శుక్రవారం, జులై 17, 2009

కోతి కొమ్మచ్చి

చాలా రోజులుగా నాకొక కల.. అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పుస్తకం కొనడానికి నేను షాపుకి వెళ్తే ఆ షాపు వాళ్ళు కొనడానికి వచ్చిన వాళ్లకి 'ఆ పుస్తకం స్టాకు ఐపోయిందండీ' అని చెబుతుంటే వినాలని. 'భాష చచ్చిపోతోంది' 'సాహిత్యం మరణశయ్య పై ఉంది' లాంటి స్టేట్మెంట్లు చూసినప్పుడల్లా బెంగగా అనిపించేది, నా కల తీరదేమో అని. అదృష్టం..గత వారం నా కల నిజమయ్యింది. థాంక్స్ టు ముళ్ళపూడి వెంకటరమణ.. ఆ పుస్తకం 'కోతి కొమ్మచ్చి.'

పుస్తకం విడుదలని టీవీ చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయడం చూడగానే నాకు కాపీ దొరకదేమో అని డౌట్ వచ్చి ముందుగానే బుక్ చేసుకున్నా.. ఆ కాపీ తీసుకోడానికి వెళ్ళినప్పుడు వినబడింది ఈ మాట. ఇంటికొచ్చి పుస్తకం ఓపెన్ చేయడం మాత్రమే నేను చేసిన పని..చదివించే బాధ్యతని పుస్తకమే తీసుకుంది. అనుభవించేసిన కష్టాలూ, ఈదేసిన గోదారీ అందంగా ఉంటాయని చెబుతూనే, ఆ అందాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు ముళ్ళపూడి.

ఇది ముళ్ళపూడి వెంకటరమణ జీవిత కథ అనడం అసంపూర్ణం గా ఉంటుంది..ఎంత అసంపూర్ణంగా అంటే కేవలం రమణనో లేక కేవలం బాపుని మాత్రమే తల్చుకున్నంత. ఈ అపూర్వ మిత్రుల స్నేహం చిగురు తొడిగింది చిన్ననాడే కాబట్టి, రమణ బాల్యంలో బాపు కూడా ఓ భాగం కాబట్టి ఇది బాపు-రమణల కథ. ఇద్దరూ కలిసి ఆడిన ఆటలూ, చూసిన సినిమాలూ, చదివిన/రాసిన పుస్తకాలూ, తీసిన సినిమాలూ, ఉమ్మడి అభిరుచులూ, విడివిడి అభిరుచులూ..ఇలా ఎన్నో..ఎన్నెన్నో..

ఊహ తెలిశాక రోజంతా ఆటలాడి సాయంత్రం ఇద్దరు పనివాళ్ళ చేత కాళ్ళు పట్టించుకున్న కుర్రాడు, ఇంటా బయటా అందరిచేతా చక్రవర్తీ అని పిలిపించుకున్న పిల్లాడు, తను తప్పు చేసినప్పుడు తనకి బుద్ది చెప్పడం కోసం ఇంట్లో వాళ్ళు పని కుర్రాడిని దండిస్తుంటే చూసిన బుడుగు యేడాది తిరక్కుండానే దుర్భర దారిద్ర్యం అనుభవించాడు అంటే అది విధి లీల కాక మరేమిటి? తండ్రి మరణం తో కుటుంబం విచ్చిన్నం కావడం తో తల్లితో కలిసి ఊరు విడిచిపెట్టారు అప్పటి ముళ్ళపూడి వెంకట్రావు. (రమణ చిన్నప్పటి పేరు)

విస్తళ్ళు కుట్టడం మొదలు, తల్లితో కలిసి మిలిటరీ వాళ్ళ చొక్కాలకి గుండీలు కాజాలు కుట్టడం వరకు తల్లితో కలిసి చేయని పని లేదు. వైభవాన్నీ, దారిద్ర్యాన్నీ చిన్నప్పుడే చూసేయడం వల్ల కలిగిన స్థితప్రజ్ఞత అనుకుంటాను..జీవితం ఎప్పుడూ భయపెట్టలేదు రమణని. అలా భయపడకుండా ఉండడాన్ని తల్లి నుంచి నేర్చుకున్నానన్నారు ఆయన. కాస్త చదువు అబ్బాక తనకన్నా చిన్నపిల్లలకి ప్రైవేట్లు చెప్పడం, ఆ తర్వాత రేడియో బాలానందం కార్యక్రమాలు, 'బాల' పత్రిక కి రచనలు..ఇవన్నీ ఆదాయ మార్గాలు.

విశాఖపట్నం లో రోజు కూలి చేసినా, మద్రాసులో నిరుద్యోగ జీవితం గడిపినా అవన్నీ 'రేపు' మీద నమ్మకం తోనే. తనమీద తనకున్న ఆత్మవిశ్వాసం తోనే. 'ఆంద్ర పత్రిక' లో ఉద్యోగం వచ్చేవరకు రమణ ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటినీ హాస్యస్పోరకం గా చెప్పడం ముళ్ళపూడికి మాత్రమే తెలిసిన విద్య. అటు సినిమాలనీ, ఇటు సాహిత్యాన్నీమాత్రమే కాదు సంగీతాన్నీ మధించారు ఆయన.

జీవితం ఇలా సాగుతూ ఉండగానే 'ఆంద్ర పత్రిక' ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడూ అదే ఆత్మవిశ్వాసం. పక్కన బాపు కొండంత అండగా ఉండగా తర్వాత ఏంచేశారు అన్నది తెలుసుకుందామని ఆత్రంగా పేజీలు తిప్పేసరికి 'ఇంటర్వెల్' ప్రకటించేశారు అచ్చం సినిమా లాగా. అంటే మిగిలింది పుస్తకం రెండో భాగం లో ఉంటుందన్న మాట. ఆద్యంతం స్పూర్తివంతంగా ఉండే పుస్తకం ఇది. కళ్ళు చెమ్మగిల్లకుండా పేజీ తిప్పడం అసాధ్యం. అవును..నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి... ('హాసం' ప్రచురణ, వెల రూ. 150).

18 వ్యాఖ్యలు:

 1. ఈ పుస్తకం చూశాను. దాని గురించి ఇప్పుడు విన్నాను. ఇక కొనాలి. ఆపైన చదవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కాళ్ళు కదా
  చాలా బావుంది రెండో పార్ట్ రిలీజ్ ఎప్పుడో ?
  కళ్ళముందు ఉంచారు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మిరు ఆ మధ్యన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం రేపు రిలీజ్ ఫంక్షన్ ఉంది అని నేనొ టపా రాసాను.నాకు వెళ్ళటం కుదరలేదు కానీ మా నాన్నగారు వెళ్ళటం,పుస్తకం కొనటం,ఆయన చిరకాల వాంఛ(బాపూగారిని కలిసి మాట్లాడటం)తీరటం,నేనా పుస్తకం వెంఠనే చదివెయ్యాటం అన్నీ అయ్యాయి..!!
  రమణగారు వారి తల్లిగారిని గురించి,చిన్ననాడు పడిన అవస్తల్ని "అమ్మకి జేజే" పుస్తకంలో కూడ రాసారు.
  మి విశ్లేషణ బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పరిచయం బాగుంది. స్వాతిలో వచ్చినప్పుడు మొదట కొన్ని సంచికలు మిస్సయిపోయాను. ఇక మధ్యలోంచి చదవడమెందుకని తర్వాతి సంచికలు అందుబాటులోనే వున్నా చదవలేదు. ఇప్పుడు పుస్తకం కొనాలి. మీరన్నది నిజమే, రమణ గారి పుస్తకాలన్నీ చదివించే బాధ్యత అవే తీసుకుంటాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నేనూ స్వాతి లో చదివానండి వారం వారం ...చివరిలోయి పెద్దగ చదవలేదు కుదరక . మంచి పరిచయం ...వారి బుడుగు అన్ని తరాలను మురిపిస్తుంది ...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అబ్బా, ఏంటి మురళీ మీరూ? నేన్రాద్దామనుకుంటుంటే? :-))

  చదవాలిక!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Murali garu,,,
  Meku aa devudu, sarva shubhalanu kaliginchalani korukuntunna......endhukante
  vesavikalam mittamadhyanam cheppulu lekunda nadichi vachina vadiki challati nimmarasam taginatanipinchindhi.... me e post chaduvuthunte...
  avunu ide swathi lo vachinadena... emina marpulu cherpulu chesara?
  malantivallaki ekkada chaduvudammana books dorakvandi... andhuke meru happyga unte enkoni vishaylu matho shre chesukuntaruga....andhukani aa devudini mallokasari vedukuntunna .......

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @కత్తి మహేష్ కుమార్: మిమ్మల్ని నిరాశ పరచదనే అనుకుంటున్నాను.. ధన్యవాదాలు.
  @హరేకృష్ణ: సరిచేశానండి..ధన్యవాదాలు.
  @తృష్ణ: మీ టపా చూశానండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @మెహెర్: చదివి చెప్పండి.. ధన్యవాదాలు.
  @సృజన: ఇంకెందుకు ఆలస్యం..చదివేయండి.. ధన్యవాదాలు.
  @అద్వైత: అదృష్టవంతులు.. ధన్యవాదాలు.
  @భవాని: తప్పక చదవండి..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @చిన్ని: 'బుడుగు' గురించి యెంత చెప్పినా తక్కువేనండి.. ధన్యవాదాలు.
  @సుజాత: మీరూ రాయండి, మీదైన శైలిలో.. ధన్యవాదాలు.
  @మహిపాల్: 'స్వాతి' లో వచ్చిందేనండి.. ఎలాంటి మార్పులు చేయలేదు.. బాపు బొమ్మలతో సహా ప్రచురించారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఓ ...పూర్తి పరిచయం ...బావుందండీ ...తప్పకుండా చదవాలి .

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @పరిమళం: తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మురళి గారికి ధన్యవాదాలు. నేను స్వాతి లొ మొదటి శీర్షిక నుండి చదువుతున్నను.నా అనుమానం నిజమే ఐతే మనకోసం మూడో భాగం కూడా సిద్ధమే

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @ఫణి: ధన్యవాదాలు. మూడో భాగం వచ్చినా స్వాగతించడానికి నేను సిద్ధం.. మరి మీరు?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. నేనూ చదివానండి చాలా చాలా బాగుంది.....బాపు గారి గీత లు రమణ గారి రాతలు తెలుగు వాడు నిజంగా చేసుకున్న అదృష్టం అనుకుంటా మీరు చాలా బాగా రాసారు

  ప్రత్యుత్తరంతొలగించు