గురువారం, సెప్టెంబర్ 08, 2011

'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు'

మూడు తరాల తెలుగు శ్రోతలకి రేడియో అనగానే మొదట గుర్తొచ్చే పేర్లలో తప్పకుండా ఉండే పేరు శారదా శ్రీనివాసన్. నావరకు నేను, "అరవావిడైనా తెలుగు ఎంత చక్కగా నేర్చుకుని మాటాడుతోందో" అనుకున్నాను, చాలాసార్లు రేడియోలో ఆవిడ గొంతు వింటూ. కానైతే నా ఆలోచన ఎంత తప్పో చాలా ఆలస్యంగా తెలిసింది. పదహారణాల తెలుగాడపడుచు కాజ శారదా కుమారి, రేడియోలో ప్రయోక్తగా చేరి అదే రేడియో స్టేషన్లో వేణు గాన కళాకారుడిగా పనిచేస్తున్న ఎన్నెస్ శ్రీనివాసన్ ని ప్రేమవివాహం చేసుకుని శ్రీమతి శారదా శ్రీనివాసన్ గా మారిందన్న సంగతి ఆవిడ స్వీయ రచన 'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు' చదివాకే తెలిసింది.

ఇదొక్కటేనా? పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శారద, రేడియోలో చేరడానికి ముందు అసలు రేడియో కార్యక్రమాలేవీ వినలేదనీ, మూడున్నర దశాబ్దాల పాటు లక్షలాది శ్రోతల్ని అలరించిన ఆవిడ గొంతును తొంభయ్యేళ్లకి పైబడి జీవించిన ఆవిడ తండ్రిగారు కనీసం ఒక్కరోజు కూడా రేడియోలో విననేలేదనీ కూడా తెలిసింది ఈ పుస్తకం చదివాకే. రేడియో ఉద్యోగం అస్సలు అనుకోకుండా వచ్చిందే అయినా, దానిని నిలబెట్టుకోడానికీ శ్రోతల మనసుల్లో తన గొంతుని చిరంజీవిగా నిలపడానికీ ఆవిడ చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషితో పాటుగా, తెలుగు రేడియో పరిణామ క్రమాన్నీ చెబుతుందీ పుస్తకం.

పదవీ విరమణ చేసిన పదిహేనేళ్ళ తర్వాత, తన డెబ్భై ఐదో ఏట రేడియో అనుభవాలనీ, జ్ఞాపకాల్నీ అక్షరబద్ధం చేసిన శారదా శ్రీనివాసన్ తన తొలినాటి సహాధ్యాయుల మొదలు, 'యువవాణి' లో పని చేసి పేరుతెచ్చుకున్నఇప్పటి యువ కళాకారుల వరకూ ఎందరెందరినో తలచుకున్నారు. 1959 లో తను విజయవాడ రేడియో స్టేషన్ లో చేరేనాటికి తెలుగు రేడియోలో పనిచేస్తున్న రచయితలు, సంగీతజ్ఞులతో అనుభవాలని శారద వివరిస్తున్నప్పుడు, ఈవిడ వెళ్ళింది రేడియో స్టేషనుకా లేక శ్రీకృష్ణ దేవరాయలు 'భువన విజయం' సదనానికా అన్న సందేహం కలగక మానదు.

కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు మొదలు పాలగుమ్మి విశ్వనాథం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వరకూ స్థానం నరసింహారావు మొదలు శ్రీరంగం గోపాలరత్నం వరకూ ఒకరనేమిటి? ఆనాటి కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అందరూను.. వీళ్ళందరి మధ్యనా అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఓ ఇరవయ్యేళ్ళ అమ్మాయి బెరుకు బెరుగ్గా.. నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్లకి నేర్పించే వాళ్ళు ఎక్కడైనా, ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటారు. తన చుట్టూ ఉన్నవాళ్ళ నుంచి తాను నేర్చుకున్నవి కేవలం వృత్తిలో మెళకువలు మాత్రమే కాదనీ, వాళ్ళంతా తన వ్యక్తిత్వాన్నీ ఎంతగానో ప్రభావితం చేశారనీ చెప్పుకున్నారు ఈ నిరాడంబర కళాకారిణి.

తనకి రావని ఊరుకోకుండా, తెలంగాణా, తూర్పు కోస్తా మాండలీకాల మొదలు, రికార్డింగ్ టెక్నిక్స్ వరకూ వృత్తికి సంబంధించిన ప్రతి పనినీ ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న వైనం చదువుతుంటే ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది. తన గొంతుతో శారద ప్రాణం పోసిన కాల్పనిక పాత్రలకి లెక్క లేదు. "కొన్ని వేల రేడియో నాటకాలు" అని రాశారు తప్ప, ఎక్కడా ఆ సంఖ్యని కూడా ప్రస్తావించలేదు. చలం ఊర్వశి, 'కాలాతీత వ్యక్తులు' నాయిక ఇందిర, తన స్నేహితురాలు యద్దపూడి సులోచనారాణి సృష్టించిన జయంతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక ఆవిడ నిర్వహణ బాధ్యత వహించి నాటకీకరించిన కథలూ, నవలలకి లెక్కే లేదు. తిలక్ 'ఊరి చివర ఇల్లు' కథ, దాశరధి రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు' 'మోదుగుపూలు' ..ఎన్నో, ఎన్నెన్నో..

పుస్తకంలో విషయాలు ఓ క్రమంలో రాయకుండా, ఎప్పుడేది గుర్తొస్తే అది అన్నట్టుగా రాశారు. అయితే, రాసిన సంగతులన్నీ రేడియో గురించీ, శారద గురించే కాబట్టి, కాసిన్ని పునరుక్తులు మినహా ఇతర ఇబ్బందులేవీ లేవు. "రేడియోలో పాత్ర స్వభావం తెలియజెయ్యడానికి కంఠమాధుర్యం ముఖ్యం. సంగీతానికే కాదు మాటలకీ ఉంటాయి శ్రుతిలయలు. అది పట్టుకునేందుకు ప్రయత్నించాలి" అంటారీ మాటల మాంత్రికురాలు. ఈవిడికున్న ఫాన్ ఫాలోయింగ్ ఎంతంటే, జనం శారద శ్రీనివాసన్ ని చూడడానికి రేడియో స్టేషన్ కి వచ్చేసేవాళ్ళు.

"మా స్టూడియో గార్డు మొయినుద్దీన్ పదిమంది చొప్పున జనాల్ని లోనికి తెచ్చేవాడు. అతనికీ విసుగు. అస్తమానం ఈమాటలే చెప్పడానికి. 'యెహ్ అనౌన్సర్ బూత్ హై, వో స్టూడియో హై, యెహ్ మైక్ హై, ఉన్హో శారదా శ్రీనివాసన్ హై' అని అంటూ ఒక్క గుక్కలో చెప్పేసేవాడు." సామాన్యులే కాదు ఎందరో అసామాన్యులూ శ్రీమతి శారద అభిమానుల జాబితాలో ఉన్నారు. 'పురూరవ' నాటకం విని, ఆచార్య ఆత్రేయ శారద ఇల్లు వెతుక్కుంటూ రావడం, రేడియో కార్యక్రమాలని విమర్శించే చలం ఆవిడని ఎంతగానో మెచ్చుకోవడం, పీవీ నరసింహారావు మొదలు గుమ్మడి వెంకటేశ్వర రావు వరకూ ఎంతోమంది వ్యక్తిగతంగా కలిసినప్పుడు అభినందించడం... ఇవన్నీ రాసేటప్పుడు తానెంతో గొప్ప కళాకారిణినన్న అహం ఆవిడలో ఏకోశానా కనిపించదు.. ఎదిగిన కొద్దీ ఒదగడం అంటే ఇదేనేమో.

అంతటి పేరు సంపాదించుకున్నా సన్మానాలకీ, సత్కారాలకే కాదు పత్రికా ఇంటర్యూలకి కూడా దూరంగానే ఉన్నారావిడ. ప్రతిరోజూ పనేలోకంగా, నేర్చుకోవాలన్న నిరంతర తపనతో పనిచేశారన్న విషయాన్ని ఈ పుస్తకం చెప్పకనే చెబుతుంది. మనం ఏమీ ఆశ్చర్య పోనవసరం లేకుండా ఈ కళాకారిణికి ప్రభుత్వం ఏ అవార్డూ ఇవ్వలేదు. "అమ్మా శారదా! నేను స్టేజీకి, నువ్వు రేడియోకి... అన్నారు స్థానం నరసింహారావు గారు. అంతకన్నాఅవార్డు ఇంకేం కావాలి?" అంటారావిడ సంబరంగా. రేడియో టేపులు భద్ర పరచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వంటి విషయాలని చెప్పీ చెప్పనట్టు చెబుతూనే, ఎప్పటికైనా వాటి విలువని గుర్తిస్తే బాగుండునన్న అభిప్రాయం వ్యక్త పరిచారు.

కార్యక్రమాలని నాణ్యంగా తీసుకురాడానికి రేడియో కళాకారుల తెర వెనుక శ్రమ, వారిమధ్యన ఆరోగ్యకరమైన పోటీ లాంటి వాటితో పాటుగానే ప్రతిచోటా ఉండే లంపెన్ ఎలిమెంట్స్ అక్కడా ఉండడం, వాటి కారణంగా వ్యవస్థకి జరిగే నష్టం వీటినీ రేఖామాత్రంగా స్పృశించారు. బ్లాగ్మిత్రులు తృష్ణ గారి తండ్రి రేడియో రామం గారి కృషిని గురించీ, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గురించీ ప్రస్తావించారు శారద. ఏకబిగిన చదివించే పుస్తకం. జగద పబ్లికేషన్స్ ప్రచురణ. (పేజీలు 198, వెల రూ.125. విశాలాంధ్ర తో పాటు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది). ఇప్పటికిప్పుడు శారదా శ్రీనివాసన్ గొంతు వినాలనుకునే వారు 'ఊర్వశి' గా ఆవిడ తన గొంతుతో చిందించిన హొయలనీ, ఎందరినో మెప్పించిన తెరల తెరల నవ్వునీ ఇక్కడ ఆలకించవచ్చు.

10 కామెంట్‌లు:

  1. Chaakkati. Vyaasam andinchaaru. Hy. Lo. Naalugu. Adugula. Dooramlo Vundikoodaa aameni. Teerubadigaa
    Kalusukolekapoyaanu. Chinnappudu. Aame. Go Tull chi
    Vachchina Prativaakyam. Vinnaanu. Aame. Ante. Ante
    Is tam. Maa. Naanna. Gaari. Naatakaalalo. Koodaa. Aame. Palgonnaaru.
    Gnana prasuna

    రిప్లయితొలగించండి
  2. ఇక్కడ కూడా ఒక సమీక్ష ఉంది చూడండి http://manishi-manasulomaata.blogspot.com/2011/07/blog-post.html

    రిప్లయితొలగించండి
  3. :) నేనూ ఈవిడ అరవావిడే అని ఎన్నాళ్ళో అనుకున్నాను. మీరూనా?! "రేడియో స్టేషన్ కా, కృష్ణదేవరాయలి భువన విజయానికా?" మంచి ఊహ. భలే!! మంచి టపా. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చక్కని విషయాలు చెప్పారు " శారదా శ్రీని వాసన్ " గురించి .ఆవిడ గొంతు [ వింటే ] [ తల్చు కుంటే ] ఆ మాధుర్యం ఇప్పడికీ అలా మన చేవులల్లో శ్రావ్యంగా వినబడుతూనే ఉంటుంది. నాకు ఎన్నో మహిళా సమాజ కార్య క్రమాలను ఇచ్చే వారు. మా పిల్లలను ఒడిలో కూర్చో బెట్టుకుని [ పిల్లల కార్య క్రమాలకు ] పాటలు కవితలూ చెప్పించే వారు. ఆవిడ పదవీ విరమణ చేసాక నాకు స్టూడియో కి వెళ్ళ బుధి వేసేది కాదు. ఆ గళ మాధుర్యం మరువ లేనిది.

    రిప్లయితొలగించండి
  5. @జ్ఞాన ప్రసూన: వీలయితే పుస్తకం చదవండి ప్రసూన గారూ.. తనతో కలిసి పనిచేసిన అందరి గురించీ చాలా విపులంగా రాసుకున్నారావిడ.. ధన్యవాదాలు.
    @శ్రీ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @కొత్తావకాయ: మీరూనా!! ఆ పేర్లన్నీ చూస్తె నాకు అప్రయత్నంగా 'భువన విజయం' గుర్తొచ్చేసిందండీ.. ధన్యవాదాలు.
    @రాజేశ్వరి నేదునూరి: అవునండీ.. పుస్తకం చదువుతున్నంత సేపూ ఆవిడ గొంతు వింటున్నట్టే అనిపించింది.. 'పురూరవ' వింటూ ఈ టపా రాశాను.. దాంతో ఆ గొంతు మరీ మరీ వెంటాడుతోంది... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఇప్పుడే అంతర్జాలంలో పురూరవలో ఆవిడ గొంతు విని వచ్చాను. అద్భుతమండీ. పాత్రని హృదయష్తం చేసుకుని గొంతులో పలికించారు. పుస్తకం కొన్నాను. వరుసలో ఉంది. చదువుతున్నది అవగానే అది చదువుకుందామనుకున్నాను. కానీ మీ పోస్ట్ చూడగానే చేతిలో ఉన్న పుస్తకం వదిలి అది చదవబుద్ధేస్తోంది.(పోస్ట్ కి సంబంధం లేని ప్రశ్న: రాధానాధ్ స్వామి ఆత్మకథ అమ్మ ఒడిలోకి పయనం(ఒక అమెరికా స్వామి ఆత్మకథ) చదివారా. చాలా బావుంది చదవండి. ఈ మధ్య వంశీ సాక్షిలో "నాకు నచ్చిన పుస్తకం" శీర్షికలో సజెస్ట్ చేశాడు.)

    రిప్లయితొలగించండి
  8. నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు, ఇప్పుడు కినిగెలో లభిస్తుంది ఈపుస్తకంగా. ఇక్కడ చూడండి

    రిప్లయితొలగించండి
  9. @పక్కింటబ్బాయి: వంశీ కథనం చదివానండీ.. ఆ పుస్తకం కోసం వెతుకుతున్నా.. ఈ వారంలో వస్తుంది బహుశా.. ధన్యవాదాలు.
    @ఒరెమున: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. Murali Garu,

    sarada garu ee pustakanni CD gaa avida gontulo teesukuni vachharu. 2 varala kritam kalisau India vachinappudu avidani.aa CD lo konni patalu paderu kuda .CD avida daggare drukutndi. evarikaina inerest untundemo ani cheptunnanu. kavalante avida phone number istaanu. email cheyyandi avasaram anukunte.avida illu Himayatnagar lo. akkada nunchi teesukovaccu CD s.

    రిప్లయితొలగించండి