బుధవారం, జులై 22, 2009

గ్రహణం విడిచిందా?

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన సూర్య గ్రహణం పూర్తయ్యింది. ప్రజలంతా ఆకాశంలోనో, టీవీలోనో ఈ గ్రహణాన్ని వీక్షించారు. మనకి గ్రహణాలు కొత్త కాదు కానీ గ్రహణాన్ని కూడా 'అమ్మకపు సరుకు' మార్చుకునే సంస్కృతి కొత్త. అత్యంత సహజమైన గ్రహణం చుట్టూ రకరకాల కథలు సృష్టించి, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి సొమ్ము చేసుకునే మార్కెటింగ్ మాయాజాలాన్ని చూడడం కొత్త.

ఈ సూర్య గ్రహణం తో యుగాంతం తధ్యమన్న పుకారు ఎక్కడ బయలుదేరిందో తెలియదు కానీ, గడిచిన వారం రోజులుగా దేశమంతా షికారు చేసింది. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఏ నోట విన్నా ఇదే మాట. మత గ్రంధాలను ఉటంకించే వారు కొందరైతే, రకరకాల శాస్త్రాలను సాక్ష్యం గా చూపించే వారు మరికొందరు. ముప్పు సునామీ రూపంలో వస్తుందా లేక ప్రపంచం మొత్తం అంధకార మయం అయిపోతుందా అన్న చర్చలు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రజలని చైతన్య వంతులని చేయాల్సిన మీడియా - ముఖ్యంగా డ్రాయింగ్ రూముల్లోకి చొచ్చుకుని వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా - ఈ పుకారుకి విస్తృత ప్రచారం కల్పించడం. గత రెండు రోజులుగా ఏ చానల్ తిప్పినా ఇదే వార్త. ఈ ప్రచారం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ వార్త చూసి కుప్ప కూలిపోయేటంతగా.

ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పిన విషయానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఏదో ముప్పు రాబోతోందనే అంశానికి మాత్రం విశేష ప్రాధాన్యత ఇచ్చి ఊదరగొట్టడం లో చానళ్ళు పోటీ పడ్డాయి. ఈ విషయం లో ఏ చానలూ మరో చానల్ కన్నా తక్కువ తినలేదు. ఎవరు ఎక్కువ భయపెట్టగలరు అన్న అంశం మీద చానళ్ళు పందెం వేసుకున్నాయా? అనిపించేలా సాగింది ప్రచారం. 'గండం గడిచింది' అని ఓ వార్త ప్రసారం చేసి చేతులు దులుపుకోడం ఈ కథకి కొసమెరుపు.

నిజానికి 'యుగాంతం' పేరు చెప్పి మీడియా ప్రజల్ని భయపెట్టడం ఇదే మొదటి సారి కాదు. మూడు దశాబ్దాల క్రితం అప్పటికి పసి వయసులో ఉన్న ఓ తెలుగు పత్రిక స్కై లాబ్ కూలిపోతోందని చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ పత్రిక ప్రచారం పట్ల అప్పట్లో చాలా విమర్శలు వినిపించాయి, ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అప్పుడు తాత్కాలికంగా ప్రజల విశ్వసనీయత కోల్పోయిన ఆ పత్రిక ఆ తర్వాత కృత్యదవస్థ మీద దానిని తిరిగి సంపాదించుకోగలిగింది.

మరి ఇప్పటి పరిస్థితి? టీఆర్పీ రేటింగులు పెంచుకోడమే లక్ష్యంగా, ప్రకటనలు సాధించుకోడమే ధ్యేయంగా పని చేస్తున్న టీవీ చానళ్ళు ప్రజల విశ్వసనీయతను కోల్పోవడం ఇదే మొదటిసారి ఐతే కాదు. మరో సారి. ఐతే ఈ సారి పెద్ద మొత్తంలో. ఎందుకీ చానళ్లకి ప్రజలంటే ఇంత లోకువ? వార్తా వ్యాపారం కనీస విలువలని ఎందుకు పాటించలేక పోతోంది?

తాము ప్రసారం చేసే వార్త సమాజం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, విశ్వసనీయత కోల్పోతే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో చానళ్ళ యాజమాన్యాలకి తెలియదా? ఈపూటకి ప్రకటనలు సంపాదించుకుంటే చాలు (వార్తలు సెకండరీ) అన్న ధోరణి, సంస్థల దీర్ఘకాలిక మనుగడకి ఎలా సాయపడుతుంది? ఈ మీడియా గ్రహణానికి విడుపు ఎప్పుడు?

19 వ్యాఖ్యలు:

 1. >>>ఎందుకీ చానళ్లకి ప్రజలంటే ఇంత లోకువ?
  సింపుల్...బారెడు కళ్ళప్పగించి, చెవులు రిక్కించి మరీ ఆసక్తిగా చూస్తున్నందుకు...
  >>>తాము ప్రసారం చేసే వార్త సమాజం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, విశ్వసనీయత కోల్పోతే దాని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో చానళ్ళ యాజమాన్యాలకి తెలియదా?
  ఎంత అమాయకులండీ మీరు..తెలిసినా వాళ్ళకు ఏమీ నష్టం ఉండదు కదా! పైగా ఆ దుష్పరిణామాలు కూడా లైవ్ లో చూపించి క్యాష్ చేసుకోవచ్చు. అయినా మన దేశంలో ప్రసార మాధ్యమాలను నియంత్రించే సంస్థ ఒకటి ఏడిచిందికదా...దానికే ప్రజల సంక్షేమం అవసరం కానప్పుడు చానళ్ళ వాళ్ళకు ఎందుకు?
  మంచి విషయాన్ని లేవనెత్తారు. చాలా బాగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >>>>>
  ఈ సూర్య గ్రహణం తో యుగాంతం తధ్యమన్న పుకారు ఎక్కడ బయలుదేరిందో తెలియదు కానీ, గడిచిన వారం రోజులుగా దేశమంతా షికారు చేసింది.
  >>>>>

  ఇలాంటి డూమ్స్ డే ప్రవచనాలు చిన్నప్పటి నుంచీ వింటున్నానులే. అవి ఒక్కసారి కూడా నిజం కాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నిజమే ఈ వార్తా చానళ్ల అతిశయోక్తులకి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రతి రోజూ ఏదో ఒక సెన్స్‌లెస్ సెన్సేషన్ క్రియేట్ చేయటమే తమ ధ్యేయం అన్నట్లుంటారు!

  వీటి యజమానులు కూడా మనుషులే కదా, ఇలాంటివి ప్రచారం చేసేటప్పుడు కనీస మాత్రపు ఆలోచన ఉండదేంటో! ఇలాంటివి ప్రసారం చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో !!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీడియాపై సంధించారన్నమాట మీ విమర్శనాస్త్రం !
  కాదేదీ వార్తకనర్హం అన్నట్టు చూపించిందే చూపిస్తూ ...చెప్పిందే చెప్తూ ...తాము ప్రసారం చేసే వార్త సమాజం పై ఎలాంటి ప్రభావం చూపించినా రేటింగులు పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నమీడియాకు పట్టింది గ్రహణమైతే విడిపోతుంది .కానీ ఇది నిరంతర అమావాస్య !

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి,
  సరిగ్గా చెప్పారు.
  ఈ గ్రహణం విడిచేది కాదేమో, ఇంకా వీటి తీవ్రత పెరుగుతూనే ఉంటుందేమోననిపిస్తుంది నాకు.. వార్తా పత్రికలూ, చానళ్ళ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే :(

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాకైతే వాటిని చూడకూడదని రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే బావుండనిపిస్తుంది. భరించటం చాలా కష్టంగా అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఆకాశంలో సూర్యుడుకీ,చంద్రుడికీ పట్టిన గ్రహణాలకి విడుపెప్పుడో చెప్పగలంఈ కానీ...మీడియాగ్రహణం గురించి చెప్పటమంటే...ప్చ్..కష్టమేనండి.అదేదో సినిమాలో పోలీసాఫీసరైన షిండే గారు మీడియాపై సెటైరికల్ కామెంట్స్ భలే చేస్తారు.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక చిన్న వార్త దొరికితే చాలు దాన్ని భూతద్దంలోంచి చూపెట్టడం,చిలువలు పలువలు చెయ్యటం మన టి.వీల వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. స్కై ల్యాబ్ నాకు తెలుసు ,అప్పుడు మా స్కూల్ కి హాలిడే ...రాత్రి రేడియో లో న్యూస్ inthe hamgama chesinatlu gurthu .

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @శేఖర్ పెద్దగోపు: నేను 'విశ్వసనీయత' అన్నది చానల్ పై ప్రజలకి ఉండే నమ్మకాన్ని దృష్టి లో పెట్టుకుని అండి.. ధన్యవాదాలు.
  @ప్రవీణ్ శర్మ : ధన్యవాదాలు.
  @సిరిసిరిమువ్వ: వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ చానల్లు చూస్తారా? అని సందేహం అండి నాకు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @పరిమళం: 'నిరంతర అమావాస్య' ..నిజమేనండి అలాగే అనిపిస్తోంది.. ధన్యవాదాలు.
  @మధురవాణి: నిజమేనండి.. ధన్యవాదాలు.
  @oremuna: ఆ దిన పత్రిక పేరు ప్రస్తావించకపోయినా, హింట్ ఇచ్చాను చూడండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @భవాని: అలాంటి నిర్ణయం తీసుకునేలా చానళ్ళే చేస్తాయండి.. ధన్యవాదాలు.
  @తృష్ణ: ధన్యవాదాలు.
  @చిన్ని: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నాకుతెలిసీ ఇలాంటి దుష్ప్రచారానికి దూరంగా ఉన్నది ఒక్క దూరదర్శన్ అనుకుంటా. అయినా దానిని చూసేవాడు ఎవడు?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @సుబ్రహ్మణ్య చైతన్య: నిజమేనండి.. దూరదర్శన్ చూసేవాళ్ళు చాలా తక్కువ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అప్పుడే ఎక్కడ విడిచిందండీ.. త్వరలో చంద్ర గ్రహణం రాబోతుంది కదా దాంతో మూడో గ్రహణం పూర్తయి ముసలం పుట్టనుంది తస్మాత్!జాగ్రత్త.. ఓ అది దాటి పోతే అంటారా.. 2012 లో యుగాంతాం ట మీరు ఎక్కడా చదవలేదా...

  మీడియాని ఎంత తిట్టుకున్నా, ఒకప్పుడు తెల్లారి వార్తా పత్రిక లో ఫోటోలు చూసి ఆనంద పడే గ్రహణాన్ని టీవీ లో లైవ్ లో ఇంట్లో కూర్చొని చూసే అవకాశం దొరికింది అని సంతోషించా...

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @వేణూ శ్రీకాంత్: ఆ ఒక్క సంతోషాన్ని మాత్రమే మిగులుస్తున్నాయండి టీవీ చానళ్ళు.. నేను నేరుగా చూశాను.. ఫిల్టర్లు ఉపయోగించే లెండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. నేను అదృష్టవంతుణ్ణి. మాకు కేబుల్ టి వి లో ఒక్క తెలుగు న్యూస్ చానెల్ కూడా రాదు.
  అయినా అప్పుడప్పుడు ఆజ్ తక్ కి బలయిపోతుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. EE madyee pralayam vacchesthondi antu konni channels udaragottesayi...India lo oka ammayyi elagu chachhipotam kada ani mundhi roje suicide chesukoni chanipoyindi... aa ammayyi chaavu ki evaru bhadyatha...

  muudu dasabdhala kritam meeru cheppina incident lo janalandaru elagu chachipotham kada unnapude enjoy cheyyali ani anni asthulani ammesukoni rodduna paddaru...

  Viluvalu vadilesina journalism valla kastalu inni inni kavaya viswa dhabhirama vinura vema

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @బోనగిరి: నిజంగానే అదృష్టవంతులు.. ధన్యవాదాలు.
  @హరిప్రియ: వేమన ఉంటే పద్యం ఏం కర్మ.. ఏకంగా ఓ శతకమే రాసి ఉండేవాడండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు