సోమవారం, సెప్టెంబర్ 12, 2011

ఇదేం బాలేదు వంశీ...

వంశీ నాకు మొదట పరిచయమయ్యింది సిని దర్శకుడిగా. కొన్ని సినిమాలు నచ్చాయి మరి కొన్ని నచ్చలేదు.. తర్వాత తన కథలూ, నవలలూ చదివాను.. వీటిలోనూ కొన్ని నచ్చాయి, మరికొన్ని నచ్చలేదు. ఇప్పుడు పుస్తక ప్రచురణలో అయితే వంశీ అనుసరిస్తున్న పధ్ధతి అస్సలు నచ్చక పోగా కోపం రప్పిస్తోంది. చిన్నగా మొదలైన ఓ అసంతృప్తి, ఇవాళ పుస్తకాల షాపుకి వెళ్ళడంతో బాగా పెద్దదయ్యింది.

పుస్తకాలు చూస్తుండగా, "సార్, 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ వచ్చింది.. తీసుకుంటారా?' అని షాప్ అబ్బాయి అడిగినప్పుడు చూశాను. తళతళ లాడే హార్డ్ బౌండ్ పుస్తకాన్ని. "ఇంతకు ముందు బైండు లేకుండా వచ్చింది కదా. అది తీసుకున్నారు. ఇది ఎప్పుడు వేశారు?" చాలా మామూలుగానే అడిగాను. "అప్పుడే వేశారు సార్. కానీ ఇప్పుడే అమ్మకానికి పెట్టారు," అతనూ మామూలుగానే చెప్పాడు కానీ, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ అర్ధం చేసుకోడానికి కొంచం టైం పట్టింది నాకు.

ఎనిమిదేళ్ళ క్రితం ఎమెస్కో ప్రచురించిన 'ఆనాటి వానచినుకులు' వంశీ కథల తొలి సంకలనం. 'అలా అన్నాడు శాస్త్రి!' 'ఆకుపచ్చని జ్ఞాపకం' లాంటి ఎన్నో చక్కని కథలు ఉన్నాయి అందులో. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ వైవిద్యభరితమైన కథ, కథనం ఉన్న కథలే. తర్వాత వరుసగా వంశీ నవలలు 'మహల్లో కోకిల,' 'మంచుపల్లకీ,' 'రవ్వలకొండ,' 'గాలికొండపురం రైల్వే గేటు,' 'వెన్నెల బొమ్మ' నవలని ప్రచురించింది ఎమెస్కో. ఒక్క 'వెండితెర నవలలు' మాత్రం సాహితి వాళ్ళు మార్కెట్లోకి తెచ్చారు.

స్వాతిలో సీరియల్ గా వచ్చిన 'మా పసలపూడి కథలు' సంకలనాన్ని తొలుత ఎమెస్కోనే ప్రచురించింది. స్వాతిలో కథలకి అప్పటికే బాగా పేరు రావడం వల్ల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అప్పుడు రంగ ప్రవేశం చేసింది కుట్టిమాస్ ప్రెస్ ప్రచురణ సంస్థ. అప్పటి వరకూ నలుపు తెలుపుల్లో ఉన్న 'మా పసలపూడి కథలు' సంకలనంలో బాపూ బొమ్మలకి రంగులద్ది, దాదాపు రెట్టింపు ధరతో మార్కెట్లోకి వదిలింది. రంగుల బొమ్మల కోసం చాలామంది ఈ పుస్తకాన్ని కొన్నారు.

ఈ స్పందన చూసే కావొచ్చు, 'ఆనాటి వానచినుకులు' సంకలనం లో ఉన్న కథలకి బాపూ చేత బొమ్మలు వేయించి, వంశీ రాసిన మరికాసిని కొత్త కథలు కలిపి 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతో రంగుల సంకలనం తెచ్చింది. మూడొందల అరవై పేజీల ఈ పుస్తకం వెల అక్షరాలా మూడొందల యాభై రూపాయలు. నాణ్యమైన ప్రచురణ, అందమైన బొమ్మలు.. ఐతేనేం? ముప్పాతిక మూడొంతుల కథలు అప్పటికే చదివేసినవి. అన్నీ కొత్త కథలు అయితే బాగుండును కదా అనిపించింది.

స్వాతిలో 'మా దిగువ గోదారి కథలు' సీరియల్ గా వస్తుండగానే, తనకు నచ్చిన కథకుల యాభై కథలతో వంశీ వెలువరించిన పుస్తకం 'వంశీకి నచ్చిన కథలు' కుట్టిమాస్ ప్రెస్ ప్రచురించిన ఈ నాలుగొందల డెబ్భై పేజీల పుస్తకం వెల రెండువందల రూపాయలు. తర్వాత ఇలియాస్ ఇండియా బుక్స్ సంస్థ 'మా దిగువ గోదారి కథలు' సంకలనాన్ని బాపూ రంగుల బొమ్మలతో విడుదల చేసింది. ఐదొందల పందొమ్మిది పేజీల పుస్తకం వెల నాలుగొందల డెబ్భై ఐదు రూపాయలు. ఈ పుస్తకం స్టాండ్స్ లో ఉండగానే ఇప్పుడు 'వంశీకి నచ్చిన కథలు' హార్డ్ బౌండ్ తో, రెండొందల యాభై రూపాయల వెలతో కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.

కుట్టిమాస్ ప్రెస్, ఇలియాస్ ఇండియా ప్రెస్ అనేవి వంశీకి చెందిన ప్రచురణ సంస్థలే అని వినికిడి. ఎంతవరకూ నిజమన్నది తెలియదు. కానీ, పుస్తకాల ప్రచురణలో వంశీ ఈమధ్యకాలంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడన్నది అత్యంత శ్రద్ధగా తీర్చిదిద్దిన సంకలనాలని చూస్తుంటే అప్రయత్నంగానే అర్ధమవుతోంది. ఇప్పుడు నన్ను వేధించే ప్రశ్నలు: ఒకే పుస్తకాన్నే నలుపు-తెలుపు లో ఒకసారి, రంగుల్లో మరోసారి, సాదా బైండుతో ఒకసారి, హార్డ్ బౌండ్ తో మరోసారి, అవే కథలని పుస్తకం పేరు మార్చి మళ్ళీ మళ్ళీ విడుదల చేయడం అన్నది ఎంతవరకూ సబబు?

ప్రచురణ సంస్థలు తనవి అయినా, కాకపోయినా, పాఠకులు పుస్తకాలు కొనేది రచయిత పేరు చూసే కానీ, ప్రచురణ సంస్థ పేరు చూసి కాదు కదా.. పైగా ఈ పునః ప్రచురణలు జరుగుతున్నది ఏళ్ళ గ్యాప్ తర్వాత కాదు. ఒక ప్రింట్ అమ్మకం మొదలైన కొన్నాళ్ళకి మార్పులు చేర్పులతో మరో ప్రింట్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. "అందరూ మమ్మల్ని అడుగుతున్నారు సార్," అన్న పుస్తకాల షాపతని మాటల సాక్షిగా, ఈ మార్పు చేర్పుల వల్ల పాఠకులతో పాటు, షాపుల వాళ్ళూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడు ఇంక వంశీ పుస్తకం వచ్చిందంటే, 'మార్పు చేర్పులతో మళ్ళీ వస్తుందేమో.. కొన్నాళ్ళు ఆగుదాం' అనిపిస్తోంది.. వంశీ, ఎందుకిలా??

14 కామెంట్‌లు:

  1. అది నా ఇష్టం నచ్చితే కొనుక్కోండి లేకపోతె లేదు అని 'వంశీ 'అంటారేమో మురళీ :-)

    రిప్లయితొలగించండి
  2. హ్మం. మీ బాధ అర్ధవంతమయిందే. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. అందులోనూ దాచుకోవాలి అనుకున్న పుస్తకాలూ, మామూలు బౌండ్ కన్నా, రంగులతో హార్డ్ బౌండ్ కొనుక్కోవటానికే మొగ్గుతాను నేను రేటు ఎక్కువైనా కూడా. అలాంటిది వెంటనే వెంటనే ఇలా జరిగితే ఉన్నది పారేసి వేరేది కొనలేము, మంచి వెర్షన్ కొనకుండా ఉండలేము. :-(((

    రిప్లయితొలగించండి
  3. ఈ మధ్య వంశీ పుస్తకం విడుదలైన ప్రతీసారీ జరుగుతున్న ప్రహసనమే ఇది.
    ముందు నలుపు తెలుపూల్లో, ఆనక రంగుల్లో మనలాటి వాళ్లకు మిఠాయి కొట్టుముందు స్కూల్ పిల్లాడి పరిస్థితి.
    అయితే ఆకుపచ్చ జ్ఞాపకం, దిగువ గోదారి కధలు ఒకే సారి రిచ్ లుక్ తో, ఎక్కువ ధరతో వచ్చేసాయి. ఇది కొంత నయం.
    మన అభిమాన రచయితకి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటే పర్లేదు. వంశీ కూడా పాపులర్ రచయితల్లాగా సుటేస్కుని పెన్ను నోట్లో పెట్టుకొని ఫోటో తీస్కోవాలి కదా.
    తాజాగా నాకో బుక్ డీలర్ చెప్పిన మాట " ఇంత రేట్ పెట్టినా పుస్తకానికి యాభై రూపాయలు నష్టంట? "

    రిప్లయితొలగించండి
  4. హ్మ్మ్.. ధనం మూలమిదం జగత్. ఇలాంటివి ఉహించలేదు.

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు - నిశితం గా పరిసోధించి రాసారు. వెల్ డన్. వంశీ - క్రేజ్ ని కేష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. బాపు కాకుండా ఇంకెవరైనా బొమ్మలు వేసిస్తే ఈ కధలకి అంత గ్లామర్ వచ్చుండేది కాదేమో ! స్వాతి బలరాం మార్కెటింగ్ స్కిల్ల్స్ కూడా చాలా వరకూ తోడ్పడుతున్నాయి. అయితే పుస్తకాలు (వంశీవైనా ఇంకెవరివైనా) అనేది తెలుగు పుస్తక రంగంలో కొత్తగా చోటు చేసుకుంటున్న పరిణామం. తెలుగు పుస్తకం వెల పెరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  6. mastaru,

    ippudu ela kooda jaruguthondaa..manchi shathiya abhilasha unnavallaki chala kashtam gaa untundi kadandi.. untanu..

    రిప్లయితొలగించండి
  7. ఇన్ని
    మాటలు ఎందు కు నిజం గ శ్రద్ధ వుంటే వారపత్రికలూ కొని అందులో వచ్చిన వాటిని బైండ్ చేసుకోవచ్చు కదా! ఒక్క సారి
    ఆలోచించండి!

    రిప్లయితొలగించండి
  8. Murali garu..
    deeniki reasons

    1. mamulu bound book andariki andubatulo untundi ani
    2. rangulato Hard bound very frankly N.R.I la kosam...
    3.alage govt librarry orders okkosari hard bound books ki ravu cost ekkuvaga untayi budget takkuva kabatti so appudu vallu mamulu bound books supply chesukovali
    4. vamsi books ila rendu rakaluga undataniki karanam ide.
    5. ayite rendu okesari release cheyachhu kani ikkada financial aspect okati undi
    so rangullo kavalanukunevaru wait cheyadame manchidi.

    naku telisinamtavaraku...

    రిప్లయితొలగించండి
  9. రేటెక్కువయినా వంశీ కొత్త పుస్తకాలు చూడగానే కొనెయ్యాలనేలా వుంటున్నాయండీ . బాపు బొమ్మలు అదనపు ఆకర్షణ .

    మనం మాత్రం చదువుకోటానికయితే , నలుపు తెలుపూ అయినా పర్లేదు కానీ వారసత్వంగా ఎవరికయినా ఇవ్వాలనే ఆలోచన వుంటే మాత్రం ధర ఎక్కువయినా బైoడు పుస్తకాలు కొనడం మంచిది.

    అవే కథలను తిరిగి తిరిగి ప్రచురించడం మాత్రం ఏం బాలేదు వంశీ

    రిప్లయితొలగించండి
  10. @చిన్ని: నిజమేనండీ.. అలా అన్నా ఏమీ చేయలేం.. కానీ అనక పోవచ్చేమో :-) :-) ..ధన్యవాదాలు.
    @పద్మవల్లి: నిజమండీ.. మన దగ్గర ఉన్న బుక్ కన్నా మంచి వెర్షన్ వెంటనే వస్తే అదే ఇబ్బంది.. ధన్యవాదాలు.
    @ఆత్రేయ : 'మిఠాయి కొట్టు ముందు స్కూలు పిల్లాడి పరిస్థితి' ..భలేగా చెప్పారు! ఇంకా సూట్ వరకూ రాలేదు కానీ, ఇంటర్యూలూ అవీ బాగానే ఇస్తున్నాడండీ ఈ మధ్యన.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @కొత్తావకాయ: కేవలం ధనం ఒక్కటేనా? అన్న ప్రశ్న వేసుకుంటే అవుననీ, కాదనీ కూడా జవాబు రావడం లేదండీ.. అందుకే ఈ టపా :-) ..ధన్యవాదాలు.
    @సుజాత: పరిశోధన ఏమీ లేదండీ.. నా దగ్గర ఉన్న పుస్తకాలు చుట్టూ పెట్టుకుని రాసిన టపా :-) తెలుగు పుస్తకం వెల పెరుగుతోంది సరేనండీ, స్థాయి కూడా పెరగాలి కదా మరి!! ..ధన్యవాదాలు.
    @సునీత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @గోదావరి: అవునండీ.. అదే పరిస్థితి.. ధన్యవాదాలు.
    @విరిసిన పారిజాతాలు: నచ్చే ఒకటి రెండు శీర్షికల కోసం మిగిలిన వార పత్రిక మొత్తాన్ని భరించలేకే కదండీ ఈ తిప్పలు!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @కల్లూరి శైలబాల: అన్ని రకాల పుస్తకాలూ ఒకేసారి విడుదల చేస్తే ఏ ఇబ్బందీ ఉండదండీ.. ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు.. అలా కాకుండా, తక్కువ వెలతో మొదలు పెట్టి పెంచుకుంటూ వెళ్తే.. మొదట మామూలు పుస్తకం కొనుక్కుని, అ తర్వాత బౌండ్ పుస్తకమో రంగుల పుస్తకమో బాగుంది కదా అనుకునే వాళ్ళు రెండు పుస్తకాలు కొనుక్కోలేరు.. వదులుకోలేరు.. అదండీ సమస్య.. ధన్యవాదాలు.
    @లలిత: ఏది కొనుక్కోవాలి అన్నది మన చాయిస్ అండీ.. అన్నీ ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుంది కదా.. కొంచం వంశీ చెవిన వేయండి. అలాగే పేర్లు మార్చి ప్రింట్ చేసి మోసం చెయ్యొద్దని కూడా.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి