బుధవారం, జనవరి 20, 2010

(ఇం)కోతి కొమ్మచ్చి

చూడదగ్గ సినిమాలని నేను రెండు రకాలుగా వర్గీకరించుకుంటాను. గొప్ప సినిమాలు, మంచి సినిమాలు. గొప్ప సినిమా మనం థియేటర్ నుంచి బయటికి వచ్చినా మనల్ని వెంటాడుతుంది. అందులో పాత్రలో, మాటలో, పాటలో, కొండొకచో మొత్తం సినిమాలో కొన్నాళ్ళ పాటు మనకు తరచూ గుర్తొస్తూ ఉంటాయి. ఇక మంచి సినిమా అంటే, చూసినంత సేపూ సినిమాని ఆస్వాదిస్తాం. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా నుంచి బయటికి వచ్చాక తల్చుకోడానికి, గుర్తు చేసుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు.

సిని రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ 'సిరీస్' గా రాస్తున్న తన జీవిత చరిత్రలో మొదటి భాగం 'కోతి కొమ్మచ్చి' గొప్ప సినిమా అయితే, రెండో భాగం '(ఇం)కోతి కొమ్మచ్చి' ని మంచి సినిమా అనొచ్చు. సినిమా వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి సినిమాలతో పోలిక సరైనదేనేమో. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయడం తో మొదటి భాగాన్ని ముగించిన రమణ, అదే అంశంతో రెండో భాగాన్ని ప్రారంభించి, సిని రంగ ప్రవేశాన్ని గురించి సుదీర్ఘంగా వివరించారు.



విమర్శకుడిగా అప్పటివరకూ విడుదలైన సినిమాలని చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసిన రమణ, సినిమా కి రచన చేసే అవకాశం రాగానే సహజంగానే కొంచం భయపడ్డారు. వద్దనుకున్నారు. చివరికి దిగారు. రచయితగా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా ఎదిగారు. అయితే ఇదంతా మంచినీళ్ళు తాగినంత సులువుగా జరిగిపోలేదు. ఎందుకంటే రమణ జేబు నిండా సొమ్ములున్న వ్యక్తి కాదు. కేవలం టాలెంట్ ని నమ్ముకుని ధైర్యం చేసిన వ్యక్తి. పక్కనే బాపూ కొండంత అండ.

'కోతి కొమ్మచ్చి' లో రమణ బాల్యం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, అలవి కాని కష్టాలని కూడా చిరునవ్వుతో భరించిన వైనాన్ని అత్యంత హాస్య భరితంగా చెప్పారు మనకి. అయితే రెండో భాగంలో కేవలం సినిమా రంగం మాత్రమే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని కేవలం రెండు మూడు పేజీలకి మాత్రమే కుదించారు. ఫలితం, సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రెండో భాగాన్ని ఆస్వాదించ గలుగుతారు. పైగా, సినిమా రంగ వార్తలని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లకి కొత్తగా అనిపించే విషయాలు కొన్నే ఉన్నాయి.

నిర్మొహమాటంగా రాయడం రమణ శైలే అయినా, ఆత్రేయ గురించీ, ఆదుర్తి గురించీ రాసిన కబుర్లు చివుక్కు మనిపిస్తాయి. ఎంతైనా 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' కదా.. ఆత్రేయ డబ్బు తీసుకుని 'సాక్షి' సినిమాకి పాట రాయకపోవడం, ఆదుర్తి 'మూగమనసులు' సినిమాకి కథ, మాటలు రాయించుకుని డబ్బు ఎగ్గొట్టడాన్నిగురించి రమణ రాసిన విధానం చదివితే ఆయనలోని నిర్మాతే మన కళ్ళ ముందు మెదులుతాడు. ఎస్వీఆర్ భోజనం, జమునతో షూటింగ్ అనుభవాలు, 'బుద్ధిమంతుడు' లో నటిస్తానని భానుమతి అడిగినప్పుడు రమణ గుండెల్లో రాయి పడడం లాంటివి నవ్విస్తాయి.

మొదటి భాగం తో పోల్చినప్పుడు పుస్తకం రెండో భాగంలో కథనం కొంచం పల్చబడిందని అనిపించింది. ఒక ఆత్మకథని కాక సినిమా కబుర్ల పుస్తకం చదువుతున్న భావన కలిగింది. మొత్తం మీద మొదటి భాగం అందించిన రసానుభూతి రెండో భాగంలో లోపించింది. అందువల్లనే కావొచ్చు, పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చిన విషయాలేవీ లేవు నాకు. బాపు బొమ్మలతో 'హాసం' ప్రచురించిన '(ఇం)కోతి కొమ్మచ్చి' పేజీలు 200, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్మిత్రులు వేణూ శ్రీకాంత్ గారి టపాని ఇక్కడ చదవొచ్చు.

17 కామెంట్‌లు:

  1. "నిర్మొహమాటంగా రాయడం రమణ శైలే అయినా, ఆత్రేయ గురించీ, ఆదుర్తి గురించీ రాసిన కబుర్లు చివుక్కు మనిపిస్తాయి. ఎంతైనా 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' కదా"
    నిజమే మరి నాకూ అనిపించిది సుమా...

    "ఆత్రేయ డబ్బు తీసుకుని 'సాక్షి' సినిమాకి పాట రాయకపోవడం, ఆదుర్తి 'మూగమనసులు' సినిమాకి కథ, మాటలు రాయించుకుని డబ్బు ఎగ్గొట్టడాన్నిగురించి రమణ రాసిన విధానం చదివితే ఆయనలోని నిర్మాతే మన కళ్ళ ముందు మెదులుతాడు"
    ధనం నాయనా మనిషిని నడిపించే ఇంధనం అని చెప్పిస్తాడు(రచయిత జంధ్యాల)రావుగోపాలరావు పాత్రచేత"వేటగాడు" సినిమాలో,ఎంత రమణయినా డబ్బు డబ్బే కదా మరి.

    రిప్లయితొలగించండి
  2. కోతి కొమ్మచ్చి చదివాను కాని ఇదిచూడలేదండి.
    చక్కగా వివరించారు.

    రిప్లయితొలగించండి
  3. ప్రతి మనిషి లో ఒప్పు తప్పు వుంటాయి కదండి మురళి. అలా రాయటం రమణ గారి, చేయటం ఆదుర్తి, ఆత్రేయ గారి నెగటివ్ అయ్యివుంటుంది కదా. చేదు తీపిల కలయికే జీవితం. చాలా మంచి సమీక్ష. మీ పుణ్యమా అని పుస్తకాల లిస్ట్ పెరిగిపోతోంది మా అమ్మ కు వచ్చేప్పుడు ఇక్కడకు. మీ మీదే చెపుతాను సుమా.

    రిప్లయితొలగించండి
  4. నేనెప్పుడు చదువుతానో ఏంటో ఈ పుస్తకాలన్నీ :(

    రిప్లయితొలగించండి
  5. క్లుప్తంగా చెప్పారు బావుంది. నాకు మీ టపా చదివాకా పుస్తకం కంటే ఆదుర్తి, ఆత్రేయ విషయాలు గుర్తొస్తూ ఉన్నాయి,ఉంటాయేమో కూడా (ఎప్పటికీ).

    రిప్లయితొలగించండి
  6. టైటిల్ భలే ఉందండీ ... ఎంతైనా 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' కదా"...మీరు రాసింది చదివాక నాక్కూడా చివుక్కుమంది సుమండీ ....

    రిప్లయితొలగించండి
  7. ఇంతలావు బుక్ కొనైతే పెట్టుకున్నాను మురళి గారు. ఎప్పుడు చదువుతానో ఏవిటో! ఇంకొంచెం (పూర్తిగా) రాయండి అంటేనేమో, మీరు వినరు.

    రిప్లయితొలగించండి
  8. ఆత్రేయ మాటేమో కాని ఆదుర్తి గారి లాంటి వ్యక్తి అలా
    దగా చేయటం భావ్యం కాదు కదా?
    సురేఖ_____________________*

    రిప్లయితొలగించండి
  9. సరిగ్గా నేనూ ఇదే చెప్పాలనుకున్నాను .కోతి కొమ్మచ్చి చాలా చాలా బావుంది . అంటే ఇంకోతి కొమ్మచ్చి ........రాజుగారి పెద్దభార్య సామెత గుర్తుచేసుకోవటమే. రెండో భాగం సాధారణ పాఠకులంటే సినీ జనాలకి బాగా వుపయోగపడుతుంది. ఆ ప్రొడక్షన్ ఖర్చులూ, పాట్లూ వంటి వి తెలుసుకుందుకు. పైగా మందుఘాటు ,సిగరెట్ వాసన మోతాదు మించాయి. అయినా సరే రమణ గారు ఏం చెప్పినా ఎలా చెప్పినా నాకు నచ్చేస్తుంది లెండి.
    ఆదుర్తిని చివరికంటా తల్చుకుంటూనే వున్నారు . మరి తల్చుకోరా ఏవిటి, ఆయన ఇవ్వాల్సిందాన్ని నమ్ముకునేకదా పాపం ఈయన పెళ్ళి ముహుర్తం కూడా పెట్టేసుకుంది. అలా దగా చెయ్యటం తప్పేకదండీ . రమణ గారు ఎగ్గొట్టిన అప్పుల్నికూడా అలానే తల్చుకున్నారుకదా రెంటికీ సరి

    రిప్లయితొలగించండి
  10. కోతి కొమ్మచ్చి స్వాతిలో వస్తుందిగా... అదే చదువుతున్నాను...(ఇం)కోతి కొమ్మచ్చి వైపు ఇంకా చూడలేదు!

    ఆత్రేయ, ఆదుర్తి గారి విషయంలో... ఒక నిర్మాతలా స్పందించినా కూడా... వారు చేసింది కూడా సబబు కాదు కదా! అందులో కేవలం డబ్బు కోణం మాత్రమే ఎందుకు చూడాలి?
    (వాళ్ళని విమర్శించటం నా ఉద్దేశం కాదు)

    రిప్లయితొలగించండి
  11. @శ్రీనివాస్ పప్పు: నిజమేనండీ.. డబ్బు డబ్బే.. ధన్యవాదాలు.
    @ప్రేరణ: కోతికొమ్మచ్చి కి కొనసాగింపు అండీ.. ధన్యవాదాలు.
    @రాంగోపాల్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @భావన: తప్పకుండా చెప్పండి.. నేను సిద్ధమే :-) ..ధన్యవాదాలు.
    @మధురవాణి: త్వరలోనే చదువుతారండీ.. త్వరలోనే :) ..ధన్యవాదాలు.
    @వాసు: పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టాక నాకు పదే పదే గుర్తొచ్చిన విషయాలు అవేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @పరిమళం: టైటిల్ క్రెడిట్ బాపూ-రమణలదండీ.. ధన్యవాదాలు.
    @జయ: మొదలు పెడితే పూర్తి చేయడం పెద్ద కష్టం కాదండీ.. మీ కొలీగ్స్ కి ఎవరికీ పుస్తకాల ఆసక్తి లేకపోతే చక్కగా కాలేజీ కి పట్టుకెళ్ళి లీజర్ లో చదివేయొచ్చు.. ధన్యవాదాలు.
    @సురేఖ: "కొత్త వాడికి ఇంత అవకాశం ఇచ్చాను, ఇదే చాలు" అనుకున్నారేమో అని నా సందేహం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @లలిత: మందు ఘాటు, సిగరెట్ వాసన మొదటి భాగం లోనూ ఉన్నాయండీ.. కానీ అక్కడ మనం కథలో పడిపోయి పెద్దగా పట్టించుకోలేదు.. ఇక్కడ కథ లేకపోవడం వాళ్ళ మన దృష్టి వాటిమీద పడింది, అంతే.. :) రెంటికీ సరి అంటారా.. సరే ఐతే.. ధన్యవాదాలు.
    @చైతన్య: స్వాతి లో వచ్చే దానిని పుస్తకాలుగా వేస్తున్నారండీ.. వాళ్ళు చేసిన దానిని పుస్తకం మొత్తంలో పదే పదే తల్చుకోడం వల్ల అలా అనిపించిందండీ నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. బాగా రాశారు మురళి నిజమే ఆదుర్తిగారి గురించి కాస్త ఎక్కువే తలుచుకున్నారు. కానీ ఉన్నదున్నట్లు రాయడంలో ఇలాటివి తప్పవేమో అనిపించింది నాకు.

    రిప్లయితొలగించండి
  16. @వేణూ శ్రీకాంత్: శ్రీనివాస్ గారు చెప్పినట్టు అంతా డబ్బు మహత్యం అండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి