బుధవారం, ఆగస్టు 12, 2009

నాయికలు-వేదసంహిత

కొన్ని కొన్ని పుస్తకాలు మొదటి సారి చదివినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి..కొన్ని పాత్రలు మనకి మరీ దగ్గరగా అనిపిస్తాయి.. మనకి తెలియకుండానే ఆ పాత్ర (ల) తో ప్రేమలో పడిపోతాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా అన్నమాట.. అలా నేను ప్రేమలో పడ్డ అనేక పాత్రల్లో ఒకామె వేదసంహిత. ఆంత్రోపాలజీ రీసెర్చ్ స్కాలర్, అపాచీ కల్చర్ మీద పీహెచ్.డీ. చేయడమే కాదు, ఆ అపాచీల నాయకుడి మనసునూ గెలుచుకున్న అమ్మాయి. అంతే కాదు, తాగి వచ్చి భార్యపై కత్తిపీటతో దాడి చేసే ఓ భర్తకి భార్య కూడా!

సుమారు రెండు దశాబ్దాల క్రితం అనుకుంటా.. 'ఆంధ్రజ్యోతి' వారపత్రిక ఓ ప్రయోగం చేసింది. 'ప్రేమ' అనే సబ్జెక్ట్ ఎంపిక చేయడంతో పాటు, ముఖ్య పాత్రల పేర్లనూ నిర్ణయించి, ముగ్గురి చేత సీరియల్స్ రాయించి ప్రచురించింది. మూడు సీరియళ్ళ టైటిళ్ళూ 'ప్రేమ,' ప్రధాన పాత్రల పేర్లు అభిషేక్, సంహిత, చలం. యద్దనపూడి సులోచనా రాణి, వెన్నలకంటి వసంత సేన, యండమూరి వీరేంద్రనాథ్ లు ఆ సీరియళ్ళు రాశారు. ముగ్గురు సంహితల్లోనూ నాకు బాగా నచ్చింది యండమూరి వేదసంహిత.

బ్రహ్మదేవుడు తను సృష్టించిన అమ్మాయి గురించి తనే తన్మయంగా మాట్లాడి సరస్వతీదేవి కి కోపం తెప్పించడం లాంటి అపసవ్యపు ప్రారంభం చికాకు తెప్పించినప్పటికీ, గోదారి ఒడ్డున పల్లెటూరు ఆదిత్యపురానికీ, గాజాలో రెడ్ ఇండియన్ల స్వతంత్ర పోరాటానికీ వేదసంహిత అనే అందమైన అమ్మాయిని వంతెనగా చేసి ఆశ్చర్య పరుస్తాడు రచయిత. ఒంటరిగా ఆదిత్యపురం వచ్చిన వేదసంహిత పల్లెటూళ్ళ మీద రిసెర్చ్ మిష మీద సోమయాజిగారింట్లో అద్దెకి దిగుతుంది.

అప్పటికి సివిల్ సర్విస్ పరిక్షలు రాసి వస్తుంది వేదసంహిత. ఆధునికంగా ఆలోచిస్తూనే సంప్రదాయాన్ని విడిచిపెట్టకపోవడం ఆమె ప్రత్యేకత. పదిమంది చుడీదార్ అమాయిల్లో ఓ లంగా వోణీ అఅమ్మాయి తను. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతారు ఆ ఊరి కుర్రాళ్ళు చలం, అరుణ్. వాళ్ళతో తాను 'వివాహితను' అని చెబుతుంది, మెడలో ఉన్న తాళిబొట్టు తీసి చూపిస్తుంది.

ఆమె వచ్చిన కొన్నాళ్ళకే ఆమెని వెతుక్కుంటూ ఆ ఊరొస్తాడు అభిషేక్. 'అపాచీలు' అనే ఆటవిక తెగకి నాయకుడతడు. ఈ ప్రపంచంలో 'ప్రేమ' తో సాధించలేనిది ఏదీ లేదని నమ్మిన వాడు. "స్త్రీకి కష్టాలు లేకపోవడమే సంతోషమా? భర్త కష్టాల నుంచి బయటపడితే చాలా?" ఇవి వేదసంహితని వేధించే ప్రశ్నలు. సమాజాన్ని సంతోషాన్ని వెతుక్కోవాలన్న అభిషేక్ సూచన ఆమెని ఆలోచనలో పడేస్తుంది. భర్తనుంచి తాను ఆశించే ప్రేమని అభిషేక్ నుంచి పొందుతుంది వేదసంహిత.

ఇప్పుడు ఈనవల మళ్ళీ చదువుతుంటే, అప్పటి ఉత్కంఠత గుర్తొచ్చి నవ్వొచ్చింది. కథలో నాటకీయత తో పాటు, కథనంలో లోపాలూ చాలానే కనిపించాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించీ రచయిత ఇచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు విసుగు కలిగించాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ మారనది ఒకటి ఉంది.. వేదసంహిత మీద అభిమానం. బహుశా తొలిప్రేమ బలమేమో?!! ('ప్రేమ,' నవసాహితి ప్రచురణ, వెల రూ. 50.)

15 కామెంట్‌లు:

  1. నాకు చాల ఇష్టమైన పాత్ర వేదసంహిత.అలానే యండమూరి నవల్లో నచ్చినది ఇదొకటి,మీ ఫస్ట్ లవ్ ఏమోకాని ఆ నవల చదువుతుంటే కోనసీమ తో కచ్చితంగా ప్రేమలో పడతాము. మంచి పరిచయం,యద్దనపూడి ప్రేమ తేలిపోయింది ..యండమూరి ముందు..,వెన్నెలకంటి దొరకలేదు.

    రిప్లయితొలగించండి
  2. నవల చదవలేదు కానీ అపాచీల నాయకుడు అభిషేక్ అంటే ఇక చదవాలనిపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. Vedasamhitha sounds cool.
    ఇదే బాణీలో యండమూరి నాయికలు చాలా మందే మంచి బలమైన వ్యక్తిత్వమున్న వాళ్ళుగా నాకు ఆకర్షణీయంగా కనబడతారు. పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు.

    అవునూ, గాజాలో రెండ్ ఇండియన్లు? అపాచీల నాయకుడు "అభిషేక్"? కొంచెం గజిబిజిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. అవును మంచి నవల... ఆమె పేరే నాకు ఎంతో నచ్చింది వేద సంహిత. కొన్ని పేర్లు ఆ పాత్ర వ్యక్తిత్వాలు బలే గుర్తు వుండి పోతాయి, ఒక మందాకిని, ఒక వేద సంహిత, ఒక కిరణ్మయి.. ఈ నవలలో ఆమె ను యండమూరి చిత్రీకరించిన తీరు ఇంకా అధ్బుతం... అవును యండమూరి నవలలో కొంచం ఎక్కువైన వర్ణనలు విసుగనిపించినా మంచి నవల, యద్దనపూడి గారిది చాలా రొటీన్ మాములు గా వుంది, వెన్నెలకంటి గారిది తేలిపోయింది ముగ్గురి చిత్రీకరణల లో.. మంచి పుస్తకం గుర్తు చేసేరు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. నవల చదవలేదు,"వేదసంహిత" ఆ పేరే నాకు ఎంతో నచ్చింది.

    రిప్లయితొలగించండి
  6. ఆ మూడూ ‘ప్రేమ’ల్లో నాకు వెన్నెలెకంటి వసంతసేన నవల నచ్చింది. యండమూరి నవల్లో వేదసంహితే హైలైట్.

    రిప్లయితొలగించండి
  7. migatha rendu navals kuda cheppochuka..... chinnapudu ma bamma, eppudu tv serials la correct alachana lepi na pani ayyipondhi annatuga untaru... endhukante ee navals vachinappudu nenu inka palu thaguthu undi untanu... koncham twarga publish chesaru... pls...pls

    రిప్లయితొలగించండి
  8. @చిన్ని: నేను కోనసీమతో బాల్యంలోనే ప్రేమలో పడిపోయానండి :-) ..ధన్యవాదాలు
    @Srinivas: దానికో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందిలెండి.. పర్లేదండీ నవల చదవొచ్చు.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: గజిబిజిగా ఉండడానికి బాధ్యత యండమూరిదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @భావన: మిగిలిన ఇద్దరు సంహితల పక్కనా వేదసంహిత మరీ బాగా అనిపించిందండీ :-) ..ధన్యవాదాలు.
    @పద్మార్పిత: వీలయితే చదవండి. ధన్యవాదాలు.
    @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
    @మహిపాల్: వెన్నెలకంటి 'ప్రేమ' మినహా మిగిలిన రెండు ప్రేమలూ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయండి.. మూడింటిలో నాకు నచ్చినవి యండమూరి, వెన్నెలకంటి ప్రేమ లు. వెన్నెలకంటి నవల కోసం వెతుకుతున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. బాగుంది మురళీగారూ. ఆ మూడు సీరియళ్ళూ నాకూ గుర్తున్నాయి. మొదట ముగ్గురివీ ఆసక్తిగా మొదలు పెట్టాను గానీ, సంచిక సంచికకీ మిగతా రెంటి మీదా ఆసక్తి చల్లబడిపోయి, చివరికి యండమూరిది మాత్రమే కడదాకా చదివాను. తరువాత పుస్తక రూపంలో కూడా చదివాను. యండమూరి నవలల్లో కాస్త భిన్నంగా వుంటుందిది. నచ్చితే బాగా నచ్చుతుంది, నచ్చకపోతే అస్సలు నచ్చదు. నాకు కోనసీమ వరకూ బానే నచ్చింది గానీ, మధ్యలో అభిషేక్-అపాచీల గోల ఇరికించడం మాత్రం నచ్చలేదు. "వేదసంహిత" నా మీద అంత ముద్ర వేయలేదెందుకో, మందాకిని (ఆనందోబ్రహ్మ) లాగా. పేర్లు మాత్రం బాగా పెడతాడు యండమూరి. అతని పేర్లలో "మందాకిని", "హేమంత సంధ్య" నాకు బాగా నచ్చుతాయి. "నికుంజ్ విహారి" లాంటివి మాత్రం నవ్వొస్తాయి.

    రిప్లయితొలగించండి
  11. మెహెర్: 'హేమంత సంధ్య' పేరు నాకూడా బాగా నచ్చిందండీ. వేదసంహిత అప్పట్లో బాగా నచ్చిందండీ.. మిగిలిన ఇద్దరు సంహితల పక్కనా ఉండడం వల్లనో ఏమో.. ఇప్పుడు అంతగా అనిపించలేదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఈ నవల చదవలేదండీ నేను..
    "యద్దనపూడి" ది చదివాను కానీ నచ్చలేదు నాకు...

    "హేమంత సంధ్య" యండమూరి గారి ఏ నవలలో నాయికో చెప్పరూ..

    రిప్లయితొలగించండి
  13. @ప్రణీత: 'కాసనోవా' అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మురళీగారు, కాసనోవా కాదండీ, మరో హిరోషిమా అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  15. vedasamhita is an excellent character created by yandamoori.others are mandakini - anandobrahma, Kiranmai - ladies hostel, sowparnika - tappuchedamrandi.
    konne varnanalu bore antam kani ippudunna globalisation lo evi levu. routine.

    రిప్లయితొలగించండి