బుధవారం, ఆగస్టు 05, 2009

మనసు

ఏమిటో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.. నా చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక్కొక్కరూ ఒక్కొరకం సమస్యలో ఉన్నారు. ఎవర్ని కదిలించినా 'మనసు బాలేదు' అన్న సమాధానమే వినాల్సి వస్తోంది.. నిజమే మనసు బాగుండడం, బాగోకపోవడం అన్నది మన చేతుల్లో ఉండదు. అది ఎప్పుడు ఎలా ఉంటుందో, అలా ఎందుకు ఉంటుందో తెలిస్తే ఇంక మనసు గురించి చెప్పుకోడానికి ఏముంటుంది?

'మెండార రాజూ నిద్రించూ నిద్రయునొకటే.. అండనే బంటు నిద్ర అదియూనొకటే..' అని పాడారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. నిజానికి ఈ సమానత్వం నిద్రకే కాదు, మనసుకీ వర్తిస్తుంది. మనసు ప్రశాంతంగా లేకపొతే, వాడు ఎంతటి చక్రవర్తి ఐతేనేమి..పట్టు పానుపు మీద పవ్వళిస్తేనేమి? కంటిమీదకి కునుకన్నది రాదు కదా.. పంచ భక్ష్య పరమాన్నాలు విస్తట్లో ఉన్నా, నోటికి సహించవు కదా?

మనసు సంగతి బాగా తెలిసిన పెద్దమనిషెవరో ఒకాయన ఈ మనసుని కోతితో పోల్చాడు. బహు చక్కటి పోలిక.. కోతి చేష్టలకి, మనసు పోకడలకి కారణాలు వెతకడం కష్టమే. బేసిగ్గా మనసు మంచిదే.. మనల్ని సంతోషంగా ఉంచుతుంది, మనకి కావాల్సింది దొరికినప్పుడు. కాకపొతే దాని చెడ్డ తనమంతా బయట పడేది ఎప్పుడంటే మనం బాగా కోరుకున్నది మనకి దొరకనప్పుడు. అది దొరికేంత వరకు భలే హింస పెడుతుంది మనల్ని.

కావాల్సింది మనకి దొరికేంత వరకూ మనసు పెట్టే హింస ఒక రకమైతే, అస్సలు దొరకదు అని తెలిసినప్పుడు పెట్టే హింస మరొక రకం. అలాంటప్పుడు 'దొరికిన దానితో తృప్తి పడాలి' లాంటి మాటలు గుర్తు చేసుకోడానికి అస్సలు ఇష్టపడం మనం. "మనం కోరుకున్నది ఇక దొరకదు" అన్న నిజం తట్టుకోడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ధైర్యం లేనివాళ్ళే, ఆత్మహత్యకి సిద్ధపడుతూ ఉంటారు.

సరే.. మనం బాగా కోరుకున్నది మనకి దొరికింది.. అప్పుడు మనసు ఏం చేస్తుంది? మనల్ని సంతోషంగా ఉంచుతుంది.. ఎన్నాళ్ళు? ఇది కొంచం కష్టమైన ప్రశ్న.. కావాల్సింది దొరక్కపోతే జీవితాంతం మనల్ని బాధ పెట్టే ఈ మనసే, దొరికినప్పుడు జీవితాంతం సంతోషంగా ఉంచదు, అదేమిటో మరి. కొన్నాళ్ళు మనల్ని సంతోషంగా ఉండనిచ్చాక మరింకేదో కావాలనిపిస్తుంది. కథ మళ్ళీ మొదటికి వస్తుంది.

మనసుని అదుపులో పెట్టుకోడానికి పూర్వకాలంలో ఐతే తపస్సులు, ఇప్పుడు యోగ, ధ్యానం అందుబాటులో ఉన్నాయి. కాకపొతే బోల్డంత కృషి అవసరం. కృషి ఉంటేనే కదా మనుషులు ఋషులు, మహా పురుషులు అయ్యేది. మనసుకీ కవిత్వానికీ దగ్గర సంబంధం. రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళకి మనసు బాగున్నా కవితే, బాగోకపోయినా కవితే. సిని కవుల్లో ఒకాయనకి ఏకంగా 'మనసు కవి' అన్న పేరే ఉంది.

మనసు బాగోనప్పుడు దాన్నలా వదిలేయకుండా, బాగు చేసుకునే మార్గం ఆలోచించడం అవసరం. అన్ని మనసులూ ఒక్కలా ఉండనట్టే, స్వస్థత చేకూర్చుకునే మార్గాలు కూడా మనసుని బట్టి మారుతూ ఉంటాయి. వీలైనంత తొందరగా మనసుకి స్వస్థత చేకూరిస్తేనే మనం బాగుండగలం. మామూలు కోతి కన్నా పిచ్చి కోతి మరింత ప్రమాదకారి.. దెబ్బతిన్న మనసూ అంతే..

22 వ్యాఖ్యలు:

 1. అమ్మో ఈ మనసు చేసే గోల, అది పెట్టే బాధ అంతా ఇంతా కదండీ మురళి గారు, దాన్ని సమాధానపరచటమూ వీజీ కాదు. దాని గోల నుండి బయట పడటానికి ఎన్ని మార్గాలు కనుక్కున్నా అది మాత్రం మనల్ని బాధ పెట్టటానికి రాచమార్గాలలోనే వస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మనసొక మధు కలశం..పగిలే వరకే
  అది నిత్య సుందరం.. అని అన్నారో కవిగారు. నిజమే మీరన్నట్టు కావాల్సింది దొరక్కపోతే జీవితాంతం మనల్ని బాధ పెట్టే ఈ మనసే, దొరికినప్పుడు జీవితాంతం సంతోషంగా ఉంచదు. మనసు స్వభావాన్ని ఒక ముక్కలో బాగా చెప్పారు.

  >>అన్ని మనసులూ ఒక్కలా ఉండనట్టే, స్వస్థత చేకూర్చుకునే మార్గాలు కూడా మనసుని బట్టి మారుతూ ఉంటాయి. వీలైనంత తొందరగా మనసుకి స్వస్థత చేకూరిస్తేనే మనం బాగుండగలం. మామూలు కోతి కన్నా పిచ్చి కోతి మరింత ప్రమాదకారి.. దెబ్బతిన్న మనసూ అంతే..
  చాలా చక్కగా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీరన్నట్టు మనసు కోరుకున్నది దొరికినా మళ్లీ మరో కోరిక మీదకి వెళ్తుంది. దొరకక పోయినా వెళ్తుంది. కానీ దొరకక పోతే అదో బాధ.

  నిజానికి కోరికలుండొచ్చు. కానీ దేన్నీ అతిగా వాంఛించ కూడదు. ఎందుకంటే అతిగా ఆశ పెంచుకున్న తరువాత అది లభించక పోతే అది కల్లుతాగిన కోతిలా గెంతుతుంది. మనం ఆశ పడే వస్తువు మనకు దొరికే సాధ్యా సాధ్యాలను త్వరగా బేరీజు వేసుకుని మరులు గొల్పక ముందే నిష్క్రమించడం మంచిది.

  ఇటువంటి పరిస్థితి ఈ మధ్యన ప్రేమికులలో బాగా గమనించ వచ్చు. ఆస్థితిలోనే అమ్మాయిల మిది దాడులు, ఆత్మ హత్యలు లాంటి వీపరీతాలకు పాల్పడుతున్నారు.

  అలాంటి సంధర్భంలో మనసుకుదుట పడటానికి భగవద్ సేవ కూడా చాలా బాగా పని చేస్తుంది. అతనికి పూర్తి శరణాగతులమవ్వాలి.

  మనసు గురించి చాలా బాగా చెప్పారు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "అస్సలు దొరకదు అని తెలిసినపుడు పెట్టె హింస మరోరకం " నిజం...చేయగలిగినదోక్కటే .....గౌతమ బుద్ధుని మార్గము అనుసరించడమే ......కోరికలే మన దు;ఖానికి కారణం ....ఆ కోరికే లేకపోతె మనకు భాద వుండదుగా...ప్రయత్నిస్తే పోలా ....:)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రెండు ముంతలు తాటి కల్లో, ఓ రెండు షాట్లు స్కాచి విస్కీ తాపిస్తే సరి. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బాగుందండి కొత్తపాళీ గారి సూచన పాటిస్తే ఏమైనా వర్కౌట్ అవ్వుతాదేమో ....ట్రై చేస్తే పోలా ...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. 16వ శతాబ్దంలో "John Milton" తన "Paradise Lost"లో చెప్పారు“The mind can make a heaven out of hell or a hell out of heaven”అని.
  తరువాత 17వ శతాబ్దంలో మన త్యాగయ్యగారు కూడా "శాంతము లేక సౌఖ్యము లేదు..దాంతునికైనా..వేదాంతునికైనా..శాంతము లేక సౌఖ్యము లేదు.."అన్నారు.మనసుకు శాంతి లేకపోతే ఎన్ని సుఖాలు,భోగభాగ్యాలు ఉన్నా,అన్ని శాస్త్రాలూ చదివినా,వేదిక కర్మలు ఎన్ని ఆచరించినా.... అవన్నీ నిష్ప్రయోజనములు అని అన్నారాయన.

  కానీ 19వ శతాబ్దంలొ మనసుకవి ఆత్రేయ గారు ఇంకోలా చెప్పారు "మనసు గతి ఇంతే,మనిషి బ్రతుకింతే..మనసున్న మనిషికీ..సుఖములేదంతే..."అని!!

  రెండూ వాదాలూ సరైనవే.కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా మనం తెలుసుకోవాల్సిన సత్యమొక్కటే "మనం మన మనసుకి బానిసలు కారాదు"అని..(ఇలా చెప్పటం తేలికే గాని..ఆచరించటమే కష్టం :) )

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురళి గారు,
  చాల బాగా రాసారండి...
  నాకు తెలిసిన ఒక చిన్న సమేత చెబుతాను...
  " అసలే కోతి,దానికి కొంచెం పిచ్చి..ఆపై కళ్ళు తాగింది..."మనసు కూడా అప్పుడప్పుడు ఇలానే ఉంటుందండి...
  --హను

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మనం ఎన్ని మార్గాలు వెతికి ఏమి లాభమండీ! ఎవరెన్ని చెప్పినా మనసు మాటవినదుకదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మా నాన్నగారు అంటూ ఉంటారు మన: స్వస్థతైవ ఆనంద: మనోజయయేవ మహా జయా: అని. మనసు విషయంలో చెప్పినంత తేలిక కాదు. అది తాడు అయితే మనం బొంగరం లాంటివాళ్ళం. ఎన్ని కసరత్తులు చేసినా దాని పని అది చేస్తుంది. మంచి విషయం చర్చలో పెట్టారు. థాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చాలా మంచి టపా మురళి... అంత తేలిక కాక పోయినా మనసును అదుపులో పెట్టుకోవటం ప్రయత్నించటం మానం కదా... నిజమే మీరన్నట్లు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పద్దతి

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Emo murali garu,,,
  nakithe meru ela rayadam naku nachaledu........ endhukomari... na manusuni adagali!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. "మనసుకీ కవిత్వానికీ దగ్గర సంబంధం. రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళకి మనసు బాగున్నా కవితే, బాగోకపోయినా కవితే." ;) mere coincidence, my top post "ఏకాకి" http://maruvam.blogspot.com/2009/08/blog-post_05.html

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @లక్ష్మి: నిజమేనండి.. ధన్యవాదాలు
  @శేఖర్ పెద్దగోపు: 'మధు కలశాన్ని' పగలకుండా చూసుకోడం మన తరమా చెప్పండి? ..ధన్యవాదాలు.
  @విశ్వప్రేమికుడు: ధన్యవాదాలు.
  @చిన్ని: చాలాసార్లు ప్రయత్నించానండి.. నావల్ల కావడం లేదు :-) ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @కొత్తపాళీ: అంతేనంటారా? :-) ధన్యవాదాలు.
  @తృష్ణ: మామూలు కష్టం కాదాండి.. చాలా చాలా కష్టం.. ధన్యవాదాలు.
  @హను: కల్లు తాగి నిప్పుతోక్కే కోతి అండీ మనసు :-) ధన్యవాదాలు.
  @Sujata: !! ??? :-) ...ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @పద్మార్పిత: వినదు కాబట్టే కదండీ మనకిన్ని బాధలు.. ధన్యవాదాలు.
  @వర్మ: చక్కగా చెప్పారండీ.. ధన్యవాదాలు.
  @భావన; ఇక్కడ యూనిఫాం రూల్స్ పనిచేయవండి :-) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @సునీత: ధన్యవాదాలు.
  @మహీపాల్: మీ మనసుని కొంచం నా మాటగా అడగండి, ఏమంటుందో... ధన్యవాదాలు.
  @ఉష: నిజమేనండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నా మనసూ బేసిగ్గా మంచిదే..:)
  కాకపోతే అప్పుడప్పుడూ మాట వినదు అంతే ! :)
  మనసు గురించి భలే చెప్పారండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. na manushu nundi samdhanam vachindhandi....
  valbirumuka makrantham...
  flithenam kithamsaraha..
  gathrani shidhilayanthe....
  trushnaika sharaniythe! ani cheppindhii nina night kalalo

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @పరిమళం: :-) :-) ..ధన్యవాదాలు.
  @మహిపాల్: తెలుగు అనువాదం ప్లీజ్..

  ప్రత్యుత్తరంతొలగించు