపడగలు' లో చర్చించిన ప్రధాన విషయం చాతుర్వర్ణ వ్యవస్థ. 'గాన్ విత్ ద విండ్' కథంతా 'ప్లాంటర్స్' వర్గం చుట్టూ తిరుగుతుంది. ఒక కులాన్ని, వర్గంతో పోల్చడం, అలా పోల్చి  'గాన్ విత్ ద విండ్' గొప్ప నవల, విశ్వనాథ కన్నా మిచెల్ మార్గరెట్ గొప్ప రచయిత్రి అని నిరూపించడం కోసం ఏకంగా ఏడు వ్యాసాలు రాశారు. 

ఈ వ్యాసాలు రాయడం వెనుక ఉన్న కృషి, చేసిన పరిశీలన అభినందనీయమే. అయితే, మందారాన్నీ, గులాబీని పోల్చి చూసి, గులాబీ గొప్ప పుష్పం అని చెప్పడంలా అనిపించింది చదవడం పూర్తిచేశాక. ఇంతకీ ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు రాసినట్టు? జవాబు ముందుమాటలో దొరికింది: "భారతీయ సమాజ, రాజకీయ, సాంస్కృతిక చక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలన కాలం నుంచీ, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రభావాలను కోల్పోయాననుకుని దుఃఖానికి, నిరాశా, నిస్పృహలకూ లోనవుతూ వచ్చిన భారతీయ సమాజంలోని ఒక ప్రాబల్య వర్గం - ఇప్పుడు వాటి నుంచి బయటపడి కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో - ప్రత్యేకించి గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు"

పాలకులుగా స్వదేశీయులున్నా, విదేశీయులున్నా, బాగుపడింది, బాగుపడుతూ వస్తున్నదీ ఈ ప్రాబల్య వర్గమే అనే బలమైన విమర్శ ఈ విమర్శకుడి చెవిన పడలేదా? ఈ వర్గానికి గత వందేళ్లలో ఒరగనిది, ఇప్పుడు కొత్తగా ఒరుగుతున్నదీ ఏమిటో వివరంగా చెప్పి ఉంటే బాగుండేది. "విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయిపడగలు' - దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్ష దశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్ష దశలో ఈ బృహన్నవల చదివితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా, నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల స్థానంలో నేటి విజయ దరహాసపు వెన్నెల వెలుగులు దర్శించడం ఎలా ఉంటుంది? ఆ దిశగా ఆలోచనలను నడిపించడానికి ఈ వ్యాసాలలో ప్రయత్నించాను". ఇదే రచయిత "కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తానొక్కడే తప్ప సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు" (పేజీ 52) అని ప్రతిపాదించారు!

"ధర్మారావుల నేటి విజయ గాధను పొందుపరుస్తూ వారి శుక్లపక్ష దశను ప్రతిబింబిస్తూ వేయిపడగలకు సీక్వెల్ రాయవలసిన సందర్భం వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను.." ధర్మారావు ఇప్పుడు పుట్టి ఉంటే బహుశా బీఏ బదులు బీటెక్ చదివి ఉండేవాడు. సుబ్బన్నపేట నుంచి కదలడానికి ఇష్టపడడు కాబట్టి ఏదన్నా 'వర్క్ ఫ్రం హోమ్' ఉద్యోగం దొరికి ఉంటే చేసి ఉండేవాడు.  కానీ, అతను కలగన్నట్టుగా సుబ్బన్నపేటకి దివాను అయ్యే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించడం లేదు. అలా ముందుమాట లోనూ కొంచం అస్పష్టత కనిపించింది. ('అస్త్ర' ప్రచురణ, పేజీలు 181, వెల రూ. 225, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు). 

5 కామెంట్‌లు:

 1. విశ్వనాధ గారి ధర్మారావు జీవితంలో అందరిలాగానే కలలు గంటాడు, వచ్చిన వాటిని తీసుకుని జీవిస్తాడు. అంతేగానీ తానేదో గొప్ప పనులు చేయాలనీ కీర్తి సంపాదించాలనే ప్రయత్నాలేమీ లేవు. మన అందరి లాగానే కాలమనే నౌకలో జీవితమనే సముద్రం పైన ఆటు పోట్లతో ప్రయాణించాడు తప్పితే అతనిది ఒక విజయ గాధ క్రింద చెప్పలేము అని నేను అనుకుంటాను.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విజయగాధ అని ఈ పుస్తక రచయిత కూడా భావించలేదండీ... కాకపోతే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ధర్మారావుకి అనుకూలంగా ఉన్నాయి అన్నారు. ఎలా అనుకూలం? అన్న సందేహం నాది.. ..ధన్యవాదాలు.. 

   తొలగించు
 2. కల్లూరి భాస్కరం గారి దృక్కోణం ఏమీ ఆశ్చర్యాన్ని కలిగించదు. భారతీయమైనదని మనవాళ్ళు భావించే ప్రతివస్తువూ విషయమూ భావనా ఐతే ఏదో ఒక విదేశీ మూలాలనుండి వచ్చినదైనా అయ్యుండాలనో లేదా ఏదో ఒక విదేశీవస్తువిషయభావనలకన్నా నాసిరకం అయ్యుండాలని నిరూపించటం కోసం ఆయన అహరహమూ ఏవేవో వ్రాస్తూనే ఉంటారు. రవీంద్రుడు ఎక్కిన మెట్లగురించీ విశ్వనాథ దిగిన మెట్ల గురించీ నాకు తెలియదు కానీ భాస్కరం గారు మాత్రం విదేశీగడపల మీదనే తారట్లాడుతూ ఉంటారు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఓ డోలూ, చిడతలు పట్టుకోనివాయించాలేగానీ ఇలా మనదాన్ని చీపుగా చూస్తాడా? హన్నా!

   తొలగించు
  2. పీవీ నరసింహారావు 'ది ఇన్సైడర్' కి తెలుగు అనువాదం 'లోపలి మనిషి' మినహా ఈయన ఇతర రచనలేవీ చదవలేదండీ నేను.. నిజానికి 'వేయిపడగలు' (ఆమాటకొస్తే ఏ రచన అయినా) విమర్శకి అతీతం కాదు. (ఇంకా అనేక విషయాలతో పాటు, విశ్వనాథకి ధర్మారావు మీద ఉన్న ప్రేమని భరించడం చాలా కష్టం.) విమర్శకి ఎంచుకున్న విషయాలు, సమకాలీన రాజకీయాలతో ముడిపెట్టాలనే ప్రయత్నం, ప్రయాస నిరాశపరిచాయి. ..ధన్యవాదాలు..

   తొలగించు