ఆమె పేరు శ్రీలత. చిత్తూరు జిల్లా భాకరాపేట ఆమె స్వస్థలం. కుటుంబానికి ఉన్న సినీ పరిచయాల కారణంగా కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఒకేసారి ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమా. సినిమా కెరీర్ ని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేదో తెలియదు, తెలుగు సినిమా షూటింగ్ లో ఓ సహనటుడు ఆమెని ఇబ్బంది పెట్టి ఉండకపోతే. అతడి ప్రవర్తన ఆమెలో పట్టుదలని పెంచింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ 'రోజా' గా వెలుగొందేందుకు దోహదం చేసింది. ఏ నటుడైతే తొలినాళ్లలో ఆమెని ఇబ్బంది పెట్టాడో, అతడే స్టూడియోల్లో ఆమె వచ్చేవరకూ మేకప్ వేసుకుని ఎదురు చూశాడు. కెమెరా సాక్షిగా ఆమె చేత చెంపదెబ్బలూ తిన్నాడు. తనతో సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. ఇక్కడితో ఆగిపోతే, ఓ సినిమా నటిగా తప్ప ఆమెని గురించి చెప్పుకోడానికి ఇంకేమీ ఉండకపోను. ఆమె ఆగలేదు, రాజకీయాల్లో అడుగుపెట్టింది.
నిజానికి సినీనటిగా రోజాని నేను గమనించింది తక్కువ. అప్పట్లో నేను చూసిన కొన్ని సినిమాల్లో ఆమె కథానాయిక, అంతే. అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చాక మాటల్నీ, చేతల్నీ తెలియకుండానే గమనిస్తూ వచ్చాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి చిలక పలుకులు వినడానికి సరదాగా ఉంటాయి. పెద్దగా సబ్జక్ట్ నాలెడ్జి లేకుండా నాయకుడిని పొగడ్తల్లో ముంచే ప్రసంగాలు చేసి నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే, రోజా ఇందుకు భిన్నం. తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా ఆమెకి తనేం మాట్లాడుతోందో స్పష్టత ఉండేది. స్వతహాగా ఉన్న వాగ్ధాటి, సినిమా ఇమేజి, తక్కువ కాలంలోనే ఆమెకి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కాంగ్రెస్ నాయకులపై ఆమె విసిరే పంచ్ డైలాగులు వింటుంటే ఆమె ఎవరిదో డైలాగ్ రైటర్ సాయం తీసుకుంటోందన్న సందేహం కలిగేది. అయితే, ఆమెకి 'స్పాంటేనిటీ' ఉందన్నది తర్వాత రోజుల్లో అర్ధమైన విషయం. రాజకీయాలని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేది అన్నది మళ్ళీ సందేహమే -- తెలుగు దేశం పార్టీలో ఆమె దారుణమైన అవమానాలు ఎదుర్కొని ఉండకపోతే. పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే, సొంత పార్టీ నాయకులే ఆమెని పోటీ చేసిన చోట ఓడించారు రెండు సార్లు. ఈ పరిస్థితుల్లో పార్టీ వీడింది.
తెలుగు దేశం పార్టీని అవమానకర పరిస్థితుల్లో వీడిన మొదటి నటి రోజా కాదు. అప్పటికే జయప్రదకి ఆ అనుభవం వుంది. అయితే, జయప్రద నాటి పార్టీ పరిస్థితులు, లెక్కలు ఆమెని రాజ్యసభకు నామినేట్ చేసేలా చేశాయి. రోజాకి దక్కింది కేవలం 'తెలుగు మహిళ' అధ్యక్ష పదవి మాత్రమే. పార్టీని వీడిన జయప్రద రాజకీయంగా ఉత్తరాదికి మరలిపోవడంతో ఆమెకి తెలుగు దేశం పార్టీని ఎదుర్కోవలసిన, ఆ పార్టీని గురించి మాట్లాడవలసిన అవసరం కలగలేదు. కానీ, రోజా పరిస్థితి అది కాదు. తొలుత కాంగ్రెస్ లో చేరి, ఆవిర్భావం నాటినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న రోజా పార్టీకి ప్రధాన శత్రువు తెలుగు దేశం పార్టీనే. ఆ పార్టీ నుంచి పొందిన అవమానాల బ్యాగేజీని ఆమె మోస్తూనే ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన పదిహేనేళ్ళకి 2014లో నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికవడం రాజకీయాల్లో ఆమె తొలివిజయం. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలుపొందలేదు. అధికార పార్టీతో ఆమె అసెంబ్లీలోనూ, బయటా తీవ్రంగా పోరాడింది. ఆమె ఏదైనా మాట్లాడితే, తెలుగు దేశం పార్టీ మహిళా నేతలందరూ కలివిడిగానూ, విడివిడిగానూ ఎదురుదాడి చేసేవాళ్ళు.
ఒకానొక సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'లైవ్' లో ఉండడానికి రోజా కారణమైంది అనడం అతిశయోక్తి కాదు. తెలుగు దేశం పార్టీ చేసిన అనేక తప్పులు అధికారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పళ్లెంలో పెట్టి అందించినా, వాటిలో ముఖ్యమైనది రోజా అసెంబ్లీ బహిష్కరణ. ఏ పరిస్థితులు ఆమె బహిష్కరణకి దారితీశాయన్నది ఇవాళ్టికీ స్పష్టంగా తెలియదు. కానీ, ఆ బహిష్కరణని సవాల్ చేస్తూ ఆమె చేసిన పోరాటం మాత్రం గుర్తుండిపోయింది. ఒక సెక్షన్ వోటర్లని ఆమె పార్టీకి దగ్గర చేసింది. మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పార్టీ విజయ దుందుభి మోగించి అధికారంలోకి వచ్చింది. ఆమెకి మంత్రి పదవి తధ్యం అనుకున్నారందరూ. 'హోమ్' శాఖని కేటాయించనున్నారని రూమర్లూ షికారు చేశాయి. రోజాకి మంత్రి పదవి రాకపోవడం ఆమె కన్నా ఎక్కువగా రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. మరో మూడేళ్ళ తర్వాత, అనేక నాటకీయ పరిణామాల అనంతరం మాత్రమే ఆమెకి మంత్రి పదవి దక్కింది.
రోజా మీద వినిపించే ప్రధానమైన విమర్శ రాజకీయాల్లో హుందాతనం పాటించదనీ, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు టీవీ కామెడీ షోలలో కనిపిస్తుందనీను. 'ఇదే విషయాన్ని ఈమె మరికొంచం హుందాగా చెప్పి ఉండొచ్చు' అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానైతే, ఆమె ఒక్కర్తీ హుందాగా ఉంటే సరిపోతుందా, లేక మొత్తం రాజకీయాల నుంచి ఏనాడో మాయమైపోయిన హుందాతనం మళ్ళీ తిరిగి రావడం బాగుంటుందా? అదీకాకుండా, తన ప్రత్యర్థులకు అర్ధమయ్యే భాష అదేనని ఆమె భావిస్తోందా? ఎడతెగని ప్రశ్నలు. ఇక టీవీ షోల విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు మాటలు, పాటలున్న సినిమాల్లో హీరోగా నటిస్తూ, తెరనిండా నెత్తురు పారిస్తున్న వారి విషయంలో ఈ అభ్యంతరం ఎందుకు వినిపించదు? ఆమె మహిళ కావడం వల్ల ఆమె నుంచి కొంచం ఎక్కువగా ఆశిస్తున్నారా? పురుషుడై ఉంటే షోల విషయంలో అభ్యంతరాలు ఉండేవి కాదా? ఇవీ ఎడతెగని ప్రశ్నలే. "టీవీ షోలు మానేస్తున్నా" అంటూ ఆమె చేసిన తాజా ప్రకటనతో ఈ రెండో విమర్శకి ఇకపై తావుండక పోవచ్చు.
ఇంతకీ, మంత్రిగా రోజా ఏం చేయబోతోంది? ఒక ప్రాంతీయ పార్టీలో (ఆ మాటకొస్తే ఏ పార్టీలో అయినా) మంత్రిగా ఉన్నవాళ్ళు చేయగలిగేది ఏం ఉంటుంది? ఏదన్నా మంచి జరిగితే దాన్ని ముఖ్యమంత్రి ఖాతాలో వేయడం, చెడు జరిగితే, తప్పని పరిస్థితులు ఎదురైతే, బాధ్యత వహించడం. ఇప్పటి వరకూ చూస్తూ వస్తున్నది ఇదే కదా. వారసత్వం పుణ్యమా అని చులాగ్గా మంత్రులైపోయి, బోల్డంత స్వేచ్ఛని అనుభవించిన వాళ్ళే ఏ ముద్రా వేయలేకపోయిన పరిస్థితుల్లో, అనేక పరిమితుల మధ్య స్వల్పకాలం పదవిలో ఉండే ఈమె నుంచి అద్భుతాలు ఆశించగలమా? పోనీ గడిచిన మూడేళ్ళనే తీసుకున్నా, 'ఇది ఫలానా మంత్రి చేపట్టిన కార్యక్రమం' అని చెప్పుకోడానికి ఏముంది? చెక్కులిచ్చే ఫోటోల్లో ముఖ్యమంత్రి వెనుక నిలబడ్డం మినహా ఎవరూ చేసిందేమీ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. కాబట్టి, మంత్రిగా రోజా ఏదో చేసేయబోతుందనే భ్రమలేవీ లేవు. ఓ దెబ్బ తిన్నప్పుడో, అవమానం ఎదురైనప్పుడో అక్కడే ఆగిపోకుండా, పట్టు వదలకుండా, ఓర్పుగా పోరాడితే విజయం సాధించవచ్చు అనే సత్యాన్ని మరోమారు చెబుతుంది ఆమె కథ.
రోజా గారు, రజని గారు ఏనాడు మంత్రి పదవులు ఆశించలేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టే వారి మంత్రి పదవులు ఇచ్చారు.
రిప్లయితొలగించండిఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోయినా నవ్వుతూ పార్టీ కోసం పనిచేస్తారు. అసంతృప్తి నాయకుల లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళరు... రోజా, రజని లాంటి మహిళ నాయకులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారు..
ఈమధ్య కాలంలో రజని లక్కియెస్ట్ పొలిటీషియన్ అండీ.. రాజకీయాల్లోకి వస్తూనే ఎమ్మెల్యే, గెలిచిన మూడేళ్లకే మంత్రి పదవి.. కానీ రోజా వేరు, మొదటి నుంచీ ఆమె స్ట్రగుల్ అవుతూనే ఉంది.. పదవిరాకపోతే ఎలా స్పందిస్తారు అన్నది ఊహకి అందదు.. చెప్పలేమండీ, చుట్టూ ఉన్నవాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది కదా.. ధన్యవాదాలు..
తొలగించండి