శనివారం, ఆగస్టు 01, 2009

సప్తపది

మంచి సినిమా తీయడానికి చక్కని కథ ఎంత అవసరమో, ఆ కథని అంతే చక్కగా చెప్పగలగడమూ అంతే అవసరం. ఈ కథ చెప్పే విధానాన్నే సినిమా పరిభాషలో స్క్రీన్ ప్లే అంటారు. కథని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగించాలో, ఏ దృశ్యం తర్వాత ఏ దృశ్యం రావాలో వివరిస్తుంది స్క్రీన్ ప్లే. కె. విశ్వనాధ్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి 'సప్తపది.'

సున్నితమైన కథాంశాన్ని తీసుకుని, దానిని చెప్పాల్సిన విధంగా చెప్పారు విశ్వనాధ్. తనకి ఇష్టమైన ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని, సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా ప్రేక్షకులకి ఆసక్తి సడలని విధంగా తీశారీ సినిమాని. ఈ సినిమా మొత్తానికి కేవలం ఒకే ఒక్క సన్నివేశం మాత్రం అనవసరం అనిపిస్తుంది నాకు.

కృష్ణా నది వొడ్డున ఓ పల్లెటూరు. ఆ ఊరి దేవీ ఆలయం పూజారి యాజులు గారు. (జే.వి. సోమయాజులు). ఆయన కొడుకు అవధాని (రమణమూర్తి), మనవడు గౌరీనాధం కూడా అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఆ ఊరి పెద్దమనిషి, యాజులు గారి స్నేహితుడు రాజుగారు (అల్లు రామలింగయ్య). ఊరందరికీ వీళ్ళిద్దరూ అంటే భయమూ భక్తీ. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఇంట్లో యాజులు మాటకి కొడుకు, కోడలు అన్నపూర్ణమ్మ (డబ్బింగ్ జానకి) మనవడు ఎదురు చెప్పరు.

ఓ పక్క టైటిల్స్ పడుతుండగానే కథ తాలూకు మూడ్ ని క్రియేట్ చేసి, పాత్రలని ప్రవేశ పెడతారు. టైటిల్స్ అయ్యాక వచ్చే రెండో సన్నివేశంలో కథానాయిక 'హేమ' పరిచయం ఉంటుంది. అమ్మవారి ఉత్సవాల్లో ఆమె నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు రాజుగారు. హేమ ఎవరో కాదు, యాజులు గారి కూతురు జానకి కూతురు. కూతురు ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుందని ఆమె అంటే కోపం యాజులు గారికి. కూతురు మరణించాక కూడా అల్లుడితోటీ, మనవరాలితోటీ కూడా మాట్లాడడు ఆయన. మరోపక్క ఆయన కొడుకు, కోడలికి హేమని గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది.

విడిపోయిన రెండు కుటుంబాలనూ కలపాలని రాజుగారు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. హేమ పై వచ్చే తొలి సన్నివేశంలోనే ఆమె తన డాన్స్ ట్రూపులో వేణువు ఊదే హరిబాబు తో సన్నిహితంగా ఉండడాన్ని చూపిస్తారు. తన నృత్య ప్రదర్శనతో యాజులు గారిని మెప్పిస్తుంది హేమ. తరువాతి సన్నివేశంలో హేమ, హరిబాబు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు, మూఢాచారాలు, వింత నమ్మకాలు వాళ్లకి అడ్డుపడుతున్నట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి గుళ్ళో ఓ వుయ్యాల కడతారు.

హేమ ప్రదర్శనని మెచ్చుకున్న రాజుగారు, ఆమెని గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయమని యాజులుకి సలహా ఇస్తారు. "నాట్యం చేసే పిల్ల" అని యాజులు అభ్యంతరం చెబితే, నాట్యం వేదాల నుంచి పుట్టిందే కదా అని ఒప్పిస్తారు. హేమని ఆలయానికి పిలిచి, వేదగానానికి నాట్యం చేయమని ఆమెకి పరీక్ష పెట్టి, గౌరీనాధానికి, ఆమెకి పెళ్లి జరిపిస్తానని ప్రకటిస్తారు యాజులు. పడవలో తన ఊరికి తిరుగు ప్రయాణమైన హేమకి గతం గుర్తొస్తుంది.

ఒక నాట్య ప్రదర్శనలో హరిబాబు తో పరిచయం, అతని చొరవతో అది ప్రేమగా మారడం. ఆమె తన ప్రేమని వ్యక్త పరిచాక.. అతను తాను 'హరిజనుణ్ణి' అని చెప్పడం.. హేమ తనని పెళ్లి చేసుకోడం కుదరని పక్షంలో ఆమె మరెవ్వరి సొత్తూ కాకూడదన్న 'వింత కోరిక' కోరడం జరుగుతాయి. హరిబాబు తన వివరాలు చెప్పకుండా మోసం చేసినందుకు హేమ అతన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది.. కానీ హేమ అతనిపై ప్రేమని పోగొట్టుకోదు.

గౌరీనాధంతో హేమ పెళ్లి జరిగాక, ఆమె అతనికి తను నిత్యం పూజించే దేవతలా కనిపించడం తో వాళ్ళిద్దరూ 'పరాయి' వాళ్ళుగానే ఉంటారు. హేమకి పిల్లలు కలగపోవడంతో, ఆమెచేత గుళ్ళో చెట్టుకి వుయ్యాల కట్టించే ప్రయత్నం చేస్తారు. గతం గుర్తొచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది హేమ. గుళ్ళో పూలమ్ముకునే అమ్మాయి నుంచి విషయం తెలుసుకున్న గౌరీనాధం, హేమ ద్వారా హరిబాబు ని గురించి తెలుసుకుని అతన్ని తీసుకురాడానికి బయలుదేరతాడు. మనవరాలిని ఓ హరిజనుడికి ఎలా ఇవ్వాలన్న యాజులు సంశయాన్ని పోగొడతారు రాజుగారు. ఊరివారందరినీ సమాధాన పరిచి, హేమని హరిబాబుతో పంపడం సినిమా ముగింపు.

ముందుగా చెప్పినట్టుగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బలం అనిపిస్తుంది నాకు, సినిమా చూసిన ప్రతిసారీ. రాజుగారి భార్య, కూతురు ఒకేసారి పురిటికి సిద్ధపడడం ఒక్కటే అనవసరపు సన్నివేశం అనిపిస్తుంది. నిజానికి ఈ సన్నివేశం లేకపోయినా కథకేమీ నష్టం లేదు. విశ్వనాథ్ చాలా సినిమాల్లో లాగే ఇందులోనూ నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే తర్వాత చెప్పుకోవలసింది పాటల గురించి. మహదేవన్ సంగీతం లో పాటలన్నీ ఆపాత మధురాలే.

సత్యభామచేత వడియాలు పెట్టించడం విశ్వనాధ్ కే చెల్లింది. 'అచ్చెరువున అ-చ్చెరువున విచ్చిన కన్నుల జూడ' 'ఆ రాధ ఆరాధనాగీతి వినిపించ' లాంటి చమక్కులు చూపారు వేటూరి. 'గోవుల్లు తెల్లన' పాటలో జానకి గళ విన్యాసాన్ని తలచుకోకుండా ఉండగలమా? జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు.. ముఖ్యంగా కత్తిమీద సాము లాంటి ముగింపు సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో వర్ణ వ్యవస్థను చిత్రించిన తీరు గురించి చాలా చర్చలే జరిగాయి. నాకైతే ఇది ఎన్నిసార్లు చూసినా విసుగనిపించని సినిమాల్లో ఒకటి. జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చి రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1981 లో విడుదలై అవార్డులని గెలుచుకుంది.

24 వ్యాఖ్యలు:

 1. its a memorable film..మీ రివ్యూ చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి సినిమా. బహుశా సమాజపు నమ్మకాలకి మరీ విరుద్ధంగా ఉండడం వల్లనేమో ఎక్కువ ఆడలేదు. అంత మహా సీరియస్ సినిమాలోనూ కొన్ని చక్కటి హాస్య సన్నివేశాలున్నాయి. నాకు గుర్తున్న ఒక దృశ్యం, రమణమూర్తి, భార్యా పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటే పక్కింటి బుడ్డాడు, "ఏవండీ మీ రాయి మా యింటో పడింది" అని మధ్య గోడ మీద పెట్టి వెళ్తాడు. ఆ ఆలయం ఎక్కడిదో కానీ చాలా బాగుంటుంది. అగ్రహారం వీధుల్లోనూ, ఆలయ ప్రాంగణంలోనూ వేదాధ్యయనం జరుగుతుండడం ప్రధాన దృశ్యానికి నేపథ్యంగా ఇమిడిపోతుంది.
  అన్నింటికంటే గొప్ప సృజనాత్మక ఘట్టం త్యాగయ్య కృతి నగుమోముని ప్రేమసందేశంగా ఉపయోగించడం. రాస్తూ పోతే చాలా ఉన్నై ఈ సినిమా విశేషాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హైదరాబాద్ లో సంగం లో విడుదల అయింది ఈ చిత్రం. దాదాపు ఇదే ముఖ్య కథ గా , వేరు వేరు ముగింపులతో అప్పట్లో ఇంకో మూడు చిత్రాలు వచ్చాయి. బాపు గారి రాదా కళ్యాణం. దాసరి గారి స్వయంవరం, మోహన్ గాంధి గారి తోలి చిత్రం అర్ధాంగి. రాధా కళ్యాణం సుదర్శన్ లోను , స్వయంవరం శాంతి లో ను, అర్ధాంగి ఏమో కాచీగూడ లో నృపతుంగ పాఠశాల పక్కన ఉన్న ధియేటర్ లో ను వచ్చాయి. సంగం లో ఈ చిత్రం అరవై రోజులు ఆడింది. రాధాకళ్యాణం, స్వయంవరం వంద రోజలు ఆడాయి. అర్ధాంగి డెబ్భై దాదాపు గా వంద రోజులు ఆడింది కాని పూర్తిగా వంద రోజులు ఆడలేదు. మంచి సాహిత్యం. ఉయ్యాల కట్టే సన్నివేశం లో నేపధ్య సంగీతం విన్నారా. డొలాయన్చల గీతం... హేమ తర్వాత ఎ చిత్రం లో ను చెయ్యలేదు. నిజానికి ఆ అమ్మాయి కి అదే నిర్మాత తీసిన గోపాల క్రిషుడు చెయ్యవలిసి ఉంది. కాని దర్శకుడు కి రాధ అంటే మొగ్గు చూపడం వాళ్ళ ఆ అవకాశం తప్పి పోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. check out my view of the film through following link
  http://navatarangam.com/2008/07/sapatapadi-analysis/

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా మంచి చిత్రం గురించి పరిచయం చేసారు మురళి గారు, ఈ సినిమా గుర్తు రాగానే, నాకు సత్యభామ వడియాలు పెట్టడమే గుర్తొస్తుంది :-) హేమ మరో సినిమా ఏమీ చేసినట్లు లేదు. కేవలం నాట్యం కోసమే తీసుకున్నారేమో అని అనుకునే వాడ్ని. పాటలు దేనికదే సాటి. అప్పట్లో ఒకో ఆల్బం లో అన్ని పాటలు బాగుండేవి. ఇప్పుడలా ఆశించడం అత్యాశే అవుతుందేమో..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చాన్నాళ్ళ క్రితం చూసాను, మళ్ళీ కళ్ళకు కట్టినట్లు చూపారు. నా దగ్గర తెలుగు నేర్చుకునే చిన్నారులకి "ఆవు పాలు తెల్లన" అన్న పాదం నేర్పుతూ "గోవుల్లు తెల్లన'..." లోలోపల ఈ పాట స్ఫురణకి తెచ్చుకున్నానీమధ్యనే. విశ్వనాథ్ ఒక గ్రంధం, ఆయన చిత్రాలు తిరిగి తిరిగి చెక్కబడే శిల్పాలు. విశ్లేషించే రచయిత రసదృష్టిని బట్టి ఏదో ఓ క్రొత్త కోణం అవిష్కరించబడుతూనే వుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మంచిసినిమా మురళిగారూ ! అనవసర సన్నివేశం హాస్యం కోసం పెట్టి ఉండొచ్చు ...కానీ అప్పట్లో నిజంగానే అలా ఉండేవారట ! మా చిన్న పిన్నికి , పెద్దమ్మగారి పెద్దబ్బాయికీ రెండునేలలే తేడా అట :)
  ఈ సినిమాలో సాయికుమార్ ని చూస్తే నవ్వొస్తుంది.ఇక గోవుల్లు తెల్లన పాట .....జానకిగారి ఆణిముత్యాల్లో ఒకటి !మీరూ ఆవిడ అభిమానే కదా ....ఆవిడ గురించి రాఖీ గారు(http://rakigita9-4u.blogspot.com) నానోలోరాసిన రెండుముక్కలు ..
  "కోకిల
  పాటనేర్చుకుందా!
  దాని గురువు
  జానకే కచ్చితంగా!!"

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇందులో హీరోయిన్ గా చేసిన సబిత నాకు డిగ్రీలో క్లాస్ మేట్. సినిమాలో తన యాక్షన్ అస్సలు కనపడలేదు. అదేంటో మంచి సబ్జెక్ట్ ఐనా సినిమా నడవలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @తృష్ణ: ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: ఆలయం అమరావతి సమీపంలో ఉండి ఉండొచ్చని నా ఊహ. టైటిల్స్ లో అమరావతి ఆలయ అధికారులకి కృతఙ్ఞతలు చెప్పారు :-) పక్కింటి పిల్లవాడి పాత్ర ఆద్యంతమూ చాలా బాగుంటుంది.. ముఖ్యంగా యాజులు కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఆ పిల్లాడిని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు.. నిజంగా యెంత చెప్పినా తక్కువే.. ధన్యవాదాలు.
  @శ్రీ: చక్కని సమాచారం.. 'డోలాయాం' ఒక్కటే కాదండీ, హేమకి పెళ్లవుతుంటే, హరిబాబు ఏటి వొడ్డున కూర్చుని పెళ్లి మంత్రాలు ఫ్లూట్ పై వాయించే సీన్ గమనించండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: హేమ (అసలు పేరు సబిత) ని గురించి శ్రీ గారు, జ్యోతి గారు వ్యాఖ్యలు రాశారు చూడండి.. నిజమేనండీ..ఇప్పుడలాంటి పాటలు రావడం లేదు.. ధన్యవాదాలు.
  @ఉష: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పరిమళం: ఆ సన్నివేశం లేకపోయినా ప్రధాన కథకి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పడం నా ఉద్దేశం అండీ.. అలాంటివి మా బంధువుల్లోనూ జరిగాయి.. సాయికుమార్ ని పోలీసు వేషంలో చూసినప్పుడల్లా నాకు 'మా గురువు గారు చిన్నప్పుడు చిన్న పిల్లంగోవి మింగేశారో ఏమో..' అన్న డైలాగు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను.. చాలా బాగా చేశాడు.. చాలా చక్కగా ఉందండీ నానో.. నూటికి నూరుపాళ్ళు నిజం.. ధన్యవాదాలు.
  @జ్యోతి: కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో, మరికొన్ని ఎందుకు ఆడవో నాకు ఎప్పటికీ అర్ధం కాదండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. cinema ante yento kuda teliyani vayasu..theatre yedo gurtu ledu kani aa pakkane vunna khali pradesam lo pedda pelli pandiri..andulo maa mavayya pelli!!
  amma vallu memekkadunnama ani vetukkuntoo vaste theatre gate voochalu pattukuni velladutoo kanipinchamata..
  papam pelli panulu chesukoleka mammalni kapala kayaleka chala avasha paddarata..
  ''SAPTA PADI'' taluku 1st memory adi..
  aa taravata chala sarlu kadalakunda choosina cinema kuda!!
  naku kuda baga nachina sannivesam hema pelli jarugutundaga yeti gattuna hero flute py vayinchina pelli mantralu..
  alage "marugelara o raghava" naku chala istamyna pata..janaki garu padadam valla inka inka istamyna pata!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @ప్రణీత: బాగున్నాయండి మీ చిన్నప్పటి సినిమా జ్ఞాపకాలూ. ధన్యవాదాలు. తెలుగులో రాయడానికి ఈ లింక్ లో ఒకసారి ప్రయత్నించండి.. http://www.google.co.in/transliterate/indic/telugu

  ప్రత్యుత్తరంతొలగించు
 14. murali garu inkokkasari mimmalni na english-telugu to ibbandi pedutunnanu..
  link chepparu kani danni upayoginchadam bothiga raledu naku..
  "mee vyakhyanu vunchandi" ani vunna chota type chesi post chesestunna nenu ippati dakanu..

  nakidantha kotha lokam kadandi..
  baabbabu inkaasta saayam chesi punyam kattukondi..

  aa link ni yela vadalo kuda chepparu..pls!!
  chinna pilla la adugutunna anukunna parledandi..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @ప్రణీత: ముందుగా మీ ఉత్సాహానికి అభినందనలు.. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుందండీ.. అక్కడ మీరు రాయదల్చుకున్నది ఇంగ్లీషులో రాసెయ్యండి, అంటే ఇప్పుడు కామెంట్ బాక్స్ లో ఎలా రాస్తున్నారో అలా.. దానంతట అదే తెలుగులోకి మారిపోతుంది.. ఏ పదమైనా స్పెల్లింగ్ తప్పు వస్తే ఆ పదం మీద కర్సర్ ఉంచి క్లిక్ చేయండి.. మూడు, నాలుగు పదాలు వస్తాయి.. వాటిలోనుంచి కావాల్సింది ఎంచుకుని క్లిక్ చేయండి.. మొత్తం కామెంట్ రాయడం ఐపోయాక, కాపీ చేసి కామెంట్ బాక్స్ లో పేస్ట్ చేసి పంపండి.. ఏదైనా ఇబ్బంది వస్తే నిరభ్యంతరంగా అడగండి.. మీరు తెలుగులో రాసే వ్యాఖ్య కోసం ఎదురు చూస్తూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అబ్బ ! యేనుగెక్కినంత సంతోషం గా వుందండి...
  చాల చాల చాల థాంక్స్ మురళి గారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @ప్రణీత: మీరు జిమెయిల్ లో కూడా తెలుగులో రాయొచ్చు.. కొద్దిగా ప్రాక్టిస్ చేస్తే తప్పులు లేకుండా వచ్చేస్తుంది.. (ఉచిత) సలహాలు ఇవ్వడానికి మేమంతా ఉన్నాం.. త్వరలోనే ఓ బ్లాగువారవ్వాలని కోరుకుంటూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నీకు నచ్చిన సినిమా ఏంటి అని అడిగితే టక్కున చెపుతాను ఈ సినిమా పేరు అంత ఇష్టం .. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఇందులో హీరోయిన్ భర్త ఎందుకు దూరం గా ఉంచుతున్నాడొ తెలియక అత్తగారి మాటలు తట్టుకోలేక గుడిలో రౌద్రంగా ఒక డాన్స్ చేస్తుంది అదే సమయానికి హీరో మురళీ గానంతో ఆమెను శాంత పరుస్తాడు ఆ సీన్ నాకు చాలా ఇష్టం

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @నేస్తం: అత్తగారితో ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడేటప్పుడు, హీరోయిన్ కుంపటి రాజేస్తూ ఉంటుంది గమనించారా.. సింబాలిక్ సీన్.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. చాలా ఏళ్ళుగా ఈ సినిమా గురించి వింటూ వచ్చాక.. ఈ మధ్యనే ఈ సినిమా చూసాను. ఏమి నచ్చిందో చెప్పాలంటే సినిమా చూసిందానికంటే ఎక్కువ సేపే పడుతుందేమో.. ఈ సినిమా గురించి నా స్పందన ఒక పోస్టులా రాయాలని అనుకుంటూ ఉన్నాను చూసినప్పటి నుంచీ కూడా...అలా అలా వాయిదా పడుతూ ఉంది సమయం కుదరక :( మీ టపా చూడడం సంతోషంగా ఉంది :)
  'నెమలికి నేర్పిన, గోవుల్లు తెల్లన'..పాటలు చిన్నప్పటి నుంచీ బాగా విన్నవే కానీ, 'మరుగేలరా' పాట నాకు చాలా చాలా నచ్చింది. ఎంతంటే.. ఆ ఒక్క పాటే వింటూ రోజంతా గడిపేయగలనేమో కూడా .. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 21. నా స్వర్ణముఖి టైటిల్ వెనకాల ఒకతను సూర్యనమస్కారం చేస్తుంటాడు. అది సప్తపదిలోనిఒదే. అక్కడ కనిపించేది గౌరీనాధుడే. సినిమా చూసేప్పుడూ పాస్‌చేసి క్లిప్పింగ్‌ని సేవ్ చేస్కొన్నా. చాలాకాలం అదినే నావాల్‌పేపర్. బ్లాగుమొదలుపెట్టేప్పుడు గుర్తొచ్చి దానిని పెట్టేసా.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @మధురవాణి: నాకు 'మరుగేలరా' తో పాటు 'రేపల్లియ..' కూడా ఇష్టమండి.. బాలు, సుశీల నా పేరు పలుకుతూ ఉంటారు కదా :-) ఆ పాటలో వేటూరి గారి పద ప్రయోగాలు చాలా బాగుంటాయి.. టపాలో రాశాను.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: మీ బ్లాగు చూసినప్పుడు డౌట్ వచ్చింది కానీ, మీ స్వర్ణముఖి నది వొడ్డున మీరు తీసిన ఫోటో కూడా అయ్యి ఉండొచ్చు కదా అనిపించిందండి.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. మంచి చిత్రం గురించి పరిచయం చేసారు మురళి గారు

  ప్రత్యుత్తరంతొలగించు