శనివారం, జనవరి 02, 2010

సువర్ణ సుందరి

నేను ఒక సినిమా చూసి ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్నది మొదటిసారి జరిగింది 'సువర్ణ సుందరి' సినిమాతో. హీరోయిన్ అంజలీ దేవి. ఆమెతో ప్రేమలో పడ్డ ముహూర్త బలం ఏమిటో కానీ, నా హీరోయిన్ల జాబితాకి అంతు లేకుండా పోతోంది. పిడకల వేటని పక్కన పెట్టి, అసలు కథ లోకి వస్తే, యాభై రెండేళ్ళ క్రితం వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాని ఆపాత మధురాల్లో ఒక ఆణిముత్యం అనడానికి అభ్యంతర పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరేమో.

అంజలీ పిక్చర్స్ పతాకం పై అంజలి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు నిర్మించి, సంగీతం సమకూర్చిన 'సువర్ణ సుందరి' సినిమాకి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. టైటిల్ పాత్రని అంజలీ దేవి, ఆమె సరసన కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వర రావు నటించారు. కథాశివబ్రహ్మం గా పేరు పొందిన సదాశివబ్రహ్మం రాసిన జానపద కథలో బోల్డన్ని మలుపులూ, మెలికలూ. మాయలూ, మంత్రాలూ, శాపాలూ, శాప విమోచనాలూ.. ఆద్యంతం ఆసక్తికరం.



కథలోకి వస్తే జయంతుడు (అక్కినేని) అనే రాకుమారుడు. ఒకరకంగా ఇతనిది శాపగ్రస్త జీవితం. గురుకులం లో విద్యాభ్యాసం పూర్తవుతుండగానే, తను సోదరిగా తలచిన గురు పుత్రిక ప్రేమిస్తున్నానంటూ వెంట బడుతుంది. తనని కాదన్నందుకు, అత్యాచారం చేశాడని నింద మోపుతుంది. రాజ్యానికి వెళ్తే ఆవేశంలో తండ్రి విధించే శిక్షకి గురి కావాల్సి వస్తుందని రాజ్యం నుంచి పారిపోతాడు. అనుకోకుండా ఒక గంధర్వుడికి శాప విమోచనం కలిగించి, ఎగిరే చాపా, దండం, కమండలం కానుకలుగా అందుకుంటాడు. ఐతే, ఆ కానుకలు దొంగల పాలవుతాయి.

ఓ గుహలో తల దాచుకున్న జయంతుడికి, ఇంద్రలోకం నుంచి శివపూజ కోసం తన చెలికత్తెలతో కలిసి వచ్చిన ఇంద్ర దర్బారు ప్రధాన నర్తకి సువర్ణ సుందరి కంట పడుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజ ముగిశాక జయంతుడిని చూసిన సువర్ణ సుందరి తొలి చూపులోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. జయంతుడికి ఒక వేణువుని కానుకగా ఇచ్చి తనని పిలవాలంటే ఆ వేణువు ఊదితే చాలని చెబుతుంది సుందరి. ఏ పనీ లేకుండా తోచీ తోచకా కాలక్షేపం చేస్తున్న జయంతుడు వేళా పాళా లేకుండా వేణువు ఊదేస్తూ ఉంటాడు.

ఒకసారి ఇంద్రలోకంలో నృత్య ప్రదర్శన ముగుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయిన సువర్ణ సుందరిని పరీక్షిస్తాడు దేవ వైద్యుడు. (ఏం చెప్పాడో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి? తెలుగు సినిమాలు చూసే వాళ్ళు సులువుగా ఊహించ గలరు) ఆగ్రహం పట్టలేని ఇంద్రుడు, సుందరికి స్వర్గ లోక ప్రవేశం నిషేధించడంతో పాటు జయంతుడు ఆమెని మర్చిపోతాడని, ఆమె తాకితే అతడు శిలగా మారిపోతాడనీ శాపం ఇస్తాడు. ఆమె బతిమాలితే, ఆమెకి పుట్టిన బిడ్డ వల్ల శాప విమోచనం కలుగుతుందని అమెండ్మెంట్ ఇస్తాడు.

