శుక్రవారం, ఆగస్టు 28, 2009

కప్పు కాఫీ

ఆఫీసు పని మధ్యలో అటెండర్ ని పిలిచాను. పక్క సెక్షన్ నుంచి కావాల్సిన కాగితాలు తీసుకురమ్మని చెప్పాను. అతను వెళ్తుంటే పరధ్యానంగా "కుదిరితే ఓ కప్పు కాఫీ.." అన్నాను. వెళ్తున్న వాడల్లా ఆగి నవ్వాపుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకా? అని ఆలోచిస్తే గుర్తొచ్చింది 'బొమ్మరిల్లు' లో పాపులర్ డైలాగు "అంతేనా? వీలయితే నాలుగు మాటలు.. కుదిరితే ఓ కప్పు కాఫీ.." ...సిస్టం లో తల దూర్చేశాను వెంటనే.

ఈ మధ్య కాఫీ తాగడం బాగా ఎక్కువైపోయింది. మరీ నాలుగైదు కాఫీలు, రెండు మూడు టీలు తాగేస్తున్నాను. తగ్గించాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశానో లెక్కలేదు. కాఫీల సంఖ్యని రోజుకి ఒకటి చేయడం.. సంతోష పడేలోగానే నెమ్మదిగా మళ్ళీ కాఫీలు పెరిగిపోడం.. 'శ్రీశ్రీ' సిగరెట్ల కథలా అవుతోంది. ఒక్కసారిగా మానుకోడానికి ఇదేమైనా ఇవాళ కొత్తగా అయిన అలవాటా..? పైగా వారసత్వంగా వచ్చింది కూడాను.

గుండ్రాలు గుండ్రాలుగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, నా చిన్నప్పుడు మా ఇంట్లో తాతయ్య, బామ్మ కాఫీ తాగేవాళ్లు, అమ్మానాన్నా టీ తాగేవాళ్లు. పిల్లలు ఆ రెండూ తాగకూడదు కాబట్టి మనకి మూడు పూటలా పాలే. భలే విసుగ్గా ఉండేది పాలు తాగడం. అక్కడికీ నా పాల గ్లాసులో ఎవరూ చూడకుండా తాతయ్య చేత కొంచం కాఫీ పోయించేసుకునే వాడిని. బామ్మ మాత్రం అలా చేసేందుకు ఒక్కనాటికి ఒప్పుకునేది కాదు, నాకు జ్వరం వచ్చినప్పుడు తప్ప.

చిన్నప్పుడు జ్వరం వస్తే ఆయుర్వేద వైద్యం చేయించేవాళ్ళు. ఆ డాక్టరు గారు రెండుపూటలా వేడి కాఫీ తాగించమనే వాళ్ళు, జ్వరం త్వరగా తగ్గిపోతుందని. కేవలం కాఫీ తాగొచ్చనే కారణానికి జ్వరం రావాలని కోరుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో.. ఎప్పుడైనా అమ్మతో అంటే తిట్టేది. "వెధవ కాఫీ, కావాలంటే నాన్నగారు చూడకుండా పెట్టిస్తా.. జ్వరం కోరుకోకు" అంటూ అక్షింతలు. ఊరికే అలా అనేదే కాని ఇచ్చేది కాదు, అది వేరే విషయం.

హైస్కూలికి వచ్చాక పరిక్షల ముందు నైటౌట్లు అలవాటై, నిద్రాపుకునే మిష మీద తేనీరు సేవించడానికి పర్మిషన్ దొరికింది. కాఫీ కి మాత్రం కాలేజీలో చేరే వరకూ ఆగాల్సి వచ్చింది.. అందరూ రహస్యంగా సిగరెట్లు తాగే వయసులో, నేను రహస్యంగా కాఫీ తాగేవాడిని హోటల్లో. మా ఇంట్లో మా పిన్ని చేసే కాఫీ మాత్రం అద్భుతం. కేవలం కాఫీ తాగి బతికేయొచ్చు. మిగిలిన కుటుంబ సభ్యుల కాఫీ ప్రావీణ్యం గురించి మాట్లాడ్డం అంత మంచిది కాదు.

ఇప్పటికీ నేను విచారించే విషయాల్లో ఫిల్టరు కాఫీ తయారు చేయడం నేర్చుకోలేక పోవడం ఒకటి. చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ అంత బాగా రావడం లేదు. పాలు వేడి చేసుకుని ఇన్ స్టంట్ కాఫీ చేసుకోడం మాత్రం వచ్చు. అప్రతిహతంగా సాగిపోతున్న నా కాఫీ వ్రతానికి మూడేళ్ళ క్రితం బ్రేకు పడింది. నా రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉందన్న విషయం కనిపెట్టిన డాక్టరు, ఓ జాబితా ఇచ్చి "ఇవి తీసుకోడం తగ్గించండి" అన్నాడు. జాబితాలో మొదటిది కాఫీ.. అప్పటినుంచీ బోల్డన్ని సార్లు కాఫీ తగ్గించాను.. తగ్గిస్తూనే ఉన్నాను.

34 వ్యాఖ్యలు:

 1. బాగుందండి మీ కాఫీ గొడవ....
  అద్భుతంగా వర్ణించారు....మీ వర్ణన చూస్తే వెంటనే కాఫీ కి వెళ్ళాలనిపిస్తుంది...కాని టైం కాదు కదా అని ఆగిపోతున్నాను...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇదేదొ నా కాఫీ కధలానే ఉందండి..
  http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_16.html
  మా అమ్మ కూడా "కాలేజీ కొచ్చేదాకా నో కాఫీ"అంది.నేను కూడా కాఫీ కోసమే ఎప్పుడు కాలేజిలోకి వస్తానా అని ఎదురుచూసాను.అయితే ఫిల్టర్ కాఫి చెయటం పెద్ద కష్టమైన విషయం కాదండి.మీకు దగ్గరలో ఏదైనా కాఫిగింజల్ని మరాడించే షాప్ ఉంటే,అక్కడ కొన్న ఫ్రెష్ పౌడర్తో ఫిల్టర్ కాఫీ చేస్తే టేస్టీగా ఉంటుంది.
  మానేసే విషయం మాత్రం మనలోనే ఉంటుందండి.అనుకుంటాం గానీ ఏదైనా అలవాటు చేసుకోవటం,మానుకోవటం మన చేతిలోని పనే.ధృఢమైన నిశ్చయం కావాలి అంతే.
  "కాఫీ" అనగనే వరదలా ఎంత పెద్ద వ్యాఖ్య రాసేసానో...కాఫి మీద నాకున్న ప్రేమ అలాంటిది!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంచి 'కాఫీ' లాంటి 'కాఫీ' తీపిగుర్తులు...
  అయ్యో! మీకు చిన్నప్పుడు ఇంట్లో కాఫీ ఇచ్చేవారు కాదా..నేను, మా నాన్న కాఫీ/టీ తాగుతున్నప్పుడు, అరగుండు బ్రహ్మంగాడిలాగ కప్పు వంక, సాసర్ వంక మార్చి మార్చి చూస్తే చాలు...సాసర్ లో కొంచెం పోసి నాకు ఇచ్చేవారు. అది తాగేసి మళ్ళీ మార్చి మార్చి చూడటం..అప్పుడు కప్ లో రెండు సిప్ లకు సరిపడా ఉంచి అమ్మకి ఇది ఇచ్చేయరా అంటూ కప్, సాసర్ నా చేతిలో పెట్టేవారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్చ్...మీకేమో కాఫీ మానెయ్యాలి అన్న కష్టం నాకేమో అసలు కాఫీ టీ లు అలవాటే కాని కష్టం. అందరితో కాఫీ కి వెళ్ళి మంచి నీళ్ళు తాగి వస్తా, ఏమి చేద్దాము...కొన్ని జీవితాలు అంతే

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళీ గారూ! కాఫీలో మొదటి శత్రువు అందులో కలిపే చికోరీ, దాని శాతం తగ్గించి ఫాట్ ఫ్రీ పాలు తో కాఫీ ట్రై చెయ్యండి. బాగుంటుంది కాఫీ.ఇంకో మాట మీరుండేది బెంగుళూరులో కదా లేటెస్ట్ కాఫీ మేకరు తీసుకోండి. ఇన్స్టాంట్ గా ఫిల్టర్ కాఫీ లాగా వస్తుంది కాఫీ చికోరీ తక్కువైనా కూడాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఛ, డాక్టరు చెప్పాడని కాఫీ మానేస్తామేంటి? కావాలంటే అన్నమైనా మానేస్తాం కానీ?

  అన్నట్లు మీరు రాసిన డైలాగు బొమ్మరిల్లు లోది కాదు, అతిథిలో వెర్రి పప్పీ అమృతా రావుది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. " బోల్డన్ని సార్లు కాఫీ తగ్గించాను.. తగ్గిస్తూనే ఉన్నాను. " హ హ హ. బాగుంది. నేను కూడా, నేను కూడా.... ఈ అమెరికా వచ్చి టీ బాగోక ఇంకా కాఫీ లు ఎక్కువ ఐపోయాయి. :(

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నాకు కాఫీ, టీ రెండు అలవాట్లూ లేవు. ఎప్పుడో ఒకసారి మాత్రం 'బ్రూ' తాగడానికి ఇష్టపడతాను. అందుకే, ఈ కాఫీ ప్రేమకథలు నాకు లేవు.
  అన్నట్టు... మీరలా అడగ్గానే మీ అటెండరు 'మురళి సారేంటి.. ఎవరైనా అమ్మాయిని అడక్కుండా నన్ను అడుగుతున్నారు.. పాపం..ప్చ్..ఏం చేస్తాం..' అని దీనంగా అనుకుని ఉంటాడేమో ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చిన్నప్పటినుంచి ఇప్పటివరకూ నా వెన్నంటే వస్తున్నవి మూడు. నా పేరు, ఈనాడు పేపరు, మూడోది మీరనుకుంటున్నట్టే కాఫీ ( హి హి హి )..

  చిన్నప్పుడు గేదె ఈని, కాఫీకోసం పాలు బయటినుంచి తేవాల్సి వచ్చినప్పుడూ, లేదా హైదరాబాదు లో ఉన్నప్పుడు పాలవాడు పొద్దున్నే పాల పాకెట్ తేవడం లేట్ చేసినప్పుడూ పాపం వాళ్ళ తప్పేమీ లేకపోయినా పిచ్చికుక్కులా ఇంట్లో వాళ్ళమీద కయ్ మని లేచేవాణ్ణి.

  తరువాత ఈదేశానికొచ్చాక కాఫీషాపులోకెళ్ళి కాఫీ కోసం వెదుక్కొనేవాణ్ణి (అన్ని రకాలుంటాయ్). ఈరొజు దొరికిన టేస్టు రేపు దొరికేది కాదు. వెతికీ వెతికీ నాక్కావాల్సిన రుచి నా నాలుక్కి తగిలేసరికి సంవత్సరన్నర పట్టింది.

  మొన్నీ మధ్యే ఏంక్జయిటీ, ఎసిడిటీ, ఆకలి మందగించడం లాంటివి ముందు ముందు ఎక్కడ దాడి చేస్తాయో అని అతికష్టమ్మీద కాఫీ తాగకుండా పది రోజులు వోర్చుకున్నా ఆ తరువాత నా వల్ల కాలేదు. విపరీతమయిన తలనొప్పి. ఇప్పుడు "స్టిక్కు" :) గా రోజుకి రెండు కప్పులే. నా "ఆపరేషన్ నో కాఫీ" దారుణంగా ఫెయిలయిన తరువాత నాకు వచ్చిన మొట్టమొదటి భయంకరమైన ఆలోచన ,ఒకవేళ నేను కాఫీ అనేదే దొరకని ప్రదేశంలో ఒక నెల రోజులు ఉండాల్సొస్తే? ఆ ఆలోచనకే నాకు చెమటలు పడతాయి.

  సరెనండీ ఉంటాను నా మార్నింగ్ కాఫీ టైం అయింది ( నిజ్జంగానే, నా కాఫీ మీదొట్టు)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మంచి కాఫీ లాంటి పోస్టు బాగుంది !

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీ అందరికీ కాఫీ మరిచిపోయే ఉపాయం ఒకటి చెప్పనా! వీనుల విందు చేసే చక్కటి మీకు నచ్హిన ఏ సంగీతమైనా వింటూనేపోండి. ఆ ధ్యాసలో పడిపోయిన మీకు ఏనాటికి కాఫీ గుర్తుకురమ్మన్నా రాదు. ఎన్ని పనులైనా అలసట లేకుండా చేసుకోవచ్హు. మీ ఆఫీసర్ కూడా తప్పకుండ చెవిలో ఏవో వైర్లు పెట్టుకోనే ఉండి ఉంటారు. ఈ సారి జాగ్రత్తగా చూడండి. ఆల్ ద బెస్ట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. డాక్టర్ కాఫీ మానేయమంటే మానేస్తామేమిటి, డాక్టర్ని మానేస్తాం గాని!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. సూపర్ టైమింగ్ మురళి గారు. భలే ఉంది టపా!! నాకూ కాఫీ చాలా ఇష్టం, కానీ మొన్నా మధ్య ఒక రెండ్రోజులు తప్పని సరి పరిస్తితులలో కాఫీకి దూరంగా ఉండాల్సొచ్చినపుడు తలనొప్పి వచ్చింది. దాంతో అమ్మో మనం కాఫీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతున్నాం ఠాట్ నా అంత వాడ్ని కాఫీ కంట్రోల్ చేడమా అని అవుమానప్పడిపోయి పొయిన శనివారం ఇక్కడ యంటీఆర్ లో ఓ మాంచి కాఫీ సేవించి ప్రస్తుతానికి ఒక చిన్న కామా పెట్టాను. సో రేపటికి నే కాఫీ మానేసి వారం రోజులు.

  ఇలానే ఓ నెల్రోజులన్నా గడిపేసి మన కంట్రోల్ లోనే కాఫీ ఉంది కానీ మనం కాఫీ కంట్రోల్ లేం అని నిర్ధారించుకున్నాక మళ్ళీ అప్పుడప్పుడు సేవించడం మొదలెడదాం అని అనుకుంటున్నాను. ఈ సారి ఆఫీసు లో కాఫీ మాత్రం ఎప్పటికీ ముట్టుకో కూడదు అని శపథం పట్టాను, ఎందుకంటే అది చాలు బోల్డంత కాఫీ సేవనాన్ని నియంత్రించడానికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. kauphy కస్టాలు మీకు కూడా వున్నాయా .

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఎంతమాట అన్నావన్నాయ్. పిల్టర్ కాపీ చేస్కోటం నేర్చుకోలేకపొయ్యావా.
  ఎంత అవమానం నాకు!! ఇంత అవమానభారంతో, నాచెయ్యి వదులు, కాపీకప్పులో, వదులన్నాయ్ నా చేతిని, దూకేస్తా -

  http://nalabhima.blogspot.com/2008/11/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అరవ్వాళ్ళ కాఫీ చాలా బాగుంటుంది . కాఫీ కాయటానికి ప్రత్యేకంగా కాఫీ ఫిల్టరును మద్రాసు నుంచి తెప్పిస్తున్నాం మేం. మా ఆవిడకు, నిజం చెప్పొద్దూ, నాకంటే కాఫీ అంటేనే ఎక్కువిష్టం అని నాకో అనుమానం. అదికూడా కప్పుతో కాదు గ్లాసునిండా ఉదయాన్నే డోసు పడాల్సిందే. నేనీ మధ్య ఇంటిదగ్గర కాఫీ టీలు త్రాగటం మానేసాను, కాని ఆఫీసులో రోజు మొత్తానికి రెండు నుంచి మూడు సార్లు తాగుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. 'కప్పు కాఫీ' అంటూ గుర్తుచేసి తగ్గించుకోమంటే ఎలా చెప్పండి:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. అందరూ రహస్యంగా సిగరెట్లు తాగే వయసులో, నేను రహస్యంగా కాఫీ తాగేవాడిని హోటల్లో>>
  ఇప్పుడు సిగరెట్లు తాగటం మొదలుపెట్టలేదు కదా:)

  నాకు కాఫీ అలవాటు లేదు. ఎందులోనైనా పాలుంటే అది ముట్టుకోను. కాబట్టి మీ బాధ నాకు లేదు..రాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. "అప్పటినుంచీ బోల్డన్ని సార్లు కాఫీ తగ్గించాను.. తగ్గిస్తూనే ఉన్నాను"...
  ఇక మీదట కూడా తగ్గిస్తూనే వుంటారేమో..కదండీ !!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. శేఖర్ గారూ..ఈ లెక్కన మీ నాన్నగారు ఏం తాగినట్టు..?
  అహా..ఏమి లేదు! అంతా మీరే తాగినట్టనిపిస్తూంటేనూ..

  ప్రత్యుత్తరంతొలగించు
 21. కాఫీ అంటే ఇంట్లో అభ్యంతరపెట్టేవాళ్లు ఎవరూ లేకపోవటం నా అదృష్టమే అనుకొంటా. వాళ్లుకూడా అదేదో ఇచ్చేస్తే వాడుగుట్టుగా ఓమూలపడుంతాడు ఈరెండు నిమషాలైనా వాగుడాపి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనేది వాళ్ల అభిప్రాయం. ఇక ప్రస్తుతానికి నాగోడు ఓసారి భాస్కరన్న దగ్గర వెళ్లబోసుకున్నా. పిల్ట్రీ టపాచూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. కాఫీ, టీ తాగని వాడు మరు జన్మలో మానై పుట్టున్...

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @హను: అయ్యో మీకు తెలీదా? 'ఎనీ టైం ఈస్ కాఫీ టైం' అండి :-) ధన్యవాదాలు
  @చిన్ని: ధన్యవాదాలు
  @తృష్ణ: బాగుందండి మీ టపా.. నా సమస్య ఫిల్టరో, పౌడరో కాదండి.. నాకు ఆవిద్య అంతగా పట్టుబట్టక పోవడం.. ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: ఏడిపించడం లోనూ, నవ్వించడం లోనూ కూడా మీకు మీరే సాటి.. ఎంతసేపు నవ్వానో, మిమ్మల్ని ఊహించుకుని.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. @లక్ష్మి: మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండీ.. ధన్యవాదాలు.
  @సునీత: ఏమిటో కాఫీ కాఫీలా లేకపొతే (చక్కగా చిక్కగా) తాగాలనిపించదండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: Thank you :-)
  @సుజాత: అయ్యో.. అది 'బొమ్మరిల్లు' లో డైలాగండీ.. కరుసైపోయిన నా ఐదొందల రూపాయల నోటు మీద ఒట్టు.. ఒక వేళ వెర్రి పప్పీ కూడా చెప్పిందేమో తెలీదు. నిజంగానే అన్నం మానేయడం చాలా సులువు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @భావన; హమ్మయ్య.. చాలామంది నాకు తోడున్నారు.. ధన్యవాదాలు.
  @మధురవాణి: ప్చ్.. మీరు చాలా మిస్సైపోతున్నారు.. ఒక్కసారి ఫిల్టర్ కాఫీ రుచి చూడండి.. మరింక వదలరు.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: యెన్నాళ్ళకెన్నాళ్ళకి?? బాగుందండీ మీ కాఫీ అనుబంధం.. కాఫీ దొరకని చోట ఉండాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటూ.. ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @జయ: నేను పాటలు వింటూ కాఫీ తాగుతానండీ :( ..ధన్యవాదాలు
  @శ్రీనివాస్: నిజమే :-) ..ధన్యవాదాలు
  @వేణూ శ్రీకాంత్: మిమ్మల్ని చూస్తే అసూయగా ఉందండీ.. విజయీభవ.. ధన్యవాదాలు.
  @మాఊరు: ఉన్నాయండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. @భాస్కర్ రామరాజు; పోస్ట్ చదివాను.. నాకు కాఫీ 'అద్భుతంగా' చేయడం రావడం లేదు.. అదీ సమస్య.. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను.. ధన్యవాదాలు.
  @నరసింహ: నేను తమిళుల కాఫీ తాగే అవకాశం ఎప్పుడొచ్చినా వడులుకోనండి.. నాకు తెలుసు ఆ రుచి.. ధన్యవాదాలు.
  @సృజన: ధన్యవాదాలు
  @భవాని: సిగరెట్లది వేరే కథ.. అన్నీ ఒకే చోట చెప్పేస్తామా చెప్పండి? ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @ప్రణీత స్వాతి: అవునండీ :-) ధన్యవాదాలు
  @సుబ్రహ్మణ్య చైతన్య: అదృష్టవంతులు.. ధన్యవాదాలు.
  @సత్య: భలే చెప్పారండీ :-) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. నేనూ మీలాగే ...కాఫీని ఎంజాయ్ చెయ్యగలను కానీ తయారుచేయడం అంతబాగా రాదు , బ్రూ ఐతే కాస్త ఫరవాలేదు . మా శ్రీవారు అద్భుతంగా చేస్తారు . పొద్దున్నే మంచి బ్రూ కాఫీ పరిమళంతో నిద్రలేపుతారు . అసలు కాఫీ అలవాటు చేసిందే తను!
  ముఖ్యంగా చిరుజల్లులు పడే ఈ కాలంలో...ఇంకా వణికించే చలికాలంలోనూ పొగలుగక్కె కాఫీ కప్పుతో పొద్దున్నే నిద్రలేపితే ....ఆహా ఆవ్యక్తి సాక్షాత్ భగవంతుడేకదండీ :)
  అన్నట్టు నేను రోజుకు ఒక్కసారే తాగుతానండోయ్ ..అప్పుడప్పుడూ మరోసారి ..అంతే ! మీరూ డాక్టర్ ని మర్చేయక ...కాఫీని తగ్గించండి మరి . అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కదండీ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 30. @పరిమళం: ఇలా మీ ఇంట్లో కాఫీ గురించి చెప్పేసి అందర్నీ (కనీసం కొందరినైనా) ఇబ్బంది పెట్టడం భావ్యమా చెప్పండి? :-) మీవారు దేవుడండీ.. కానీ అందరు మగవాళ్ళూ దేవుళ్ళు కాలేరు కదండీ?? :-) నేను కాఫీ తగ్గించే ప్రయత్నాల్లోనే ఉన్నానండీ.. వేణూ శ్రీకాంత్ గారి వ్యాఖ్య చూశాక కొంచం పట్టుదల పెరిగింది.. (ఎటొచ్చీ అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు) .. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు