బుధవారం, ఆగస్టు 19, 2009

నిప్పులాంటి నిజం

మర్డర్ మిష్టరీలంటే ఆసక్తి లేనిది ఎవరికి? కల్పిత పాత్రలే అని తెలిసినా, హంతకుడెవరో తెలుసుకోడం కోసం డిటెక్టివ్ నవలని తిండి నీళ్ళు మానేసి మరీ చదవని వాళ్ళు అరుదు. అలాంటిది ప్రపంచాన్ని కుదిపేసిన ఓ హత్య తాలూకు పరిశోధనని, ఆ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన అధికారులే పుస్తక రూపంలో అందించారంటే చదవకుండా ఉండగలమా? హతుడైన ఆ నాయకుడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. ఆ పుస్తకం పేరు 'నిప్పులాంటి నిజం.'

రాజీవ్ హత్య కేసు పరిశోధనకి కేంద్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) సారధి సీనియర్ ఐపీఎస్ అధికారి డి.ఆర్. కార్తికేయన్, మరో అధికారి రాధా వినోద్ రాజు తో కలిసి, తన పరిశోధనకి 'ట్రైంఫ్ ఆఫ్ ట్రూత్' అనే పేరుతొ అక్షర రూపం ఇచ్చారు. జర్నలిస్టు జి.వల్లీశ్వర్ 'నిప్పులాంటి నిజం' పేరుతో తెనిగీకరించారు. ఈ పుస్తకం వెల్లడించిన విషయాలు చాలా వరకు వార్తల రూపంలో తెలిసినవే ఐనప్పటికీ, కథనం డిటెక్టివ్ నవలని తలపించింది. ఫలితం..పుస్తకాన్ని పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేం.

రాజీవ్ గాంధీ హత్య జరిగిన మర్నాడు ఎలాంటి ఆధారాలూ లేకుండా, కనీసం అనుమానితులెవరో తెలియకుండా పరిశోధనకి రంగంలోకి దిగిన సిట్ అధికారులు ఒక్కో ఆధారాన్నీ సంపాదించిన వైనం, నేరస్తులని ఒకరొకరుగా అదుపులోకి తీసుకున్న వివరం ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. హత్యాస్థలంలో పోలీసులకి దొరికిన ఒకే ఒక్క ఆధారం ఒక కెమెరా. అందులో రీల్ డెవలప్ చేయించి, అధికారులు చూసేలోగానే ఆ ఫోటోలు మద్రాసు నుంచి వెలువడే ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక మొదటి పేజీలో ప్రచురితమయ్యాయి.

అదిమొదలు, నేర పరిశోధనలో పత్రికల కారణంగా అధికారులకి ఎన్నోసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. నేరస్తుల సమాచారాన్ని సేకరించడంలో, వారి ఆనుపానులు కనుక్కోడంలో అవే పత్రికలు సహకరించాయి కూడా.. వివిధ పక్షాల నుంచి రాజకీయ ఒత్తిడులకీ లోటు లేదు. హంతకులు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) కి చెందిన వారని సిట్ అధికారులు ప్రకటించగానే విమర్శలు చుట్టుముట్టాయి. అది మొదలు హత్యకి ప్రధాన సూత్రధారులు శివరాజన్, శుభ ల కోసం వేట మొదలయ్యింది.

సస్పెన్స్ సినిమాలోచేజింగ్ సీన్ ని తలపించే ఈ వేట లో సిట్ అధికారుల లక్ష్యం ఒక్కటే, నిందితులని ప్రాణాలతో పట్టుకోవాలని. ఎందుకంటే పోలీసులకి దొరికిన పక్షంలో సైనేడ్ మింగి చనిపోమ్మని నిందితులందరికీ ఎల్టీటీయీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వారు మెడలో సైనేడ్ కాప్సూల్స్ ధరించారు కూడా. హత్య జరిగి యేడాది పైగా గడిచాక శివరాజన్, శుభ లను పట్టుకోగలిగారు, సిట్ అధికారులు. సజీవులుగా కాదు, నిర్జీవులుగా..

రాజీవ్ హత్యకి కొన్ని గంటల ముందు ఒక ఆగంతకుడు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి 'రాజీవ్ ఇంకా సజీవంగానే ఉన్నారా?' అని అడిగిన వైనం తో మొదలయ్యే ఈకథనం శ్రిపెరంబదూరు సభాస్థలిలో భద్రతా వైఫల్యాలు లాంటి అంశాల మీదుగా సాగి, పరిశోధన, కోర్టు తీర్పుతో ముగుస్తుంది. ఎల్టీటీయీ కి భారత దేశంలో ఉన్న విస్తృతమైన నెట్ వర్క్, ఆ సంస్థ కార్యకర్తల అంకిత భావం ఆశ్చర్య పరుస్తాయి.

శ్రీలంక తమిళుల సమస్యలు, భారత-శ్రీలంక సంబంధాలనూ వివరంగా చర్చించారు ఈ పుస్తకంలో. ఎక్కడా అనువాదం అన్న భావన కలగదు, పుస్తకం చదువుతుంటే. ('నిప్పులాంటి నిజం,' ఎమెస్కో ప్రచురణ, పేజీలు 304, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

12 కామెంట్‌లు:

  1. hmmm, మీ టపా చదివాక నాకు అర్జెంటుగా ఆ పుస్తకం చదివేయ్యాలని ఉంది, కాని బెంగుళూరు ఎక్కడ దొరుకుతుందో తెలియదు చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. మీ రివ్యూ చదివిన తరువాత కోతి కొమ్మచ్చి చదవడం మొదలుపెట్టా.. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పుస్తకాన్ని పరిచయం చేసారు...

    రిప్లయితొలగించండి
  3. మురళీ గారూ,
    ఈ పుస్తకం నేర పరిశోధనలోని అనేక కోణాలను తెలియజేస్తుంది. నేను గత అక్టోబరులో బ్లాగింది ఇక్కడ చూడండి.
    http://arunam.blogspot.com/2008/10/blog-post_08.html

    రిప్లయితొలగించండి
  4. అయితే తప్పక చదవాల్సిందేనండి..నేనూ కొంటాను.

    రిప్లయితొలగించండి
  5. పేపర్లలోనూ , టీవీల్లోనూ ....చూశాం కదా ..కొత్తగా చదివేందుకేముంది అనుకునే వాళ్ళకి కూడా చదవాలనే ఆసక్తి కలిగించేలా ఉంది మీరు పరిచయం చేసిన తీరు !

    రిప్లయితొలగించండి
  6. మీ బ్లాగ్ లోని పుస్తకాల రివ్యూలు చూస్తే చాలండి,మీరు సజెస్ట్ చేసిన పుస్తకాలన్నీ కళ్లుమూసుకుని కొనేయచ్చు.బాగుందండీ రివ్యూ.

    రిప్లయితొలగించండి
  7. నిజానికి ఈ సంఘటనకన్నా ఆయన ప్రక్కనుండి మరణించిన వారి కుటుంబగాథలు, ధనుకి సంబంధించిన వివరాలు నన్నెంతో వెంటాడాయి, కలవరపరిచాయి. ఇకపోతే నిజాయితివున్న ఏ ఉద్యోగిని చూసినా దైవాన్ని కాంచినంత తృప్తి నాకు.

    రిప్లయితొలగించండి
  8. @నాగ: తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.
    @సత్య: 'కోతి కొమ్మచ్చి' పూర్తయ్యాక ఓ టపా రాయండి, మర్చిపోకుండా.. ఈ పుస్తకం కూడా బాగుందండి.. ధన్యవాదాలు.
    @అరుణ పప్పు: చదివానండి.. బాగుంది మీ సమీక్ష.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: చదివాక మీరు కూడా ఓ టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @పరిమళం: లేదండీ.. మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి పుస్తకంలో.. కథనం కూడా చాలా ఆసక్తి కరంగా సాగింది.. ధన్యవాదాలు.
    @తృష్ణ: హమ్మో.. చాలా పెద్ద ప్రశంశ అండీ.. ధన్యవాదాలు.
    @ఉష: థాను గురించి కూడా చాలా వివరంగా రాశారండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. మంచి పుస్తకం పరిచయం చేశారు, పుస్తకం కొని రాత్రి 9 గంటలకు మొదలు పెట్టాను, పుస్తకం పూర్తి చేసి తలెత్తేసరికి తెల్లవారుఝాము 4 గంటలయ్యింది.

    thanks for writing about such a good book

    రిప్లయితొలగించండి
  11. @రాఘవ్: నేను కూడా అలాగే ఆపకుండా చదివానండి.. కాదు కాదు.. చదివించింది ఈ పుస్తకం.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. naa anuvaadam gurinchi murali gaaru raasina samiiksha aanandam kaliginchindi. entha ...? cheppalenu. endukante, telugulo ippativarakuu nenu chesina anuvaadam idokkate...! manchi pustakaala gurinchi ii blaag dwaaraa telusukovachchani telisindi. dhanyavaadaalu....
    valliswar

    రిప్లయితొలగించండి