శనివారం, మార్చి 26, 2011

పాక హోటల్

పొగచూరిన పైకప్పు, చుట్టూ తడికెలు, వాటిని కవర్ చేస్తూ కొత్త సినిమాల వాల్ పోస్టర్లు, చెక్కబల్లలూ, సేవండి పళ్ళాలూ, గ్లాసులూ, అనేకానేక చప్పుళ్ళతో పోటీ పడుతూ వినిపించే కొత్త సినిమాల రికార్డులు. ఇలాంటి ప్రపంచాన్ని మీరెప్పుడైనా చూశారా? చూసి ఉంటే దానిపేరు కాఫీ హోటల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పాకలో నడిపే హోటల్ కాబట్టి పాక హోటల్ అని కూడా అంటూ ఉంటారు జనసామాన్యం. వేడివేడి టీ కాఫీలూ, రుచికరమైన టిఫిన్లూ సరసమైన ధరలకి దొరకడం ఈ హోటళ్ళ ప్రత్యేకత.

ఈ హోటళ్ళు సర్వసాధారణంగా ఒకే కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉంటాయి. అంటే టిఫిన్లు తయారు చేయడం మొదలు, వాటిని సప్లై చేయడం, ప్లేట్లు, గ్లాసులు, బల్లలు శుభ్రం చేయడం వరకూ ప్రతి పనినీ ఆ కుటుంబంలో సభ్యులే వంతుల వారీగా చకచకా చేసేస్తూ ఉంటారు. రూపురేఖలలో మార్పులు మినహా ఇప్పటికీ ఈ తరహా హోటళ్ళు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. పొట్ట చేతపట్టుకుని నేను ఏ ఊరికి వెళ్ళినా, ముందుగా వెతుక్కునేది ఇదిగో ఇలాంటి హోటల్ కోసమే.

నేను మొదటిసారిగా ఈతరహా హోటల్ని దర్శించింది కాలేజీలో చేరాక. టీ, కాఫీలతో పాటుగా ఇడ్లీ, మినపరొట్టి, బజ్జీ, గారి దొరకే ఆ హోటల్ శుభ్రతకి పెట్టింది పేరు. తర్వాత చూసిన చాలా పెద్ద హోటళ్ళలో కన్నా, ఆ హోటల్ నిర్వహణ యెంతో బాగుండేది. వచ్చిన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం, ఏం కావాలో కనుక్కుని వేడి వేడిగా వడ్డించడం, ఒకవేళ ఆసల్యం అయ్యేలా ఉంటే అదే విషయాన్ని అపాలజిటిక్ గా చెప్పడం.. ఇలా 'హాస్పిటాలిటీ' కి పెట్టింది పేరుగా ఉండేది ఆ హోటల్. వాళ్ళ పిల్లలిద్దరూ నాతోనే చదివే వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు హోటల్ పనులు కూడా చూసుకునే వాళ్ళు.


సినిమాలకి వాల్ పోస్టర్లు అతికించే వాళ్ళు వస్తే, హోటల్ వాళ్ళు టిఫిన్, టీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ప్రతిఫలంగా, ఉన్నంతలో మంచి పోస్టర్ హోటల్ తడికెని అలంకరించేది. ఆ సినిమా కనుక, ఎవరన్నా పెద్ద హీరోది అయ్యిందో, మర్నాడు వెళ్లేసరికి ఆ పోస్టర్కి వేలాడుతూ ఒక పూలదండ కనిపించేది. ఆ హీరో అభిమానులు పూలదండ కొని తెచ్చి ఆ పోస్టర్ కి వేసేసే వాళ్ళన్నమాట. హోటల్ కి వచ్చిన అందరితోనూ హోటల్ వాళ్ళు మాట కలిపే వాళ్ళు కాబట్టి, బోలెడన్ని లావాదేవీలు అక్కడ జరిగిపోతూ ఉండేవి. అలాగే ఊరందరి సంగతులూ వద్దన్నా తెలిసిపోతూ ఉండేవి.

ఈ తరహా హోటల్ నాకు భాగ్యనగరంలోనూ తారసపడింది. కాకపొతే గెటప్ లో కొంచం నాగరికత సంతరించుకుంది. రెండు గదులు పోర్షన్లో నడిచే ఈ హోటల్ కూడా కుటుంబ సంస్థే. తర్వాత తిరిగిన ఊళ్లలో, ఒక చోట తిన్న దోశలు, మరోచోట లొట్టలేసిన పొంగల్, ఇంకోచోట ఇష్టంగా తిన్న సాంబార్ వడ ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ గుర్తొచ్చి నోరూరుతూ ఉంటుంది. ఈ హోటళ్ళ ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒక రెండుమూడుసార్లు క్రమం తప్పకుండా వెళ్ళామంటే చాలు, మన ఇష్టాలేమితో వాళ్ళు కనిపెట్టేస్తారు. దాంతో మనం ప్రతిసారీ ఆర్డర్ చేసే పని ఉండదు.

చిరునవ్వులతో మొదలయ్యే పరిచయం వ్యక్తిగత విషయాల వరకూ సాగిపోతూ ఉంటుంది. ఒకానొక హోటల్ నడిపే ఆయన, వేడి చల్లారిన తినుబండారాలని అస్సలు వడ్డించడు తన అతిధులకి. వచ్చినవాళ్ళు మొహమాటానికో, టైం లేకో 'పర్లేదు' అన్నాకూడా ఆయన వినేవాడు కాదు. అయ్యప్ప, భవానీ లాంటి దీక్షలు తీసుకున్న వాళ్ళకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే హోటల్ వాళ్ళూ ఉన్నారు.

నాకు తెలిసిన రెండు హోటళ్ళలో, రెండోతరం వారు హోటల్ నడపడం ఇష్టం లేక వ్యాపారాన్ని వదిలేశారు. తండ్రుల వెంట హోటల్ లో పని చేసిన వాళ్ళే, తమ జమానా వచ్చేసరికి ఉద్యోగాలకి మళ్ళిపోయారు. ఈ సంగతులు తెలిసినప్పుడు నాకెందుకో ఉసూరుమనిపించింది. ఇప్పటికీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తిన్నా కలగని తృప్తి, ఈతరహా హోటల్లో తిన్నప్పుడు అనుభవానికొస్తూ ఉంటుంది నాకు. వడ్డించే వారు చూపించే ఆత్మీయత ఇందుకు కారణం కావొచ్చునేమో.

15 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా రాసేరండీ. దీనినే మా వేపు పాకా హొటల్ అంటం.నాజూకు తనం మీరి అక్కడి వాతావరణాన్ని చీదరించు కుంటే చెప్ప లేం కానీ, అక్కడ దొరికే టిఫిన్లు, అభించే ఆత్మీయత పెద్ద పెద్ద రెష్టారెంట్లలోనూ లభించవు.ఇక రుచి గురించి చెప్పే పని లేదు. ఒక సారి తింటే జీవితంలో మరిచి పోలేం. ఆ పాకా హొటల్ లో ఇడ్లీ ఉంటుందీ .... ఈ పాకా హొటల్ లో ఉల్లి పెసరెట్ వేస్తాడూ ... అక్కడి కొబ్బరి చెట్నీవో ...వాహ్ ...
  ఇలాంటి మాటలు దొర బాబుల్లా కనిపించే చాలా మంది నోట నేను విన్నాను. పాపం, గ్రామ ప్రాంతాలలఓ ఉండే ఇలాంటి హొటళ్ళ వారికి స్థానిక పెద్దల సహకారం లేక పోతే ఇక అరువుల బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.తిరిగి యిచ్చే వారూ, ఎప్పటికీ యివ్వ కుండా ఎగ్గొట్టే వారూ కూడా ఉంటారు. ఇలాంటి టపాలని నాష్టాలజీ కబుర్లు అని తేలిగ్గా కొట్టి పారేస్తే చెప్ప లేను కానీ, అనుభవైక మాధుర్యాన్ని వైయక్తికంగా ఆస్వాదించ వలసినదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి గారు భలే రాసారు . మాటలు లేవంతే !
  ఇలాంటి అనుభూతులు , జ్ఞాపకాలు రాయటం లో మీరు , బాగ్లడిస్తా రవి గారు ఇద్దరు ఇద్దరే !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. btw ఇలాంటి ప్రదేశాల్లో దొరికే పదార్దాలు మనకు ఎక్కువ గా నచ్చటానికి కారణం మనం చిన్నప్పటి నుంచి తినే వాటికి రుచికి దగ్గరలో ఉండటం అనిపిస్తుంది నాకు .

  ఈ పోస్టు చదవగానే నాకు గుర్తుకు వచ్చిన ప్రదేశం , తిరుమలలో శ్రీనివాస నిలయం దగ్గరలో రోడ్డు పక్కన పునుకులు , బజ్జీలు లాంటివి అమ్మే ఒక చిన్న పాక !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పాక హోటల్ అనగానే నా కళ్ళముందు కనబడేవి రెండు హోటల్లండీ

  ఒకటి మా కాకినాడ గాంధీనగర్ సిమెంట్ రోడ్ లో శంకర నారాయణ విలాస్ అనే పేరుతో ఉన్న పాక హోటల్లో (దీన్ని హోటల్ పేరుతో ఎవరూ పిలవరు. సిమెంట్ రోడ్ లో పాక హోటల్ అనే అంటారు) వాడిచ్చే నెయ్యి, కారప్పొడి, అల్లం చట్నీ లతో వేడి వేడి ఇడ్లీలు ఒక్కసారి తింటే మహాప్రభో...బెమ్మాండం.

  ఇంక ఇంకోటి అంబాజీ పేట లో అమలాపురం రోడ్ లో ఎడం చేతి వైపు ఉన్న ఒక హోటల్ లో పనస ఆకులు బుట్టలా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఉడికించి చేసే పొట్టిక్కలు (వీటిని మిగిలిన ఏరియాలలో ఏమంటారో నాకు తెలియదు), అందులో నెయ్యి వేసుకుని, వాడిచ్చే దబ్బ చట్నీ లో అడ్డుకుని వేడి వేడిగా తింటుంటే .........అబ్బ తలచుకుంటేనే నోరూరిపోతోంది.

  ఇక పోతే కోటిపల్లి రేవులోని పాకహోటల్లో వేడి వేడిగా వేసే పెసర పునుగులు కూడా భలే ఉంటాయి. ఈ పోస్ట్ తో ఒక్కసారి మనసుని ఎక్కడెక్కడికో తీసికెళ్ళిపోయారు. మీకు పదివేల వీరతాళ్ళు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అమలాపురం లో పుల్లయ్య హోటల్,పాత పాత బస్‌స్టాండ్ ఎదురుగా పాక హోటల్ కూడా ఫేమస్.మనపక్క ప్రతీ ఊళ్ళోనూ బహుశా ఇలాంటి పాకహోటళ్ళు ఉంటాయనుకుంటా మురళి గారూ.

  శంకర్ గారూ భలే గుర్తు చేసారు గాంధీనగర్ శంకర్‌నారాయణ విలాస్,ఇంకా కోటిపల్లి రేవులో పాకహోటల్లో వేడిపుణుకులు కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్(అమ్మో లాలాజలగోదారి పరవళ్ళు తొక్కేస్తోంది...)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాకు ఊర్లకు పోతున్నప్పుడు, రోడ్ల మీద వచ్చే ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ అంటె చాలా ఇష్టం. ధాభా హోటల్స్ కాదు. అలా ఆకాశం కింద, రాత్రైనా...పగలైనా...ఆ అనుభూతే వేరు. ఎంతో మర్యాద చూపిస్తారు. ప్రేమతో, వేడి వేడి గా వడ్డిస్తారు. ఎంతసేపైనా ఉండిపోవాలనిపిస్తుంది.నా అనుభవంలో ఉన్న పాకహోటల్స్ మాత్రం ఇవే మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బాగా రాసారండి..
  ఇలాంటి హోటల్ ఒకటి మా ఆంధ్ర యునివర్సిటీ డౌన్ లో కూడా ఒకటి వుంది...ఒక కుటంబం నడిపే ఆ హోటల్ ఇక్కడి విద్యార్థులకి ఒక అమృత ఫలమే..
  ఇంటి భోజనాన్ని తినాలనిపించే ఎంతో మందికి ఇటువంటి హోటల్స్ గొప్ప వరమే..
  మంచి టపా రాసారు
  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. బాగుందండీ మీ పాక హోటల్ కథ .గతంలో హైదరాబాద్ వెళ్ళే దారిలో రోడ్ పక్కన ఇలాటి పాకలు దర్శనం ఇచ్చేయి అక్కడ శుభ్రంగా వున్నా లేకపోయినా (జనం తాకిడి )తప్పనిసరి అల్పాహారం సేవిన్చేవాళ్ళం :)..హైవే పుణ్యాన అవన్నీ కొట్టుకుపోయాయి ...కాని అద్భుతం అయిన 'సెవెన్ డేస్ 'లాంటి రెస్టారెంట్స్ పుట్టుకొచ్చాయి.స్టార్ హోటల్ చార్జెస్ అయితేనేం రుచికరమైన ఫుడ్ దొరుకుతుంది ప్రయాణం లో ఫుడ్ కోసం వెదుక్కోనవసరం లేకుండా .ఇడ్లీ లోకి అయిదు రకాల చట్నీలు సాంబారు అదిరిపోయేట్లున్నాయి .ఈ రోజు ఉదయం వస్తూ అక్కడే మన ఫలహారం :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మావైపు ఈ పాకహోటళ్ళని కాకా హోటళ్ళు అని కూడా అంటారండి. ఈ హోటళ్ళలో ఇడ్లీ, పచ్చడిలకి ఉన్న రుచి ఇంకెక్కడా రాదు. ఇంట్లో స్వయంగా చేసుకున్నా కూడా రాదు. ఆ మధ్యెప్పుడో వాసు గారి బ్లాగులో "అయినాపురం కథలు"లో ఇలాంటి హోటలు గురించి చదివి చిన్నప్పటి ఇడ్లీల రుచి గుర్తొచ్చి నోరూరిపోయింది. మళ్ళీ మీరు ఇప్పుడు గుర్తు చేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @పంతుల జోగారావు: నిజమేనండీ.. నా చిన్నప్పుడు మా ఊళ్ళో బాగా నడిచిన ఒక హోటల్ బాకీల వల్ల మూతపడింది, తర్వాతి కాలంలో.. ధన్యవాదాలు.
  @సునీత: ధన్యవాదాలండీ..
  @శ్రావ్య: నిజమేనండీ.. రుచితో పాటు శుచి ఇంకా పెర్సనల్ కేర్ ఇవన్నీ కూడా కారణం కావొచ్చు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @SHANKAR.R: మీరు చెప్పినవి నేను రుచి చూశాను అని చెప్పడానికి గర్వపడుతున్నాను.. అన్నట్టు కోటిపల్లి పెసర పుణుకులు ల గురించి వంశీ కథల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ధన్యవాదాలండీ..

  @శ్రీనివాస్ పప్పు; ఆ గోదారికి వరదొచ్చేయ్యక ముందే మన గోదారికి వచ్చేసి రుచులన్నీ చూసేసి వెళ్ళండి మరి.. ధన్యవాదాలు.

  @జయ; ఇలాంటివే పల్లెల్లోనూ, చిన్నపాటి పట్టణాల్లోనూ ల్యాండ్ మార్కులండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @కథాసాగర్: ధన్యవాదాలండీ..

  @చిన్ని: పాక హోటళ్ళకి పై కప్పు సరిగ్గా ఉండదు కాబట్టి, టిఫిన్ తిని నీళ్ళు తాగడానికి తల పైకెత్తితే ఆకాశం కనిపిస్తుంది.. ఈ రెస్టారెంట్లో బిల్లు చూసినప్పుడు చుక్కలు కనిపిస్తాయి.. అంతే కదండీ :-) ..ధన్యవాదాలు.

  @శిశిర: అసలు ఇడ్లీ కన్నా చట్నీ రుచిగా ఉండే హోటల్స్ కీ కొదవలేదండీ.. అన్నట్టు 'అయినాపురం కథలు' సిరీస్ లో తర్వాతి కథ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో నేనూ ఒకడిని.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. పాకహోటళ్ళ రుచిలో మైమరచి పోయి నా ఇంటిపేరు (ఇనీషియల్) మార్చేసారు మాస్టారూ!!!
  అది R. కాదు S.
  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. SHANKAR.S: ముందుగా క్షమాపణలండీ.. మీ పేరే గల మిత్రుడి ఇనీషియల్ ఆర్.. ఏదో పరాకులో ఎస్ రాయబోయి ఆర్ రాశాను.. తప్పుని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు