శనివారం, జనవరి 24, 2015

ఆరేళ్ళు ...

ఋతువులు మారాయి.. గోడమీది కేలండర్ మారింది.. వయసు గడిలో మరో అంకె వచ్చి చేరింది. 'నెమలికన్ను' కి ఆరేళ్ళు నిండాయి!! యధాప్రకారం, సింహావలోకనం చేసుకునే సమయం వచ్చింది. నాలుగో పుట్టినరోజు నుంచీ బ్లాగు టపాల సంఖ్య ఆరోహణ క్రమంలోనే వెళ్తోంది. గడిచిన సంవత్సరంలోనూ అదే జరిగింది. అయితే, 'టపా రాయాలి' అనుకుని రోజు చివర్లో వీలవ్వక మానేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలా చూసినప్పుడు, గడిచిన సంవత్సరంలో రాయాల్సిన టపాలు కొన్ని మిగిలిపోయాయి..

గడిచిన ఏడాదిలో కూడా చదువేమీ సంతృప్తిగా సాగలేదు. చదవాల్సిన పుస్తకాల జాబితా తగ్గకపోగా, పెరిగింది. చదివిన వాటిలో గుంటూరు జిల్లా వ్యవసాయరంగాన్నిఇతివృత్తంగా తీసుకుని నల్లూరి రుక్మిణి రాసిన 'ఒండ్రుమట్టి' నవల బాగా నచ్చింది. ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ధ పెడితే బాగుండుననిపించినా, నవల రాయడం వెనుక రచయిత్రి చేసిన శ్రమ ప్రతి పేజీలోనూ కనిపించడం వల్ల కాబోలు, సర్దేసుకోవచ్చు అనిపించింది. ఆమధ్య చదివిన 'గౌతమీ గాథలు' తో పాటు ఈమధ్యే పూర్తిచేసిన ఆచంట జానకిరామ్ ఆత్మకథ 'నా స్మృతి పథంలో... సాగుతున్న యాత్ర' కూడా బాగా గుర్తుండిపోయే రచన.


మా జిల్లాలో 'ద్రాక్షారం,' అభిమాన రచయిత పతంజలి పుట్టి పెరిగిన 'అలమండ' గడిచిన సంవత్సరం చేసిన యాత్రలు. రెండూ గుర్తుండిపోయేవే, వేరువేరు కారణాలకి. దర్శనీయ స్థలాల జాబితా అలాగే ఉంది. ఆ జాబితాలో లేని చోట్లు మాత్రం చూసి వచ్చేశాను. జాబితాలో స్థలాలకీ ఓ టూర్ వస్తుంది, ఎప్పుడో. ఈలోగా లిస్టుతో నిమిత్తం లేకుండా వీలుకుదిరినవి చూసేయడమే. థియేటర్ లో చూసిన సినిమాలే బహుతక్కువ. చూసిన వాటిలో 'రౌడీ FELLOW' నచ్చింది. ముచ్చటగా మూడు కథలు - 'లవ్ లీ,' 'తప్పటడుగు,' 'నిక్వాణం' - రాశానీ సంవత్సరంలో. మొదటిదీ, మూడోదీ ఏకబిగిన రాసినవి.

బ్లాగింగ్ లో ఆరో సంవత్సరాన్ని ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా చేసింది 'కృష్ణవేణి.' యాదృచ్చికంగా మొదలుపెట్టాను రాయడం. పెద్ద కథ అవుతుంది అనుకున్నది కాస్తా నవలికగా రూపుదాల్చింది. ప్రచురించడం మొదలు పెట్టాక ఒకరిద్దరు మిత్రులు ఏదన్నా వెబ్ మేగజైన్ కి పంపాల్సింది అన్నారు. ముగింపు ప్రచురించిన తర్వాత కూడా వారిది అదే మాట! ప్రచురిస్తున్నానన్న మాటే కానీ, నా సందేహాలు నావి. అయితే, నేనేమాత్రం ఊహించని రీతిలో ఉంది స్పందన. వ్యాఖ్యలు, మెయిల్స్ తో పాటు పబ్లిక్ ఫోరమ్స్ లో చర్చలు.. చాలా, ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

ఒకరిద్దరు మిత్రులు 'ఈ-బుక్' చేద్దాం అన్నారు. కానీ, ఆ క్షణంలో నా మనసులో ఉన్న ఆలోచన వేరు. ఆ ఆలోచననే వారికి చెప్పాను. వారూ అది బావుందన్నారు, మంచి మనసుతో. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఒక మెయిల్ పలకరించింది. 'మనసుని తాకిన మీ కృష్ణవేణి కి చిన్న ట్రిబ్యూట్' అంటూ. అటాచ్మెంట్ ఓపెన్ చేస్తే 'కృష్ణవేణి' పీడీఎఫ్ ఫైల్. పంపినవారు మిత్రులు వేణూ శ్రీకాంత్. ఆ క్షణంలో నాక్కలిగిన అనుభూతిని అక్షరాల్లో పెట్టలేను. అప్పటికే నేను ముందుగా అనుకున్న ఆలోచన అమల్లో పెట్టడానికి ఇంకా సమయం పడుతుందని అర్ధమయ్యింది.


జరిగిన విషయంతో పాటు, 'ఈ-బుక్' డిజైన్ ని గురించిన నా అభిప్రాయాలనీ వేణూ శ్రీకాంత్ గారికి వివరంగా రాశాను. వారు అర్ధం చేసుకుని, తన విలువైన సమయాన్నీ, ఎంతో శ్రమనీ వెచ్చించి 'ఈ-బుక్' ని అందంగా తీర్చిదిద్దడమే కాదు, నా మాట మన్నించి, తను మనసుపెట్టి చక్కని 'ముందుమాట' రాశారు కూడా. ఏనాటి అనుబంధమో.. ఏ నేస్తమే జన్మ వరమో.. పుస్తకాన్ని చూసుకున్న క్షణంలో నా ఉద్వేగం అనిర్వచనీయం. కళాతపస్వి చేతిలో రూపుదిద్దుకున్న బాలూకే సాధ్యం కాలేదు దాన్ని ప్రకటించడం. ఇక, అక్షరాల్లో పెట్టడం నా వల్ల అయ్యేపనా?

మొత్తం మీద చూసినప్పుడు బ్లాగింగ్ చాలా ఉత్సాహంగా జరిగిందీ సంవత్సరంలో. ప్లానింగ్ అన్నది పెద్దగా అలవాటు లేని పని కాబట్టి, రాబోయే కాలానికి సంబంధించి ప్రణాళికలు ఏవీ లేవు. పెండింగ్ లో ఉన్న పుస్తకాల సంగతి చూడాలి. కొనాల్సిన వాటి మీదా దృష్టి పెట్టాలి. చూడాల్సిన సినిమాల జాబితా ఒకటి నెమ్మదిగా పెరుగుతోంది. ఆవైపూ ఓ కన్నేయాలి. కాలపరిమితులూ అవీ ఏవీ లేవు కానీ, వీలు చిక్కినప్పుడల్లా చేయాల్సిన పనులివి. 'కృష్ణవేణి' ని పుస్తకరూపంలో చదవాలనుకునే వారు మెయిల్ ఐడీని ఇక్కడ కామెంట్ బాక్స్ కి, లేదా నా మెయిల్ ఐడీకి పంపగలరు. నా బ్లాగింగ్ కొనసాగడానికి కారకులైన మీ అందరికీ మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు..

13 వ్యాఖ్యలు:

 1. నా మెయిల్ ఐడీ www.prabhakar@gmail.com. మీ కృష్ణవేణి నవల పంపగలరు.ఈ బ్లాగులో హాస్యం తప్ప అన్నీ ఉన్నాయి అనుకునేవాడిని.కానీ ఎవరికీ తట్టని విధంగా సుమన్ నాటికలు/చిత్రాలు గుండె దిటవు చేసుకుని మరీ చూసి సమీక్షలు వ్రాసి, ఆ లోటుని పూరించారు.కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంక అలాంటివి రావటం లేదు.వాటి కోసం ఎదురు చూస్తున్నాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆరవ వసంతంలోకి స్వాగతం మురళి గారు :)
  ఈ-బుక్ డిజైన్ ఇంత చక్కగా చేసినందుకు వేణు గారికి థాంక్స్

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "కృష్ణవేణి" నెమలికన్నుకో మైలురాయండీ. ప్రతి కథా ప్రత్యేకమైనదే.. నాకైతే "నిక్వాణం" కూడా అంతగానూ నచ్చింది. ఈ బుక్ చాలా చక్కగా ఉంది. వేణుగారికి అభినందనలు.

  "నెమలికన్ను"కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!! అన్నట్టు "సిరికాకొలను చిన్నదాన్ని" మర్చిపోయారేవండీ?!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అందుకోండి, ఆరు అభినందన మందారమాలలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. గోదావరిలా నిండుకుండలా ఉంటూనే కృష్ణవేణిలా ఉరకలు పరుగులు తీయడంలో దిట్ట సుమా మీరు. ఓ పోస్ట్ చదివి ఆ అనుభూతి నుంచి తేరుకునేలోగానే మళ్ళీ వెన్నకుండతో సిద్ధమైపోతున్నారు... రికార్డుల రికార్డు సాధించాలని ఆశంస.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @ప్రభాకర్ రెడ్డి: ఈ పాటికి చదవడం పూర్తిచేసి ఉంటారనుకుంటున్నానండీ.. ధన్యవాదాలు..
  @నాగార్జున: ఆరు నిండాయండీ.. వేణూ శ్రీకాంత్ గారికి నేనెన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే.. ధన్యవాదాలు.
  @కొత్తావకాయ: కృష్ణవేణి గొడవలో పడి అలివేణి సంగతి మర్చిపోయానండీ :( ..నిజంగానే చాలా మంచి రూపకం.. వినే కొద్దీ రుచి పెరుగుతోంది. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @బోనగిరి: ధన్యవాదాలండీ
  @పురాణపండ ఫణి: రికార్డులెందుకండీ.. రాయగలిగినప్పుడల్లా రాస్తూ ఉంటాను.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఆరేళ్ళు గడచిపోయాయ మురళి గారు! నాకు మీ బ్లాగ్ ఎప్పటికప్పుడు చాలా కొత్తగానే కనిపిస్తుందండి. ఏమాత్రం వయసు రాలేదు. వయసు కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు:) నిత్యనూతనంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు పరుగులు తీస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీనుంచి ఇంకా చాలా చాలా ఆశిస్తున్న మా అందరి కోరికని మన్నిస్తూ, మీ ప్రణాళికలన్నీ క్రమబధంగా పూర్తి చేసుకుంటూ, ఆ ఫలితాలని మాకు కూడా పంచుతూ పోవాలని మనస్పూర్తిగా కోరుతూ....ఎదురుచూస్తూ ఉంటాను మురళి గారు. I wish you all the best for everything.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ముందుగా ఆరు వసంతాలు ముగించుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు మురళి గారు... ఇకపై ప్రతి ఏడాది మీ బ్లాగ్ లో పోస్టుల సంఖ్య ఆరోహణక్రమంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  కృష్ణవేణి ఇ-బుక్ కోసం మరికొంత సమయం వెచ్చించలేకపోయినందుకు నేను ఫీల్ అవుతూ ఉంటానండీ.. మరింత సమయం కేటయించి మరింత అందంగా తీర్చిదిద్దితే బాగుండేదనిపిస్తూ ఉంటుంది. ఆ కథ అంతగా నచ్చేసింది మరి :-) బుక్ నచ్చిందన్నందుకు నాగార్జునకు కొత్తావకాయ గారికి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @వేణూ శ్రీకాంత్: ఇంకానా.. భలేవారండీ. మీరెంత సమయం వెచ్చించారో నాకు తెలుసు.. పుస్తకం చూసిన అందరికీ సులువుగానే అర్ధమవుతుంది. ఏం చెప్పగలనండీ మీకు, మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తప్ప!!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మురళి గారు శుభాకాంక్షలు! పుస్తకం నా మెయిల్‌కి పంపించరా? ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @leo: తప్పకుండానండీ.. nemalikannumurali@gmail.com కి మెయిల్ చేయండి, వెంటనే పంపుతాను.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు