ఆదివారం, జులై 05, 2009

మల్లికాసులు

చిన్నప్పుడు నాకు కథల్లో తరచూ వినిపించినవీ, మా ఊళ్ళో యెంత వెతికినా కనిపించనివీ రెండు జంతువులు. మొదటిది గాడిద, రెండోది నక్క. బళ్ళో చేరక ముందే సర్కస్ తో సహా చాలా వింతలు చూశాను కానీ ఈ రెండు జంతువులని మాత్రం ఊహలలోనే చూసుకోవాల్సి వచ్చింది. మా ఊరికి ఉన్న ఏకైక మడేలుకి గాడిద లేదు. మా ఊళ్ళో శ్మశానమే లేదు కాబట్టి నక్క కూడా లేదు.

అసలు విషయం లోకి వచ్చే ముందు ఇంకో కొసరు విషయం కూడా చెప్పాలి. మా ఎలిమెంటరీ స్కూలు రెండు పూటలా ఉండేది. నడక దూరం కావడం తో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి, మళ్ళీ బడికి వెళ్ళే వాళ్ళం. ఈ విభజన సులువుగా అర్ధం కావడానికి పొద్దున్న బడి, మధ్యాహ్నం బడి అనే వాళ్ళం. వేసవి ప్రవేశిస్తుండగా ఒంటిపూట బడి ఉండేది. అంటే మధ్యాహ్నం సెలవన్న మాట, హాయిగా.

నేను మూడో తరగతి చదివేటప్పుడు మొదటిసారిగా మల్లికాసులిని చూశాను. అబ్బే.. అమ్మాయి కాదు. ఓ సంచార జాతి. చిన్నా, పెద్దా, ఆడా, మగా అంతా కలిపి ఓ పదిహేను మంది, వాళ్ళ జంతువులు, పక్షులు. ఊరూరూ తిరుగుతూ వాళ్ళ విద్యలు ప్రదర్శించి, యాచించి బతుకుతూ ఉంటారు. ఇళ్ళకి వచ్చినప్పుడు "మల్లికాసులం వచ్చాం బాబయ్యా.." అని తెలుగులోనే మాట్లాడే వాళ్ళు కానీ, వాళ్ళలో వాళ్ళు మాత్రం ఏదో తమాషా భాష మాట్లాడుకునే వాళ్ళు.

ఓ రోజు భోజనం చేసి మధ్యాహ్నం బడికి వెళ్ళేసరికి, బడికి కొంచం దూరం లో ఉన్న కళ్లం లో కోలాహలం. భోజనానికి ఇంటికి వెళ్ళిన మేష్టారు ఇంకా రాకపోవడం తో, అక్కడ దిగిన మల్లికాసులని చూడ్డానికి మిత్రులతో కలిసి వెళ్లాను. వాళ్ళ వేషభాషలు, సామాను, పక్షులు, జంతువులు.. అన్నీ వింతగానే ఉన్నాయి. కొద్దిపాటి తేడాతో ఉన్న రెండు జంతువులు నన్ను భలే ఆకర్షించాయి. ఒకటి గాడిద, మరొకటి కంచర గాడిద అని మిత్రులు చెప్పారు. చెప్పొద్దూ, గాడిద భలే ముద్దొచ్చింది.

మధ్యాహ్నం బడి అయ్యాక ఇంటికి గాల్లో తేలుతూ వెళ్లాను. పుస్తకాల సంచీ గిరవాటేసి, పెరట్లో పప్పు రుబ్బుతున్న అమ్మ దగ్గరికి ఒక్క పరుగు పెట్టా. ఓ ఇటుక బొంత మీద కూర్చుని వగర్చుకుంటూ మల్లికాసుల వాళ్ళ వింతలన్నీ చెప్పడం మొదలు పెట్టాను. "తెల్లగా ఉందమ్మా.. యెంత ముద్దుగా ఉందో.. నేనింకా కథలు విని ఏదో పెద్ద జంతువు అనుకున్నానా.. చాలా పొట్టిగా ఉంది.. మనదేం ఊరమ్మా.. ఒక్క గాడిదా లేదు.." అని నేను ఒళ్ళు మరచి వర్ణిస్తున్న వేళ... "నువ్వున్నావు కదా నాయనా.." అని వినిపించింది వెనుక నుంచి.

ఈవేళప్పుడు నాన్న ఇంటికెందుకు వచ్చారో ఆలోచించేంత సమయం లేదు. తక్షణ కర్తవ్యంగా ఇంట్లోకి పరిగెత్తి సంచీ లోంచి తెలుగు పుస్తకం బయటికి లాగి, పేజీలు తిప్పక ముందే పాఠం చదవడం మొదలు పెట్టేశాను. (ఈ సౌకర్యం ఒక్క తెలుగు పుస్తకం తో మాత్రమే సాధ్యం) "గాడిద.. అడ్డ గాడిద.. చదువు సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు.." నేపధ్యంలో దీవెనలు సాగుతున్నాయి. ఎప్పుడూ వినేవే.. అప్పుడు మాత్రం 'గాడిద' అనిపించు కున్నందుకు కూసింత గర్వంగా అనిపించింది. (నవ్వి పోదురు గాక..)

మల్లికాసులు చిన్న చిన్న వస్తువులు అమ్ముతారుట. గద్దగోరు, ఐసు కాయింతం కొనుక్కోవాలని మిత్రులు ప్లాన్లేస్తున్నారు. నాకు ఆ రెండూ ఏమిటో అర్ధం కాలేదు. అక్కడికీ 'గద్దగోరు ఎందుకూ?' అని ఒక మిత్రుడిని అడిగేశా. "ఎవడైనా మన మీదకి వచ్చాడనుకో.. అదుచ్చుకుని గీరొచ్చు.. అది మన దగ్గరుంటే ఎవడూ మన జోలికి రాదు.." అసలు ఎవరైనా మన జోలికి ఎందుకొస్తారో తెలియలేదు. అవడానికి భారీ కాయుణ్నేఅయినా శాంతి కాముకుడిని కావడం వల్ల యుద్ధతంత్రం మీదదృష్టి పెట్టలేదు.

ఐసు కాయింతం సంగతి అమ్మని కనుక్కుందాం అనుకున్నా.. 'ఇది కూడా తెలీదా?' అంటారని. నాకు ఐసు, కాయింతం (కాగితం) తెలుసు కాని, ఈ కొత్త వస్తువేమిటో అర్ధం కాలేదు. "అది అయస్కాంతం రా.. మన సూదుల పెట్లో పడేసుకుంటే సూదులన్నీ ఓ చోట పడి ఉంటాయి," అమ్మ స్వార్ధ బుద్ధితో ఆలోచించింది. ఇంతకీ కొనడానికి ఇష్ట పడలేదు. "వాళ్ళ దగ్గర కొనడం నాన్నగారికి ఇష్టముండదు" అని కొట్టి పారేసి "తాతగారికి ఉత్తరం రాసి తెప్పించుకో" అని సలహా ఇచ్చేసింది. అదేమిటో తెలిసి పోయాక నాకూ ఆసక్తి పోయింది.

మల్లికాసులు ఓ దేవుడిని తీసుకుని ఊరేగేవాళ్ళు. అదికూడా వాళ్ళు ఊరు విడిచి పెట్టే ముందు. ఓ పెట్టె లో దేవుడిని పెట్టి, ఓ తెర కప్పి ఇల్లిల్లూ తిరిగి, తెర తీసి చూపించే వాళ్ళు. ఆ దేవుడెవరో అర్ధం కాలేదు. అలాగే వాళ్ళ భాష కూడా. డబ్బులు, బియ్యం, పాత బట్టలు ఇలా ఏదిస్తే అది తీసుకునే వాళ్ళు. వాళ్ళు ఆడే ఆట చూసే అవకాశం మాత్రం నాకు దొరక లేదు. చీకటి పడ్డాక దూరం పంపేవారు కాదు. నాకు నేనుగా వెళ్ళే వయసొచ్చేసరికి వాళ్ళు రావడం మానేశారు.

14 వ్యాఖ్యలు:

 1. "'గాడిద' అనిపించు కున్నందుకు కూసింత గర్వంగా అనిపించింది."
  హ హ్హ హ్హ ........సారీ !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "నువ్వున్నావు కదా నాయనా.."
  హ హ హ... ఫక్కున నవ్వేశాను మురళి గారు. నేను చిన్నప్పుడు కూడా ఇలా చాలా మంది సంచార జాతుల వాళ్ళు వచ్చేవారు.. గెణుసుగెడ్డలు/చిలకడదుంపలు బండ్ల వాళ్ళు, బిందెలకి బక్కెట్ల కీ మాట్లు వేసే వాళ్ళు, పిన్నీసులు అయస్కాంతం లాటి చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళు... ఇలా.. ఇప్పుడెవరూ రావడం లేదనుకుంటా... వచ్చినా బంగారానికి మెరుగు పెడతామంటూ వస్తువు ని కరిగించి తీసుకు వెళ్ళే కంత్రీలు మాత్రమే వస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఐసు కాయింతం--మొదట నాకూ అర్థం కాలేదు ఇదేం కాయితమా అనుకున్నాను:)
  "మడేలు" అంటే చాకలా?
  పొద్దున బడి, మధ్యాహ్నం బడి, ఒంటిపూట బడి--మేమూ అలానే అనేవాళ్లం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ మల్లికాసులు లాగా మా ఊళ్ళో చెంచులు ( ఓ రకమైన గిరిజన తెగ ) వచ్చేవారు. పక్షి వెంట్రుకలు అతికించుకున్న బట్టలు వేసుకుని ఇంటింటికీ వచ్చి బియ్యం తీసుకునేవారు. వారిని చూస్తే భయం వేసేది. ఏదో వింత భాష మాట్లాడుకునేవారు. అన్నట్టు మీరు మా ఊరు తప్పకుండా రావాల్సిందే!! ఎందుకంటారా...గాడిదలను చూడటానికండీ..మా కాలనీలో బోలేడు గాడిదలు ఉంటాయి. ఏటిఒడ్డున అయివుండటం వల్ల చాకలి వాళ్ళు వాళ్ళ గాడిదలకు పుట్టిన పిల్లల్ని కాలనీలోనే వదిలేయటం వల్ల వీదిలో కుక్కలు చూసినట్టే గాడిదలను మేము చూస్తాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "మల్లికాసులు" కొత్తగా వింటున్నాను. చిన్నప్పటి మీ అమాకత్వం చదవ ముచ్చటగున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. "నువ్వున్నావు కదా నాయనా"

  :))))))))))

  గాడిదా అని పిలిచినందుకు (పసి వయసైనా సరే) గర్వపడినవారు మీరేనేమో భూప్రపంచం లో? :P

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మల్లికాసులవాళ్ళ ఆట మీరు చూడనేలేదన్నమాట.దొమ్మరివాళ్ళ ఆట చూసిన గుర్తు నాకు చిన్నప్పుడు.చిన్న చిన్న పిల్లలు ఏవో సర్కస్ ఫిట్లు చేస్తూ ఉండేవారు.
  మరయితే నక్కని ఎప్పుడు చూసారొ రాయనేలేదు?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇందాకా మరిచాను,మీ నెమలిని ఎక్కడ దాచేసారు?ఆకుపచ్చ రంగు బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "మల్లికాసులు".. కొత్తగా వింటున్నాను. .

  మల్లికాసులేమోగాని మీ పోస్టు చదవగానే నాకు వర్షాకాలంలో, వర్షాలు పడటం ఆలస్యం అయినప్పుడు ఒక కర్రకి అటూ ఇటూ వేపమండలు కట్టుకొని వచ్చేవాళ్ళు గుర్తుకొచ్చారు.ఆ వేపమండలమధ్య ఉండే కప్పల్ని చూడటంకోసం మేము వాళ్ళవెంటపడి వీధి చివరవరకూ వారిని సాగనంపివచ్చి ఇంట్లో తీరిగ్గా తిట్లుతినేవాళ్ళం.

  అయినా ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది.. గాడిదకేం తక్కువండీ , అందంగానే ఉంటుంది.."ష్రెక్ " సినిమాలో గాడిద నాకు చాలా ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @పరిమళం: అయ్యో..సారీ ఎందుకండీ? ...ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: నిజమేనండి.. ఇప్పుడెవ్వరూ కనిపించడం లేదు.. అంతెందుకు..హరిదాసు కూడా రావడం లేదు, చాలా ఊళ్ళకి. ధన్యవాదాలు.
  @సిరిసిరి మువ్వ: అవునండి.. రజకుడిని మడేలు అని కూడా అంటారు. మీ బడి కూడా అంతేనా...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @శేఖర్ పెద్దగోపు: పెద్దయ్యాక చాలా గాడిదల్ని చూశానండి.. కాకపొతే అప్పట్లో అది తొలివలపు :-) చెంచులు మా ఊరు కూడా వచ్చేవారు..ఓ గంట మోగించుకుంటూ.. ఇంట్లో వాళ్ళు అది వినలేక వాళ్ళని పంపెయ్యమనేవారు.. మాకేమో ఆ గంట వినడం సరదా.. రహస్యంగా వాళ్ళని అనుసరించేవాళ్ళం. అబ్బా.. చాలా గుర్తొస్తున్నాయండి.. ...ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలు.
  @పద్మ: నో రిగ్రెట్స్ అండి..అంత గొప్పగా ఉంది ఆ గాడిద సౌందర్యం :-) ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @లక్ష్మి: నిజం లక్ష్మి గారూ.. అప్పటికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానేమో.. ఒక్కసారిగా చూసేసరికి లోపల్నించి అభిమానం పొంగుకొచ్చింది. ...ధన్యవాదాలు.
  @తృష్ణ: దొమ్మరి వాళ్ళ ఆట నేనుకూడా చూశానండి.. నక్కడి maroన కథ.. నెమలి భద్రంగానే ఉంది.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: హమ్మయ్య! మీరొక్కరు తోడు దొరికారండి.. గాడిద కూడా అందంగానే ఉంటుందంటే ఎవరూ నమ్మడం లేదు చూడండి. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. me nemalikannu chanlabaguntundi ...manam life lo entha edigina chinnanti sweet memories evaru marachipotharu ???chinnappudu same ilane oka gang ata ila mavuru vachinappudu chusanu ..valla stunts entha risky ga vuntayante ..10 years ammayi complete vennakki vangi tana venaka vuna sudulani kallatho tisthundi ....a stunt talachukonte ippatiki ammo anipisthundi ...antha risky sean nenu life lo chudaledu ...poor girl ....food kosam enni patlo :-(

  ప్రత్యుత్తరంతొలగించు