ఇక్కడ భూలోకంలో సువర్ణ సుందరిని మర్చిపోయిన జయంతుడికి, అనుకోకుండా తను గంధర్వుడి నుంచి పొందిన దండం దొరుకుతుంది. అది పట్టుకుని తోచీ తోచకా అడవుల్లో తిరుగుతూ, ఒక పాము నెత్తిన దండంతో మోదుతాడు. ఆ పాము కాస్తా నెత్తురోడే తలతో నాగకన్యగా మారి, పగలు స్త్రీ గానూ, రాత్రి పురుషుడిగానూ మారిపొమ్మని శాపం ఇస్తుంది జయంతుడికి. సువర్ణ సుందరి భూలోకం వచ్చేసి ఒక మగ బిడ్డని ప్రసవిస్తుంది. ఓ ప్రమాదంలో ఆమె ఆ పసిబిడ్దని పోగొట్టుకోడం, ఆ బిడ్డ ఒక వృద్ధ పశువుల కాపరికి (గుమ్మడి) దొరకడం జరుగుతుంది.

విడిపోయిన జయంతుడూ, సువర్ణ సుందరీ, వాళ్లబ్బాయీ ఎలా కలిశారు? జయంతుడి శాపాలు ఎలా విమోచనం అయ్యాయి? అన్నది మిగిలిన కథ. మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ నిడివి (ఇప్పుడైతే ఇంచుమించు రెండు సినిమాలకి సమానం) గల ఈ సినిమాకి ప్రాణం పోసింది అంజలి నటన, సంగీతం. అసలు ఈ సినిమాకి నాయికా నాయకులు అంజలి, ఆదినారాయణ రావులే అనిపిస్తుంది నాకు. జయంతుడిగా నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. పైగా రెండో సగంలో స్త్రీ గా మారిపోతాడు.

ఆడ జయంతుడిగా రాజసులోచన చేసింది. (నాకు అత్యంత ఇష్టమైన ఒక 'రొమాంటిక్ సాంగ్' లో నటించినందుకు గాను ఈమె అంటే ప్రత్యేకమైన ఇష్టం) సినిమా మొదటి సగంలో దేవకన్యగా సాత్వికాభినయం ప్రదర్శించి, రెండో సగంలో భూలోకంలో సాధారణ స్త్రీగా, బిడ్డకి దూరమైన తల్లిగా, భర్త ఎదురుగా కనిపిస్తున్నా పలకరించలేని భార్యగా కరుణ రసాన్నీ, ఆపై ఒక రాజ్యానికి మంత్రిగా వీర రసాన్నీ అలవోకగా అభినయించింది అంజలి.

'సువర్ణ సుందరి' పాత్ర కోసం ఆమె ఎంపిక చేసుకున్న దుస్తులు, ఆహార్యం ఇప్పటికీ ఆ తరహా పాత్రలకి ఒక రిఫరెన్స్ అనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమా చేసేనాటికి ఆమె వయసు ముప్ఫై ఏళ్ళు. నిజజీవితంలో ఇల్లాలు, మాతృమూర్తి. ఇవేవీ 'సువర్ణ సుందరి' పాత్ర పోషణకి అడ్డు రాలేదు. అంజలి నటన తర్వాత చెప్పుకోవాల్సింది ఆదినారాయణ రావు సంగీతం. ఏ ఒక్క పాటనీ తీసేయలేము.

ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే పాట, ఏ టీవీ చానల్లో పాటల పోటీ జరిగినా గ్రాండ్ ఫినాలే లో తప్పక వినిపించే పాట, నాకు అత్యంత ఇష్టమైన పాట 'హాయి హాయిగా ఆమని సాగే..' జిక్కి, ఘంటసాల పాడారు. ఈ పాట ఒక్కో చరణాన్ని, ఒక్కో రాగం లో కంపోజ్ చేయడమే కాక, ఒక్కో సెట్ లో చిత్రీకరించారు. ముఖ్యంగా 'చూడుమా చందమామ..' చరణంలో అంజలిని చూస్తే నిజంగా చందమామే దిగి వచ్చినట్టు అనిపిస్తుంది.

వెంటనే చెప్పుకోవాల్సిన మరో పాట 'పిలువకురా...' సుశీల పాడిన ఈ పాటకి అంజలి అభినయాన్ని చూసి తీరాల్సిందే. ఆమె ఇంద్రసభలో నృత్యం చేస్తూ ఉంటే, జయంతుడు భూలోక ఉద్యానవనంలో ఆపకుండా వేణువు ఊదుతూ ఉంటాడు. "ఇదో నాగేసర్రావూ.. ఆ పిల్ల డేన్సింగులో ఉంది కదా.. అవగానే వస్తుందిలే.. కాసేపు ఆ ఊదడం ఆపు.." అని చెప్పాలనిపిస్తుంది మనకి. సుశీల పాడిన 'నీ నీడలోన నిలచేను రా.' పాటకి కూడా అంతే.. ఆమె ఇంద్ర సభలో నాట్యం చేస్తూనే ఉంటుంది, జయంతుడు వేణుగానం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ రెండు పాటలూ ఇంద్రలోకం సెట్లలో చిత్రించారు. (వీనస్ స్టూడియో, అప్పటి బోంబే).

గురు పుత్రిక, ఆమె చెలికత్తెల మీద తీసిన పాట 'బంగారు వన్నెల..' కాగా హాస్య గణం రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ల మీద తీసిన పాట 'ఏరా.. మనతోటి గెలిచే వీరులెవ్వరురా..' బిడ్డ దూరం అయినప్పుడు సువర్ణ సుందరి పాడుకునే పాట 'నా చిట్టి పాపా..' (ఎప్పటిలాగే) గుమ్మడి మరణించగానే, అప్పటికి ఐదారేళ్ళ వాడైన పిల్లవాడు రోడ్డున పడడం, తల్లి, స్త్రీ రూపంలో ఉన్న తండ్రి అంతా ఒక చోట చేరినా ఒకరినొకరు గుర్తించుకోలేని సందర్భంలో నేపధ్యంలో వచ్చే విషాద గీతం 'అమ్మా అమ్మాయని..' ఈ మధ్యలో అంజలి బొమ్మలమ్ముతూ పాడే పాట 'బొమ్మాలమ్మా బొమ్మలూ..' అప్పటి సినిమాల పేర్లన్నీ వినిపిస్తాయి ఈ పాటలో.

ఇవే కాకుండా గిరిజ, బృందం మీద చిత్రించిన 'పూబాల పెళ్లి..' రాజసులోచన, గిరిజల మీద తీసిన 'తధీం నన..' రాజసులోచన, రాక్షసుడి మీద తీసిన 'నా నోము పండే ఈనాడు..' అంజలి పై మరో కరుణరస గీతం 'శంభో నా మొర వినవా..' ఉన్నాయి ఈ సినిమాలో. గ్రాఫిక్స్ అంతే ఏమిటో తెలియని ఆ రోజుల్లో చిత్రించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్య పరుస్తాయి. మనిషి తల, పాము శరీరం తో ఉండే గంధర్వుడు, భారీగా కనిపించే రాక్షసుడు, శాపం వల్ల శిలగా మారిపోతున్న జయంతుడు.. తదితర సన్నివేశాలన్నీ కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి తీసినా క్వాలిటీ లో ఎక్కడా నాసిరకంగా అనిపించవు.

కథలో నాయకుడు నాయికని మర్చిపోయే చోట 'శాకుంతలం,' కొడుకు ద్వారా శాప విమోచనం అన్న దగ్గర 'బాలనాగమ్మ' గుర్తొస్తాయి. హాస్యాన్ని కథలో భాగం చేసినప్పటికీ, కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ సుదీర్ఘంగా అనిపిస్తాయి. పాత్ర స్వభావం వల్లనో, మరెందువల్లో తెలీదు కానీ అక్కినేని జ్వరం నుంచి అప్పుడే కోలుకున్న వాడిలా కనిపిస్తాడు చాలా చోట్ల. తెలుగులో విజయవంతమైన ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో పునర్నిర్మించారు. ఆపాత మధురాలని ఇష్టపడేవాళ్ళు మర్చిపోలేని సినిమా ఈ 'సువర్ణ సుందరి.'

23 కామెంట్‌లు:

  1. హాయి హాయిగా ఆమని సాగే పాట ఎన్నిసార్లైనా వినొచ్చు. నాకు చాలా చాలా ఇష్టమైన పాట..

    రిప్లయితొలగించండి
  2. విజయవంతంగా ఆడిన ఈ సినిమా కన్నా అంజలీదేవి నటించిన సినిమాల్లో నాకు సంఘం, లవకుశ, జయసింహ, సతీ సక్కుబాయి సినిమాల్లో నటన బాగా నచ్చుతుందండీ. సువర్ణ సుందరిలో నాకు "పిలువకురా.." పాట ఇష్టం. ఎప్పటిలా బావుందండీ పరిచయం.

    రిప్లయితొలగించండి
  3. నాకెంతో ఇష్టమైందీ, మాయా బజారు కంటె ఎక్కువ సార్లు చూసిందీ అయిన సువర్ణసుందరి చిత్రం గురించి ఎవరెన్ని సార్లు ఎంత రాసినా చదవడం నాకానందదాయకం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మనసుకి హాయిగా వుంది మీ టపా చదివాక.

    రిప్లయితొలగించండి
  5. మీకు అంజలీదేవి అంత ఇష్టమాండి. సువర్ణసుందరి సినిమా ఒక మ్యూజికల్ హిట్. అడుగడుగునా అందమైన పాటలొచ్చే సినిమా అది. ఒక చందమామ కథ లాగా ఉంటుంది. ప్రతీ పాట చక్కగ వివరించారు. జానపదాల అందం ఈ సినిమాలో బాగానే కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. సువర్ణసుందరి హిందీలో రజతోత్సవం జరుపుకుంది. ఆఉత్సవాలు నాగపూరులో జరిపారని ఓసారిచదివా.
    వేణువుని వేళాపాళాలేకుండా ఊదేప్పుడు మీరనుకొన్నట్టే మాయాసలో కొన్ననుకునేవాళ్ళం. ఇక్కడ రాయడంకష్టం :). అంజలీదేవి అన్నంతలో గుర్తొచ్చేది గావుకేకపెట్టేయ్యడం. మీలాగే నాకూ ఓహీరోయిన్తో ఎఫైర్ ఉంది. గురుతులన్నీ పోగేసుకుని రాయాలి.

    రిప్లయితొలగించండి
  7. గ్రాఫిక్స్ కి వేల కోట్ల ఖర్చు చేసిన సినిమా అని గొప్పగా హంగామా చేసుకొంటున్న ఇప్పటి సినిమాలు చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది నాకు ..ఇవేవీ లేని అప్పటిరోజుల్లో మన దర్శకులు సన్నివేశాల్ని ఎంతబాగా రక్తి కట్టించేవారో ఇటువంటి సినిమాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది . మన వాళ్ళు హాలీవుడ్ వాళ్లకి ఏమాత్రం తీసిపోరని వాదిస్తూ ఉంటా ! అన్నట్టు మురళీ గారు , మీ జాబితాలోని లేటెస్ట్ హీరోయిన్ ఎవరో :) :)

    రిప్లయితొలగించండి
  8. ఈ సినిమా పూర్తిగా చూసే అవకాశం ఇంకా దొరకలేదు కానీ కథ గురించి తెలుసు. ’హాయి హాయిగా’, ’పిలువకురా’ పాటలు మాత్రం నాకు చాలా ఇష్టం.

    ఏంటండీ బాబు మా నాగెస్సర్రావు ని అంతమాట అనేశారు. అభిమానుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేశాయి, హన్నా !!!

    రిప్లయితొలగించండి
  9. నాకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో ఇది కూడా ఒకటి.. అసలు అంజలీదేవి ఎంత చక్కగా ఉంటుందో! ANR కి మాత్రం మీరు చెప్పిన పోలిక కరెక్ట్ గా సరిపోతుంది :))

    ఇంతకీ మీకు అత్యంత ఇష్టమైన, రాజసులోచన నటించిన సాంగ్ 'సడిసేయకే గాలి...'??

    రిప్లయితొలగించండి
  10. చాలా బాగుందండి మీ సమీక్ష.
    >>>"ఇదో నాగేసర్రావూ.. ఆ పిల్ల డేన్సింగులో ఉంది కదా.. అవగానే వస్తుందిలే.. కాసేపు ఆ ఊదడం ఆపు.." అని చెప్పాలనిపిస్తుంది మనకి".

    హ్హ..హ్హ..హ్హ.. భలే రాశారు.

    సినిమా అగ్రిమెంట్ రాసుకుంటున్నప్పుడే నాగేశ్వరరావు ని ఎప్పుడు ఫ్లూటు ఊదమంటే అప్పుడు ఊదుతూనే ఉండాలి, ఏ విధంగాను అభ్యంతరం పెట్టకూడదు అని రాసుకున్నారేమో అనిపిస్తుందండి నాకైతే. ఆ ప్లూటు లాక్కొచ్చేసే గొడవొదిలిపోతుంది అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  11. మా నాన్నగారు ఈ పాటలు రోజూ టేప్ రికార్డర్ లో పెట్టడం వల్ల ఇవన్నీ బుర్రలో ట్యూన్ తో సహా బుర్ర లో ఉండిపోయాయి చిన్నప్పటినించీ. కొంచం సంగీతాన్ని ఆస్వాదించే వయస్సు, జ్ఞానం వచ్చాకా అవి ఎంత గొప్ప పాటలో తెలిసాయి. ముఖ్యంగా హాయి హాయిగా పాటంటే నేను చెవి కోసుకుంటా.

    రిప్లయితొలగించండి
  12. హాయి హాయిగా ఆమని సాగే... ఈపాట ఇప్పటికీ ఒక wonder!!

    రిప్లయితొలగించండి
  13. మీకంజలీ దేవంటే అంతిష్టమాండీ?? నాకేమో చిన్నప్పటినుండీ కాస్త తలకి నూనె పెట్టుకుని పక్కపాపిడి తో తల దువ్వి జడేసినా, కాస్త గాట్టిగా ఎక్స్ ప్రెషన్ పెట్టినా అందరూ అంజలీ దేవి లుక్ తో చంపేస్తున్నవే బాబూ అనో, ఆ అంజలీ దేవి ఎక్స్ ప్రెషన్లు ఏంటే హింస పెడుతున్నావు అని తెగ ఏడిపించీ పించీ పించీ నాకు ఆవిడన్నా, ఆవిడ సినిమాలన్నా తెగ విరక్తొచ్చేసినాయండీ..ఆయ్, అదన్నమాట సంగతి.మరేమో సువర్ణ సుందరి సినిమా ఏమో అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు దూరదర్శన్ వాడు వెయ్యగా చూడ్డమే కానీ పెద్దగా గుర్తులేమీ లేవు, ఒకటి రెండు పాటలు తప్పించి, అందువల్ల నో కామెంట్స్ అన్నమాట...

    రిప్లయితొలగించండి
  14. @శేఖర్ పెద్దగోపు: నిజమేనండీ.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాట.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీది డిఫరెంట్ టేస్ట్ అని మరో సారి ప్రూవ్ అయిందండీ :) ..ధన్యవాదాలు.
    @కంది శంకరయ్య: నేనూ మీ పార్టీనే అండీ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @సృజన: ధన్యవాదాలండీ..
    @జయ: చాలా ఇష్టమైన సినిమాలలో ఇదొకటండీ.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: మీ నాయిక 'అతిలోక సుందరి' ఏమో అని నాకో చిన్న సందేహం :) కొద్దిపాటి ఆధారాలు కూడా ఉన్నాయి లెండి!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @పరిమళం: విద్యాబాలన్ అండీ.. 'పా' తర్వాత వేరే సినిమా ఏదీ చూడలేదు థియేటర్లో :) ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: నాగేసర్రావ్ మీద అంత అభిమానం ఉన్నా సినిమా పూర్తిగా చూడకపోవడం అన్యాయం అండీ!! ఇప్పుడు మీ మనోభావాలకి మరమ్మతులు చేయడం ఎలా అబ్బా...... 'సీతారామయ్య గారి మనవరాలు' లేదా 'మేఘ సందేశం' టపాలు మళ్ళీ ఓసారి చదవండి :) ..ధన్యవాదాలు.
    @నిషిగంధ: యెంత కరెక్ట్ గా పట్టుకున్నారు!! తరచూ వినే పాట 'సడి సేయకో గాలి..' ఆ మధ్యనే మిత్రులొకరు ఎమ్పీత్రీ పంపారండీ.. అప్పటినుంచీ ఇంచుమించు రోజూ వింటున్నా.. ఇక 'సువర్ణ సుందరి' లో అంజలి గురించి యెంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శిశిర: అసలు నాగేశ్వర రావు చాలా తక్కువ డేట్స్ ఇచ్చి ఉంటారనీ, రకరకాల చొక్కాల్లో వేణువూదే బిట్లు తీసి, కథలో శాపాలూ అవీ కలిపెశారానీ నాకో డౌటండీ.. ధన్యవాదాలు.
    @వాసు: నేను ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెవులు కోసుకుంటూనే ఉన్నానండీ.. ధన్యవాదాలు.
    @చైతన్య: ధన్యవాదాలండీ..
    @లక్ష్మి: అందం చూసే కళ్ళని బట్టి ఉంటుంది అంటారు కదండీ.. నాకళ్ళకి తను అందంగా కనిపిస్తుంది మరి.
    ఓపాలి సినేమా జూసి మీ కామెంటు మల్లీ సదుంకొండి.. అబ్బిప్పిరాయం మార్సుకుంటే మల్లోపాలి కామెంటండి.. ఏటంటారండీ మరి.. ఆయ్..:):)
    ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. నాకు 'పిలువకురా..' పాట తెలుసు. కానీ, ఈ సినిమా నేను చూళ్ళేదు. మీరింతగా చెప్పక ఇక చూడకుండా ఎలా ఉంటాను.? త్వరలోనే చూసేస్తా :)

    రిప్లయితొలగించండి
  19. @శిరీష: మీరూ చూడండి.. మీక్కూడా నచ్చుతుంది.. ధన్యవాదాలు.
    @మధురవాణి: ఇంకెందుకండీ ఆలస్యం.. చూసేయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. nenu choosanu murali garu...ma nannagari peru kuda murali ney .....

    రిప్లయితొలగించండి
  21. ఈ సినిమా పాటలు లెక్కలేనన్ని సార్లు విన్నా సినిమా ఎప్పుడూ చూడలేదు. కధ కూడా నాకు పూర్తి గా తెలియదు. బోలెడన్ని మలుపులు వున్నాయి కదా.. బాగుంది. థ్యాన్క్స్ మురళి పరిచయానికి.

    రిప్లయితొలగించండి
  22. మురళి గారు ఇదే సినిమాలొ ఇంకో అద్భుథమైన పాట ఉందండి .."శివ శంకర..పాహి పరమేశ్వర.." ఆ పాటే కద మన వీరో వీరొయిన్లను కలిపే పాట.. ఇప్పటికి మా వూరి శివుని గుళ్లొ వినపడె పాట

    రిప్లయితొలగించండి