సెలవురోజు మధ్యాహ్నం.. గూగుల్ ముందు కూర్చుని తోచీ తోచకా గుర్తొచ్చిన పదాలు
టైప్ చేసి రిజల్ట్స్ చూస్తూ చూస్తూ యధాలాపంగా 'రాజా రవివర్మ' అని టైప్
చేశాను. రిజల్ట్స్ వెంట వెళ్తూ ఉండగా కనిపించిన 'రంగ్ రసియా' ఆసక్తిగా
అనిపించింది. యూట్యూబ్ లో ఉంది సినిమా. పైగా నిడివి కూడా గంటా చిల్లరే
(అనగా గంటా యాభై తొమ్మిది నిమిషాల ముప్ఫై ఒక్క సెకన్లు!!) కావడంతో చూడడం
మొదలు పెట్టాను. పందొమ్మిదో శతాబ్దానికి చెందిన విఖ్యాత భారతీయ చిత్రకారుడు
రాజా రవివర్మ జీవితం ఆధారంగా మరాఠీ రచయిత రంజిత్ దేశాయ్ రాసిన నవలకి
దర్శకుడు కేతన్ మెహతా ఇచ్చిన దృశ్యరూపం ఇది.
ఒక స్టార్ హోటల్లో రాజా రవివర్మ పెయింటింగ్ వేలం జరుగుతూ ఉండగా, హోటల్ బయట పెద్ద ఎత్తున ఆందోళనలు
జరుగుతూ ఉండడం సినిమా ప్రారంభం. వేలం, ఆందోళనల దృశ్యాలతో పాటు టైటిల్
కార్డ్స్ చూపించి, నేరుగా రవివర్మ కథలోకి తీసుకుపోయాడు దర్శకుడు. మధ్య
వయస్కుడైన రాజా రవివర్మ (రణదీప్ హూడా) బొంబాయి నగరంలో బ్రిటిష్ వారి
కోర్టులో హాజరై, తనపై వచ్చిన అభియోగాలకి జవాబులు చెప్పుకునే క్రమంలో ఫ్లాష్
బ్యాక్ ద్వారా తన జీవితంలో జరిగిన ఒక్కో సంఘటననీ నెమరు వేసుకుంటాడు. ఈ
క్రమంలోనే రవివర్మ విఖ్యాత చిత్రకారుడిగా ఎదిగిన వైనం, ఎదుర్కొన్న
ఆటుపోట్లు ఒక్కొక్కటీ తెలుస్తూ, కోర్టు తీర్పుతో సినిమా ముగుస్తుంది.
ట్రావెన్కోర్
లో పుట్టిన రవివర్మ కి చిన్నప్పటినుంచీ చిత్రకళ అంటే ప్రాణం. ఆలయం గోడ మీద
బొగ్గు ముక్కతో గీసిన ఏనుగుల బొమ్మ ద్వారా మహారాజు దృష్టిలో పడతాడు.
శిక్షించడానికి బదులు, ఎంతగానో మెచ్చుకుంటాడు మహారాజు. ఫలితం, రవివర్మకి
చిత్రకళ మీద ఇష్టం మరింత పెరుగుతుంది. తన రాజ్యంలో కళాకారులని గౌరవించాలని
తాపత్రయ పడే మహారాజు రవివర్మని 'రాజా' బిరుదుతో సత్కరిస్తాడు. వివాహం
తర్వాత ఊహించని సమస్య వస్తుంది రవివర్మకి. భర్త అలా బొమ్మలు గీయడం ఏమాత్రం
నచ్చదు అతని భార్యకి. పరువుతక్కువ పని అన్నది ఆమె భావన.
అత్తవారింటి
పరిచారిక కామిని లో గొప్ప మోడల్ ని చూస్తాడు రవివర్మ. ఆమెని మోడల్ గా చేసుకుని ఎన్నో స్కెచ్ లు గీస్తాడు. ఈ క్రమంలో కామినితో అనుబంధం
పెరగడంతో పాటు, భార్యతో దూరం పెరుగుతుంది. దీనిని ఏమాత్రం భరించలేని
రవివర్మ భార్య అతనితో తెగతెంపులు చేసేసుకుంటుంది. కేరళ విడిచిపెట్టి
బొంబాయిలో స్థిరపడతాడు రవివర్మ. స్థానిక దీవాన్ కళాభిమాని. అతని
ప్రోత్సాహంతో తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆలయంలో
సుగంధ బాయి (నందనా సేన్) ని చూసి ఆకర్షితుడవుతాడు రవివర్మ. ఆమె స్కెచ్ లు
గీస్తాడు.
మొదట రవివర్మని అపార్ధం చేసుకున్న సుగంధ, తర్వాత అర్ధం
చేసుకుని మోడల్ గా ఉండడానికి అంగీకరిస్తుంది. కొంత స్నేహబృందం, శిష్యబృందం
ఏర్పాటవుతాయి రవివర్మకి. దీవాన్ ద్వారా బరోడా మహారాజుతో పరిచయం
ఏర్పడుతుంది. మహారాజు కోరిక మేరకి భారతదేశమంతా పర్యటించి, దేశ సంస్కృతిని
ప్రతిబింబించే చిత్రాలెన్నో గీస్తాడు రవివర్మ. వీటితో పాటు భారతీయ దేవతా
మూర్తులకి రూపం ఇస్తాడు. అతడి చిత్రాలని ప్రింట్ చేసి విక్రయించడం ద్వారా
పేరూ, డబ్బూ సంపాదించవచ్చని సలహా ఇస్తారు మిత్రులు. తన బొమ్మలు మరింత
మందికి దగ్గరవుతాయన్న ఊహ ఆనందాన్ని కలిగిస్తుంది రవివర్మకి. సేట్ గోవర్ధన
దాస్ (పరేష్ రావల్) ప్రింటింగ్ ప్రెస్ కి పెట్టుబడి పెట్టడానికి ముందుకి
వస్తాడు, భాగస్వామిగా చేరే షరతుమీద.
మరోపక్క, రవివర్మతో ప్రేమలో
మునిగిపోతుంది సుగంధ. అతని కోరిక మేరకు అప్పటివరకూ దేవతా మూర్తుల చిత్రాలకి మాత్రమే మోడల్ గా
చేసిన ఆమె, 'ఊర్వశి' చిత్రం కోసం అర్ధనగ్నంగా మోడలింగ్ చేయడానికి సిద్ధ
పడుతుంది. వాళ్ళిద్దరూ మరింత దగ్గరవుతారు. ఇంతలో బొంబాయి
మహా నగరంలో ప్లేగు మహమ్మారి వ్యాపించడంతో పాటు, దేవతామూర్తులకి రవివర్మ
రూపం ఇవ్వడం వల్లే ఈ ఉపద్రవం వచ్చి పడిందన్న ప్రచారమూ మొదలవుతుంది.
ప్రింటింగ్ ప్రెస్ కి నిప్పు పెడతారు దుండగులు. ఓ విదేశీ వనితతో రవివర్మ
స్నేహాన్ని సుగంధ అపార్ధం చేసుకుంటుంది. మరోపక్క అతడి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇన్ని చిక్కుల్లో ఉండగా పులిమీద పుట్రలా, రవివర్మని ప్రాసిక్యూట్ చేయాలంటూ
కోర్టు కేసు వచ్చిపడుతుంది. కోర్టు తీర్పుతో పాటు, రవివర్మ చిత్రం వేలంలో
ఏం జరిగిందన్నది ముగింపు.
కళాకారుడి మనస్తత్వాన్ని ఒడిసి పట్టుకోడం
మొదలు, కీలకమైన సన్నివేశాలని కళాత్మకంగా చిత్రీకరించడం వరకూ, దర్శకుడు
కేతన్ మెహతా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు
ముందుగానే ఊహించగలిగేలా ఉన్నప్పటికీ, సినిమా ఎక్కడా విసుగు కలిగించదు.
నాలుగైదు 'ఇంటిమేట్' సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని అసభ్యంగా కాక
కళాత్మకంగా చిత్రించడాన్ని మెచ్చుకోవాలి. నటీనటుల్లో మొదట
చెప్పుకోవాల్సింది సుగంధగా చేసిన నందనా సేన్ గురించి. ఒక్కమాటలో చెప్పాలంటే
ఆమె లేకపోతే ఈ సినిమా లేదు. 2008 లో ఈ సినిమా నిర్మాణం జరిగే నాటికి ఆమె
వయసు అక్షరాలా నలభై ఒక్క సంవత్సరాలు!
ముగ్ధత్వాన్ని ఒప్పించడమే
కాదు, తనకన్నా వయసులో తొమ్మిదేళ్ళు చిన్నవాడైన కథానాయకుడితో వయోభేదం
ఏమాత్రం బయటపడని విధంగా నటించింది. ఇన్నిమాటలేల? 'నందన చాలా
బోల్డ్' అనిపించి తీరుతుంది ఈ సినిమా చూస్తుంటే. తర్వాత చెప్పాల్సింది
రణదీప్ హూడా గురించే. ఇరవయ్యేళ్ళ నుంచి అరవయ్యేళ్ళ వరకూ వయసున్న రవివర్మని
కళ్ళముందు నిలబెట్టాడు. పాత్ర వయసుకి తగ్గట్టు తన శరీరాకృతిని
మార్చుకోవడంతో పాటు, కళాకారుడికి ఉండే తపననీ, ఆత్మ విశ్వాసాన్నీ,
ఆత్మగౌరవాన్నీ చక్కగా పలికించాడు.
ఫోటోగ్రఫీ, సంభాషణలు,సంగీతం, ఎడిటింగ్
అన్నీ చక్కగా కుదిరాయి. సెన్సార్ అభ్యంతరాలు ఎన్నింటినో ఎదుర్కొని 'A'
సర్టిఫికేట్ తో గతేడాది నవంబర్ లో రిలీజయ్యింది ఈ సినిమా. ఇదే కథతో
మలయాళంలో 'మకరమంజు' (2011) పేరుతో సినిమా తీశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్
శివన్ రవివర్మగానూ, రాధ కూతురు కార్తీక నాయర్ సుగంధ గానూ నటించారట.
చూస్తున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలని కలిగించి, చూడడం పూర్తయ్యాక కూడా ఆలోచనల్లో
పడేసే సినిమా 'రంగ్ రసియా.' చిత్రకళతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం
ఉన్నవాళ్ళతో పాటు వైవిద్యభరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళకి నచ్చే సినిమా
ఇది. గంటా చిల్లర (!!) సమయం దొరికినప్పుడు యూట్యూబ్ లో ఇక్కడ చూడొచ్చు.
చూసి తీరాల్సిన మరో సినిమాని పరిచయం చేసినందుకు కొంచం ఆలశ్యంగా థాంక్సులు
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి