మంగళవారం, జనవరి 20, 2015

వడ్ల చిలకలు

కొత్తగా వచ్చిన సబ్-కలక్టర్ అనుపమ చటర్జీ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడు విశ్వనాథం. డిగ్రీ పాసయ్యి, టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకున్నాడు. పైగా బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడాను. కలెక్టర్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగాలున్నాయని దగ్గర బంధువుల  ద్వారా తెలిసి ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. విశ్వనాథం బయో డేటా చూస్తూనే, 'కూర్చో'మని తన ఎదురుగా కుర్చీ చూపించింది అనుపమ. తర్వాత పది నిమిషాల పాటు ఆమే మాట్లాడింది. విశ్వనాథం కేవలం శ్రోత.

ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా మాట్లాడారు విశ్వనాథం కుటుంబ సభ్యులు. ఎవరి మాట నెగ్గింది అన్న ప్రశ్నకి జవాబే తల్లావజ్ఝల పతంజలి  శాస్త్రి రాసిన 'వడ్ల చిలకలు' కథ. చదివేప్పటి పాఠకుల మనఃస్థితిని అనుసరించి ఎన్ని అర్దాలైనా గోచరిస్తాయి ఈ కథలోనూ, ముగింపులోనూ. అనుపమ పక్షాన నిలబడాలా? విశ్వనాథం తల్లిదండ్రుల పక్షాన నిలబడాలా? అన్నది పాఠకులకి ఓ సవాలు.

పర్యావరణవేత్తగా, కవిగా పేరొందిన పతంజలి శాస్త్రి చక్కని కథా రచయిత కూడా. 1990-96 మధ్య కాలంలో శాస్త్రి రాసిన ఇరవై కథల సంకలనమే 'వడ్ల చిలకలు.' సంకలనానికి మకుటంగా ఇచ్చిన శీర్షికతో వచ్చిన కథని గురించి చాలా చర్చే జరిగింది. కొందరు విమర్శకులు ఈ కథకి 'గొప్ప తెలుగు కథల' జాబితాలో చోటిచ్చారు కూడా. 'ఎస్సై నవ్వాడు' కథతో మొదలయ్యే ఈ సంకలనం వంశీకి నచ్చిన 'వైతరిణికీవల' తో ముగిసింది. మెజారిటీ కథలు కాల పరీక్షకి నిలబడేవే. మళ్ళీ, మళ్ళీ చదవాలనిపించేవే.


ఆదర్శాలు మెండుగా ఉన్న ఓ ఎస్పీ దొరగారికి ఓ కూతురు. ఊళ్ళో పేరున్న కాన్వెంట్ లో ఆ అమ్మాయికి సీటు  కావాలి. దొరవారే స్వయంగా వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన ఆ పనిని ఆ ఏరియా ఎస్సై ఎలా చక్కబెట్టాడో చెబుతుంది 'ఎస్సై నవ్వాడు.' పతంజలి 'ఖాకీవనం' కి మరో పార్శ్వంలాగా అనిపించే కథ ఇది. రెండో కథ 'కనకం గట్టెక్కిన వైనము' కూడా పోలీసుల కథే. కాకపొతే కానిస్టేబుళ్ల కథ. ఈ కథతో పాటు, 'అలవాటైన కోతి' కి కూడా మెరుపు ముగింపే ప్రత్యేకత. 'భోక్త' 'రుబ్బురోలు' 'మూడో జన్మ' బ్రాహ్మణ కుటుంబాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు. వీటిలో 'మూడో జన్మ' కథ ముగింపు ఓ చిన్న ఉలికిపాటుని కలిగిస్తుంది.

'వాల్ పోస్టర్-1' 'వాల్ పోస్టర్-2' పేరుతో రెండు కథలు రాశారు పతంజలి శాస్త్రి. ఒకటి పట్టణంలోని ఓ పేద ముస్లిం కుటుంబంలో జరిగిన కథైతే, రెండోది ఏజెన్సీ జరిగిన కథ. జీవిత చిత్రణ పట్ల రచయిత శ్రద్ధ కనిపిస్తుంది. రంగురాళ్ళ తవ్వకం ఇతివృత్తంగా రాసిన 'రంగురాళ్ళు' కథ పాఠకులని ఏజెన్సీ ప్రాంతంలోకి అదాటున తీసుకెళ్ళిపోతుంది. ఓ పల్లెటూళ్ళో రెండు బ్రాహ్మణ కుటుంబాల మధ్య వచ్చిన ఓ చిత్రమైన తగువు ఇతివృత్తంగా రాసిన కథ 'ఒకటీ బై నాలుగు.' ఈ కథకీ మెరుపు ముగింపునే ఇచ్చారు.

'ఎందాకా,' 'సర్మా,' 'బరువు సామాను,' 'జెన్,' 'టై,' 'ప్చ్..హూ..,' 'బొమ్మనేదు' కథలకి ఇతివృత్తం మానవ మనస్తత్వమే.ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో రెండు కథలు 'గ్రాసం' 'వైతరిణికీవల.' మొదటిది బ్రహ్మాండమైన పొలిటికల్ సెటైర్. మళ్ళీ మళ్ళీ చదువుకునే కథ. రెండోది, అంతిమయాత్ర నేపధ్యంగా సాగే కథ. చదవడం పూర్తిచేశాక చాలాసేపు ఆలోచనల్లో పడేస్తుంది. కథా సాహిత్యాన్ని ఇష్ట పడే వారితో పాటు, కొత్తగా కథా రచనలో ప్రవేశించే ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన కథలివి. (త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి