శుక్రవారం, ఆగస్టు 07, 2009

మొగ్గల చీర

మా బామ్మ దృష్టిలో చీర అంటే ఏక రంగు నేత చీరే. సాదా అంచుతో ఉన్న చీరలు ఇంట్లోనూ, జరీ అంచు చీరలు బయటికి వెళ్ళేటప్పుడూ కట్టుకునేది. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాలకి పట్టు చీరలు సరేసరి. అమ్మ మాత్రం పూలు, డిజైన్లు ఉన్న చీరలు కట్టుకునేది. బామ్మవాటిని 'మొగ్గల చీరలు' అని వెక్కిరించేది. అత్తయ్యలు కూడా అమ్మ కట్టుకునే లాంటి చీరలే కట్టుకునే వాళ్ళు కానీ బామ్మ పాపం వాళ్ళనేమీ అనేది కాదు.

బామ్మ బాధ పడలేక అమ్మకూడా అప్పుడప్పుడూ ఆ అంచున్న చీరలు కట్టుకునేది. "ఏమీ బాలేవమ్మా.. బామ్మలాఉన్నావు.. అసయ్యంగా.." అని తను అడక్కపోయినా నా అభిప్రాయం ప్రకటించే వాడిని అమ్మ దగ్గర. అప్పటికింకా "అమ్మా..నీకేం తెలీదు" అనడం రాలేదు నాకు. నా మాటలు బామ్మ ఎక్కడ వింటుందో అని హడిలిపోయేది అమ్మ. నాన్న అమ్మకి చీర తెచ్చినప్పుడల్లా బామ్మ డైలాగు ఒక్కటే "ఇదేం చీరా..మొగ్గల చీర.."

మొగ్గల చీర మీద బామ్మ తన అభిప్రాయాలు తన స్నేహితురాళ్ళ దగ్గర తరచూ ప్రకటిస్తూ ఉండేది. ఆ చీరల మీద వ్యతిరేకతతో ఆవిడ కొన్ని సామెతలు కూడా సృష్టించింది.. "వద్దంటే మొగ్గల చీర కట్టుకు రావడం" వాటిలో ఒకటి. (ఈ సామెత మరెవ్వరూ వాడగా వినలేదు కాబట్టి, పేటెంట్ మా బామ్మదే అనుకుంటున్నా) ఒకరోజు అమ్మ, బామ్మ ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నాకసలే అభిప్రాయాలు చెప్పేయడం అలవాటు కదా.. వాళ్ళ మధ్యలోకి వెళ్లి నా అభిప్రాయం చెప్పేశా..

సహజంగానే బామ్మకది నచ్చలేదు. "మధ్యలో నిన్నెవరు రమ్మన్నార్రా.. వద్దంటే మొగ్గల చీర కట్టుకుని.." అంటూ కోప్పడింది. సమయానికి తాతయ్య ఇంట్లో లేరు..దాంతో ఫిర్యాదు చేయడానికి లేకపోయింది. అప్పటికింకా నేను సినిమాలు ఎక్కువగా చూడకపోయినా నా మనసు ప్రతీకారంతో రగిలిపోయింది. ఏం చెయ్యాలా? అని ఆలోచించి, అమ్మ బామ్మ వాళ్ళ చర్చలో వాళ్లుండి నన్ను గమనించడం లేదని తెలుసుకుని ఇంట్లోంచి బయటికి నడిచాను.

ముందుగా మా బామ్మ తేలుమంత్రం స్నేహితురాలు శాయమ్మ గారింటికి వెళ్లాను. ఆవిడతో ఆకబురూ ఈకబురూ చెప్పి "ఇవాళ మా బామ్మ గారు మొగ్గల చీర కట్టుకున్నారండీ" అని చెప్పి మరో ఇంటికి వెళ్లాను. ఇలా నాలుగైదు ఇళ్ళు తిరిగి, తాతయ్య, నాన్న ఇంటికి వచ్చే వేళకి పిల్లిలా ఇంటికి చేరాను. సాయంత్రం శాయమ్మ గారు హడావిడి పడుతూ వచ్చి "ఏమిటండీ మొగ్గల చీర కట్టుకున్నారుట?" అని అడిగేశారు బామ్మని. నేను ప్రమాదాన్ని శంకించిన వాడినై తాతయ్యని వదల్లేదు.

మరి కాసేపటికి మరో ఇద్దరు స్నేహితురాళ్ళు వచ్చారు, మొగ్గల చీరలో మా బామ్మని చూడ్డానికి. నాన్న చేత నన్ను భయపెట్టించాలని చూసింది కానే, తాతయ్య పడనివ్వలేదు. పైగా "నీకంతగా మనుసుగా ఉంటే ఓ మొగ్గలచీర కొనుక్కో.. నేనేవన్నా వద్దన్నానా?" అని ఎదురు దాడికి దిగారు. పాపం..బామ్మ చాలా అవమాన పడింది. ఎందుకంటే వారం రోజులపాటు ఎవరు కనబడ్డా ఆవిడని "ఏమిటండీ మొగ్గల చీర కట్టుకున్నారుట?' అని అడగడమే.. మా బామ్మకి నేను 'పగ వాడిని' ఎందుకయ్యానా? అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చిన అనేక సంఘటనల్లో ఇదీ ఒకటి.

31 వ్యాఖ్యలు:

 1. బాగుందండి మీ బామ్మ గారి మొగ్గల చీర సామెత. నేను ఎప్పుడు వినలేదు. నాకైతే చాల నచ్హింది. పేటెంట్ ఖచ్హితంగా అవిడదే..............

  పావని

  ప్రత్యుత్తరంతొలగించు
 2. 'పగవాడు' అవడానికి అప్పుడే మొగ్గ పడిందన్నమాట!!! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "మొగ్గల చీర" పదం బాగుంది. పేటంటు ఖచ్చితంగా మీ బామ్మ గారిదే. ఎందుకయినా మంచిది పేరు రిజిస్టర్ చేయించండి, ఎవరయినా సినిమా వాళ్లు వింటే భలే ఉంది పేరు అని సినిమాకి పెట్టేసుకుంటారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వద్దంటే మొగ్గల చీర కట్టుకుని.....మరీ పోస్ట్ రాస్తారా ...హన్నా ! :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు,
  మీ శైలిలో చంపేసారండి....
  ఈ కాలంలో బామ్మలు గురించి మాట్లాడుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది.....
  అదేంటో తెలియదు కాని చాలా మంది బామ్మలకు వాళ్ళ మనవాళ్ళే పగవాళ్ళుగా ఉంటారు...
  నేను కూడా అదే లిస్టు లో ఉన్నవాడిని... :)
  --హను

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బాగుంది మీ చీర ఉదంతం. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "వద్దంటే మొగ్గల చీర కట్టుకొని".....హ!..హ! ఎంత కోపముంటే మాత్రం, మరీ ఇలా సామెత కనిపెట్టేశారా? సూపర్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. బామ్మ గారిని మరి ఇలా ప్రపంచ వల (వరల్డ్ వైడ్ వెబ్ ) మీదకి వేసి అల్లరి చేస్తారా.. హన్నా ...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మురళి "వద్దంటే మొగ్గల చీర కట్టుకుని" బామ్మ ను ఇలా వెక్కిరిస్తారా! ఏం బాగాలేదు ఇది. :-)) ఎందుకైన మంచిది పేటెంట్ రిజిస్టర్ చెయ్యండి చాలా బాగుంది డైలాగ్...

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బాగుందండి మీ బామ్మ గారి మొగ్గల చీర.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హన్నా..ఇందుకా మీరు బామ్మ గారి పగవాడి జాబితాలో ఉన్నారు!! భలేవారే మీరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బావుందండీ.. కవ్వించి ఆనక తాత వెనుక నక్కేవారన్నమాట..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @పావని: ధన్యవాదాలు.
  @మేధ: భలే చెప్పారండి.. ధన్యవాదాలు.
  @సిరిసిరిమువ్వ: మీరు నాకంటే అమాయకుల్లా ఉన్నారు.. ఇప్పటి సినిమాలకి ఇలాంటి టైటిల్స్ ఏం పనికొస్తాయి చెప్పండి? ధన్యవాదాలు.
  @లక్ష్మి: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @పరిమళం: మన బ్లాగు మిత్రులకి నా టపా కన్నా మీ వ్యాఖ్య బాగా నచ్చిందండీ :-) మీరంతా కలిసి మా బామ్మ అభిమాన సంఘం పెట్టేస్తారేమో అని డౌట్ వస్తోంది నాకు.. ధన్యవాదాలు.
  @నేస్తం: ధన్యవాదాలు.
  @హను: హమ్మయ్య!! నాకు తోడు దొరికారు.. బామ్మ బాధితుడిని నేనొక్కడినే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ.. ధన్యవాదాలు.
  @జాబిలిగీతం: ధన్యవాదాలు. బ్లాగుకి అంత మంచి పేరు పెట్టి, ఏమీ రాయకపోవడం అన్యాయం అండీ.. రాసే సంగతి చూడండి కొంచం..

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @భవాని: అబ్బో..ఇంకా చాలా సామెతలు ఉన్నాయండి.. ధన్యవాదాలు.
  @శ్రీ: అదేమిటండీ.. అప్పుడు చేసినదానికి ప్రాయశ్చిత్తంగా ఈ టపా రాస్తే అలా అంటారు? :-) ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: Thank you
  @భావన: పేటెంట్ కి వెళ్ళాలంటే ముందు అర్ధం తెలుసుకోవాలి కదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @తృష్ణ: పరిమళం గారికి ఇచ్చిన జవాబే మీకూను :-) ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: పరిమళం గారికి ఇచ్చిన స్పందనే నా స్పందన.. ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: ఇదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: తాతయ్య ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు బామ్మ పాత పగలన్నీ గుర్తుంచుకుని ప్రతీకారం తీర్చుకునేదండీ.. ధన్యవాదాలు.
  @చిన్నా: ధన్యవాదాలు.
  @మహిపాల్: ఆవిడని కలిసినప్పుడు చెబుతానండి.. ఎప్పుడో చెప్పలేను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మొగ్గలచీర నాక్కూడా చాలా బాగా నచ్చిందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మురళీ గారూ, అప్పుడు నలుగురికే చెప్పారు, ఇప్పుడు ప్రపంచమంతా చాటింపే... ఇక మీ బామ్మ మిమ్మల్ని వదలదు చూడండి. ఎందుకైనా మంచిది తాతయ్య గారిని స్మరించుకోండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. హమ్మో ! మీతో చాల జాగ్రత్తగా వుండాలన్నమాట .చిన్నప్పటి నుండే ఫిట్టింగ్ మాస్టారన్నమాట!...బా.రా.గారి మాటే నా మాట:)

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @సునీత: ధన్యవాదాలు
  @భాస్కర రామిరెడ్డి: చూశారా..మా బామ్మకి ఎంతమంది అభిమానులో ఇక్కడ :-) పర్లేదండి..తాతయ్య ఎప్పుడూ నాపక్షమే.. ధన్యవాదాలు.
  @చిన్ని: 'నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..?' ..మిమ్మల్ని కూడా మా బామ్మ అభిమాన సంఘంలో చేర్చేస్తున్నా :-) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. మురళీ గారూ,మీ గురించి చాలా బాగుంది.మీ మొగ్గల చీరా బాగుంది .నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశం కధా వస్తువుగా రమ్యంగా మలచ వచ్చు ,అన్న విషయాన్ని , కాదేదీ కవిత కనర్హం అని ఋక్కులు లో మహాకవి శ్రీ శ్రీ గారు నుడివినట్లు , అతి సహజంగా ఫ్రీ ఫ్లో తో చదువరులు మక్కువతో చదివేలా మీ కధనం అభినందనీయం .
  మీ నెమలికన్ను నా కంటికి రమణీయంగా కనపడింది .చూడటానికి అప్పుడప్పుడూ వస్తే అభ్యంతరం వుండదుగా. అభినందనలతో ....నూతక్కి రాఘవేంద్ర రావు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @నూతక్కి రాఘవేంద్ర రావు: మీకు వీలైనప్పుడల్లా తప్పకుండా రండి.. సలహాలు, సూచనలు ఇవ్వండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు