బుధవారం, జులై 01, 2009

టాంపండు లీలలు

తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మ ఉత్సాహంగా చెప్పే కబుర్లు టాంపండు ప్రస్తావన లేకుండా పూర్తవ్వవు. తాతగారికి తొమ్మిది మంది సంతానం ఉన్నా, వీళ్ళు చాలరన్నట్టు ఓ కుక్కనీ పెంచారు.. ఆ కుక్క పేరు టామీ..ముద్దుగా టాంపండు. అమ్మ టాంపండు గురించి చెప్పినప్పుడల్లా నేను "కొడుకులతో పాటు రాజు కుక్కని పెంచి..." పాడి తిట్లు తింటూ ఉండేవాడిని.

అసలు టాంపండు తాతగారింటికి రావడమే చిత్రంగా జరిగింది. ఆయన ఏదో పనుండి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పొరుగూరికి వెళ్ళినప్పుడు ఒకరి ఇంట్లో ఓ చిన్న కుక్కపిల్ల కనిపించిందిట. ఆయనకి వాళ్ళు ఇచ్చిన పాలలో కొంచం ఓ కొబ్బరి చిప్పలో పోసి శవాకారంలో ఉన్న ఆ కుక్క పిల్ల ముందు పెట్టారుట. అది ఆ పాలు తాగి ఇక ఆయన్నివిడిచి పెట్టలేదు. ఆయన వెంటే నడుస్తూ ఇంటికి వచ్చేసింది.

ఓ రెండు మూడు రోజులు చద్దాన్నాలు అవీ తిని కాస్త తేరుకుంది.. దాని ప్రాణానికి ఏమీ ఢోకా లేదని తెలిశాక, దానికో పేరు పెట్టాల్సిన బాధ్యత అమ్మ వాళ్ళ మీద పడింది. పిన్నిలిద్దరూ కలిసి దానికి టామీ అనే పేరు నిశ్చయించారు. అప్పటివరకూ తాతగారిని వేధించిన సమస్యలు ఒక్కొక్కటీ ఓ కొలిక్కి రావడం మొదలవ్వడంతో ఆయన "టామీ వచ్చిన వేళ.." అని దానికి బోల్డంత క్రెడిట్ ఇచ్చేశారు.

టామీ ఆయనకి ప్రియమైనది అయిపోవడంతో మొదలయ్యాయి ఇంట్లో వాళ్ళ కష్టాలు. అదెంత అల్లరి చేసినా దానిని ఏమీ అనడానికి లేదు. వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కల తిరిగే బురద పాములు, నీరుకట్లని (ప్రమాదం లేని పాములు) మాటేసి, తన పంజాతో వేటాడి కొట్టి నోటికి కరుచుకుని ఇంట్లోకి తెచ్చేసేదిట. అమ్మమ్మ బాపిరాజునో, లేకపొతే పిల్లలనో బతిమాలి ఆ చచ్చిన పాముల్ని బయట పడేయించేది, మనసులో టామీ ని తిట్టుకుంటూ.

టాంపండు ఊరికే తిని కూర్చుంటోందని, దానికేమైనా పనులు నేర్పాలని మా పిన్నిలిద్దరూ ప్రయత్నించి దానికి దూరంగా ఉన్న వస్తువులు నోటికి కరుచుకుని రావడం లో ట్రైనింగ్ ఇచ్చారు. ఓ రోజు మా పిన్ని కొత్త ఇంకు పెన్ను కొనుక్కుని పుస్తకాల దగ్గర పెట్టుకుంది. చదువుకునేటప్పుడు పెన్ను కావల్సోచ్చి టాంపండుకి పురమాయించింది. టాంపండు గా..ట్టిగా నోటికి కరుచుకు రావడంతో ఆ పెన్నుకి నాలుగు చిల్లులు పడ్డాయి. వెంటనే కొత్త పెన్నంటే ఇంట్లో ఒప్పుకుంటారా?

అమ్మమ్మవి మరో రకం కష్టాలు.. కాపురానికి వచ్చినప్పటినుంచి పిల్లిని పెంచడం ఆవిడకి అలవాటు. పిల్లికి కుక్కకి జన్మవైరం కదా.. పిల్లి పిల్లల్ని పెట్టిందంటే టాంపండు వాటిని ఏం చేసేస్తుందో అని ఆవిడకి బెంగ. సగం రాత్రి వరకు తను కాపలా ఉంది, పిల్లల్ని వంతులేసుకుని చూస్తూ ఉండమని బతిమాలుకునేదిట ఆవిడ. టాంపండు మీద తాతగారికి కంప్లైంట్ చేయడం అనవసరం, చేసిన వాళ్ళే తిట్లు తినాలి. పైగా 'దానిని ఏమైనా అంటే నన్ను అన్నట్టే' అని ప్రకటించేశారు కూడాను.

దాదాపు పదేళ్ళ పాటు రాజ్యం చేశాక, టాంపండుకి జబ్బు చేసింది. పశువుల ఆస్పత్రి చాలా దూరం. తాతగారు లెక్క చేయకుండా రోజూ రిక్షా కట్టించి పిల్లల్ని ఇచ్చి టామీని ఆస్పత్రికి పంపి వైద్యం చేయించారు. "ఆ వైద్యానికి పెట్టిన డబ్బు పెడితే ఎకరం పొలం వచ్చేది" అని చెప్పుకున్నారుట ఊళ్ళో అందరూ. మానవ ప్రయత్నం యెంత చేసినా విధిని ఎవ్వరూ ఆపలేరు కదా.. వైద్యం జరుగుతుండగానే ప్రాణం విడిచింది టాంపండు. బిడ్డని పోగొట్టుకున్నట్టుగా బాధపడ్డారట తాగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రకరకాల ఒడిదుడుకులు చుట్టుముట్టాయట ఆయన్ని..

27 కామెంట్‌లు:

  1. చాల బాగున్నాయండి ,ముఖ్యంగా మీ తాత గారు మూగ జీవాన్ని చుసిన విధం ...గత జన్మ భంధాలుంటే అవి తీర్చుకోవడానికి దగ్గరవుతారని అంటుంటారు పెద్దోళ్ళు .

    రిప్లయితొలగించండి
  2. మీటపా చదువుతుంటే నాకు మా మెంతిష్ గుర్తొచ్చింది. అది మాఇంట్లో అనుభవించిన భోగాలు ఏ స్థాయివి అంటే నెయ్యితప్ప నూనెవాసన వస్తే అన్నం ముట్టుకొనేదికాదు. వీలు చూస్కోని నేనో ఒక టపా రాయాలి.

    రిప్లయితొలగించండి
  3. మా మావయ్యలు ఇద్దరు కొన్నాళ్ళు ఒకరు పిల్లిపిల్లని,ఒకరు కుక్కపిల్లని పెంచారు.మీ టాంపండులాగే వి కూడా ఏవో జబ్బు చేసి పోయాయి.వాళ్లూ చాలా రోజులు బాధపడ్డారు..మనుషులకి లేని విశ్వాసం జంతువులకే ఉంటుందండీ.అందుకే కొందరు పెంపుడు జంతువులపై మనుషులకన్నా ఎక్కువ మమకారం పెంచుకుంటారు.

    రిప్లయితొలగించండి
  4. టాంపండు - పేరు చాలా బాగుందండి.
    అవునండి. అవి చనిపోతే చాలా బాధనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. మా టఫీగాడి లీలలు మరీ చిలిపిగా వుంటాయండి. వాడు అసలు మా పాపని ముద్దు పెట్టుకున్నా భరించలేదు. అన్నీ దానికే కావాలంటు గారాలు పోతుంది ఎంతైనా చిన్నది కదా!
    ఒకోసారి ఏమిటో ఈ బంధాలు అనుబంధాలు అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. mm bagunnayi............
    maaku vunnadu okadu jooli ani..........chaala manchidi.......

    రిప్లయితొలగించండి
  7. mee mother picture pettavachu kada murali garu...

    రిప్లయితొలగించండి
  8. మీ టాంపండు లీలలు బాగున్నాయి. అలానే నా మేనల్లుడికి (ఐదేండ్లవాడు) కూడా ఒక కుక్క ఉంది. గ్రేట్ డేను బ్రీడ్. పొద్దస్తమాను స్కూల్ టైము మినహాయించి "జిమ్మీ" అంటూ దాని వెనకే ఉంటాడు. అది పెడిగ్రీ, బోర్నవీట, చపాతీ, ఇద్లీ, బ్రెడ్, బిస్కెట్ తప్పితే తినదు. అపుడపుడూ నాన్ వెజ్ . పలక్రిస్తే ఆనందంతో కన్నీళ్ళు కారుస్తుంది. మిగిలిన జంతువులేమో కాని నా మటుకూ నాకు కుక్కలంటే తగని చిరాకు. మేనల్లుడిమీద ప్రెమ కొద్దీ కొన్నిసార్లు నేనుకూడా వాడి కుక్కను ప్రేమించాల్సివస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. బిడ్డొచ్చిన వేళా గొడ్డొచ్చిన వేళా అంటారు కదా మురళీ,కొన్ని(మనుషులయినా,వస్తువులయినా)ఇంట్లో చేరాకా అలా కలిసొస్తుంది మరి.అదో సెంటిమెంట్..నిజమేనేమో...

    రిప్లయితొలగించండి
  10. మురళి గారూ ! మీ టాంపండు కబుర్లు చదువుతుంటే మా పింకీ గుర్తొచ్చింది . సెంటిమెంట్ అయినా కూడా మీ తాతగారి సహృదయతకు జోహార్లు . చివరి వరకూ టామీని బ్రతికించే ప్రయత్నం చేయటం గొప్ప విషయం . మీరన్నట్టు విధి బలీయమైంది కదా ....

    రిప్లయితొలగించండి
  11. మీ టాంపండుకి నీరాజనాలు...
    తాతగారికి సహృదయానికి జోహారులు...

    రిప్లయితొలగించండి
  12. i remember of my 'TINU' which was with us for nearly ten years.
    it died on April 2nd .till last one hour it was in the hospital. onthe way to home it died. we spend sleepless nights for many days.its memories are haunting us still.

    రిప్లయితొలగించండి
  13. ఆశ్చర్యం, అచ్చం మా ఇంటి కథే. కొంపదీసి కొట్టేసారా ఏమి నా దగ్గర. ;) అంతకు మునుపు "హైదర్" ని పెంచినా మా తాతగారి బంగారు కుక్క మాత్రం "శోభ" ట. తాతగారు ఏవో ఒక వ్యవహారాలకి పొరుగూరు రైలు బండిలో వెళితే మాత్రం సాయంత్రం స్టేషనులోనే వేచి వుండేదట. ఆయన పోయాక కూడా అలాగే వెళ్ళివస్తూ పిచ్చి కుక్క కాటుకి గురై, ఒక కుక్క పిల్లని ఆ పిచ్చిలోనే ప్రసవించి మరణించిందట. ఆ పుట్టినవాడే "జిప్సీ" దానికి కోయదొరల వైద్యం చేయించి ఇంటి మనిషికన్నా సేవలు చేయించి బ్రతికించారట. అది కూడా పూర్ణాయుసు వరకు బ్రతికిందట. ఈ లోపు అమ్మ పెళ్ళి నాన్న గారికి కుక్కల పట్ల వున్న చిరాకుతో దాన్ని ఓ శుభసందర్భంలో ఇత్తడి చెంబుతో ఒకటి వేయటం జరిగిందట. అప్పటినుండి అల్లుడి పట్ల మొదటిసారిగా అమర్యాదగా ప్రవర్తించటం జిప్సీ గాడే మొదలుపెట్టాడట. వాడు అరిచాడు అంటే అల్లుడు వచ్చాడు అని అర్థమట. అమ్మ ఈ సంగతి ఎప్పుడు చెప్పినా మహదానందంగా వినేదాన్ని. తర్వాత "లూసీ" చివరగా "పెడ్రో" నా హయాంలో పెరిగాయి కానీ ఇప్పుడిక అన్నయ్య ఏమీ పెంచటం లేదు. మా మళ్ళ పేరే సమాధి మళ్ళు. అక్కడ దహన సంస్కారాలు, సమాధులు ఇంటివారివి, ఇంటిలోని జీవాలవీ జరుగుతాయి. మేము సంక్రాతికి పెద్దల పూజ చేస్తాము. వతనుగా ఆ సమయానికి ఓ కుక్క వస్తుంది. కాసేపు అదే తాతగారి ఆత్మ అనో, లేదా పైన వాటిల్లో ఒకరనో మేళమాడుకునుంటాము.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు,
    మీ అమ్మ గారు ఇప్పటికీ మీతో వాళ్ళ విషయాలు ఇష్టంగా చెప్పుకుని నెమరువేసుకుంటారంటే నిజంగా ఆవిడని అభినందించితీరాలి. చాలా అంటే చాలా తక్కువ మంది పెద్దవాళ్ళు ఇలా ఉంటారని నా అభిప్రాయం. you are so lucky.
    టాంపండు గాడికి మీ తాతగారు అందించే ప్రేమాభిమానాలు ప్రశంసనీయం. ఇంతకు మీరు ఏమైన పెంచుతున్నారా?

    రిప్లయితొలగించండి
  15. @కార్తిక్: ధన్యవాదాలు.
    @చిన్ని: నిజమేనేమో అనిపిస్తుందండీ..ఇలాంటివి విన్నప్పుడు.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య మామిడిపూడి: 'మెంతిష్' పేరు బాగుంది..రాసేయండి త్వరగా.. ధన్యవాదాలు.
    @తృష్ణ: అలా మమకారం పెంచుకున్నవాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @భవాని: ఆ బాధ మా చిన్నప్పుడు మేమూ అనుభవించామండి.. ..ధన్యవాదాలు.
    @సుభద్ర: ధన్యవాదాలు
    @సృజన: అమ్మో.. మరీ అలా ఉంటె కష్టం కదండీ.. ..ధన్యవాదాలు.
    @వినయ్ చక్రవర్తి గోగినేని: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  17. @సిరిచందన: అదేమిటోనండి.. మా ఇంట్లో ఎవరికీ ఫోటోలంటే పెద్ద ఆసక్తి ఉండదు.. ధన్యవాదాలు.
    @సునీత: మేనల్లుడి మీద మీకెంత ప్రేమ ఉందో ఈ ఒక్క చర్య ద్వారా తెలిసిపోతోందండి.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ఇలాంటివి విన్నప్పుడు నిజమేనేమో అని అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
    @పరిమళం: మీ పింకీ కబుర్లు నాకు గుర్తున్నాయండి.. అమ్మ చాలా గర్వంగా తలుచుకుంటుంది వైద్యం విషయం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @పద్మార్పిత, కొత్తపాళీ, జయచంద్ర: ధన్యవాదాలు
    @ఉష: కొట్టేయ్యలేదు కానీ మనం బందువులమేమో అని ఆలోచిస్తున్నానండి :-) ఇప్పుడు బ్లాగు బంధువులమే అనుకోండి.. ...ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: లేదండి.. మనం కొంచం టైం స్పెండ్ చేసి ఓపికగా కదిలిస్తే చాలా విషయాలు చెబుతారు పెద్దవాళ్ళు.. అలా తల్చుకోడం వాళ్లకి చాలా సంతోషం కూడా.. మనం చేయాల్సిందల్లా టైం కేటాయించడమే.. ఓసారి ప్రయత్నించి చూడండి... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  19. ఎమోషనల్ గా రాసారు..నా చిన్నప్పుడు కూడా ఒకటి చనిపోయింది తర్వాత ఇప్పటిదాకా పెంచలేదు
    దీనికి స్ఫూర్తి మన్మధుడు కాదు

    రిప్లయితొలగించండి
  20. @హరేకృష్ణ, శ్రీ: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  21. Maa inti kadhaki chala deggaraga undi..kakapothe akkada mee tatayyagare antha garabam chesaru .. ma intlo andaram chesam.. evarayina maa julie ni kukka ante maku entha kopam vacchedo... mari maa julie maku antha premanu panchindi..dani telivitetalu.. adi matani ardham chesukovadam.. dani gurinchi cheppadaniki enni vunnayoo... nenu na 8th class chedivetappudu naa chethollo ki vacchindi 12 years taruvatha naa chetullone chanipoyindi..

    Pet animals ni penchukovadam chala manchidi.. avi icche unconditional love bayata enni tensions unna intiki ragane vatitho adukuntunte entha refreshinga ga untundho.. we miss our julie.

    రిప్లయితొలగించండి
  22. @హరిప్రియ: నిజమేనండి.. పెంచుకోడం మంచిదే.. కాని అవి మనల్ని విడిచి వెళ్ళినప్పుడు చెప్పలేనంత వైరాగ్యం వచ్చేస్తుంది.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి