శుక్రవారం, జనవరి 30, 2015

కృష్ణారెడ్డిగారి ఏనుగు

కర్ణాటక పర్వత ప్రాంతంలో అటు ధర్మస్థల కీ ఇటు కూనూరుకి మధ్య ఉన్న చిన్న పట్టణం మూడిగెరె. గూళూరు మఠం కూడా బాగా దగ్గరే ఈ పట్టణానికి. మూడిగెరెలో చిన్నకీ, పెద్దకీ, అటు ప్రభుత్వ శాఖల వాళ్ళకీ, ఇటు స్థానిక నేతలకీ అందరికీ ఒకటే సమస్య.. కృష్ణారెడ్డి గారి ఏనుగు. ఆ ఏనుగు ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళందరూ సాదరంగా ఆహ్వానించిన వాళ్ళే. అయితే, రానురానూ ఆ ఏనుగు వాళ్ళకో సమస్యగా మారిపోయింది. వాళ్ళకే కాదు, యజమాని కృష్ణారెడ్డి గారిక్కూడా సమస్యై కూర్చుందా ఏనుగు. ఆయొక్క ఏనుగు కథా కమామిషే కన్నడ రచయిత స్వర్గీయ పూర్ణచంద్ర తేజస్వి (విఖ్యాత రచయిత కువెంపు తనయుడీయన) కన్నడంలో రాసిన కథకి, శాఖమూరు రామగోపాల్ తెలుగు అనువాదం 'కృష్ణారెడ్డిగారి ఏనుగు.'

బొత్తిగా మనుషుల పొడ తెలియనిదేమీ కాదు ఏనుగు. గూళూరు మఠంలో జనం మధ్యనే పుట్టి పెరిగింది. జగద్గురువు ఊరేగింపుకి ఏనుగుని కాక, జనం మోసే పల్లకీని వినియోగించడంతో ఏనుగుకి అక్కడ బొత్తిగా పని లేకుండా పోయింది. ఏనుగుని పోషించడం కన్నా, తాగుబోతైన మావటి వేలాయుధంని భరించడం కష్టమయ్యింది వారికి. ఫలితం, ఏనుగుని అమ్మకానికి పెట్టేశారు. అప్పటికే చాలా వ్యాపారాలు చేసి అన్నింటిలోనూ నష్టాలే రుచి చూసిన కృష్ణారెడ్డి గారు ఆ ఏనుగుని కొనుక్కున్నప్పుడు మూడిగెరెలో అందరూ ఆయన్ని చూసి జాలిపడ్డ వాళ్ళే. వేలాయుధంతో సహా ఏనుగుని మూడిగెరె తీసుకొచ్చారు కృష్ణారెడ్డిగారు.

ఏనుగు వచ్చిన వేళా విశేషం, కృష్ణారెడ్డి గారికి కలిసొచ్చింది. అడవిలో కలప కొట్టే కాంట్రాక్టర్లకి ఏనుగు సేవలు అవసరం. పెద్దపెద్ద చెట్లు పడగొట్టడం, అడవి నుంచి లారీల దగ్గరకి మోసుకు రావడం మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఇదిగో, తను కొన్న ఏనుగుని ఆ పనుల నిమిత్తం అద్దెకి తిప్పడం ద్వారా ఆర్జించడం మొదలు పెట్టారు కృష్ణారెడ్డిగారు. మొదట్లో ఊళ్ళో వాళ్ళు ఏనుగుని ఆదరంగానే చూశారు. కూరలు, పళ్ళు దుకాణాల వాళ్ళు మిగిలిపోయిన సరుకుని ఏనుగు కోసం ప్రత్యేకంగా  అట్టే పెట్టే వాళ్ళు. ఏదో వేళ ఊళ్ళో విహారానికి వెళ్ళిన ఏనుగు వాటిని భోంచేసి వచ్చేది. ఎంత మనుషుల మధ్య పెరిగిన ఏనుగే అయినా మనుషుల్లా ప్రవర్తించలేదు కదా.. దాని అలవాట్లు దానివి కదా. అవిగో, అవే జనానికి కోప కారణం అయ్యాయి నెమ్మదిగా.

వేలాయుధం వారానికోసారి వాగు దగ్గర కొబ్బరి పీచుతో శ్రద్దగా తోమి స్నానం చేయించినా, ఏనుగుకి అప్పుడప్పుడూ ఒళ్ళు దురద పెట్టక మానదు. అలాంటప్పుడు కనిపించిన స్తంభానికి ఒళ్ళు రాసుకోకా మానదు. ఇలాంటప్పుడే, కరెంటు స్తంభాల తీగలు తెగిపోవడం, లేదా కరెంటు వైర్లు, ఫోను వైర్లు కలిసిపోవడం లాంటివి సంభవించేవి. రెండు డిపార్ట్మెంట్ల లైన్ మెన్లూ మొత్తం లైన్ చెక్ చేసుకుని, బాగు చేసుకోవాల్సి వచ్చేది. ఫోన్ తీగల వల్ల ఒక్కోసారి క్రాస్ టాక్ వచ్చేస్తూ ఉండేది. మూడిగెరె లో ఎవరికీ రహస్యాలు లేవు కాబట్టి, ఎవరి ఫోన్ ఎవరికి వచ్చినా ఆ సమాచారం ఊరంతా తెలిసిపోయేది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే అయితే ఇబ్బంది లేకపోను.


ఓసారి ఏనుక్కి అంబారీ పెట్టి ఊరేగింపు చేస్తూ ఉంటే అంబారీతో సహా అడవిలోకి పారిపోయింది. ఏడెనిమి వేలు ఖరీదు చేసే ఇత్తడి ఆభరణాలతో అలంకరించారు ఏనుగుని. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండడం వల్ల ఏనుక్కి షాక్ కొట్టి పారిపోయిందని ఒకరూ, పిచ్చెత్తి పారిపోయిందని మరొకరూ.. రకరకాలుగా చెప్పుకున్నారు. కొన్నాళ్ళకి ఏనుగు మళ్ళీ కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసింది. అంబారీ అడవిలో మాయమైపోయింది. కృష్ణారెడ్డి గారి ఏనుగు ఆడ ఏనుగు కావడంతో దానికోసం అప్పుడప్పుడూ అడవి నుంచి మగ ఏనుగుల మంద ఊరి మీదకి వచ్చి పడుతూ ఉండేది. మంద వచ్చినప్పుడల్లా ఊరి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది.

ఏనుగుకి పని ఎక్కువగా ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు రెండు లీటర్ల విప్పసారాయిని బహుమానంగా ఇచ్చేవారు. అందులో వేలాయుధం కొంత పుచ్చుకోగా మిగిలింది ఏనుగుకి తాపించేవాడు. ఓసారిలా సారాయి సేవనం అయిన తర్వాత పనికి వెళ్ళాల్సి వచ్చింది. స్మగుల్డ్ దుంగల లారీని సామిల్ నుంచి తరలించే పని కావడంతో రాత్రిపూటే చెయ్యాలి. అటు వేలాయుధం, ఇటు ఏనుగూ కూడా మత్తులో ఉండడంతో పొరపాటు జరిగిపోయింది. దుంగలకి బదులు మొత్తం లారీనే తిరగబెట్టేసింది ఏనుగు. కేబిన్ లో ఉన్న లారీ డ్రైవర్ జరిగింది ఏమిటో తెలియకుండానే  ప్రాణాలు విడిచాడు. మరోసారి, ఏనుగు స్తంభాలని రాసుకోవడంలో ఎలెక్ట్రిక్, టెలిఫోన్ వైర్లు కలిసిపోయాయి. ఈ సంగతి తెలియక పోల్ మీదకి ఎక్కిన టెలిఫోన్ లైన్మెన్ తిప్పణ్ణ కరెంట్ షాక్ తో చనిపోయాడు.

మూడిగెరె ప్రజలకి కృష్ణారెడ్డిగారి ఏనుగు ఓ సమస్యగా మారిపోయింది. ఏనుగుకి పిచ్చి ఎక్కిందేమో అన్న అనుమానం మొదలయ్యింది జనంలో. దానికి తోడు ఊళ్ళో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ధర్మస్థల జైనులు జీవహింస చెయ్యరు కాబట్టి, అక్కడి కుక్కలని రాత్రి వేళల్లో రహస్యంగా లారీలో మూడిగెరె తెచ్చి వదిలేస్తున్నారు. దీనితో ఎటు చూసినా కుక్కలే. కుక్కల సమస్య ఇలా ఉండగానే, గూళూరు మఠంలో ఓ పండితుడు ఏనుగుకి జాతకం చెప్పడం గుర్తొస్తుంది వేలాయుధానికి. ఆ ఏనుగు కారణంగా ఐదు ప్రాణాలు పోతాయని తెలిసిన తర్వాతే మఠం వాళ్ళు ఏనుగుని అమ్మకానికి పెట్టారన్న రహస్యం ఒక్క వేలాయుధానికే తెలుసు.

ఇంతకీ కృష్ణారెడ్డిగారి ఏనుగు కథ ఏమయ్యింది? ఇది తెలియాలంటే అరవై పేజీల అనువాదాన్ని చదవాల్సిందే. ఆపకుండా చదివించే కథనం. ఏనుగు కథ చెప్పే క్రమంలో సమాజనీతికి సంబంధించి, మానవ సంబంధాలని గురించి, వ్యవస్థ పనితీరుని గురించి ఎన్నెన్నో విషయాలని చర్చించారు రచయిత. 'కృష్ణారెడ్డి గారి ఏనుగు' తో పాటు మరో పద్నాలుగు కన్నడ అనువాద కథలున్న సంకలనాన్ని ప్రచురించింది హైదరాబాద్ కి చెందిన అభిజాత్య కన్నడ-తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం. 294 పేజీలున్న ఈ సంకలనం వెల రూ. 100. ప్రతి కథ చివరా రచయిత ఇచ్చిన ఫుట్ నోట్స్ కథల నేపధ్యాన్ని వివరిస్తుంది. కూర్చున్న చోటినుంచి కదలకుండా గ్రామీణ కర్ణాటకమంతా తిరిగి వచ్చే అవకాశాన్నిచ్చే సంకలనం ఇది. కృష్ణారెడ్డి గారి ఏనుగునైతే ఓ పట్టాన మర్చిపోలేం..

2 కామెంట్‌లు:

  1. చదివినదైనా "వెంటనే" మరోసారి చదవాలనిపించేసేలా రాస్తారండీ సమీక్ష. :) గ్రామీణ కర్ణాటక చూడాలనే నా కోరికని మరింత బలపడేలా చేసిందీ కథ.

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: 'సమీక్ష' మరీ పెద్ద మాటేమోనండీ :) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి