సోమవారం, మార్చి 21, 2011

ప్రభుత్వం

"అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందంటారా? జరుగుతున్నవి చూస్తుంటే, భవిష్యత్తు గురించి మీకేమీ బెంగగా అనిపించడంలేదా?" ...విదేశంలో స్థిరపడిన బ్లాగ్మిత్రులొకరు ఈ మధ్య రాసిన మెయిల్ లో అడిగిన ప్రశ్నలివి. ఈ క్షణంలో ఈ ప్రశ్నలని గుర్తు చేసుకుంటే మాత్రం, 'గమ్యం' సినిమాలో ఓ సన్నివేశం గుర్తొస్తోంది. ధనవంతుడైన కథానాయకుడు అభిరాం, ఓ మోటర్ సైకిల్ మీద తిరుగుతూ తన ప్రియురాలు జానకి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఆ క్రమం లో ఓ చోట గన్ కల్చర్ ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే పరిచయమైన ఓ వ్యక్తిని "ప్రభుత్వం ఏమీ చేయదా?" అని అడిగితే, "ఐదేళ్లకోసారి ఎలచ్చన్ పెట్టుద్దిగా" అంటూ ఠక్కున జవాబిచ్చేస్తాడు గాలిశీను.

ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి ఎన్నికల తంతుని గమనిస్తుంటే, ఈ ఎన్నికల వల్ల జనం అందరికీ ప్రభుత్వం అనేది ఒకటి పనిచేస్తోంది అని తెలిసే వీలుంది కదా అని సంతోషం కలుగుతోంది. పతంజలి చెప్పినట్టుగా ఎన్నికలు మన దేశంలో కేవలం ఐదేళ్లకోసారి జరిగే తంతు. అయితే మాత్రం? ఈ తంతులో కూడా కాలక్రమంగా అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళూ వీళ్ళూ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లాభ పడగలుగుతున్నారు. 'అధికస్య అధికం ఫలం' అన్నట్టుగా, ఎన్నికలు ఎన్ని ఎక్కువసార్లు జరిగితే అందరికీ అంత మంచిదిగా కనిపిస్తోంది.

లేకపొతే, కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు 'అజాగళస్థనం' అనీ, సామన్యులనేకులు 'ఆరోవేలు' అని ముద్దు పేరు పెట్టిన శాసన మండలికి పునః సృష్టి చేయడం ఏమిటీ, ఆ ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఏమిటి? భగవత్ సృష్టిలో ఉన్న లోపాల గురించి చెబుతూ, ఈ సృష్టిలో పునరుక్తి దోషాలు ఎక్కువగా ఉన్నాయంటాడు గురజాడ వారి గిరీశం. అసలు పాల సముద్రం అంటూ ఒకటి ఉన్నాక, మళ్ళీ పెరుగు సముద్రం, నెయ్యి సముద్రం ఎందుకోయ్? అని ఎద్దేవా చేస్తాడు కూడా. శాసన సభ అంటూ ఒకటి ఉన్నాక, మళ్ళీ శాసన మండలి ఎందుకు? అని మన ప్రభుత్వాన్ని ఎవరూ గట్టిగా అడగలేదు..అక్కడక్కడా పీలగా, లీలగా వినిపించిన గొంతుల్ని నాటి పాలకులు పట్టించుకోనూ లేదు.

నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.

ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంబంధాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.

అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?

11 వ్యాఖ్యలు:

 1. "అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

  :D Well said

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కలదు కలదందురు లోకసభను,
  కలదందురు ప్రభుతలోన పంచాయితీలో,
  కలదందురు రాజ్యాంగమును,
  కలదు ప్రజాస్వామ్యమనెడు వింత కలదో? లేదో?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

  Lessa palikitiri.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

  Absolutely true.Moreover, we will get more holidays,new roads,new promises and India will "shine".

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ప్రస్తుత రాజకీయాలని చుస్తే నవ్వాలో ....ఏడవాలో తెలియని పరిస్థితి .సామన్యులు పేదరికంతో ,అజ్ఞానంతో డబ్బుతీసుకుని ఓటు వేస్తున్నారు అనుకుందాము ,మరి MP,MLA, స్థానిక నాయకులుకూడా డబ్బుకి అమ్ముడయి సొంత పార్టీలకి ద్రోహం చేస్తున్నారు .వాళ్ళని ఎలా అర్ధం చేసుకోవాలి ?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @వాసు: ధన్యవాదాలండీ
  @ఆ.సౌమ్య: మరి ఈ సభలన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రజాస్వామ్యం కూడా ఉందనే అనుకోవాల్సి వస్తోందండీ :-) ..ధన్యవాదాలు.
  @సుజాత: ధన్యుడనైతిని :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @స్వాతి: నిజమేనండోయ్.. వెలిగిపోతాం మనం :-) ..ధన్యవాదాలు.
  @అనఘ: ఏముందండీ.. "ధనమేరా అన్నిటికీ మూలం..' అనుకోవడమే.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇది మాత్రం డేంజరస్ ఐడియా అండి.
  అయిదేళ్ళకొకసారి ఎన్నికలంటేనే ఇంత దోచుకుంటున్నారు.
  ఇక ఏడాదికోసారి ఎన్నికలంటే ఇంతకు అయిదు రెట్లు దోచుకుంటారు.
  అప్పుడు చాలా త్వరగా మనం "బోడాంధ్ర" ప్రదేశ్ చూస్తాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @బోనగిరి: పోనీలెండి.. అలా దోచుకోడానికి ఏమీ మిగలక పోవడం వల్లనైనా ఈ దోపిడీ ఆగుతుందేమో:))ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ ఆలోచన బాగుంది. ఏడాదికో కొత్త గ్రైండరూ, కొత్త కుక్కరూ (మళ్ళీ ఎన్నికలకి మన రాష్ట్రంలో కూడా ఈ పధకాలొచ్చేయచ్చు). బాగుంటుంది. :) ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడుతున్న పిల్లలు ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యమనుకునే ప్రమాదముంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @శిశిర: "ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడుతున్న పిల్లలు ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యమనుకునే ప్రమాదముంది." ..నిజం చెప్పారు.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు