మంగళవారం, జనవరి 12, 2010

సుబ్బీ గొబ్బెమ్మా...

అసలు పండగంటే పల్లెటూరిలోనే చూడాలి.. ఇక సంక్రాంతి పండుగ సంబరాలు చూడాలంటే గోదారి ఒడ్డున పల్లెటూరుకి ప్రయాణమై వెళ్ళాల్సిందే. రాత్రిపూట చలి ముదిరి రగ్గు కప్పుకోవాల్సి వచ్చిందంటే, వీధిలో బంతి మొక్కలు నవలాడుతూ ఎదిగి పూతకి సిద్ధమవుతున్నాయంటే, డిసెంబరాలు విరగబూయడం మొదలు పెట్టాయంటే అర్ధమైపోయేది చిన్నప్పుడు, సంక్రాంతి పండుగ రాబోతోందని.

గుళ్ళో ధనుర్మాసం సేవ మొదలవ్వడం, అమ్మ రోజూ వేసే ముగ్గుకు బదులుగా నెలపట్టు ముగ్గు వేయడం కొండ గుర్తులు. అమ్మో సంక్రాంతి అంటే ఎన్ని పనులు.. భోగి పిడకలు చేసుకోడం మొదలు, కొత్త బట్టలు కుట్టించుకోడం వరకూ.. అస్సలు ఊపిరి సలుపుతుందా?? వీధిలో అందరికన్నా మన ఇంటి ముందు వేసే భోగి మంటే పెద్దదిగా ఉండాలా.. పైగా మనం వేసే భోగి దండే పొడుగ్గా ఉండాలి.. కనీసం లక్ష పిడకలైనా ఉంటే కానీ (లెక్కల్లో నేను చిన్నప్పటి నుంచీ వీకే) అంత పెద్ద దండ రాదు మరి.

మరి భోగి పిడకలు చేసుకోడం మొదలు పెట్టాలంటే గొబ్బిళ్ళు పెట్టే వరకు ఆగి, వాటిని కూడా ఆవు పేడలో కలిపి అప్పుడు కదా పని మొదలు పెట్టాలి. అమ్మ వీధికంతటికీ 'అత్తయ్ గారు' కాబట్టి చుట్టు పక్కల ఆడపిల్లలంతా మనింటికి వచ్చి సందె గొబ్బిళ్ళు పెట్టుకోవాల్సిందే. అమ్మ పెరడంతా బాగు చేసి, కల్లాపి జల్లి ముగ్గులేసి, నేను కష్టపడి సంపాదించి తెచ్చిన ఆవుపేడతో గొబ్బెమ్మలు చేశాక అప్పుడు వచ్చే వాళ్ళు అమ్మాయిలు పూల బుట్టలు పట్టుకుని.

వీళ్ళీ గొబ్బిళ్ళేవో పెట్టేసుకుంటే రేపటినుంచి భోగి పిడకల పని మొదలు పెట్టేసుకోవచ్చు కదా అన్నది నా మొదటి ఆలోచన. ఈ పూజా కార్యక్రమమేదో తొందరగా అయిపోతే నాన బెట్టిన అటుకుల్లో, బెల్లం పొడీ, కొబ్బరి కోరూ, ఏలకు పొడీ కలిపి చేసిన ప్రసాదాన్ని రుచి చూడచ్చు కదా అన్నది రెండో ఆలోచన. వచ్చిన వాళ్లకి మంచినీళ్ళు, వాళ్ళు తెచ్చుకోడం మర్చిపోయిన పూజ వస్తువులు అందించే అదనపు డ్యూటీ కూడా పడేది.

అమ్మ తన పూజ పుస్తకాల్లోనుంచి ఓ పుస్తకం చూసి ఏదో చదివితే, ఆడ పిల్లలంతా గొబ్బెమ్మలకి పూజ చేసేవాళ్ళు. చివరగా వాళ్ళంతా గొబ్బిళ్ళు పెట్టిన ముగ్గు చుట్టూ ప్రదిక్షిణ చేస్తూ 'పాట' పాడేశారంటే గొబ్బిళ్ళు పెట్టడం అయిపోయినట్టే. ఇంక ప్రసాదాలు పెట్టేస్తారు. అమ్మ పాట చెబుతుంటే వాళ్ళు అందుకుని చప్పట్ల దరువేస్తూ, ప్రదిక్షణ చేస్తూ పాడేవాళ్ళు.


"సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే..
మొగలి పూవంటీ.. మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే.."

పాట చివరికొచ్చేసరికి ఆడపిల్లలంతా ఉన్నట్టుండి పాడడం మానేసేవాళ్ళు.. "ఊ... అనాలమ్మా.." అని అమ్మ కొంచం నొక్కి చెబితే ఇక తప్పక లోగొంతుకతో చెప్పేవాళ్ళు చివరి వాక్యం.. వెంటనే బాగా నవ్వుకునే వాళ్ళని జ్ఞాపకం. ఆలోచనలు ప్రసాదం మీద, భోగి పిడకల మీదా ఉండడంతో పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. చూస్తుండగానే కొన్ని సంక్రాంతులు గడిచిపోడం, నేను కాలేజీకి వచ్చేయడం జరిగిపోయింది. దృష్టి భోగి పిడకల లాంటి చిన్న విషయాల నుంచి 'ఇతర' విషయాల మీదికి మళ్లడం సహజమే కదా..

ఎప్పటిలాగే మా పెరట్లో గొబ్బిళ్ళు. నా డ్యూటీ నేను చేస్తున్నా, కించిత్ కుతూహలంగా.. అమ్మాయిలు వచ్చేశారు.. ఎక్కువ మంది నా ఈడు వాళ్ళు.. ఒకరిద్దరు కొంచం అటూఇటూ గా ఉన్నవాళ్ళూ.. నేను పెరట్లోనే యేవో పనులు కల్పించుకుని, నా పనుల్లో నేనున్నా.. వాళ్ళు ఎప్పటికీ పూజ మొదలు పెట్టరు.. ఇంతలో ఒకమ్మాయి 'అత్తయ్ గారి' చెవి కొరికింది. అమ్మ యెంతో లాలనగా "వీధిలోకెళ్లి చదువుకో నాన్నా.. " అని ఆర్డరేసేసింది. ఇంక చేసేదేముంది..

మామూలప్పుడే ఇంగ్లిష్ పాఠం అంతంతమాత్రంగా అర్ధమవుతుంది.. పెరట్లో అంత హంగామా జరుగుతుంటే, ఏ కుర్రాడైనా వీధిలో కూర్చుని షెల్లీ గురించో షేక్స్పియర్ గురించో చదవగలడా? నేనూ అంతే.. పైగా, గొబ్బిళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ చేసిన నాకు పూజ చూసే కనీస హక్కుందని ఆ క్షణంలో చాలా బలంగా అనిపించింది. దేవుడి గదికి ఉన్న చిన్న కిటికీ రెక్కని కొంచం పక్కకి తప్పిస్తే పెరడంతా చక్కగా కనిపిస్తుందన్న విషయం ఏదో ఆశరీరవాణి చెప్పినట్టుగా గుర్తొచ్చేసింది.

అసలే నాకు ఎప్పుడు ఏ పని అనుకుంటే అది వెంటనే చేసేసే అలవాటు అవడంతో, పుస్తకం పక్కన పెట్టి పిల్లిలా దేవుడిగదిలోకి ప్రవేశించాను. అమ్మ గొంతు వినిపిస్తోంది, అమ్మాయిలు కనిపిస్తున్నారు. నాక్కావాల్సిన పాట వచ్చేసింది. 'మొగలీ పువ్వంటీ..' తర్వాత నిశ్శబ్దం.. ఈసారి అమ్మ మాట వెంటనే వినలేదు వాళ్ళు. మొత్తం మీద అమ్మ సాధించింది.

వోణీలు నోటికి అడ్డం పెట్టుకుని, నేల చూపులు చూసుకుంటూ మొదటి సారి మెల్లిగా గొణిగి, రెండోసారి కొంచం గట్టిగా చెప్పారు వాళ్ళు. నేను బుద్ధిగా చదువుకోడం కోసం వీధి ఆరుగు మీదికి వెళ్ళబోతుండగా దేవుడి గది గుమ్మం దగ్గర .అలికిడయ్యింది. చూస్తే.. ఎదురుగా అమ్మ..

...బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

44 కామెంట్‌లు:

  1. Yeppudu sudden entry ichedi mee nannagaru kada.. ee sari for a change mee mummy icharu anamata.

    రిప్లయితొలగించండి
  2. బలే వుంది మీ అనుభవం.
    మేం కూడా చిన్నప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకుని ఆ పాట ని మీరు చెప్పినట్టే పాడేవాళ్ళం. కాని మా తమ్ముడు నా వెనకాలే వుండేవాడు. ఆఖరున వాడి గొంతు ఒక్కటే గట్టిగా వినిపించేది.. ఇప్పుడు ఎంత నవ్వు వస్తుందో...

    రిప్లయితొలగించండి
  3. తెలుగు పండుగల భోగం పల్లెల్లోనే చూడాలి! ప్చ్!! నేనింకో జన్మెత్తేప్పటికి బహుశా ఆ పల్లెలు పల్లెల్లా ఉండవేమో?

    రిప్లయితొలగించండి
  4. దృష్టి భోగి పిడకల లాంటి చిన్న విషయాల నుంచి 'ఇతర' విషయాల మీదికి మళ్లడం సహజమే కదా..
    _____________________________________
    :)

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగున్నాయండి మీ సంక్రాంతి అనుభవాలు. మొత్తానికి మంచి పాటే వింటు పెరిగారు. నాకు నెమలి ముగ్గు చాలా బాగుంది. ఇది ఎవరు వేసారు? ఎక్కడ వేసారు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అమ్మ గారికి నా నమస్కారాలు అందజేయండి.

    రిప్లయితొలగించండి
  6. hello muraligaru,
    motham mida bhogi mantala vechadannanai gurhtuku techaru.i rojllo aslu bhogi amntlau vesthurantara?
    happy bhogi nadi miku

    రిప్లయితొలగించండి
  7. ముగ్గు బలే వుంది అక్కడ కూడా నెమలీకే నా .:-) బాగున్నాయి మీ దొంగ చూపుల సంక్రాంతి కబుర్లు. మీకు మీ కుటూంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. బాల్యం కల్లెదుట కనిపించేలా గుర్తుకు తెప్పించారు.. మీకు నూ... సంక్రాంతి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  9. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. మా ఊర్లో సంక్రాంతి గుర్తు చేసారు. ఎన్నాల్లయిపోయిందో వెళ్లి మా ఊరికి. ఇది వరకూ పది రోజులు సెలవులిచ్చేవారు సంక్రాంతికి హాయిగా. భలేగా ఉండేది. కానీ మీరు చెప్పిన గొబ్బిళ్ళ పాటలకి అమ్మాయిలు రావడం మాత్రం గుర్తురావట్లేదు. బహుసా గుర్తుపెట్టుకునేంత బావున్నా అమ్మాయిలు రాలేదేమో :)

    అన్నట్టు ముగ్గు చాలా బావుంది. ఇలాటిది ఎప్పుడూ చూడలేదు సంక్రాంతికి రథం ముగ్గు, మెలికెల ముగ్గులూ తప్ప.

    మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    నాకూ ఒక టపా రాయాలనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  11. మీకు కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నెమలి చాలా బాగుంది..మీరే వేసారా!!

    రిప్లయితొలగించండి
  12. మీకూ మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. మంచి జ్ఞాపకాలు తోడుకుని మురిసే టపా వ్రాసారు ;) మీకు మీ కుటుంభసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  14. హ హ :-) వండర్ ఫుల్లూ..
    చాలా బాగుంది మురళిగారు.
    మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  15. మీ నెమలి ముగ్గు చాలా బాగుందండి .
    అందరూ సంక్రాంతి గురించి చాలా చాలా చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తు తెస్తున్నారు .
    సంక్రాంతి శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  16. హన్నా.. మురళీ గారూ.. అయితే మీరు సార్థకనామధేయులన్నమాట ;-) అంతా చెప్పారు గానీ, సరైన సన్నివేశం మాత్రం వివరంగా చెప్పకుండా అక్కడే ఆపేసారేంటి .? ఇంతకీ మీ అమ్మగారు ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారా? లేక ఏమైనా అక్షింతలేసారా? లేకపోతే మీరే తెలివిగా దేవుడి గదిలో షెల్లీ పోయెట్రీ చదువుతున్నానని చెప్పి తప్పించేసుకున్నారా? అప్పుడేం జరిగిందో చెప్పాల్సిందే..!
    ఇక భోగి విషయానికొస్తే.. ఊరికే భోగి మంట వేస్కోడం, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టడం..ఇంతవరకే నాకు తెలుసు. గొబ్బి పూజలు, పాటలు, భోగి దండలు.. ఇవేవీ తెలీదు నాకు :( :( మీ జ్ఞాపకాలతో అవన్నీ నాలాంటి వాళ్లకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  17. మరో విషయం అడగడం మర్చిపోయాను. మీ పోస్టులో పెట్టిన నెమలి ముగ్గు ఎంత బావుందండీ.. అద్భుతం..!! వేసినవాళ్లెవరో తెలుసుకోవచ్చా?

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
    అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
    *** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
    SRRao
    శిరాకదంబం
    http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

    రిప్లయితొలగించండి
  19. "కనీసం లక్ష పిడకలైనా ఉంటే కానీ అంత పెద్ద దండ రాదు మరి" ఇది చదివైతే నవ్వాపుకోలేకపోయాను :))
    పల్లెటూళ్ళలో పండగల కళే వేరు కదా!
    మీ సంక్రాంతి జ్ఞాపకాలు చాలా బావున్నాయండి.. ముఖ్యంగా 'బాల'మురళి 'యువ'మురళిగా ఎదగడం ఇంకా బావుంది :-)

    మీకూ, మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  20. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  21. టపా గురించి ప్రత్యేకం చెప్పేదేముంది గానీయండి, నెమలిపింఛం ముగ్గు మాత్రం- చాలా చాలా బావుంది -

    రిప్లయితొలగించండి
  22. :) టపా చదువుతుండగా నాకు తెలియకుండానే నా కింది పెదవి నా పంటి కిందకి వెళ్ళిపోయింది, మొత్తం సినిమా రంగుల్లో చూపించారు కదా. నాకు తెలిసి బహుశా మీ అమ్మగారు ఏమీ మాట్లాడకుండా మీవైపు అదోలాంటి చూపు విసిరి వెళ్ళిపోయిఉంటారు కదా? జీవితాంతం మనం గిల్ట్ ఫీలింగ్తో ఎలా మధనపడేలా చేయచ్చో అమ్మకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు

    రిప్లయితొలగించండి
  23. ఈ సారి మీరంతా సంక్రాంతి గురించి రాస్తె , నేను వేరే దారి పట్టినట్లున్నాను . అందుకే నా పోస్ట్ ఎవరూ చదవలేదు .స్చప్ !!!
    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  24. మురళి గారు, బాల్యంలోకి భలే అలవోకగా తీసుకుపోతారండి మీరు. మీ టపా చదివాక ఆ రోజంతా మనసు మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోదాం రా అని పేచీ పెట్టేస్తూ ఉంటుంది.

    సంక్రాంతి శుభాకాంక్షలు.:)

    రిప్లయితొలగించండి
  25. మీ సంక్రాంతి కబుర్లు చాలా బాగున్నాయి. అసలు భోగి నాడు అంత హంగామా ఉంటుందని కూడా తెలీదు నాకు!

    మీకు, మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  26. తర్వాత ఏం జరిగిందో చెప్పాలి కదండీ.. మురళి గారు.

    రిప్లయితొలగించండి
  27. @స్వాతి: నాన్నొచ్చి ఉంటే ఇప్పుడు ఈ పోస్ట్ రాసే అవకాశం ఉండేది కాదేమోనండీ :-) ..ధన్యవాదాలు.
    @శ్రీలలిత: 'మీ తమ్ముడి గొంతు..' ఊహించుకుంటేనే భలే నవ్వొస్తోందండీ.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ఈ జన్మలో కూడా ఆ అవకాశం లేదని చెప్పడానికి చింతిస్తున్నానండీ.. కేబుల్ టీవీ పుణ్యమా అని ఇప్పుడెవరూ కలవడం లేదు పల్లెల్లో కూడా.. రచ్చబండలూ, పేరంటాలూ క్రమంగా కనుమరుగవుతున్నాయి.. మార్పు అనివార్యం కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @వీరుభొట్ల వెంకట గణేష్: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @జయ: ముగ్గు గూగులమ్మ ఇచ్చిందండీ.. ధన్యవాదాలు.
    @స్వాతి మాధవ్: పూర్తిగా మానేయలేదు కానీ బాగా తగ్గిపోయాయండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. @భావన: ఈ మధ్యనే బ్లాగులో ఫోటోలు పెట్టడం నేర్చుకున్నానండీ.. అదీ సంగతి.. ధన్యవాదాలు.
    @నెల బాలుడు: ధన్యవాదాలండీ..
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  30. @వాసు: మరింక ఎందుకండీ ఆలస్యం.. రాసేయండి టపా.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: నాకంత దృశ్యం లేదండీ.. గూగులమ్మ ఇచ్చింది.. ధన్యవాదాలు.
    @తృష్ణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  31. @మరువం ఉష: ఎన్నేళ్ళు గడిచినా కరిగిపోకుండా, తరిగిపోకుండా వెంటాడేవి జ్ఞాపకాలే కదండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: నెమలి ముగ్గు నా రచన అని అపార్ధం చేసుకోకండి, గూగులమ్మ ఇచ్చింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. @మధురవాణి: అమ్మ ఏమందో నేను చెప్పడం కన్నా మీరు ఊహించుకుంటేనే బాగుంటుంది కదండీ.. అలాంటి సందర్భాల్లో ఏ అమ్మ అయినా ఏం చేస్తుందో మా అమ్మ కూడా అదే చేసింది :-) :-) ..ధన్యవాదాలు. ముగ్గు వేసింది గూగులమ్మ అండీ.. ఫోటో కోసం వెతుకుతుంటే అనుకోకుండా దొరికింది..
    @SR Rao: ధన్యవాదాలండీ..
    @అప్పారావు శాస్త్రి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  33. @నిషిగంధ: అప్పట్లో (ఆమాటకొస్తే ఇప్పటికీ) నా లెక్కల ప్రావీణ్యం అదండీ.. ధన్యవాదాలు.
    @సృజన: ధన్యవాదాలండీ..
    @బుడుగు: అయ్యో ప్రయోగం కాదండీ.. నీలం రంగులోనూ, చంద్రకాంత రంగులోనూ డిసెంబర్/జనవరి నెలల్లో పూసే పల్చని పూలని మా ఊళ్ళో డిసెంబరాలు అనే అంటారు ఇప్పటికీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. @ఊకదంపుడు: టపా నాది, ముగ్గు గూగులమ్మదీ అండీ.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: "జీవితాంతం మనం గిల్ట్ ఫీలింగ్తో ఎలా మధనపడేలా చేయచ్చో అమ్మకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు" Excellent!! ..ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: మీ పోస్టు చదివానండీ, చాలా బాగుంది.. రెండు పోస్టులు ఒకేసారి చదవడం వాళ్ళ విడిగా కామెంటలేదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  35. @శిశిర: ధన్యవాదాలండీ..
    @చైతన్య: అవునా.. పల్లెల్లో కొంచం హడావిడి ఎక్కువగానే ఉంటుందండీ.. ధన్యవాదాలు.
    @MY DIARY: అది మీ ఊహకే వదిలేశానండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. ఆంద్రలేఖ (http://andhralekha.com/) వారి బ్లాగుల పోటీలో మొదటి పది బ్లాగుల్లో మీది కూడా ఉన్నందుకు అభినందనలు. చైతన్య మీ అసలు పేరా??

    రిప్లయితొలగించండి
  37. :-)..వంటిల్లు కిటికీ నుండి అమ్మాయిలకి సైటు కొట్టి మీ అమ్మగారికి దొరికేసారా... :-)...మీరేమైనా అనండి..అలాంటివి ఎవరికీ దొరకకుండా చెయ్యాలంటే కొంచెం నైపుణ్యం కావాలండీ..అందరివల్ల కాదు...:-)

    నేనైతే మా అక్క భోగిదండను రాత్రి పూట మేడమీదకి తీసుకెళ్ళి పురితాడు కోసేసి, కొన్ని పిడకలు కొట్టేసి నా భోగిదండకు గుచ్చుకుని మళ్ళీ యాధాప్రకారం మా అక్క దండని గుచ్చేసి పెట్టేసేవాడిని. తర్వాత భోగి రోజు పిల్లకాయలందరిలోనూ మనదే పెద్ద భోగి దండ...విషయం మా అక్కకి తెలిసే సరికి నేను అప్పటికే భోగి దండను భోగి మంటల్లో వేసేసి అఫీషియల్ గా చేతులూపుకుంటూ వెళ్ళిపోయేవాణ్ణి.

    మీరన్నది నిజమే...ఇప్పుడు ఇలాంటివి ఇంచుమించులేవనే చెప్పొచ్చు.

    రిప్లయితొలగించండి
  38. హన్నా ....ఎంత వీధిలో అమ్మాయిలందరికీ అమ్మ 'అత్తయ్ గారు' ఐతే మాత్రం అలా దొంగచూపులు చూస్తారా ?అటుకుల ప్రసాదం మీదనుండి అతివల మీదకు మళ్ళిందన్న మాట నెమలికన్ను దృష్టి !అమ్మ ఏమనుకునుంటారు లెండి ఏవయసుకు ఆ ముచ్చట అనుకుంటారు . సంక్రాంతి ముచ్చట్లు ....బావున్నాయి కాని ఇంతకూ వారిలో మీ మనసు దోచిన మగువ ఎవరైనా ఉన్నారో లేదో చెప్పనేలేదు :)

    రిప్లయితొలగించండి
  39. మీనుంచి చాలా కాలమైంది ఒక టపా వచ్చి. ఎందుకు రాయటంలేదు, ఏమైనా అలిగారా!... నేను కూడా మీరు టాప్ టెన్ లో ఉన్నారనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  40. @ మురళి: మీరు నన్ను క్షమించాలి. మీ బ్లాగ్ మళ్ళీ చదువుతుంటే నా వ్యాఖ్య చూశాక గుర్తొచ్చింది. నాకు సంక్రాంతి మీద రాయాలని ఆలోచన ఈ టపా చూసాకే వచ్చింది. Acknowledge చెయ్యడం మర్చిపోయా నా టపా లో . ఇప్పుడు సవరించాను. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  41. @సిరిసిరిమువ్వ: అలెర్ట్ చేసినందుకు ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: ఇప్పుడు మీ దగ్గర ఆ నైపుణ్యాలు నేర్చుకుందామన్నా, చాలా ఆలస్యమై పోయిందండీ ప్చ్ :-) :-) బాగున్నాయి మీ జ్ఞాపకాలు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  42. @పరిమళం: ఉంటే చెప్పకుండా ఉంటానా చెప్పండి.. మనసు దోచిన మగువ ముచ్చట్లు మరోసారి.. ధన్యవాదాలండీ..
    @జయ: అయ్యో.. ఎవరిమీద అలగాలండీ? .. కొంచం బిజీ గా ఉండడం వల్ల రాయడం కుదరలేదండీ.. ధన్యవాదాలు.
    @వాసు: అయ్యయ్యో.. సారీ ఎందుకు చెప్పండి? జ్ఞాపకాలన్నీ ఇలాగే గుర్తొస్తాయి.. ఏమైనప్పటికీ మీ నుంచి అంత అందమైన టపా రాడానికి నా టపా కారణం అయ్యిందంటే కూసింత గర్వంగానే ఉందండీ నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి