బుధవారం, మే 04, 2022

రాసుకోడానికో చోటు

స్థానిక రాజకీయ మరియు సినిమా వార్తల పట్ల విరక్తి చెంది, ప్రపంచం ఎటుపోతోందో చూసొద్దాం అనుకుంటూ అంతర్జాతీయ వార్తలు బ్రౌజ్ చేస్తూంటే కనిపించిన 'రాయిటర్స్' వార్త ఆకర్షించడమే కాదు, వెంటనే చదివేసి ఆతర్వాత ఆగి కాసేపు ఆలోచించేలా చేసింది. అది జపాన్ రాజధాని టోక్యో నగరంలో నడుస్తున్న ఓ కెఫె గురించి. 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' పేరుతో ఈ కాఫీషాపుని నడుపుతున్నది తకువా కవాయ్ అనే రచయిత. ఇక్కడ పది సీట్లు రచయిత(త్రి)ల కోసం రిజర్వు చేయబడ్డాయి. వాళ్ళ రచన ఏదైనా సరే, ఈ కెఫె లో కూర్చుని రాసుకోవచ్చు. మధ్య మధ్యలో కావాల్సినన్ని టీ కాఫీలు సేవించవచ్చు.  ఇది చదువుతూ ఉంటే సాహిత్య ప్రపంచంలో ఓ సంచలనాన్ని నమోదు చేసిన 'హ్యారీ పోటర్' సిరీస్ లో మొదటి పుస్తకాన్ని అప్పట్లో పేదరాలైన జేకే రౌలింగ్ ఓ కాఫీ షాపులో కూర్చుని రాసిన విషయం గుర్తొచ్చింది. 

జపాన్ కెఫె దగ్గరికి వస్తే, కాఫీ టీ లతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసునీ అందిస్తోంది రచయితలు, ఎడిటర్ల కోసం. రచయితలు చేయాల్సిందల్లా తమ పేరుతో పాటు, ఏం రాయాలనుకుంటున్నారో ఆ వివరం, ఉజ్జాయింపున ఎన్ని గంటల్లో రాయడం పూర్తి చేద్దామనుకుంటున్నారో రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత పనిని సకాలంలో పూర్తి చేయడానికి అక్కడ అందుబాటులో ఉన్న మూడు రకాల సేవల్లో ఒకదానిని ఎంచుకోవాలి. మొదటిది 'మైల్డ్', రెండోది 'నార్మల్', మూడోదేమో 'హార్డ్'. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రకమైన సేవలు లేకపోబట్టి కదా అల్లసాని వారు నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము వగయిరాలు కోరుకున్నారు తన కావ్య సృష్టికీ అనిపించేసింది. అయినా, ఈ సేవలేవీ రాక పూర్వమే ఆధునిక జపాన్ నుంచి 'మురకామి' లాంటి గొప్ప రచయిత ఉద్భవించలేదూ? 

'మైల్డ్' సేవలు ఎంచుకున్న రచయితలు చెప్పిన గడువు లోపల రచన పూర్తి చేశారా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు కెఫె వారు. 'నార్మల్' కనుక ఎంచుకుంటే, గంటకోసారి వచ్చి, పలకరించి, ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక 'హార్డ్' వారి పరిస్థితి చదువుతుంటేనే గుండె గుభేల్ మంది. కెఫె స్టాఫు తరచూ వచ్చి వీరి వెనుక నిలబడుతూ ఉంటారట, మన రామయ్య మెస్సు, సుబ్బయ్య హోటలు లాంటి చోట ఓ బంతి వాళ్ళ భోజనాలు అవుతూ ఉండగానే, టోకెన్లు కొనుక్కున్న తర్వాతి బ్యాచి వాళ్ళు వచ్చి కుర్చీల వెనకాల అసహనంగా నిలబడ్డట్టు. ఇదంతా రచయితల్లో బద్ధకం వదిలించి, రాయాలనే వాళ్ళ లక్ష్యం పూర్తి చేయించడానికే అంటున్నాడు కవాయ్ మహాశయుడు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు, తగుమాత్రం ఫీజు వసూలు చేస్తున్నాడు రచయితల దగ్గరనుంచి. నేనేమో 'హార్డ్' వాళ్లకి తక్కువ ఫీజు, 'మైల్డ్' వాళ్ళకి ఎక్కువా ఉంటుందేమో అనుకున్నా కానీ, కాదు. 

'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' లో కూర్చుని రాసుకోడానికి మొదటి అరగంటకి 1.01 అమెరికన్ డాలర్ (ర్లు), తర్వాత ప్రతి గంటకీ 2.34 డాలర్లూ చెల్లించాలి. జపాన్ కరెన్సీలో మొదటి అరగంటకి 130 యెన్ లు, తర్వాత ప్రతి గంటకీ 300 యెన్ లూ అన్నమాట. టేబులు, కుర్చీతో పాటు టీ, కాఫీలు, ఇంటర్నెట్టూ, త్వరగా రాసేందుకు దోహదం చేసే సిబ్బంది సేవలూ (?) ఉచితమే. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కొత్త వింతలు క్షణాల్లో 'వైరల్' అవ్వకపోతే కదా ఆశ్చర్య పోవాలి. యుగ ధర్మాన్ని అనుసరించి ఈ కెఫె వార్త టోక్యోని చుట్టేసింది. రచయితలు క్యూ కట్టేశారు. "మా సేవల వల్ల చాలామంది ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న రచనల్ని కొన్ని గంటల్లో పూర్తి చేసేస్తున్నారు" అనడమే కాదు, అలా పూర్తి చేసిన వాళ్ళ జాబితానూ ప్రదర్శిస్తున్నాడు కవాయ్. 

ఎమికో ససాకి అనే బ్లాగర్ ఈ కెఫె సేవల్ని ఉపయోగించుకుని మూడే గంటల్లో ఏకంగా మూడు బ్లాగు పోస్టులు రాసేసిందట. దృష్టిని మరల్చే ఇతరత్రా ఆటంకాలేవీ లేవు కాబట్టి రాయడం మీద గురి కుదుర్చుకో గలిగిందట. ఈవిడ 'హార్డ్' కేటగిరీ సేవల్ని ఎంచుకుని ఉంటుందని నాకెందుకో బలమైన సందేహం కలిగింది. రెండేళ్ల క్రితం వరకూ లైవ్ స్ట్రీమింగ్ వ్యాపారం చేసిన కవాయ్, కోవిడ్ రెండేళ్ళూ ఖాళీగానే గడిపి (రచయిత కదా, ఏవో రచనలు చేసే ఉంటాడు), ప్రపంచం కాస్త కుదుట పడ్డాక ఇదిగో ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. "ఇక్కడి నుంచి ఎలాంటి రచనలు రాబోతున్నాయో నాకు తెలీదు. కానీ, అందరూ చదివే రచనలకి నావంతు మద్దతు పలకడం గర్వంగా ఉంది" అని జాపనీస్ లో సంతోషపడ్డాడు కవాయ్. కెఫె కి వచ్చే రచయితలు అక్కడి సేవల్ని మెచ్చుకుంటూ, మామూలుగా ఒక రోజు పట్టే రచనని మూడు గంటల్లో పూర్తి చేసేయగలుగుతున్నామనీ, మూడు గంటలు పట్టే రచన గంటలోనే పూర్తైపోతోందనీ చెబుతున్నారట. 

సహజంగానే నాకు ఇండియాలో ఇలాంటి కెఫె ఎవరైనా మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలైంది. మన దగ్గర రాసే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, దాన్నో పూర్తి స్థాయి వ్యాపకంగా చేసుకున్న వాళ్ళు బహు తక్కువ. రచనల ద్వారా బాగా ఆర్జించే సినిమా వాళ్ళు వగయిరాలది అంతా భారీ వ్యవహారమే. స్టార్ హోటళ్లు, రిసార్టులు కావాలి కానీ, ఇలాంటి చిన్న ఏర్పాట్లు కాదు. చిన్న, సన్నకారు రచయితలకి ఇప్పటికే స్వీయ ప్రచురణ ఖర్చులు తలకి మోపెడు, ఇంకా ఈ 'రాత' ఖర్చు కూడానా? ఎడిటింగ్ అనే (ప్ర)వృత్తి దాదాపు అంతరించిపోతోంది, కాబట్టి వాళ్ళకీ అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్తే, వారేమన్నా ఓ బిజినెస్ మోడల్ గా స్వీకరించే వీలుందా? దగ్గర ఆగాయి నా ఆలోచనలు ప్రస్తుతం. (నా ఉటంకింపులు లేకుండా వార్తని వార్తగా ఇక్కడ చదవొచ్చు). 

5 కామెంట్‌లు:

  1. పూరీ జగన్నాధుడు బ్యాంకాక్ పోయి వ్రాసుకుంటాడట కదా, ఇస్మార్ట్ శంకర్ లాంటి కళా ఖండాలు పుట్టుకొచ్చాయి మరి...లైగర్ కోసం వెయిటింగ్ !?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'శివమణి' తర్వాత పూరీ సినిమాలేవీ థియేటర్లో చూడలేదండీ.. టీవీలో కూడా 'నేనింతే' ఒకటే చూసిన జ్ఞాపకం. అతగాడి బ్యాంకాక్ అభిమానం గురించి చదివాను.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. "గన్ననుకున్నావా, పెన్నే " అని బుజ్జగించి మరీ రాయిస్తారన్నమాట .. బావుంది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతేనండీ.. ఓ ట్రిప్ వేసే ప్లానేమన్నా ఉందా? (ఏంలేదు, వాళ్ళ పుణ్యాన మళ్ళీ బ్లాగ్ రాస్తారేమో అని) ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. : )

      కానీ ఏమాటకామాటే నాక్కూడా స్టార్బక్స్ అలానే బార్న్స్ అండ్ నోబుల్ , ఈ రెండు చాలా ఇష్టమైన ప్రదేశాలు రాసుకోవడానికి . అప్పుడప్పుడు పబ్లిక్ లైబ్రరీ .

      ఇంట్లో మాత్రం బద్ధకం వైఫై లా నా చుట్టూ ఆవరించుకొని ఉంటుంది . పైగా చుట్టూ చూస్తే చేయాల్సిన పనులు బోల్డు గుర్తుకొస్తుంటే కీబోర్డు పై వేళ్లెలా కదులుతాయి?

      తొలగించండి