బుధవారం, జూన్ 03, 2009

హరిశ్చంద్ర-అయ్యప్పనాయుడు

సత్య హరిశ్చంద్ర నాటకం అంటే యెంత క్రేజు.. ముఖ్యంగా కాటిసీను.. పద్యాలకి వన్స్ మోర్లు పడాల్సిందే.. అబ్బే ఇప్పటి సంగతి కాదు. అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో ప్రతి సంవత్సరం ఈ నాటకం వేయాల్సిందే. తెలిసిన కథే అయినా, ఊళ్ళో సగం మందికి పద్యాలన్నీ నోటికి వచ్చేసినా, సంవత్సరాదికో, శ్రీరామ నవమికో సత్య హరిశ్చంద్ర ప్రదర్శన తప్పదు.

అమ్మ వాళ్ళు కొంచం పెద్దవాళ్ళయ్యాక ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయి. వాళ్ళు బడికెళ్లే వయసులో మాత్రం ఎలాంటి ఆంక్షలూ లేవు. పైగా వాళ్ళ పెద నాన్నగారికి నాటకాలంటే విపరీతమైన ఇష్టం. ఊళ్ళో ఎక్కడ నాటక ప్రదర్శన జరిగినా పిల్లల కోడిలా వీళ్ళందరినీ వెంటేసుకుని ఆయన హాజరు తప్పదు. అలా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చాలా నాటకాలే చూశారు.

నాటకాలేనా? నాటక బృందం ఊళ్లోకి వచ్చింది మొదలు వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళ ప్రతి కదలికనీ గమనించడం, మిగిలిన పిల్లలకి గొప్పగా చెప్పడం.. ఇవన్నీ వీళ్ళ వీరోచిత కార్యాలు. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా 'సత్య హరిశ్చంద్ర' బృందం ఊళ్లోకి వచ్చింది. మర్నాడు రాత్రి ప్రదర్శన. పెద్ద చెక్కపెట్టెల్లో బట్టలు, సెట్టింగులు, వాయిద్యాలతో దిగిపోయారు బృందం వాళ్ళు. తాతగారింటికి నాలుగిళ్ళ అవతల ఉన్న ఇల్లే నాటక బృందానికి విడిది ఇచ్చారు.

మధ్యాహ్న భోజనాలయ్యాక, నాటక బృందం పెద్ద తలకాయ (హెడ్) ఊరి పెద్ద తలకాయతో వాళ్ళ సమస్య చెప్పాడు. అదికాస్తా గోడ పక్క కాపు కాసిన అమ్మ వాళ్ళ చెవిన పడింది. నాటకంలో లోహితాస్యుడి వేషం వేసే పిల్లాడికి జ్వరం వచ్చింది. అందువల్ల అతను రాలేదు. స్థానికంగా ఓ ఏడెనిమిదేళ్ళ కుర్రాడినెవరినైనా ఏర్పాటు చేస్తే అతనితో నాటకం కానిస్తారు. అదీ సంగతి.

అసలు హరిశ్చంద్ర కాటిసీను లో లోహితాస్యుడికి పనేమీ ఉండదు.. చంద్రమతి భుజం మీద నిద్రపోవడమే. కథ ప్రకారం పాము కరిచి మరణించిన లోహితాస్యుడిని చంద్రమతి శ్మశానానికి తీసుకొస్తుంది. అక్కడ కాటికాపరి మరెవరో కాదు మారువేషంలో ఉన్న హరిశ్చంద్రుడు. సుంకం చెల్లించనిదే లోపలి అడుగు పెట్టనివ్వనంటాడు సత్య వాక్య పాలకుడైన హరిశ్చంద్రుడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదంటుంది చంద్రమతి. హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించే 'చంద్రమతి మాంగల్యం' చూపించి దానిని సుంకంగా చెల్లించమంటాడు కాపరి. అప్పుడు భర్తని భార్య గుర్తుపడుతుంది.

బోల్డంత సెంటిమెంటు..బోల్డన్ని పద్యాలు.. పైగా అన్నీ వన్స్ మోర్లు.. ఎవర్ని కాదన్నా తెర చింపేస్తారేమో అన్న భయం. అలా నాటకం ఇంచుమించు తెల్లారే వరకూ జరిగేది. లోహితాస్యుడి వేషానికి సరిపడే పిల్లాడి కోసం అన్వేషణ మొదలయ్యింది. ఆ వయసు పిల్లల తల్లిదండ్రులు శవం వేషం వేయించడం ఆశుభంగా భావించారు. సరిగ్గా అప్పుడు అయ్యప్పనాయుడు ఆవేషం నేనేస్తానంటూ ముందుకొచ్చాడు.

అయ్యప్పనాయుడికి ఓ పదిహేనేళ్ళు ఉంటాయి. కాస్త బరువు ఎక్కువే అయినా, పొట్టిగా చూడ్డానికి పదేళ్ళ పిల్లాడిలా ఉంటాడు. అమ్మానాన్నలకి లేకలేక పుట్టిన సంతానం కావడం తో బాగా గారాబం. ఇంట్లో అతని మాటకి ఎదురు చెప్పరు. లోహితాస్యుడు దొరికాడన్న ఆనందం కన్నా చంద్రమతి మీద జాలి పెరిగిపోయింది అందరికీ.. ఇతన్ని మూడు నాలుగు గంటల పాటు ఎత్తుకుని స్టేజి మీద నిలబడి పద్యాలు చెప్పడం అంటే మాటలా? అమ్మ వాళ్లకి నాటకం చూడాలన్న కుతూహలం పెరిగిపోయింది.

నాటకం మొదలైంది. చంద్రమతి అయ్యప్పనాయుడిని అవలీలగా ఎత్తుకుంది. ఆవిడ భుజం మీద ఆ అబ్బాయి హాయిగా నిద్రపోయాడు. హరిశ్చంద్రుడికీ, చంద్రమతికీ పద్యాల పోటీ లాంటిది జరుగుతోంది, వన్స్ మోర్ల, చదివింపుల కోలాహలంతో. కాకపొతే చంద్రమతి గొంతు కాస్త బొంగురుగా ఉంది. విషయం ఏమిటంటే, చంద్రమతి వేషం వేసే ఆవిడ చివరి నిమిషంలో కారణాంతరాల వల్ల రాలేక పోయిందిట.. దానితో ట్రూపులో మగతనే ఆ వేషం వేసేశాడు. అదీ కథ.. మా ఇంట్లో నాటకం టాపిక్ వచ్చినప్పుడల్లా అమ్మ గుర్తు చేసుకుంటుంది..

8 వ్యాఖ్యలు:

 1. మురళి గారు , నేనూ చిన్నప్పుడు చాలా సార్లు చూసానండీ ..మా కజిన్ ఒక అన్నయ్యకి నాటకాలంటే ఎనలేని అభిమానం ! హరిశ్చంద్ర , చింతామణి , రాయబారం ఎక్కువగా వేసేవారు . అన్నయ్యకి ఆ పద్యాలన్నీ వచ్చు ఇప్పటికీ మా ఇంటికి వస్తే అడగ్గానే హరిశ్చంద్ర కాటి సీను లోని దళమౌ పయ్యెద మాటున ....సూర్యప్రభా కలితంబౌ వెలుగొందుచున్నదదీ ....అని రాగయుక్తం గా పాడుతుంటే ....మీరు నవ్వినా సరే మైమరచి చప్పట్లు కొట్టేస్తాను . మీ ద్వారా ఎన్ని జ్ఞాపకాలు తవ్వకాలు ! థాంక్స్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గొంతు బొంగురైన పద్యాలు చెప్పారు కదండి ఆయనెవరో..
  అదే ఆవిడ అయి వుంటే లోహితాస్యుడిని పడేసి పరుగు పెట్టి ఉండేది...
  కారణాలు ఏవైనా ఆవిడ రాకపోవడం నాయుడు రక్షించబడడం..
  మీరు మాకు చెప్పడం బాగుంది....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చంద్రమతి రాలేక పోయిన కారణాంతరాలలో మన అయ్యప్ప నాయుడి బరువు ఒక కారణమేమో అమ్మ గారిని ఒక సారి కనుక్కోండీ... :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఒక్కసారి మీ రచన/అనుభవం లో జీవించేసాను. మా నాన్నగారు ఆరడుగుల మంచి స్ఫురద్రూపి పైగా ఇంజనీరింగు చదివే రోజులనుండి నాటకానుభవం వుంది. ఇక చూస్కోండి - కృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర మా ఇంట్లో మారుమ్రోగిపోయేవి. మాకు సమయానుకూలంగా ఏదో ఒక పాత్ర దక్కేది. నేను విశ్వామిత్ర, చంద్రమతి ఏకకాలంలో వేసేదాన్ని. ఆ రకంగా వుండేది మా ఇంట్లో కళాపోషణ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు :)
  పెద్ద తలకాయ బావుంది
  diagene టాబ్లేట్స్ అవసరం రాలేదు అన్నమాట :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. :):)
  దేవీ కష్టములెట్లున్ననూ పుణ్యలోకమైన వారణాసిని దర్శించితిమిచూడు!!
  భక్తలోక పదన్యాసి వారణాసి...

  కన్నులున్నవారిని సైతమూ గుడ్డివాండ్రనుచేయుచున్నదికదా ఈ అంధకారము.

  అయ్యో అప్పుడే నీకు నూరేళ్ళునిండినవా తండ్రీ అయ్యో అయ్యో..

  నాటీనుండి నేటివరకు ఆడి..యాటయాటయాట గుర్తుకి రావట్లా.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @పరిమళం: నేనూ చప్పట్లు కొట్టే బ్యాచేనండి.. కాబట్టి నవ్వను.. వీలు చూసుకుని ఓ టపా రాయండి... ధన్యవాదాలు.
  @పద్మార్పిత: అమ్మ కూడా ఇదే మాట అంటుందండి.. మగాడు కాబట్టి అంతసేపు ఎత్తుకు నిలబడ్డాడు, అమ్మాయి ఐతే నాటకం రసాభాస అయిఉండేది అని... ధన్యవాదాలు.
  @భావన: లేదండి... ఆవిడకి తెలియదు అయ్యప్పే లోహితాస్యుడని..ఇంకేదో పని ఉంది రాలేదట.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @ఉష: అద్భుతమైన బాల్యం కదండీ... అప్పటి మీ ఇంటిని ఊహించుకుంటున్నా... ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: అవునండి.. కేవలం టాబ్లెట్స్ సరిపోక పోనేమో... ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: గుర్తురాకపోతే రాగం తీసేయడమే :):) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు