సోమవారం, జనవరి 05, 2015

గణేష్ పాత్రో ...

"విమానం, మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ, నడిపించేవాడిని కొనడం మన తరమా?" మొదటిసారి ఈ ప్రశ్న విన్నప్పుడు నాక్కలిగిన అనుభూతి ఇప్పటికీ జ్ఞాపకమే. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా, అమెరికా నుంచి రావాల్సిన కొడుకు ప్రయాణం చివరి నిమిషంలో కేన్సిలయిన కారణంగా తను షష్టిపూర్తిని రద్దు చేసుకోడానికి సిద్ధపడిన సీతారామయ్యని, మనవరాలు సీత ఆ వేడుకకి ఒప్పించే సన్నివేశం రాగానే ఈ డైలాగు కోసం ఎదురు చూస్తాను నేను. నిజమే, నడిపించేవాడిని కొనడం ఎవరితరమూ కాదు. సీతారామయ్య కొడుకు వాసు విషయంలోనే కాదు, ఆ సినిమాకి సంభాషణలు రాసిన గణేష్ పాత్రో విషయంలోనూ రుజువయిన నిజమది.

కొన్ని కొన్ని పేర్లని విడిగా విన్నప్పుడు అసంపూర్ణంగా అనిపిస్తాయి. పక్కన మరో పేరు చేరినప్పుడే వాటికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. గణేష్ పాత్రో పేరు కూడా అంతే. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే మరో పేరు కె. బాలచందర్. గడిచిన శతాబ్దపు డెబ్భై, ఎనభై దశకాల్లో తెలుగు తెరమీద ఈ ద్వయం చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. బాలచందర్ అరవ ఆలోచనలకి అచ్చ తెలుగు నుడికారాన్ని దిద్దిన రచయిత గణేష్ పాత్రో. అందుకే కాబోలు బాలు, స్వప్న, జానీ, సుహాసిని, బుచ్చిబాబు, విద్య, బేబీ.. ఈ పాత్రలేవీ కూడా పరభాషా దర్శకుడు సృష్టించినవన్న భావన కలగదు. సినిమాకి నేటివిటీని అద్దడంలో సంభాషణలది కీలకపాత్ర మరి.

అయితే, గణేష్ పాత్రో అనే సంభాషణల రచయితని శ్రద్ధగా గమనించింది మాత్రం 'సీతారామయ్య గారి మనవరాలు' నుంచే. ఆ సినిమా తర్వాత, వెనక్కి వెళ్లి పాత్రో రాసిన సినిమాలని 'సంభాషణల' కోణం నుంచి చూస్తే ఎన్నెన్ని మెరుపులో. పాత్రో రాసిన సంభాషణలని పరిశీలించినప్పుడు ఆత్రేయ పెట్టిన ఒరవడిలో ప్రయాణం మొదలు పెట్టి, తనదైన శైలిని అలవరుచుకున్నాడనిపిస్తుంది. సంభాషణల్లో నాటకీయత ఉంటుంది. కానీ, అదెక్కడా శృతి మించి అసలు విషయాన్ని మింగేయదు. 'సినిమా కోసం సంభాషణలు తప్ప, సంభాషణల కోసం సినిమా కాదు' గణేష్ పాత్రో నమ్మిన సిద్ధాంతం ఇదేనేమో అనిపిస్తుంది.


దర్శకుడి ఆలోచనలని ఆకళింపు చేసుకుని, అందుకు అనువుగా సంభాషణలు రాయడం అన్నది అంత సులువుకాదు. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు-సంభాషణల రచయిత అన్న కాంబినేషన్ ఎక్కడో తప్ప మారదు. కొందరు దర్శకులకి, కొందరు రచయితలతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. బహుశా, ఈ సౌకర్యం కారణంగానే చాలామంది రచయితలకి ఎక్కువమంది దర్శకులతో పనిచేసే అవకాశం దొరకదు. కానీ, గణేష్ పాత్రో తన సినీ ప్రయాణంలో పని చేసిన దర్శకులందరూ వైవిధ్యాన్ని కోరుకునే వారే. వెండితెర మీద తమదైన ముద్ర వేసిన వాళ్ళే.

బాల చందర్ తో పాటు, సింగీతం శ్రీనివాసరావు, క్రాంతికుమార్, వంశీ, కోడి రామకృష్ణ, ఇంకా నేటితరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఎవరి శైలి వాళ్ళది. తెలుగు తెరమీద ఎవరి సంతకం వాళ్ళది. వారి వారి అభిరుచులకి అనుగుణంగా సంభాషణలు రాసి మెప్పించిన ఘనత మాత్రం గణేష్ పాత్రోదే. కేవలం సంభాషణలు మాత్రమే కాదు, కొన్ని పాటలూ ఉన్నాయి గణేష్ పాత్రో ఖాతాలో. సీరియస్ సంభాషణలు రాసిన ఈ రచయితే, 'హలో గురూ ప్రేమకోసమేరా జీవితం..' అనే అల్లరి పాటని రాశారంటే ఎంతమాత్రం ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే, పాత్రో సంభాషణల్లో హాస్యానికి ఏమాత్రం కొదవుండదు. 'రుద్రవీణ' సినిమాలో చిరంజీవి, శోభన చెప్పిన పేరు తన వదినకి చెప్పే సన్నివేశం గుర్తుందా? 'ప్రేమించు పెళ్ళాడు' సినిమాలో సంభాషణలు??

మళ్ళీ, 'సీతారామయ్య గారి మనవరాలు' దగ్గరికి వద్దాం. కొడుకు తన పెళ్లి తనే నిర్ణయించుకోడం కన్నా, తనకి ముందుగా చెప్పకపోవడం కోప కారణం అయ్యింది సీతారామయ్యకి. అటు భర్తకీ, ఇటు కొడుక్కీ మధ్య నలిగిపోతోంది జానకమ్మ. అక్కడికీ నోరు పెగుల్చుకుని, "వాడు పుట్టాక చేసిన మొదటి తప్పండీ" అంటుంది భర్తతో. "వాడికోసం నేనూ మొదటిసారే మాట తప్పాను జానకీ" అంటాడాయన. ఇక తిరుగులేదు. కథలో కీలకమైన సన్నివేశంలో అత్యంత సహజమైన ఆర్గ్యుమెంటు.  ఎక్కడ ఏం రాయాలో బాగా తెలిసిన రచయిత పాత్రో. ఒక్కమాటలో చెప్పాలంటే సినీ సంభాషణలకి రిఫరెన్స్, గణేష్ పాత్రో సినిమాలు.

8 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా చెప్పారండి... అన్నట్టు నిన్ననే ఆహుతి ప్రసాద్ కూడా మరణించారు... ఆయన గురించి ఏమీ చెప్పెలెదెంటండి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పాత్రోచితంగా సంభాషణలు వ్రాస్తారని పాత్రో గారికి పేరు.
  సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఇంకో మంచి డైలాగ్ ఉంది. "ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండడమే అందరికీ మంచిది" అని. ఇది నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.
  కాని బాలచందర్ లాంటి దర్శకులతో చక్కటి సినిమాలకి మాటలు వ్రాసిన గణేష్‌పాత్రో, కొన్ని కోడి రామకృష్ణ సినిమాలకి ద్వందార్థాలు ఎందుకు వ్రాసారో అర్థం కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బోనగిరి గారూ పాత్రోచితంగా రాస్తారని మీరేగా అన్నారు.. కోడి వారి పాత్రలకు తగ్గట్టే ద్వందార్థాలు రాయాల్సి వచ్చుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @నాగ శ్రీనివాస: అందరి గురించీ రాయడం లేదండీ.. ధన్యవాదాలు
  @voleti: చూశానండీ.. ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @bonagiri: టైటిల్ కార్డ్స్ లో 'రచనా సహకారం' అని ఓ కార్డ్ ఉంటుందండీ.. ఆత్రేయ టైం లో 'అప్పలాచార్య' ఆ తర్వాత కాలంలో 'బాబూరావు' తదితరులు.. వీళ్ళు కేవలం కామెడీ ట్రాక్స్ మాత్రమే రాసేవారు.. మీరన్న ద్వందార్ధాలు బహుశా ఈ రచనా సహకారం వాళ్ళెవరూ రాసి ఉండొచ్చు. ఒకవేళ పాత్రోనే రాసినా, అది ఆయన చాయిస్ కదండీ.. ధన్యవాదాలు.
  @s.pudivenkata ramana: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ పోస్టెలా మిస్సయ్యనబ్బా.నాకు మొదట్నించీ కూడా టైటిల్స్ లో సంభాషణలు,పాటలు,సంగీతం ఎవరో చూసేవాడ్ని తప్పకుండా.సినిమాలో వచ్చే డైలాగుల పదును బట్టి ఆ రచయితల పేర్లు నా నోట్లో నానుతూ ఉండేవి.అలా బాఘా నానిన పేర్లలో ఈయన కూడా ఒకరు. గణేష్ పాత్రో అనగానే మరోచరిత్ర సినిమాలో 'అరవ వాళ్ళు కదే అరవం అరవం అంటూనే అరుస్తారు" అన్న డైలాగ్ ఠక్కుమని గుర్తొస్తుంది.

  కొన్ని పేర్లు విడివిడిగా విన్నప్పుడు అసంపూర్ణంగా అనిపిస్తాయి.పక్కన మరో పేరు చేరినప్పుడే వాటికి సంపూర్ణత్వం సిధ్దిస్తుంది.

  సేం పించ్

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @శ్రీనివాస్ పప్పు: ఆ అరవం డైలాగుని కొంచం మార్చి 'కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' లో వాడారు కదండీ భరణి-వంశీ.. రాసింది తక్కువ సినిమాలకే అయినా తనదైన ముద్ర వేశారు పాత్రో.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు