ఆదివారం, మార్చి 27, 2011

రామరాజ్యానికి రహదారి

"ఇది కేవలం పాలగుమ్మి పద్మరాజు మాత్రమే రాయగలిగే నవల" ...పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టగానే నాకు కలిగిన భావన ఇది. భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాల కథ 'రామరాజ్యానికి రహదారి.' దాదాపు ఇరవై వరకూ ప్రధాన పాత్రలున్న ఈ నవలలో ప్రతి పాత్రనీ వైవిద్యభరితంగా చిత్రించడం లోనూ, పాత్రల మధ్య వైరుధ్యాలని స్పష్టంగా ఎత్తిచూపడం లోనూ రచయిత వందశాతం కృతకృత్యులయ్యారని అంగీకరించాల్సిందే.

తెలుగు సాహిత్యంలో మనస్తత్వ చిత్రణకి సంబంధించి తనదైన ముద్ర వేసిన పద్మరాజు, స్వతంత్ర పోరాటాన్ని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ నవలలో కథ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఒక పల్లెటూళ్ళో 1930, జనవరి 26 న కొందరు గాంధీ అనుయాయుల జెండావందనంతో ప్రారంభమై, తర్వాతి పదిహేను, పదహారేళ్ళ కాలంలో స్వతంత్ర పోరాటంలోనూ, అందులో పాల్గొనే వారి వ్యక్తి గత జీవితాల్లోనూ, వారి వారి ఆలోచనా ధోరణుల్లోనూ వచ్చే మార్పులని కళ్ళకి కడుతూ సాగి, ప్రధాన పాత్రల్లో ఒకటైన రంగడు తన గమ్యాన్ని గురించిన నిర్ణయం తీసుకోవడంతో ముగుస్తుంది.

ఆద్యంతమూ విడవకుండా చదివించే శైలి పద్మరాజుగారి ప్రత్యేకత. అయితే పేజీలు చకచకా సాగవు. ఎక్కడికక్కడ పాఠకులు ఆగి ఊపిరి తీసుకుని, ఆలోచనలో పడి, తేరుకుని ముందుకు సాగాల్సిందే. అంతమాత్రాన కథనంలో బిగి ఏమాత్రమూ సడలదు. ఎక్కడా అనవసరపు సాగతీతలూ, సుదీర్ఘ ఉపన్యాసాలూ ఉండవు. ''తర్వాత ఏంజరిగిందో'' అన్న ఆతృత తుదకంటా కొనసాగుతుంది. అక్కడక్కడా 'మాలపల్లి' 'నారాయణరావు' 'వేయిపడగలు' 'చదువు' నవలలు గుర్తొచ్చినా, ఈ నవలని ఏ ఇతర నవలతోనూ పోల్చలేము.

ఈ కథని మూడు పాత్రల దృక్కోణాల నుంచి చెప్పారు రచయిత. చదువు మధ్యలో మానేసి స్వతంత్ర పోరాటంలో దూకిన భూస్వామి గోపాలం, గాంధీజీని అమితంగా ఆదరించే అతని వదినగారు లక్ష్మి, తర్వాతి తరానికి ప్రతినిధి అయిన గోపాలం కొడుకు రంగడు. ఈముగ్గురి జీవితాలూ కూడా స్వాతంత్రోద్యమం తో పెనవేసుకు పోయాయి. పరోక్షంగా వీళ్ళ జీవితాలని ప్రభావితం చేసింది గాంధీజీ. ఈముగ్గురూ కూడా లోతైన మనుషులు. తమ అంతః సంఘర్షణలనీ, ఆలోచనలనీ పొరపాటున కూడా పక్కవాళ్ళకి తెలియనివ్వరు.

"గాంధీజీ యెడల తన విశ్వాసం సంపూర్ణమైనదేనా?" అని సందేహం గోపాలానికి. అతనికి ఇల్లు కన్నా దేశం ముఖ్యం. చేసే పనిలో నిజాయితీ, చిత్తశుద్ధీ ఉండాలంటాడు. ఒకప్పుడు తన జీవితాన్నిఎంతగానో ప్రభావితం చేసిన పంతులుగారు తర్వాతి కాలంలో అంతగా నచ్చరు గోపాలానికి. తనతో పోరాటంలో పాల్గొంటున్న డాకూగా పిలవబడే వైద్యుడు రామశాస్త్రి చిత్తశుద్ధిమీద ఎప్పడూ సందేహమే అతనికి. ఇల్లు కూలిపోతున్నా, ఆస్తులు వేలానికొచ్చినా లెక్కచేయకుండా ఉద్యమం కోసం తిరిగిన గోపాలం -- తన చుట్టూ ఉన్న వాళ్ళలో విలువల్ని ఆశించే, ప్రవచించే విలువల్ని ఆచరణలో చూపాలని నమ్మిన గోపాలం -- ఒక వివాహేతర బంధంలోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులని చదవాల్సిందే.

లక్ష్మి ఓ జమీందారు గారి అమ్మాయి. గాంధీజీ వీరాభిమాని. కన్న తండ్రితో పంచుకోలేని తన సమస్యలని సైతం, గాంధీజీతో మనసు విప్పి మాట్లాడగలదు ఆమె. ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనడంతో పాటు రాట్నం వడకడం, ఆడపిల్లలకి హిందీ బోధించడం చేస్తూ ఉంటుంది. భర్త సూరి ఆమెకి కేవలం పోరాట సహచరుడు మాత్రమే. అతని సాంగత్యాన్ని ఏమాత్రమూ భరించలేదు ఆమె. తల్లి, సోదరితోనూ ఆమె బంధం అంతంతమాత్రమే. ఒక దశలో ఇంటిని చక్కబెట్టుకోలేకపోతున్న తను, దేశంకోసం ఏమాత్రం పని చేయగలదు అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. భర్త రెండో పెళ్లిని ఆమె హర్షించలేదు, అలాగని అభ్యంతర పెట్టనూ లేదు.

రంగడిగా పిలువబడే రంగారావుది చిత్రమైన మనస్తత్వం. వయసుకి మించిన పరిణతి కనిపిస్తుంది అతని ఆలోచనల్లో. తండ్రి గోపాలం అంటే అతనికి అంత మంచి అభిప్రాయం లేదు. తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడమే అతని మతం. కాలేజీలో చదువుకన్నా ఫుట్బాల్ ఆట, సిగరెట్టూ, డ్రింక్స్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతాడు రంగడు. అంతర్ముఖుడు కావడం వల్ల తన ఆలోచనలని ఎవరితోనూ పంచుకోడు. చుట్టూ ఎందరో స్నేహితులు ఉన్నా అతను ఒంటరి వాడే. తండ్రి వివాహేతర బంధాన్ని గురించి అతనికి తెలిసిన కొన్నాళ్ళకే తల్లి మరణించడం, అటుపై అతని జీవన గమనమే నవల ముగింపు.

గోపాలం భార్య సీత, జస్టిస్ పార్టీ సభ్యుడూ, వకీలూ అయిన నాయుడు, అతని కొడుకులు సత్యం, గోపీ నాయుడు, గోపీ నాయుడు పెళ్లి చేసుకున్న విదేశీ వనిత లారా, శాస్త్రి, శర్మ, డాకూ, పంతులు గారు, నరసయ్య, డాక్టర్ సాంబశివుడు, ఆయన భార్య, రాణీ రంగాయమ్మ, చంద్రమతి... ఇలా ప్రతి పాత్రకీ జీవం పోసి నిలిపారు రచయిత. ముఖ్యంగా లారా పాత్ర అతి సాధారణంగా ప్రారంభమై అసాధారణంగా ఎదుగుతుంది. నాకెందుకో లారా గురించి చదివినప్పుడల్లా అనిబిసెంట్ గుర్తొచ్చింది -- పోలికలేవీలేవు. రంగడు-లారా ల అనుబంధం 'ఆనందోబ్రహ్మ' లో సోమయాజి-మందాకిని ల అనుబంధానికి స్ఫూర్తి అయి ఉండొచ్చు. (సోమయాజి కూడా ఫుట్ బాల్ ప్లేయరే!)

ఈనవలతో పాటుగా పద్మరాజు గారి 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'నల్లరేగడి' నవలల్ని కలిపి ఒక సంకలనంగా ప్రచురించింది విశాలాంధ్ర. పేజీలు 391, వెల రూ. 180. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్మిత్రులు జంపాల చౌదరి గారి టపా ఇక్కడ.

6 కామెంట్‌లు:

  1. ప్రస్తుతం నేను ఇదే చదువుతున్నానండీ. :)))) మీ రెండవ అశొకుడి పరిచయం చూడగానే అర్జెంటుగా చదవాలనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కుందాములే అనుకున్నాను ఇంతలో ఓ మూల ఈ పుస్తకం కనిపించేసరికి..ఓ మూడు రోజులనుండీ దీని వెనకే నేను.

    రిప్లయితొలగించండి
  2. విశాలాంద్ర వారి బుక్ ఫెస్టివల్ లో పాలగుమ్మి వారి రచనలను చూసి కొందామని అనుకుంటూనే మర్చిపోయాను.
    మీ వ్యాఖ్యానం చదివాక అర్జెంటుగా ఈ నవలను చదవాలని అనిపించింది...

    రిప్లయితొలగించండి
  3. నేను ఈసారి కొనుక్కోబోయేవి పాలగుమ్మి పద్మరాజు గారి రచనలే ..

    రిప్లయితొలగించండి
  4. @రిషి: అవునా.. ఇక పుస్తకం పూర్తి చేసి కానీ పక్కన పెట్టరు!! ఓ టపా రాయడం మర్చిపోకండి.. ధన్యవాదాలు.

    @కథాసాగర్; తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.

    @ప్రణీత స్వాతి: మొదలు పెట్టేయండి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. @ఆర్యన్ రాజ్: అవునండీ, మంచి పుస్తకం.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి