మంగళవారం, జులై 21, 2009

అబద్ధం

'నిజం నిప్పులాంటిది' అన్న మాట విన్నప్పుడల్లా నాకు కలిగే సందేహం 'మరి అబద్ధం ఎలాంటిది?' అని. విచిత్రం ఏమిటంటే చిన్నప్పుడు బళ్ళో 'అసత్యము ఆడరాదు' అని చెప్పిన మేష్టర్లే సత్యం కోసం అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడి కథ చెప్పేవాళ్ళు. హైస్కూల్లో చదివే రోజుల్లో మేము సరదాగా అనుకునే వాళ్ళం.. నిజం చెబితే హరిశ్చంద్రుడు పడినన్ని కష్టాలు పడాలి.. అదే అబద్ధం చెబితే ఏ బాధా ఉండదు అని.

అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అని తెలియని పసితనంలో నిజం చెప్పి దెబ్బలు తిన్న సందర్భాలు కోకొల్లలు. నిజానికి ఆ పనిష్మెంట్లే అబద్ధం గురించి ఆలోచించేలా చేశాయేమో అనిపిస్తూ ఉంటుంది. మొదటి అబద్ధం ఎప్పుడు చెప్పానన్నది ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. అలాగే అబద్ధం చెప్పి దొరికిపోయిన తొలి సందర్భం కూడా. చాలా సందర్భాలు ఉన్నాయి మరి..

ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. వయసుతో పాటు అబద్ధాలు చెప్పడం పెరిగింది అని. కొన్నిసార్లు ఇది ఆత్మరక్షణ లో భాగం ఐతే, మరికొన్ని సందర్భాలలో నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా ఓ అబద్ధంతో కవర్ చేసేయడం బెటర్ కదా అన్న ఆలోచన. అబద్ధం అప్పటికప్పుడు మనల్ని రక్షించినా దీర్ఘ కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకి మన మీద నమ్మకం పోగొడుతుందని కొన్నాళ్ళకి అనుభవ పూర్వకంగా అర్ధమైంది.

ఇక అది మొదలు, దగ్గరవాళ్ళు అని ఫీలైన వాళ్ళ దగ్గర సాధ్యమైనంత వరకూ అబద్ధం చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాను. పరిస్థితులు మనకి పెట్టే పరిక్షలు అన్నీ ఇన్నీ కాదు కదా. అబద్ధం చెప్పడానికి, నిజం చెప్పకుండా ఉండడానికి ఏమైనా భేదం ఉందా? అన్నది నన్ను ఎప్పుడూ వేధించే ప్రశ్న. ఓ నిజాన్ని చెప్పడం కన్నా దాచడం వల్ల ఎదుటివాళ్ళని సంతోషం గా ఉంచగలం. కానీ అది అబద్ధం చెప్పడం అవుతుందా? కాదా?

చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని ఓ చిన్న సరదా పుట్టింది. అదెంత ప్రమాదకరమైన సరదానో లెక్కలు చూశాక అర్ధమైంది. ఆ సరదా ఫలితంగా అనవసరంగా చెప్పే అబద్ధాలను బాగా తగ్గించ గలిగాను. పర్లేదు..మనం మరీ ఎక్కువ అబద్ధాలు చెప్పడం లేదు అని ఓ చిన్న ఫీలింగ్ రాడానికి సాయపడింది ఆ సరదా. ఎప్పుడూ నిజాలే ఎందుకు మాట్లాడ లేక పోతున్నాం అన్న మరో 'ప్రమాదకరమైన' ఆలోచన అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది.

దివాకరం గురించి చెప్పకుండా అబద్ధాల గురించి చెప్పడం పూర్తవ్వదు. అవును.. 'ఏప్రిల్ 1 విడుదల' హీరో దివాకరమే. అతను సినిమా మొదటి సగం లో చెప్పినన్ని అబద్ధాలు కానీ, రెండో సగం లో చెప్పిన లాంటి నిజాలు కానీ నేనెప్పుడూ చెప్పలేదు. అయినా నిజం మాట్లాడిన దివాకరాన్ని రక్షించడానికి 'గోపీ' ఉన్నాడు. మనకలా ఎవరూ లేరు కదా.. అదీకాక దివాకరం నిజాలు మాట్లాడింది భువనేశ్వరి తో పందెం నెగ్గేందుకు. మనకి అలాంటి రిస్కులు ఏవీ లేవు కాబట్టి, అవసరార్ధం అప్పుడప్పుడూ అబద్ధాలు తప్పవు. ఆ ప్రకారం ముందుకు పోవడమే..

13 వ్యాఖ్యలు:

 1. మీరుచెప్పినట్లు "ఓ నిజాన్ని చెప్పడం కన్నా దాచడం వల్ల ఎదుటివాళ్ళని సంతోషం గా ఉంచగలం." నిజమే--"నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!"అని మన బద్దెనకవి గారు చెప్పినట్లు అవసరార్ధం కొన్ని అబధ్ధాలు అప్పుడప్పుడు జివితంలో తప్పవు.నేనూ చెప్పాను అత్యవసర పరిస్థితుల్లో కొన్ని...! నిజం చెప్పటంవల్ల ఎన్నిసార్లు తలకు బొప్పి కట్టినా,కొందరితొ మాటలు ఆగిపోయినా,సరిగ్గా అబధ్ధం చెప్పలేక దొరికిపోయినా...'హరిశ్చంద్రుడి చెల్లెలివా' అని కొందరు తిట్టిన సందర్భాలూ ఉన్నాయి... ఆదర్శాలు అన్నివేళలా గెలవవు అన్న సత్యం బోధపడినా కూడా...ఎందుకనో అబధ్ధాలనీ,అవి చెప్పేవాళ్లనీ నేనైతే సహించలేనండీ.."April 1st విడుదల" నాకందుకే నచ్చిందేమో..ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోండి.i just mentioned mine.
  నా వ్యాఖ్యే ఒక టపా అయ్యేలా ఉంది.మంచి విషయం రాసారు.అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అబద్దం అప్పులాంటిది మాష్టారు :-) హరిశ్చంద్ర కధ గురించి మేముకూడా అదే అనుకునే వాళ్ళం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవసరానికి అబద్దం ఆడమన్నారు మా మాస్టారు.... పర్వాలేదు..ప్రొసీడ్ అవ్వనండి!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. >>అబద్ధం అప్పటికప్పుడు మనల్ని రక్షించినా దీర్ఘ కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకి మన మీద నమ్మకం పోగొడుతుందని కొన్నాళ్ళకి అనుభవ పూర్వకంగా అర్ధమైంది.>>
  చాలా చక్కటి మాట. నేనూ అందుకే వీలైనంతవరకూ అబద్దం చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు నిజాలను దాచేస్తుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని ఓ చిన్న సరదా పుట్టింది. అదెంత ప్రమాదకరమైన సరదానో లెక్కలు చూశాక అర్ధమైంది."

  నిజం చెప్పండి. అప్పుడు సగటున రోజుకి ఎన్ని అబద్దాలు లెక్క తేలాయేంటి? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాబోటిగాళ్ళకి -
  చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలనుకోటం అనవసరం. కారణం? అవసరమా అద్దెచ్చా? సరే, కారనం, మనకి తెల్సుగా మనం సచ్చినా నిజం చెప్పమని. :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి గారూ ! మంచిటాపిక్ ! ఇప్పుడు నాకూ అనిపిస్తోంది రోజూ ఎన్ని అబద్ధాలు చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని :)
  'ఏప్రిల్ 1 విడుదల' ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో అదొకటి .

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నా వరకు అబద్దం ఆడటం కన్నా నిజం దాచటం పెద్ద నేరంగా వుంటుంది. ఎందుకంటే ఏమో...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @తృష్ణ: ధన్యవాదాలు
  @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు
  @సృజన: ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @భవాని: ధన్యవాదాలు
  @ఉమాశంకర్: మీరూ ప్రయత్నిస్తారా? :) కనిష్టం పాండవులు, గరిష్టం పురాణాలు. ..ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు; హాయిగా, ఏ బాధా లేకుండా...గుడ్. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పరిమళం: ప్రయత్నించండి.. మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు.
  @ఉష: చాలా రోజుల తర్వాత... ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కొంచెం ఆలోచించాల్సిన విషయమే!
  నేను గమనించిన కొన్ని ట్రెండ్లు .. నిజం చెబితే మనకి ఇబ్బందో, కష్టమో కలుగుతుంది అనుకుంటే సులభంగా అబద్ధ మాడేస్తాం. ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిలో మనకా ఎంపతీ తక్కువ. చాలా అబద్ధాలు డైరెక్టుగా అబద్ధం చెప్పడం కన్నా, పూర్తి నిజాన్ని చెప్పకపోవడం, లేదా అవతలి వాళ్ళకి ఉన్న తప్పు ఊహని సరిదిద్దకపోవడం .. ఈ రూపాల్లో ఉంటాయి

  ప్రత్యుత్తరంతొలగించు