గురువారం, జులై 23, 2009

పరుగు ఆపడం ఓ కళ

నాకు సినిమా వాళ్ళ జీవిత చరిత్రలన్నా, వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. ఐతే ఈ మధ్య ఓ వ్యక్తిత్వ వికాసం టైపు టైటిల్తో వచ్చిన ఓ సినిమా నటుడి జీవిత చరిత్ర చదవాల్సి వచ్చింది. ఆ పుస్తకం 'పరుగు ఆపడం ఓ కళ' అను శోభన్ బాబు జీవిత చరిత్ర. పుస్తకం మొదటి సగం ఒకింత ఆసక్తికరంగానే ఉంది.

శోభన్ బాబు ఓ విలక్షణమైన వ్యక్తి, సహ నటులకన్నా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అందుకే తండ్రి, తాత పాత్రలు వేసే అవకాశం ఉన్నా వద్దనుకుని రిటైరయ్యాడు. ప్రశాంత జీవితం కోరుకున్నాడు. ప్రచారానికి దూరంగా, ప్రశాంతంగా గడిపాడు తన చివరి రోజులని. కెమెరాకి, పబ్లిసిటీకి దూరంగా ఉన్నా, ప్రజలు శోభన్ బాబు ని మర్చిపోలేదని నిరూపించిన సంఘటన అతని అంతిమ యాత్ర.

'సోగ్గాడు' గా పేరొందిన శోభన్ బాబు మరణించిన యేడాది తరువాత ఓ పుస్తకం వచ్చింది. ఇందులో ఉన్న కంటెంట్ శోభన్ బాబు పుస్తకం కోసమని స్వయంగా చెప్పింది కాదు. పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర రకరకాల సోర్సుల ద్వారా సేకరించినది. పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం శోభన్ బాబు స్వయంగా చెప్పినదే అనీ, వివిధ పత్రికకి విభిన్న సందర్భాలలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలే పుస్తకానికి ఆధారమని చెప్పారు రచయిత తన ముందుమాటలో.

అంతే కాదు, ప్రతి అక్షరం శోభన్ బాబుదే కాబట్టి ప్రధమ పురుష లో రాసే స్వేచ్చను తీసుకున్నాననీ చెప్పారు. తన జీవితపు చివరి రోజు ఉదయం తన ఆఫీస్ రూం లో కూర్చుని శోభన్ తన గతాన్ని నెమరు వేసుకున్నట్టుగా రాశారు కథనాన్ని. కాలేజి రోజులు, సినిమాల్లో చేరాలని గాఢమైన కోరిక, మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య శాంత కుమారి సహకారం..ఇవన్నీ విపులంగా రాశారు.

లా చదివే వంకతో మద్రాసు లో కాపురం పెట్టిన శోభనాచలపతి రావు (అసలు పేరు) వేషాల కోసం పడ్డ పాట్లు, శోభన్ బాబుగా తనని తాను నిరూపించుకునే క్రమంలో పడ్డ సంఘర్షణ ని వివరంగా రాశారు. ఇక అక్కడినుంచి కథనం దారి తప్పి ఎటో వెళ్ళిపోయింది. హిట్లూ, ఫ్లాపులూ, సహనటులతో సంబంధాలూ, రిటైర్మెంట్ గురించి ఆలోచనలు, భూముల కొనుగోలు..ఇలా సాగింది కథనం.

నిజానికి శోభన్ బాబు అభిమానులకి ఈ పుస్తకం నుంచి కొత్తగా తెలుసుకోడానికి ఏమీ లేదు, కొన్ని అరుదైన ఛాయా చిత్రాలు దాచుకోగలగడం మినహా. ఇది సినిమా నటుడి చరిత్ర కాబట్టి సహజంగానే పొగడ్తలు సింహభాగం ఆక్రమించాయి. వెండితెర మీద హీరో గా వెలుగొందాలి అని కలలు కన్న వ్యక్తి, అవకాశాలు వస్తున్నా రిటైర్మెంట్ కోరుకోడానికి దారితీసిన పరిస్థితులని వివరించిన తీరు సమగ్రంగా లేదు.

ఒక సహనటి తో శోభన్ కి ఉన్న అనుబంధం వివాదాస్పదం కావడం అందరికీ తెలిసిన విషయమే.. ఆ అంశానికి అతి ప్రాధాన్యత ఇవ్వడం చికాకు కలిగించింది. కథనం దారి తప్పుతోందనీ, సంపూర్ణత లోపించిందనీ చాలా సార్లు అనిపించింది. పుస్తకం పూర్తి చేశాక తలెత్తిన ప్రశ్న అసలు శోభన్ జీవించి ఉంటే ఈ పుస్తకం విడుదల కావడాన్ని అంగీకరించి ఉండేవాడా? అని. (బండ్ల పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 363, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

8 వ్యాఖ్యలు:

 1. ఒప్పుకునేవారు కాదేమో..!ఆయన ఎందుకు తండ్రి,తాత మొదలైన పాత్రలు వెయ్యలేదొ,తన కుటుంబంలొ వారిని సినిమా ప్రపంచంలొకి రావటాన్ని ఎందుకు ప్రొత్సహించలేదొ ఒక టెలి ఇంటర్వ్యూ లో ఆయన చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అప్పట్లో నాకు శోభన్ బాబు గారంటే అంత ఇష్టం ఉండేది కాదు .నేను చూసిన చాలా సినిమాల్లో ఇద్దరేసి భార్యలుంటారని:) :) ఆయన చిత్రాలన్నీఒకే మూస పోసినట్టు అనిపించేవి.ఐనా ఆయన మంచి నటుడు .ఆయన జీవితాన్ని ప్రతిబింబించే పుస్తకాన్ని చక్కగా పరిచయం చేశారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈటీవీలో వచ్చే సితార ఇంటర్వ్యూలో సినిమాలు ఎందుకు ఆపేశారో చెప్పారు. నాకు తెలిసిన కంతమంది అంత్యక్రియలకి చెన్నై వెళ్లలేకపోయామని బాధపడ్డారు. తరువాత శాంతినికేతన్ కి వెళ్లివచ్చారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళి గారూ, సహనటితో అనుబంధం మధ్యలో చెడిందా లేక చివరిదాకా కొనసాగిందా? మీకేమన్నా వివరాలు తెలుసని అడుగుతున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు, శోభన్ గారిపై ఉన్న అభిమానం తో ఈ పుస్తకం కొందామనుకుని కూడా మరో సారి చూద్దాం లే అని వాయిదా వేశాను. కారణాలు ఏమైనా పరుగు ఆపగలగడం నిజంగా ఓ కళే.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భ.రా.రె -మరదే!! అట్టాంటియి సెప్పటం సానా కట్టం.
  మురళి భాయ్!! నాకెందుకో శోభన్ ఓ పెద్ద అనటుడు అని అనిపించదు. ఐతే మంచి క్యాపిటలిస్టు. నేర్చుకోవాల్సింది సానా ఉంది ఆయన్నుంచి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @తృష్ణ: ధన్యవాదాలు.
  @పరిమళం: "అప్పట్లో నాకు శోభన్ బాబు గారంటే అంత ఇష్టం ఉండేది కాదు.." ఓ మహిళా నుంచి మొదటి సారి వింటున్నానండి ఈ మాట.. ఆశ్చర్యకరంగా ఉంది. ..ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య: ఆయన అంతిమ యాత్ర మాత్రం గ్రేట్ అండి.. అలా ఇంకెవరికీ జరగదేమో.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @భాస్కర రామి రెడ్డి: పుస్తకంలో రాయలేదండి ఆ విషయం.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: అభిమానులకి తెలియని విషయాలు ఏమీ లేవని అనిపించిందండి.. ఇంతకీ మీ పుస్తకాల షాపింగ్ అయిపోయిందన్న మాట.. విశేషాలతో టపా రాస్తున్నారా? ..ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: లెస్స పలికితిరి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు