గురువారం, మార్చి 24, 2011

పాటలు-పాట్లు

టైటిల్ కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదూ.. పాటలతో పాట్లేమిటన్నదే కదా ప్రశ్న? నేను పాడితే వినే వాళ్లకి పాట్లు అని కొందరైనా ఊహించేసి ఉంటారు. కానీ అది పచ్చి అబద్ధమని నిరూపించడానికే ఈ టపా. ఈ పాటలున్నాయి చూశారూ, ఇవి ఏదో సందర్భంలో తిప్పలు పెట్టేస్తూ ఉంటాయి. పాపం వాటి తప్పేమీ లేదు. కానీ అలా అంటే తప్పు మనదే అని ఒప్పేసుకోవాల్సి వస్తుంది కదా.. అంతపని చేయలేం కాబట్టి, ష్.. గప్ చుప్..

సీరియస్ గా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటామా? ఏదో ఒక పాట గుర్తొచ్చి, అది ఏ సినిమాలోదో వివరం గుర్తురాదు. లేదంటే, పాట మధ్యలో ఓ లైనో రెండు లైన్లో గుర్తొస్తాయి కానీ ఎంత గింజుకున్నా పల్లవి గుర్తుకురాదు. ఒకవేళ ఇవన్నీ గుర్తొచ్చినా గీత రచన ఆచార్య ఆత్రేయా లేక సముద్రాలా? అనో వేటూరా లేక సిరివెన్నెలా? అనో మరో డౌటు పట్టి పీడించడం మొదలుపెడుతుంది. ఇవన్నీ కాకపొతే, అచ్చంగా ఇలాంటి ట్యూన్లోనే ఇంకేదో పాట విన్నాం, అదేమిటబ్బా? అన్న సందేహం.

వినడానికి ఇవన్నీ సిల్లీ సమస్యల్లా కనిపిస్తాయి కానీ, అనుభవించే వాళ్లకి తెలుస్తుంది ఇందులో ఉన్న కష్టం. మొన్నామధ్యన మిత్రులొకరికి మహా సీరియస్ గా, పదో తరగతి పరిక్ష రాసినంత శ్రద్ధగా మెయిల్ రాస్తున్నానా? ఒక ఫ్లో లో రాస్తూ రాస్తూ "ద్వారానికి తారా మణిహారం.. హారతి వెన్నెల కర్పూరం.." పాట బిగినింగ్ వెంటనే గుర్తు రావడం లేదు అని నిజాయితీగా ఒప్పేసుకున్నా.. ఇంక, అక్కడినుంచి చూడాలి, నా జ్ఞాపకశక్తి మీద సందేహాలు, పరిక్షలు. "ఇది మల్లెలవేళయనీ.." ఆవేళ గుర్తురాలేదు మరి.

చాలా రోజులుగా నాకు సమయమూ, సందర్భమూ లేకుండా గుర్తొచ్చి వెంటాడుతున్న లైన్లు "కాటుక కన్నీటి జాలుగా..జాలి జాలిగా.." మరియు "రగిలెను నాగుండె దిగులుగా..కోటి సెగలుగా.." పరిస్థితి ఎలా ఉందంటే, ఈ లైన్లు నేను హం చేస్తున్న విషయం నాకు తెలియడం లేదు. ఆమధ్యనోసారి నలుగురు కూర్చుని నవ్వేవేళ, నా నోటివెంట ఈ లైన్లు.. పరిస్థితి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అక్కడికీ నేనుసైతం ఏదన్నా చేయడం కోసం "రేపల్లె వేచెనూ.." పాటని నా ప్లే లిస్టు నుంచి తాత్కాలికంగా తొలగించాను. అయినప్పటికీ లాభం లేదు.

ఈ లైన్లతో వచ్చిన చిక్కేమిటంటే.. ఏదో పాటలో ఒకటో రెండో లైన్లు పదే పదే బుర్రలో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి.. అచ్చంగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా. ఇలా నాకు రికార్డు బ్రేక్ చేసేసిన చరణపు ముక్క "రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది.. దీనురాలి గూటిలోన.." అంతే..ఇక్కడితో ఆగిపోతుంది.. ఈ "దీనురాలి గూటిలోన.." మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, 'గూటి' ఒత్తి పలుకుతూ. ఇంక తోటలో నిదురించడం నావల్లేం అవుతుంది? అలాగే "కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ" కూడా.. "మానసవీణ మధుగీతాల" ని వినేదేలా మరి?

ఆరోజు ఉదయాన్నే టీవీలో 'నిరీక్షణ' లో పాట చూశాను.. ఇంక రోజంతా "యమునా ఎందుకు నువ్వు?" అంటుంటే, "ఈ యమునెవరూ?" అంటూ ఇద్దరు ముగ్గురడిగారు. "చంద్ర కళాధరి ఈశ్వరీ"ది కూడా ఇదే సమస్య. అసలు ఈబాధలు పడలేక పాటలు వినడం మానేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచన కూడా రాకపోలేదు కానీ, "ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా?" అని నా అంతరాత్మ కొంచం నిష్టూరంగా ప్రశ్నించింది. ఈసమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి, తప్పదు అనుకుని పుస్తకాల్లోలాగా గాఠిగా ఊపిరి పీల్చాను.

నాకు తోచిన పరిష్కారాలలో మొదటిది: ఇలా జరగడానికి కారణం, నాలో అందరి ఎదుటా పాడాలన్న కోరిక బలంగా ఉండి ఉండొచ్చు. అది తీర్చుకుంటే ఈ సమస్య తీరిపోవచ్చు. అయితే ఇందులో ఓ చిక్కుంది. అసలే "జీవహింస మహాపాపం" లాంటి పాఠాలు చదువుకుంటూ పెరిగి పెద్దైన వాడిని. ఇంతటి హింసకి ఎలా పాల్పడను? ఇక రెండోది: బహుశా గత జన్మలో నేనో గో..ప్ప సంగీత విద్వాంసుడిని అయి ఉండొచ్చు. కాబట్టి ఆ వాసనల వల్ల ఇలా జరుగుతూ ఉండొచ్చు. నేను ఏదన్నా టీవీ ఛానల్ కి వెళ్తే, వాళ్ళు నన్ను నా గతజన్మలోకి తీసుకెళ్ళే వీలుంది.

అయితే ఇక్కడున్న చిక్కేమిటంటే, జీవితం బాగా కాంప్లికేటెడ్ అయిపోతుంది. నా గతజన్మ తెలిసిపోతే, రాయల్టీ కోసం మ్యూజిక్ కంపెనీల చుట్టూ తిరగాలి కదా మరి. అదీ కాకుండా వారసులతో సమస్యలూ అవీ కూడా వచ్చేస్తాయి, తప్పదు. అందువల్ల ఈ రహస్యం తెలుసుకోకుండా ఉండడమే మంచిది. చివరాఖరిగా తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నేనిలాగే ప్రోసీడయిపోతే, కొన్నాళ్ళకి ఈ అలవాటు దానంతట అదైనా పోతుంది..లేదా నాకూ, నా చుట్టూ వాళ్ళకీ అలవాటన్నా అయిపోతుంది. అప్పటివరకూ ఈ పాట్లు తప్పవు మరి.

13 వ్యాఖ్యలు:

 1. hello muraligaru,
  mi taa asusualga bagundi.nijame elanti anubhalau naku vunnyai.pkkosari enta alochicnhina gurthuku ravu aa pataala pallavulu.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. hello muraligaru,
  mi tapga eppatilane bagundi. naku kuda chala sarlu patala pallavullu gurthuraka alochinchia sandrbhalu vunnayi.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారూ,
  ఈ టపా చదివి పగలబడి నవ్వాను. ఇందులో ప్రతీవాక్యంతోనూ నూటికి నూట యాభై శాతం అంగీకరించాల్సిందే.
  క్రిందటి వారం ఎందుకో "ధన్య జన్మ ధన్యం" అని రెండు ముక్కలు పాట ట్యూన్ గుర్తుకు వచ్చి రెండు రోజులు విసిగించింది. ఆఖరికి సౌమ్య గారిని, వేణు శ్రీకాంత్ ని కూడా విసిగించను, ఆ పాట ఏంటో హెల్ప్ చెయ్యండి అని. ఓ మూడు రోజులు పోయాక సడన్ గా గుర్తొచ్చింది అది "బహుదూరపు బాటసారి" లో "ఎవరి కెవరు తెలియకుండా ఒకరి కొకరు " అన్న పాట అని. :-))
  సమయం సందర్భం లేకుండా ఏ పాట పడితే ఆ పాట నోట్లోంచి బయటకి వచ్చి పరువు తీయటం బాగా అనుభవమే.
  ఏదో జీవహింస వద్దనే కొన్నాళ్ళు నేర్చుకున్నా, హింస తప్పని పరిస్తితులైతే మాత్రం కలగ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హ హ మురళి గారు మీ పాట్లు బహు ముచ్చట గా ఉన్నాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. naadi variety problem. naaku ilaage edo oka paata gurthukuvachhi paadi vadulthanu. adi pass ayyi ayyi malli naa daggarike vachhi paadtharu evaro okaru. ika konni lines assalu vadalu for ex. aaha andamu chinde hrudayakalam andukone varokare. chusaara ippudu takkuna gurthukuvachhindi.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హహహ! ఇది కామన్ ప్రాబ్లం అందరికీ, మీకొక్కరికే కాదు.మతిమరిపు బాచ్ లోకి వస్తున్నామని అర్ధం. నేనైతే ఎప్పుడో సభ్యత్వం తీసుకున్నాలెండి:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి గారు, ఒక మాంచ్చి పాట పాడేసి మీ బ్లాగ్ లో మా కోసం పెట్టేయండి. మేమందరం తప్పకుండా వింటాం. మీ పాట మీ రివ్యూలంత బాగుంటుందని నాకు గాఠి నమ్మకం. తొందరలోనే మా అందరి కోరిక తీరుస్తారుకదూ.నేనైతే ఇంద్రుడిలాగా ఒళ్ళంతా నెమలికన్నులంత పెద్ద పెద్ద వేయి కన్నులతో ఎదురుచూస్తూ ఉంటాను.

  'గతజన్మ రహస్యం' ఫాలో అయిపోతున్నారా.ఆ ప్రోగ్రాం మీకెలా అనిపిస్తోంది. దాని మీద రివ్యూ ఎప్పుడు రాస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీ పాట సంగతులు బాగున్నాయి.
  అయినా అన్ని వేల పాటల్లో ఎన్నని గుర్తు పెట్టుకుంటాం?
  మరుపు మంచిదే! అనుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @స్వాతి: హమ్మయ్య, నాకు తోడూ ఉన్నారన్న మాట! ..ధన్యవాదాలు.
  @పద్మవల్లి: వావ్.. నేర్చుకున్నారా మీరు? అయితే ఇంకేమండీ, గురువుగారి పేరు చెప్పి పాదేయడమే :) ..ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @రిషి: ధన్యవాదాలండీ..
  @గీత-యశస్వి: ఇది నాకూ అనుభవమేనండీ.. ధన్యవాదాలు.
  @సునీత: నేనైతే పెర్మనెంట్ మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉందండీ మరి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @జయ: వద్దండీ వద్దు.. నా బ్లాగు చదువుతున్న మీకందరికీ అంత పెద్ద శిక్ష వేయడానికి నామనసు ఒప్పుకోవడం లేదు.. ఆ ప్రోగ్రాం చూడడం కూడానా? మొన్నోరోజు చానల్స్ మారుస్తూ ఓ ఐదు నిమిషాలు చూశాను.. పెద్ద ఫార్స్ లాగా అనిపించింది.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: బహుకాల దర్శనం అండీ.. ధన్యవాదాలు.
  @బోనగిరి: మారక మంచిదే లాగా అన్నమాట!! ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు